
'ప్రముఖ దర్శకుడు, దాదాసాహెబ్ ఫాల్కే గ్రహీత శ్యామ్ బెనగల్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. అతడి రెండు కిడ్నీలు పాడైపోవడంతో నటుడు ఇంట్లోనే డయాలసిస్ చేయించుకుంటున్నారు. కనీసం ఆస్పత్రికి వెళ్లడానికి కూడా ఆయన శరీరం సహకరించడం లేదు' అంటూ రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్‌గా మారాయి. తాజాగా దీనిపై శ్యామ్ బెనగల్ కూతురు పియా స్పందించింది. అదంతా అసత్య ప్రచారమేనని కొట్టిపారేసింది. ఆయన బాగానే ఉన్నారని, కాకపోతే కొంత బ్రేక్ తీసుకుని ఆఫీసుకు వెళ్లడం లేదని చెప్పుకొచ్చింది. ఆ మాత్రం దానికే కిడ్నీలు పాడయ్యాయని, డయాలసిస్ అని రాసేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించింది.
కాగా 88 ఏళ్ల వయసున్న శ్యామ్ బెనగల్.. అంకుర్, నిషాంత్, మంతన్, భూమిక, జుబేదా, వెల్‌కమ్ టు సజ్జన్‌పూర్ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన నంది, ఫిలిం ఫేర్ అవార్డులతో పాటు 18 జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. శ్యామ్ బెనగల్ చిత్రపరిశ్రమకు చేసిన సేవలకుగానూ భారత ప్రభుత్వం 2005లో ఆయనను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. 1976లో పద్మ శ్రీ అవార్డు అందజేసింది.
శ్యామ్ బెనగల్‌కు సొంతంగా సహ్యాద్రి ఫిలింస్ అనే నిర్మాణ సంస్థ కూడా ఉంది. తను తీసిన సినిమాల ఆధారంగా ద చర్నింగ్ విత్ విజయ్ టెండుల్కర్, సత్యజిత్ రే, ద మార్కెట్‌ప్లేస్ అనే మూడు పుస్తకాలు రాశారు. అంతేకాకుండా బంగ్లాదేశ్ మొదటి ప్రధాని షైక్ ముజ్బర్ రెహమాన్ జీవిత కథ ఆధారంగా ముజీబ్: ద మేకింగ్ ఆఫ్ ఎ నేషన్ అనే సినిమా తెరకెక్కించే పనిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment