అంగడి సరుకు: మండి
‘మండి’ అంటే మార్కెట్ అని అర్థం. మార్కెట్‌లో సరుకు అమ్ముతారు. అయితే తరతరాలుగా ఈ ప్రపంచంలో అమ్ముడుపోయే ఒక మానవ సరుకు ఉంది - స్త్రీ. హైద్రాబాద్‌లో జరిగే ఈ కథలో ఒక రద్దీ ప్రాంతంలో ఒక ‘కోఠా’ (వ్యభిచార కేంద్రం) ఉంటుంది. నగరం పెరిగి పెద్దదయ్యి ఆ ప్రాంతంలో ఒక కొత్త మార్కెట్‌ను కట్టాలనుకోవడంతో ఆ ‘కోఠా’కు ముప్పొచ్చి పడుతుంది. దానిని ఖాళీ చేయాలి. కాని ఆ ఆడవాళ్లు, పొట్టకూటి కోసం పడుపువృత్తి చేసుకునే ఆ నిర్భాగ్యులు, నిరక్షరాస్యులు ఎక్కడికెళ్లాలి? చివరకు వాళ్లను ఊరి అవతలకు తరిమేస్తారు. ఆశ్చర్యం. అక్కడ ఎప్పటితో ఒక బాబాగారి సమాధి బయటపడి అదొక రద్దీ క్షేత్రం ఏర్పడుతుంది. మళ్లీ ఆ స్థలానికి మార్కెట్ వ్యాల్యూ వచ్చింది. దాంతో అక్కణ్ణుంచి వాళ్లను తిరిగి తరిమేయాలి.
లేదా ఆ చీమల పుట్టను పాములు ఆక్రమించుకోవాలి. చివరకు అదే జరుగుతుంది. విషాదమైన ఈ కథను వ్యంగ్యంగా చెప్పడం వల్ల అప్పుడప్పుడు నవ్వుతూ అప్పుడప్పుడు ఏడుస్తూ చూస్తాం. ప్రసిద్ధ పాకీస్తానీ రచయిత గులామ్ అబ్బాస్ రాసిన ‘ఆనంది’ అనే కథానిక ఆధారంగా శ్యామ్ బెనగళ్ తీసిన సినిమా (1983) ఇది. షబానా ఆజ్మీ, స్మితా పాటిల్ పోటీ పడి చేసినా షబానా స్థిరత్వం అసామాన్యం అనిపిస్తుంది. ‘మేమున్నాం కాబట్టే ఈ సమాజం ఈ మాత్రమైనా ఉంది’ అంటుంది ఈ సినిమాలో షబానా. ‘మేం తప్పు చేస్తున్నామా? మీ మొగాళ్లను ఇంట్లో కట్టి పెట్టండి చేతనైతే. మమ్మల్నెందుకంటారు?’ అని నిలదీస్తుంది నలుగురినీ. దానికి సమాధానం లేదు. ఉండదు కూడా. మర్యాదకరమైన సాహిత్యం చూడ నిరాకరించే ఈ కురుపు సలపరం తెలియాలంటే యూ ట్యూబ్‌లో Mandi (film) అని కొట్టి చూడండి.