ఓల్డ్ అల్వాల్ పోరడు– బి. నరసింగ రావు, దర్శకులు
శ్యామ్ బెనగళ్ (Shyam Benegal) కూ నాకూ 12 ఏళ్ల వయసు తేడా ఉంది. ఆయనకు 90 అయితే నాకు 78. మా ఓల్డ్ అల్వాల్‌లో వాళ్ల ఇల్లు ఇప్పటికీ అలాగే ఉంది. గతంలో శ్యామ్ అన్నయ్య మధు అందులో ఉండేవారు. ఇప్పుడు ఎవరున్నారో తెలియదు. కనిపించడం లేదు. శ్యామ్ చాలా చురుగ్గా ఉండేవాడు. వాళ్ల నాన్నకు ఫొటో స్టుడియో ఉండేది. అందులో మేము చిన్నప్పుడు ఫొటోలు దిగేవారం. శ్యామ్ చాలా యాక్టివ్. నిజాం కాలేజీలో (Nizam College) మేగజీన్ ఎడిటర్‌గా ఉండేవాడు. ఫిల్మ్ సొసైటీ నడిపాడు.
సైకిల్ తొక్కుకుంటూ కాలేజీకి వెళ్లి తిరిగి వచ్చాక ఫ్రెష్ అయ్యి వెంటనే పరేడ్ గ్రౌండ్‌కు చేరుకునేవాడు ఆటలకు. గురుదత్ ఆయనకు కజిన్. బాంబే వెళ్లి సినిమాల్లో ప్రయత్నించాలంటే చార్జీలకు కూడా డబ్బులు లేవు. అప్పుడు మా మిత్రుల్లో అమ్రేష్ అనే అతని అన్న రైల్వేలో ఉండేవాడు. అతను పాస్ ఇస్తే వెళ్లాడు. గురుదత్ ఇంట్లోనే ఉండి సినిమాలు తెలుసుకున్నాడు.
‘అంకుర్’ (Ankur) కథలో హీరోకు మా మిత్రబృందంలోని ఒక వ్యక్తి జీవితమే ఇన్‌స్పిరేషన్. ‘నీ కథే తీస్తున్నానురా’ అని ఆ మిత్రుడికి చెప్పి మరీ ఆ సినిమా తీశాడు. ఆఫ్‌కోర్స్... సినిమాకు తగ్గట్టుగా మార్పులు చేసుకున్నాడు. తన నిర్మాణ సంస్థకు ‘సహ్యాద్రి ఫిల్మ్స్’ అని పేరు పెట్టుకున్నాడు. సత్యం శంకరమంచి కథలను దూరదర్శన్ కోసం తీస్తున్నప్పుడు నన్ను కలిశాడు. వాటి నిర్మాణంలో నా మాటసాయం ఉంది. ఒకటిన్నర సంవత్సరం క్రితం ఆఖరుసారి మాట్లాడాను. ఆ తర్వాత మాట్లాడలేదు. చాలా క్వాలిటీతో ఎక్కువ పని చేసిన దర్శకుడు శ్యామ్.
శారదకు మిస్సయిన ‘అంకుర్’
శ్యామ్ బెనగళ్ తన మొదటి సినిమా ‘అంకుర్’లో హీరోయిన్‌గా వహీదా రెహమాన్‌ను (Waheeda Rehman) అనుకున్నాడు. ఆమె మొదట చేస్తానని తర్వాత నో చెప్పింది. అప్పుడు శారదకు ఇలాంటి పాత్రలు చేయడంలో మంచి పేరుందని ఆమెను సంప్రదించాడు. ఆమెకు కథ నచ్చినా, దక్కనీ భాషలో డైలాగులు చెప్పగలనో లేదో అనే సందేహంతో చేయలేదు. అపర్ణసేన్ కూడా వెనుకా ముందు ఆడటంతో చివరకు పూణె ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ స్టూడెంట్ అయిన షబానా ఆజ్మీని ఎంచుకున్నాడు. షబానాకు ఒకరకంగా హైదరాబాద్‌తో బంధం ఉన్నట్టే కదా. ఆమె తల్లి షౌకత్ హైదరాబాదీ. షబానా, స్మిత, నసీరుద్దీన్ షా, ఓంపురి, అమ్రిష్‌పురి... వీరంతా బెనగళ్ సినిమాల్లో గొప్ప పాత్రలు పోషించారు.
సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్‌లోని శ్యామ్ బెనగళ్ నివాసం ప్రస్తుత స్థితి
Comments
Please login to add a commentAdd a comment