
రాష్ట్రవ్యాప్తంగా గతేడాది నవంబర్‌లో సమగ్ర కుటుంబ సర్వే
ప్రైవేట్ ఆపరేటర్లతో ఆన్‌లైన్‌లోవివరాల నమోదు
ఒక్కో దరఖాస్తుకు రూ.30 ఒప్పందం.. ఇప్పటికీ అందని బిల్లులు
సర్వే చేసిన సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్ల పరిస్థితీ అంతే
సాక్షిప్రతినిధి, ఖమ్మం: సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీ య, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలను ఆన్‌లైన్ చేసిన ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్లకు పారితోషికం ఇంకా అందలేదు. వీరితోపాటు సర్వేలో పాల్గొన్న ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు కూడా బిల్లులు చెల్లించలేదు. రాష్ట్రంలో గత ఏడాది నవంబర్ 9 నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరిగిన విష యం తెలిసిందే.
మున్సిపాలిటీల్లో వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, మెప్మా రిసోర్స్ పర్సన్లు, సీఓలు, గ్రామాల్లో పంచాయతీ కార్య దర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ అధ్యాపకులు, ఎంఆర్‌సీ సిబ్బంది ఎన్యూమరేటర్లుగా వ్యవహరించారు. వారు సేకరించిన వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేసేందుకు డేటాఎంట్రీ ఆపరేటర్లను నియమించారు.
» ఒక్కో దరఖాస్తుకు రూ.30 చెల్లిస్తామని చెబుతూ రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఆపరేటర్లతో పని చేయించారు. గత ఏడాది డిసెంబర్ 15 నాటికి ఎంట్రీ పూర్తి కాగా, బిల్లులు అడిగితే ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని చెప్పారు. అప్పటి నుంచి వారు కార్యాలయాలకు వచ్చి వెళుతున్నా ఫలితం కానరావడం లేదు.
» సర్వేలో పాల్గొన్న సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్లకూ బిల్లులు అందించలేదు. సర్వేను పర్యవేక్షించిన సూపర్‌వైజర్‌కు రూ.12 వేలు, ఎన్యూమరేటర్‌కు రూ.10 వేల చొప్పున ఇవ్వాల్సి ఉంది.
ఒక్క మండలంలోనే రూ.6.86 లక్షలు
ఖమ్మం జిల్లా వైరా మండలంలోని 22 జీపీలు, మరో మూడు శివారు గ్రామాల్లో 12,566 కుటుంబాలు, మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో 10,333 కుటుంబాలను ఎన్యూమరేటర్లు సర్వే చేశారు. ఆపై ఇరవై రోజులపాటు 117 మంది ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేయగా, గ్రామాల పరిధిలో దరఖాస్తుకు రూ.30 చొప్పున రూ.3,76,980, మున్సిపాలిటీ పరిధిలో 47 మంది ఆపరేటర్లకు రూ.3,09,990 చెల్లించాల్సి ఉంది. కేవలం వైరా మండలం, మున్సిపాలిటీలోనే 164 మంది ఆపరేటర్లకు రూ.6,86,970 నగదు చెల్లించాల్సి ఉంది. ఈ లెక్క రాష్ట్రవ్యాప్తంగా చూస్తే.. రూ.కోట్లలో ఉంటుంది.
రూ.15 వేలు రావాలి
ఎంటెక్ పూర్తి చేసిన నేను 500 సమగ్ర కుటుంబ సర్వే ఫారాల ను వైరా మున్సిపల్ కార్యాల యంలో ఆన్‌లైన్ చేశా. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి బిల్లు వచ్చాక.. ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. నాకు రూ.15వేలు రావాలి. ఎప్పుడు మున్సిపాలిటీకి వెళ్లినా ఇంకా నిధులు విడుదల కాలేదన్నారు.– మల్లు నర్మద, సుందరయ్యనగర్, వైరా
భోజనం, ఇంటర్నెట్ కూడా మావే..
ఆన్‌లైన్ చేస్తున్నప్పుడు 2 నెలల్లో డబ్బులు వస్తాయని చెప్పారు. డేటాఎంట్రీ చేస్తే భోజనం, నెట్ సదుపాయం కల్పిస్తామని చెప్పి, ఆ తర్వాత పట్టించుకోలేదు. పని ముగిశాక డబ్బు అడిగితే పైనుంచి రాలేదని ఓసారి.. కలెక్టరేట్‌కు వెళ్లండని ఇంకోసారి దాటే స్తున్నారు. – తడికమళ్ల యశస్విని, పల్లిపాడు, కొణిజర్ల మండలం