తొలిరోజు ఇళ్లకు స్టిక్కర్లు..
నేడు, రేపు కూడా కొనసాగింపు
9 నుంచి వివరాల సేకరణ
మండల, జిల్లా స్థాయిలో సమాచారం కంప్యూటరీకరణ
రాష్ట్రంలోని 1.17 కోట్ల కుటుంబాల సర్వేకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. తొలిరోజు ఇళ్లకు స్టిక్కర్లు వేసే కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో మంత్రి శ్రీధర్‌బాబు స్టిక్కర్లు వేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు జిల్లాల్లో కలెక్టర్లు సర్వే పనుల్లో పాల్గొన్నారు. గురు, శుక్రవారాల్లో కూడా స్టిక్కర్లు వేసే కార్యక్రమం కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.
మొదటి దశలో భాగంగా ఈ నెల 8వ తేదీ వరకు ప్రతి ఎన్యూమరేషన్ బ్లాక్‌లో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న కుటుంబాలను నమోదు చేసి, వారి ఇంటి నంబరు, కుటుంబ యజమాని పేరుతో కూడిన జాబితాను తయారు చేయనున్నారు. ఈ జాబితా పూర్తయిన ఇళ్లకు స్టిక్కర్లు వేయనున్నారు. ఆ తర్వాత రెండోదశలో ఈ నెల 9 నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టనున్నారు. ఈ సర్వేలో లభించిన సమాచారాన్ని మండల, జిల్లా స్థాయిలో కంప్యూటరీకరిస్తారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేసి సర్వే వాస్తవ పురోగతిని నిరంతరం పర్యవేక్షించనున్నారు.
ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 87,092 ఎన్యూమరేషన్ బ్లాక్‌లను గుర్తించగా, జీహెచ్‌ఎంసీలో 19,328, ఇతర ప్రాంతాల్లో 67,764 ఉన్నాయి. ఈ బ్లాక్‌ల వారీగా సర్వే చేసేందుకు 94,750 మంది ఎన్యూమరేటర్లను ఎంపిక చేశారు. 24,488 మందిని జీహెచ్‌ఎంసీలో నియమించగా, ఇతర ప్రాంతాల్లో 70,262 మందిని నియమించారు. వీరి సహకారంతో రాష్ట్రంలోని 1,17,44,954 కుటుంబాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment