శ్యామ్ బెనగళ్– ఈ పేరు ఈ తరం ప్రేక్షకులకి తెలిసి ఉండవచ్చు. కానీ సినిమాలు తెలిసి ఉండక పోవచ్చు. భారతీయ సినిమా భాషా భేదాలు లేకుండా కమర్షియల్ సినిమాల ప్రవాహంలో కొట్టుకుపోతున్న రోజుల్లో ప్రవాహానికి ఎదురీదిన వాడు, సమాంతర (పారలల్ ) సినిమాకి ఊపిరి పోసిన వాడు శ్యామ్ బెనగళ్. ఆయన పూర్తి పేరు బెనగళ్ళ శ్యామ్ సుందర రావు. సికింద్రాబాద్‌లో డిసెంబరు 14, 1934న జన్మించారు. సరిగ్గా 90 సంవత్సరాల 9 రోజులు ఈ భూమి మీద బతికారు. భారతీయ సినిమా రంగంలో ఇకపై ఎన్ని వందల ఏళ్ళు శ్యామ్ బెనగళ్ జీవించి ఉంటారనేది చరిత్ర చెబుతుంది.
తెలంగాణ– ఆయనకి ఊహ తెలిసేటప్పటికి ఇంకా నిజాం పాలనలోనే ఉంది. అప్పటి దొరల దౌర్జన్యాలు, పెత్తందారీతనాలు– అట్టడుగు ప్రజల, ముఖ్యంగా స్త్రీల కన్నీటి కథలు– శ్యామ్ బెనగళ్ గుండెలపై చెరగని జ్ఞాపకాలు అయ్యాయి. అందుకే తన మొదటి సినిమా అంకుర్ – ఇదే తెలంగాణ నేపథ్యంలో తీశారు. అప్పటిలో నిజాం రాజ్యంలో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్నిప్రాంతాలు కలిసి ఉండేవి. ఈ మూడుప్రాంతాల సంస్కృతులు, నేపథ్యాలు – శ్యామ్ బెనగళ్‌ని వెంటాడాయి. యాడ్ ఏజన్సీ లో కాపీ రైటర్‌గా కెరీర్‌ని ఆరంభించినా – ఆయన దృష్టి సినిమాల మీదే ఉండేది .
కమర్షియల్ సినిమాల ప్రభంజనంలో – ఆర్టిఫిషియల్ హీరోలను కాకుండా– జీవితాన్ని – సమాజం లోని పాత్రల్ని వాస్తవికంగా తెరపై ఆవిష్కరించాలనుకున్నాడు శ్యామ్. హైదరాబాద్‌లో ఫిలిమ్ సొసైటీప్రారంభించిన వ్యక్తి శ్యామ్ బెనగళ్. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన అత్యున్నతమైన సినిమాల ప్రింట్‌లు అతి కష్టం మీద తెప్పించుకుని, సినిమా లవర్స్ కోసం హైదరాబాద్ ఫిలిమ్ సొసైటీలో ప్రదర్శిస్తుండే వారు. తెలిసిన జీవితాలు, చూసిన సినిమాలు శ్యామ్ బెనగళ్ ఆలోచనల్లో పారలల్ సినిమా ప్రపంచాన్ని çసృష్టించాయి .
కొత్త కథలు చెప్పాలి, జనం మస్తిష్కాలు కదిలించాలని శ్యామ్ బెనగళ్‌లో ‘అంకుర్’ సినిమాతో భారతీయ సినిమా తెరపై తన సంతకాన్ని పెట్టారు.
1978–1980 మధ్య తెలుగు సినిమా అడవి రాముడు నుంచి శంకరాభరణం సినిమాల మధ్య బాక్సాఫీస్ ఊయలలు ఊగుతుండగా, ఓ బ్రహ్మాండమైన మలుపు తిరగబోయి ఆగిపోయింది. సినిమా గర్వించదగ్గ గొప్ప దర్శకుల్లో కొందరు– శ్యామ్ బెనగళ్, మృణాల్ సేన్, గౌతమ్ ఘోష్ – తెలుగు ప్రేక్షకుల అభిరుచికి, ఆమోదానికి ఫిదా అయ్యారేమో తెలియదు కానీ – హిందీలో కాకుండా తెలుగులో పారలల్ సినిమాలు తీశారు. ‘మా భూమి’ అంటూ గౌతమ్ ఘోష్ అత్యద్భుతమైన సినిమాలు అందించారు. వీరి మధ్యలో శ్యామ్ బెనగళ్ మరాఠీ నవల ఆధారంగా తెలుగులో ‘అనుగ్రహం’ సినిమా తీశారు. తెలుగుతో పాటు హిందీలో ఇదే కథతో కొండూర– టైటిల్‌తో పారలల్‌గా తీశారు.
రెండింటిలో అప్పటి అగ్ర కథానాయిక వాణిశ్రీ హీరోయిన్. అనంత్ నాగ్ హీరో . స్మితా పాటిల్ తెలుగులో నటించిన సినిమా ఇదే! అలాగే అమ్రేష్ పురి జగదేక వీరుడు – అతిలోక సుందరి మొదలైన వాటి కన్నా చాలా చాలా ముందు తెలుగులో నటించిన సినిమా అనుగ్రహం. తెలుగులో ఆరుద్ర, గిరీష్ కర్నాడ్‌తో కలిసి స్క్రీన్ ప్లే రాశారు శ్యామ్ బెనగళ్. ఆరుద్ర మాటలు– పాటలు రాశారు. రావు గోపాలరావు గుర్తుండి పోయే పాత్ర చేశారు.
అయితే శ్యామ్ బెనగళ్ చెప్పిన కథా విధానం అప్పటి ప్రేక్షకులకి రుచించ లేదనే చెప్పాలి. ఆ రోజుల్లో అభిరుచి ఉన్న ప్రేక్షకులు అంకుర్, నిషాంత్ , మంథన్ , భూమిక – ఏ ఫిలిమ్ సొసైటీల్లో చూపిస్తారా అని తిరుగుతుండేవారు. సగటు ప్రేక్షకులేమో ఈయనేంటి – వేరే కథలు చెబుతున్నారు – మనకి తెలియని జీవితపు కోణాలు పట్టుకుంటున్నారు అని డిస్ట్రబ్ అవుతుండే వారు. ఎదిగిన కొద్దీ ప్రేక్షకులకు శ్యామ్ బెనగళ్‌ను ఇంకొంచెం అర్థం చేసుకునే అవకాశం దొరికింది.
అనంత్ నాగ్, షబానా అజ్మీ , నసీరుద్దీన్ షా , ఓం పురి , స్మితా పాటిల్ , అమ్రేష్ పురి , లాంటి గొప్ప నటుల్ని కనుగొన్న కొలంబస్ – శ్యామ్ బెనగళ్. ముఖ్యంగా మన దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియా ఆధారంగా శ్యామ్ బెనగళ్ దూరదర్శన్ కోసం తీసిన సీరియల్ ఎప్పటికీ గుర్తుంచు కోదగ్గది. ముస్లిమ్ మహిళల జీవితాలను çస్పృశిస్తూ మమ్ము, సర్దారీ బేగమ్, జుబేదా అని మూడు సినిమాలు రూపొందించారు. కమర్షియల్‌గా ఫెయిల్ అయినప్పటికీ – మహా భారతాన్ని ఓ బిజినెస్ సామ్రాజ్యానికి అన్వయిస్తూ శశి కపూర్ తీయించిన ‘కలియుగ్’ శ్యామ్ బెనగళ్ ప్రయోగం.
