మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ (92) తుదిశ్వాస విడిచారు. వయో సంబంధిత సమస్యలతో గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కన్నుమూశారు. నెహ్రూ, ఇందిర, మోదీ తర్వాత అత్యధిక కాలం ఆ పదవిలో కొనసాగిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. ప్రపంచమే మెచ్చిన ఆర్థికవేత్తగా ఆయన పేరు పొందారు. ఆర్థిక మంత్రిగా దేశాన్ని సమస్యల సుడిగుండం నుంచి గట్టెక్కించిన మేధావిగా ఎప్పటికీ గుర్తుంటారు. మన్మోహన్ సింగ్ మృతిపై సినీ ప్రముఖులు చిరంజీవి, కమల్ హాసన్ సంతాపం తెలిపారు. వారికి ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఎక్స్ వేదికగా తెలిపారు.
చిరంజీవి తన ఎక్స్ పేజీలో ఇలా పంచుకున్నారు. 'మన దేశంలో గొప్ప రాజనీతిజ్ఞులలో మన్మోహన్‌సింగ్ ఒకరు. ఆయన ఉన్నత విద్యావంతులు, అత్యంత మృదుస్వభావి, వినయపూర్వకమైన నాయకుడు మన్మోహన్ సింగ్. ఆర్థిక మంత్రిగా అతని దార్శనికత దేశానికి ఎంతో ఉపయోగపడింది. వరుసగా రెండు పర్యాయాలు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్న ఆయన చరిత్రలో నిలిచిపోయే మార్పులు తెచ్చారు. అలాంటి మహానుభావుడి హయాంలో పార్లమెంట్ సభ్యుడిగా, పర్యటక శాఖ సహాయ మంత్రిగా పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఆయన నుంచి నేను చాలా విషయాలను నేర్చుకున్నాను. ఆయన మరణం మన దేశానికి తీరని నష్టం. మన్మోహన్‌సింగ్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి !!' అంటూ చిరు పేర్కొన్నారు.
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ కూడా మన్మోహన్‌సింగ్‌కు సంతాపం తెలిపారు. ' భారతదేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంతో భారత రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. నిశ్శబ్ద గౌరవం కలిగిన వ్యక్తి, అతను తన దూరదృష్టితో కూడిన ఆర్థిక, సామాజిక విధానాల ద్వారా దేశాన్ని పునర్నిర్మించారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు లక్షలాది మందికి ఉపయోగపడ్డాయి. భారతదేశం పురోగతి విషయంలో సమాజంలోని ప్రతి మూలకు ప్రభుత్వ లక్ష్యాలు చేరేలా నిర్ధారిస్తూ.. సమగ్రత, సామాజిక న్యాయం పట్ల లోతైన నిబద్ధతతో అతని పాలన కొనసాగింది. ఆయన వారసత్వం భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి' కమల్ హాసన్ పేర్కొన్నారు.
మాజీ ప్రధానికి మోహన్ బాబు సంతాపం..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల టాలీవుడ్ నటుడు మోహన్ బాబు సంతాపం తెలిపారు. ఆయన గొప్ప దార్శనికత కలిగిన నాయకుడని కొనియాడారు. అసాధారణ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ మరణించడం బాధాకరమని.. ప్రధానమంత్రిగా, ఆర్థిక మంత్రిగా భారతదేశ ఆర్థిక రంగంపై చెరగని ముద్ర వేశారని ప్రశంసించారు. రాజ్యసభలో ఆయనతో కలిసి పనిచేసిన ఘనత నాకు దక్కడం అదృష్టమన్నారు. ఆయన తెలివితేటలు, రాజనీతిజ్ఞత అందరికీ స్ఫూర్తినిచ్చాయని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment