కమల్‌కి జీవిత సాఫల్య పురస్కారం
విలక్షణ నటుడు కమల్‌హాసన్‌కు అవార్డులు, రివార్డులు కొత్త కాదు. బాలనటుడిగా, కథానాయకుడిగా, దర్శకుడిగా, రచయితగా, గాయకుడిగా... ఇలా గత 50ఏళ్లల్లో సినిమా రంగానికి చెందిన వివిధ శాఖల్లో కమల్ తన ప్రతిభ నిరూపించుకుని, బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్నారు. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారాయన. తాజాగా మరో పురస్కారం చేరనుంది.
సినిమా రంగానికి అందించిన విశేష సేవలకుగాను 15వ ముంబయ్ ఫిలిం ఫెస్టివల్‌లో కమల్‌కు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేయనున్నారు. వచ్చే నెల 17న ముంబయ్‌లో ప్రారంభం కాబోయే ఈ చిత్రోత్సవాలకు ప్రముఖ దర్శకులు శ్యామ్ బెనెగల్ అధ్యక్షుడు. కమల్‌లాంటి ప్రతిభాశాలిని సత్కరించనుండటం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
ఈ వేడుకల్లో ఫ్రెంచ్ ఫిల్మ్ మేకర్ కోస్టా గవ్‌రాస్‌కి కూడా జీవిత సాఫల్య పురస్కారం అందజేయనున్నామని బెనెగల్ తెలిపారు. వారం రోజుల పాటు జరిగే ఈ చిత్రోత్సవాల్లో దాదాపు 65 దేశాల నుంచి వచ్చే 200 సినిమాలను ప్రదర్శించనున్నారు.