
మొదట్లో ఏటీఎం తరహా స్మార్ట్‌కార్డులు జారీ చేస్తామన్న సర్కార్
కార్డుల తయారీ టెండర్లకు లభించని సీఎం ఆమోదముద్ర
ప్రస్తుతానికి సాధారణ ఆహారభద్రత కార్డులతోనే సరిపెట్టే అవకాశం
తొలి విడతలో 3–4 లక్షల కార్డుల జారీ
ఈ నెల 28 వరకు మీ సేవలో దరఖాస్తులకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: కొత్త రేషన్‌కార్డుల జారీకి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. మార్చి మొదటివారం తర్వాతనే కొత్తగా ఆహారభద్రత (రేషన్) కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ మార్చి 1న లక్ష కార్డులు జారీ చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అధికార యంత్రాంగం మాత్రం మొదటివారం తర్వాతే కొత్తకార్డుల జారీ చేసే అవకాశం ఉన్నట్టు చెబుతోంది.
అయితే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి కార్డుల జారీ ప్రక్రియ ఉంటుందని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వం ఎప్పుడు కార్డులు జారీ చేయమంటే అప్పుడు ఇచ్చేందుకు పౌరసరఫరాల శాఖ సిద్ధంగా ఉందన్నారు.
ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కూలి 8 మంది కార్మికులు గల్లంతైన నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బిజీగా ఉన్నారని, కొత్త రేషన్‌కార్డులు ఎలా ఉండాలనే విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేకపోవడంతో మార్చి మొదటి వారం తర్వాతే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని సమాచారం.
చిప్‌తో కూడిన కార్డు అనుకున్నారు...
ఏటీఎం తరహాలో స్మార్ట్‌కార్డు రూపంలో కొత్త రేషన్‌కార్డులు తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. ఆహారభద్రత కార్డుగా పేర్కొనే దీనికి చిప్‌ను అటాచ్ చేసి, యూనిక్ నంబర్ కేటాయించి, కుటుంబం వివరాలన్నీ పొందుపరచాలనుకున్నారు. ఆ శాఖ కమిషనర్ చౌహాన్ సైతం చిప్ సిస్టమ్‌తో కూడిన రేషన్‌కార్డు తీసుకురాబోతున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన ఫైల్‌ను కూడా సీఎంకు పంపారు.
అయితే ఇప్పటివరకు స్మార్ట్‌కార్డులకు ప్రభుత్వం నుంచి ఆమోదముద్ర రాలేదు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడితోపాటు సీఎం ఢిల్లీ పర్యటన, ఎస్‌ఎల్‌బీసీ ఘటన నేపథ్యంలో సీఎం, మంత్రులు బిజీబిజీగా ఉన్నారు. దీంతో దీనిపై ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా, స్మార్ట్‌కార్డు తయారీకి కంపెనీకి టెండర్లు పిలవడం, అర్హులను ఎంపిక చేయడం, చిప్‌తో కూడిన కొత్తకార్డుల తయారీ, కుటుంబ వివరాలన్నీ పొందుపరచడం లాంటివి ఇప్పట్లో అయ్యే పరిస్థితులు లేవు.
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగే లోపే కొత్త రేషన్‌కార్డుల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాత పద్ధతిలో ఆహారభద్రత కార్డులను జారీ చేసి, తర్వాత వాటిని ఏటీఎం కార్డు రూపంలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది.
కొత్తగా ఎన్ని కార్డులో ?
» రాష్ట్రంలో ప్రస్తుతం 89 లక్షల ఆహారభద్రత కార్డులున్నాయి. ఈ కార్డుల్లో 2.81 కోట్ల మంది లబ్ధిదారులుగా నమోదై ఉన్నారు.
» కాంగ్రెస్ సర్కారు కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత ప్రజాపాలన, గ్రామసభలు, మీ సేవ కేంద్రాల్లో కలిపి సుమారు 7 లక్షల కుటుంబాల నుంచి కొత్త దరఖాస్తులు అందించినట్టు సమాచారం.
» ఆ దరఖాస్తుల్లో అర్హులను గుర్తించి కొత్తగా తొలివిడతగా 3 నుంచి 4 లక్షల వరకు రేషన్ కార్డులు జారీ చేయనున్న ట్టు తెలిసింది.
» హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 1.12 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించినట్టు తెలుస్తోంది.
» కాగా గత జనవరి 26న ఎంపిక చేసిన 577 గ్రామాల్లో 16,900 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన విషయం తెలిసిందే.
» ఈనెల 28వ తేదీ వరకు మీసేవ సెంటర్ల నుంచి కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు. వివిధ రూపాల్లో వచ్చిన దరఖాస్తులను క్రోడీకరించి, జిల్లా స్థాయిలోనే అర్హులను ఎంపిక చేసి, ఆమోదానికి కమిషనర్ కార్యాలయానికి పంపుతారు.
Comments
Please login to add a commentAdd a comment