ఏపీఐఐసీ భూములు కోరింది: ధర్మాన
మంత్రిమండలి నిర్ణయం మేరకే కేటాయింపులు: ధర్మాన
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల అభివృద్ధికి భూములు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) కోరిందని, మంత్రిమండలి నిర్ణయం మేరకే సంస్థకు భూములు కేటాయించామని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు ఏపీఐఐసీ కేటాయించిన భూములకు సంబంధించి బుధవారం ఆయనను సీబీఐ అధికారులు విచారించారు. డీఐజీ హెచ్.వెంకటేష్ నేతృత్వంలోని అధికారులు సుదీర్ఘంగా దాదాపు ఐదు గంటలపాటు ఆయన్ను విచారించారు. ఉదయం 10.45 గంటలకు సీబీఐ కార్యాలయానికి చేరుకున్న ధర్మాన...విచారణ అనంతరం 3.50కి బయటకు వచ్చారు. ‘‘భూములు కేటాయించాలని ప్రభుత్వరంగ సంస్థ ఏపీఐఐసీ కోరింది. ఈ మేరకు ప్రతిపాదనలను రెవెన్యూ విభాగం ద్వారా అప్పటి మంత్రివర్గం ముందు ఉంచాం. మంత్రివర్గ నిర్ణయం మేరకే భూములు కేటాయించాం. అప్పటి రెవెన్యూ మంత్రిగా ఈ అంశంపై నాకు తెలిసిన విషయాలు చెప్పాలని కోరారు. ఫైళ్ల పరిశీలన ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలను వివరించాను.
ఈ క్రమంలో తీసుకునే అనేక అంశాల గురించి వారు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చాను. నా సమాధానాలతో వారు సంతృప్తి చెందారని భావిస్తున్నా’’ అని ధర్మాన మీడియాతో అన్నారు. మళ్లీ విచారణకు హాజరుకావాలని కోరలేదని, సీబీఐ కోరితే తనకు తెలిసిన విషయాలను చెప్పేందుకు సిద్ధమని అన్నారు. ఏపీఐఐసీకి కేటాయించిన భూములు సద్వినియోగం అయ్యాయా లేక దుర్వినియోగం అయ్యాయా అన్న అంశాలను పరిశ్రమల శాఖ చూసుకుంటుందని చెప్పారు. ధర్మాన ప్రసాదరావును విచారిస్తున్న సమయంలోనే అప్పటి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి శామ్యూల్‌ను కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. మధ్యాహ్నం విచారణకు హాజరైన శామ్యూల్‌ను దాదాపు మూడు గంటలపాటు ప్రశ్నించారు. తమను వేర్వేరుగానే ప్రశ్నించారని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ధర్మాన జవాబిచ్చారు.
సబితనూ ప్రశ్నించిన సీబీఐ: జగన్ కంపెనీల్లో సిమెంట్ కంపెనీల పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని బుధవారం సీబీఐ అధికారులు ప్రశ్నించారు. మధ్యాహ్నం ఆమె ఇంటికే వెళ్లిన ఇద్దరు అధికారులు 2-3 గంటల మధ్య విచారణ కొనసాగించారు. ఓ సిమెంట్ కంపెనీకి సున్నపురాళ్ల గనుల కేటాయింపునకు సంబంధించి ప్రధానంగా సబితను ప్రశ్నించినట్లు సమాచారం. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విచారణకు నోటీసులు జారీ చేసిన సమయంలోనే మాజీ హోం మంత్రి విచారణకు కూడా నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం బయటకు పొక్కలేదు. సబితా ఇంద్రారెడ్డి హోం శాఖకు ముందు గనుల శాఖను నిర్వహించిన సంగతి తెలిసిందే.