భాగ్యనగర్‌ కా బెనగళ్‌.. | Story Of Indian film director and screenwriter Shyam Benegal | Sakshi
Sakshi News home page

భాగ్యనగర్‌ కా బెనగళ్‌..

Published Tue, Dec 24 2024 7:26 AM | Last Updated on Tue, Dec 24 2024 8:10 AM

Story Of Indian film director and screenwriter Shyam Benegal

శ్యామ్‌ బెనగళ్‌కు నగరంతో విడదీయలేని బంధం 

చదువు..తొలి సినిమా అనుభవమూ ఇక్కడే..

సాక్షి, హైదరాబాద్‌: విఖ్యాత సినీ దర్శకుడు శ్యామ్‌ బెనగళ్‌కు నగరంతో విడదీయరాని అనుంబంధం ఉంది. ఆయన చదువు ఇక్కడే కొనసాగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని నిజాం కళాశాల నుంచి ఆరి్థక శాస్త్రంలో శ్యామ్‌ బెనగళ్‌ పట్టభద్రుడయ్యాడు. అదే సమయంలో ఆయన హైదరాబాద్‌ ఫిల్మ్‌ సొసైటీని ప్రారంభించారు.  

నాన్నే తొలి గురువు... 
నగరంలో ఉండగానే తన సినిమా ప్రయాణాన్ని ప్రారంభించారు శ్యామ్‌ బెనగళ్‌. ఆయన తండ్రి నగరంలో ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్‌గా ప్రాచుర్యం పొందాడు. ఖాళీ సమయాల్లో ఆయన 16 ఎంఎం కెమెరాతో తన పిల్లలతోనే సినిమాలను షూట్‌ చేసేవారు. ఆయన దగ్గర ఈ సినిమాల భారీ కలెక్షన్‌ ఉంది. శ్యామ్‌ బెనగళ్‌ది పెద్ద కుటుంబం. ఆయనతో కలిపి పది మంది పిల్లలు. ‘నాకు మా నాన్న తొలిగా సినిమా గురించి అవగాహన కల్పించారు. మా డిన్నర్‌ తర్వాత వినోదం..  మా నాన్న రూపొందించిన చిత్రాలను చూడటమే. సినిమాతో నా ప్రమేయం అలా మొదలై చివరికి నన్ను ప్రొఫెషనల్‌ ఫిల్మ్‌ మేకర్‌గా మార్చింది’ అంటూ శ్యామ్‌ బెనగళ్‌ గుర్తు చేసుకునేవారు. తన తండ్రికి చెందిన 16 ఎంఎం సినిమా కెమెరాతో వేసవి సెలవుల్లో తన అన్నదమ్ములు, కజిన్‌లు కలిసినప్పుడు తాను తీసిన ‘చుటియో మే మౌజ్‌ మజా (సెలవుల్లో వినోదం, ఆటలు)’ తన మొదటి సినిమాగా ఆయన పేర్కొంటారు. 

కంటోన్మెంట్‌ ఏరియాలో... 
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్‌ ఏరియాలో తాము నివసించే ప్రదేశానికి దగ్గరగా ఉన్న ఆర్మీ గ్యారీసన్‌లో సినిమా ప్రదర్శనలు ఉండేవనీ, ప్రధానంగా సైన్యం కోసం ఉద్దేశించిన ఆ ప్రదేశంలో వారాంతంలో ఆంగ్ల భాషా చిత్రంతో పాటు, వివిధ భారతీయ భాషలలోని చలనచిత్రాలు ప్రదర్శించేవారని ఆయ న తన చిన్ననాటి స్మృతులను నెమరేసుకునేవారు.  

అనుబంధం..అపురూపం... 
‘హైదరాబాద్‌ నా జన్మభూమి’ అని శ్యామ్‌ బెనగళ్‌ సగర్వంగా చెప్పేవారు. తాను జని్మంచిన నగరం గురించి ‘నేను ఇక్కడ పెరిగాను, నా పాఠశాల కళాశాల ఇక్కడే. ఇక్కడ మరే ఇతర ప్రదేశంలో లేని విశిష్టమైన స్వభావం, మిశ్రమ సంస్కృతి దీని సొంతం’ అంటూ కొనియాడేవారు. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన నిజాం కాలేజ్‌లో చదువుకున్న తాను  ప్రస్తుతం పిల్లల చదువు గురించి ఆందోళన చెందుతున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘విశ్వవిద్యాలయం ఇప్పటికీ గొప్పగా ఉంది, కానీ అక్కడ రాజకీయ ప్రమేయం పెరిగింది’ అంటూ ఆయన తాను చదువుకున్న ఉస్మానియా గురించి గతంలో ఆవేదన వ్యక్తం చేశారు.  

తెలంగాణ నేపథ్యంలో మరో చిత్రం తీస్తానన్నారు... 
తన సినిమాలపై తెలంగాణ ప్రభావం గురించి మాట్లాడుతూ తన సినిమాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన ‘అంకుర్, నిషాంత్, మండి చిత్రాలపై ఈ ప్రాంత ప్రభావం ఉందని బెనగళ్‌ అనేవారు. తెలంగాణ నేపథ్యంలో మరొక కథ దొరికితే, తాను ఖచి్చతంగా దాన్ని కూడా సినిమాగా మలుస్తాను అంటూ ఈ రాష్ట్రంపై ప్రేమను చాటేవారాయన.     అనుగ్రహం అనే తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన బెనగళ్‌కు తెలుగు మాట్లాడటం అంతగా రాదు.

‘నాకు తెలుగు బాగా అర్థం అవుతుంది కానీ మాట్లాడటం కొంచెం కష్టమవుతుంది’ అనేవారు. తాను హైదరాబాద్‌ను విడిచిపెట్టి 50 సంవత్సరాలకు పైనే అవుతున్నా, ఈ సిటీపై ఇష్టానికి దూరం కాలేదంటారు. ‘ఇది సినిమా క్రేజీ సిటీ. ఇక్కడ భారీ సంఖ్యలో ప్రేక్షకులు సినిమాలు చూస్తారు. చాలా మంది మంచి దర్శకులు, నిర్మాతలు ఇక్కడ ఉన్నారు’ అంటూ కొనియాడేవారు. ఆయన ఇప్పుడు లేకున్నా..ఆ మంచి దర్శక నిర్మాతలకు ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఎప్పటికీ ఉంటుందనేది వాస్తవం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement