మనతరం మహాదర్శకుడు
- శ్యామ్ బెనగళ్
వందేళ్ల భారతీయ సినిమా ప్రస్థానంలో దిగ్గజాల వంటి దర్శకులు అతి కొద్దిమంది మాత్రమే. వారి జాబితాను రూపొందిస్తే, మొదటి పదిమందిలో కచ్చితంగా చోటు పొందే దర్శకుడు శ్యామ్ బెనగళ్. న్యూవేవ్ సినిమాలో ఆయన ‘భూమిక’ నిరుపమానం. నసీరుద్దీన్ షా, షబానా అజ్మీ, ఓంపురి, స్మితా పాటిల్, అమ్రిష్‌పురి, కుల్‌భూషణ్ ఖర్బందా వంటి మేటి నటీ నటులను వెలుగులోకి తెచ్చిన ఘనత ఈ హైదరాబాదీదే. బెనగళ్ రూపొందించిన ‘మంథన్’ చిత్ర నిర్మాణం భారతీయ సినీచరిత్రలోనే ఓ మైలురాయి. సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి ప్రాంతంలో పుట్టి పెరిగిన శ్యామ్ బెనగళ్ విద్యాభ్యాసం ఇక్కడే కొనసాగింది. నిజాం కాలేజీ నుంచి ఎకనామిక్స్‌లో ఎంఏ పూర్తి చేశాక బాంబేలోని లింటాస్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో కాపీ రైటర్‌గా కెరీర్ ప్రారంభించారు.
విద్యార్థిగా హైదరాబాద్‌లో ఉన్న కాలంలోనే హైదరాబాద్ ఫిలిం సొసైటీ ఏర్పాటు చేశారు. యాడ్స్ రంగంలో కొనసాగుతుండగానే తొలిసారిగా 1962లో ‘ఘెర్ బెతా గంగా’ (గంగానది ముంగిట) గుజరాతీ డాక్యుమెంటరీని రూపొందించారు. దాదాపు 900 స్పాన్సర్డ్ డాక్యుమెంటరీలు, యాడ్ ఫిలింలు రూపొందించారు. ప్రతిష్టాత్మకమైన పుణే ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌లో 1966-73 కాలంలో విద్యార్థులకు నటన, దర్శకత్వంలో మెలకువలను బోధించారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌కు 1980-83, 1989-92లో రెండు పర్యాయాలు చైర్మన్‌గా కూడా సేవలందించారు. హోమీబాబా ఫెలోషిప్‌పై అమెరికా వెళ్లి న్యూయార్క్‌లోని చిల్డ్రన్స్ టెలివిజన్ వర్క్‌షాప్, బోస్టన్ డబ్ల్యూజీబీహెచ్-టీవీలలో 1970-72 మధ్య కాలంలో పనిచేశారు.
తొలి చిత్రం నుంచే అవార్డుల పరంపర
అమెరికా నుంచి బాంబే తిరిగి వచ్చేశాక, 1973లో ‘అంకుర్’ రూపొందించారు. షబానా అజ్మీ, అనంత నాగ్‌లకు కూడా ఇదే తొలిచిత్రం. జాతీయ స్థాయిలో ద్వితీయ ఉత్తమ చిత్రంగా అవార్డు పొందింది. ఇందులోని నటనకు షబానా అజ్మీకి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు లభించింది. తొలి చిత్రం నుంచే బెనగళ్‌కు అవార్డు పరంపర మొదలైంది. ఉత్తమ చిత్రాలకు ఏకంగా ఏడుసార్లు జాతీయ అవార్డులు అందుకున్న ఘనత ఆయనకే దక్కింది. నిశాంత్ (1976), మంథన్ (1977), భూమిక (1978), జునూన్ (1979), ఆరోహణ్ (1982), త్రికాల్ (1986), సూరజ్‌కా సాథ్‌వా ఘోడా (1993), మమ్మో (1995), ‘ది మేకింగ్ ఆఫ్ మహాత్మ’ (1996), సర్దారీ బేగం (1997) వంటి చిత్రాలు బెనగళ్‌కు జాతీయ అవార్డులతో పాటు అంతర్జాతీయ గుర్తింపునూ తెచ్చిపెట్టాయి. గుజరాత్ క్షీర విప్లవం నేపథ్యంలో బెనగల్ రూపొందించిన ‘మంథన్’కు అక్కడి పాడి రైతులే నిర్మాతలుగా వ్యవహరించడం అరుదైన చరిత్ర. గుజరాత్ పాడి సహకార సంఘంలోని ఐదులక్షల మంది సభ్యులు రెండేసి రూపాయల చొప్పున ఈ చిత్ర నిర్మాణానికి సమకూర్చారు. విడుదలయ్యాక వారందరూ బళ్లు కట్టించుకుని మరీ థియేటర్లకు వచ్చి చూడటంతో ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది.
బుల్లితెరపైనా తనదైన ముద్ర
బెనగళ్ బుల్లితెరపైనా తనదైన ముద్ర వేశారు. ‘భారత్ ఏక్ ఖోజ్’ టీవీ సిరీస్ ఆయనను బుల్లితెర ప్రేక్షకులకు చేరువ చేసింది. రైల్వే శాఖ కోసం రూపొందించిన ‘యాత్ర’, భారత రాజ్యాంగంపై రూపొందించిన ‘సంవిధాన్’ వంటి టీవీ సిరీస్‌లు ఆయనకు పేరు తెచ్చిపెట్టాయి. సత్యజిత్ రే, మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్‌చంద్ర బోస్‌లపై రూపొందించిన బయోగ్రాఫికల్ చిత్రాలు విమర్శకుల మన్ననలు పొందాయి. భారత ప్రభుత్వం బెనగళ్‌కు 1976లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్ అవార్డులు ప్రకటించింది. సినీరంగంలో చేసిన కృషికి గుర్తింపుగా 2007లో సినీరంగానికే తలమానికమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. ఇవేకాదు, పలు అంతర్జాతీయ అవార్డులు సైతం ఆయనను వరించాయి.
- పన్యాల జగన్నాథదాసు