23 డిసెంబర్ 2024న కన్ను మూశారు శ్యామ్ బెనగళ్. కన్ను మూసినా ఆయన ఆలోచనల్లో తీరని కలలు చెప్పని కథలు ఏమున్నాయో మనకి తెలియదు. కానీ కొత్త తరం రచయితలు, దర్శకులు శ్యామ్ బెనగళ్ స్ఫూర్తితో ఏ కొత్త సినిమాని పరిచయం చేస్తారోనని ఎదురు చూద్దాం. – తోట ప్రసాద్, సినీ రచయిత
సంతాపం
సువర్ణాధ్యాయం ముగిసింది
భారతీయ సినిమా, టెలివిజన్ రంగాల్లోని ఓ సువర్ణాధ్యాయం శ్యామ్‌బెనగళ్ మరణంతో ముగిసింది. కొత్త తరహా సినిమాలనుప్రారంభించి, క్లాసిక్ సినిమాలను రూపొందించారు. నిజమైన ఇన్‌స్టిట్యూషన్‌కు ఆయన ఓ నిదర్శనం. ఎందరో కళాకారులను, నటులను తీర్చిదిద్దారు. సినిమా పరిశ్రమకు శ్యామ్ బెనగళ్ చేసిన సేవలు దాదాసాహెబ్ ఫాల్కే, పద్మభూషణ్ పురస్కారంతో సహా ఎన్నో విశిష్ట పురస్కారాలు అందుకున్నాయి. ఆయన కుటుంబ సభ్యులకు, ఎంతోమంది ఆయన అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. – భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
తీవ్రంగా బాధించింది
శ్యామ్ బెనగళ్ గారి మరణం తీవ్రంగా బాధించింది. ఆయన కథలు ఇండియన్ సినిమాపై ఎంతో ప్రభావాన్ని చూపాయి. ఆయన ప్రతిభ ఎప్పటికీ ప్రజాదరణకు నోచుకుంటూనే ఉంటుంది. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. – భారత ప్రధానమంత్రి నరేంద్రమోది
ఫిలిం మేకర్స్‌కు స్ఫూర్తి
సమాంతర సినిమాకు నిజమైన మార్గదర్శకుడు, ఆలోచింపజేసే కథ, కథనాలు, సామాజిక సమస్యలతో సినిమాల ద్వారా చిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేశారు బెనగళ్. 18 జాతీయ చలన చిత్ర అవార్డులతో సహా ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్, దాదాసాహెబ్‌ఫాల్కే అవార్డులను అందుకున్నారు. ఆయన చరిత్ర ఫిల్మ్‌మేకర్స్‌కు స్ఫూర్తినిస్తుంది. – కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే
భావితరాలకు ప్రేరణ
విజనరీ ఫిల్మ్‌మేకర్ శ్యామ్ బెనగళ్ గారి మరణవార్త బాధిస్తోంది. సినిమాల్లో అద్భుతంగా సాగిన ఆయన ప్రయాణం, సామాజిక అంశాలపై అంకితభావంతో ఆయన చేసిన సినిమాలు భావితరాలకు ప్రేరణగా నిలుస్తాయి. – కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
సాంస్కృతిక సంపద
మన దేశంలోనే అత్యుత్తమ ఫిల్మ్‌మేకర్, మేధావి అయిన శ్యామ్ బెనగళ్‌గారి మరణం నన్ను బాధించింది. సినిమా రంగంలోని ప్రతిభావంతులను గుర్తించి, ్రపోత్సహించారు. ఆయన తీసిన సినిమాలు, జీవిత చరిత్రలు, డాక్యుమెంటరీలు భారతదేశ సాంస్కృతిక సంపదలో భాగమయ్యాయి. సహచర హైదరాబాదీ వాసి, మాజీ రాజ్యసభ సభ్యులు అయిన బెనగళ్‌గారి అద్భుతమైన చిత్రాలు, భారతీయ సినిమాలో ఎప్పటికీ మన్ననలు పొందుతూనే ఉంటాయి. – చిరంజీవి
Comments
Please login to add a commentAdd a comment