నవంబర్ 4 లేదా 5న రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం
ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ మంజూరు
ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
‘జీవో 317’ఉద్యోగులకు స్పౌజ్, ఆరోగ్యం, పరస్పర బదిలీలు
మిగిలిన ఉద్యోగులతోపాటు జీవో 46 సమస్యలపై అసెంబ్లీలో చర్చ
అనంతరం కేంద్రం ఆమోదానికి ప్రతిపాదనలు
డీఫాల్ట్ అయిన మిల్లర్ల తొలగింపు
పీపీపీ విధానంలో ఆర్ అండ్ బీ,పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధి
రూ. 24,269 కోట్లతో మెట్రో రెండో దశకు ఓకే
మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయాలు..
వెల్లడించిన మంత్రులు పొంగులేటి, పొన్నం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, కులగణన సర్వేను నవంబర్ 4 లేదా 5న ప్రారంభించి 30లోగా పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. సర్వేకు సంబంధించిన ప్రశ్నావళి, విధివిధానాలను ఆమోదించింది. రాష్ట్రంలో కులగణన నిర్వహించాలని ఫిబ్రవరి 17న శాసనసభలో తీర్మానం చేయడంతోపాటు ఇప్పటికే జీవో 18 ప్రభుత్వం జారీ చేయగా సీఎం రేవంత్ సోమ వారం రాష్ట్ర నోడల్ అధికారి, జిల్లా కలెక్టర్లతో సమావేశమై సర్వేపై దిశానిర్దేశం చేయనున్నారు.
శనివారం సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జిల్లా, మండల స్థాయిలోని 80 వేల మంది అధికారులు, సిబ్బందికి కులగణనపై శిక్షణ అందించనున్నట్లు పొన్నం తెలిపారు.
ఒక్కో ఎన్యూమరేటర్‌కు 150 ఇళ్లను కేటాయించి సర్వే పూర్తి చేయడానికి 3, 4 రోజుల సమయం ఇస్తున్నామన్నారు. 15–20 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా సర్వే పూర్తికానుందని... ఇప్పటికే షెడ్యూల్‌ను సిద్ధం చేసినట్లు వివరించారు. గత ప్రభుత్వం ఒక్క రోజులో కుటుంబ సర్వే నిర్వహించి వివరాలను బయటపెట్టలేదని.. కానీ తాము సర్వే ముగిశాక సమాచారాన్ని, ప్రయోజనాలను ప్రజా బాహుళ్యంలో ఉంచి పారదర్శకంగా వ్యవహరిస్తామని పొన్నం తెలిపారు. సర్వేలో సరైన సమాచారం ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం..
దీపావళి కానుకగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రతి గ్రామంలో గ్రామసభ పెట్టి కులమతాలు, పారీ్టలకు అతీతంగా పేదల్లో బహు పేదలను ఎంపిక చేయాలని నిర్ణయించామన్నారు. దీపావళి మర్నాడు లేదా ఆ తర్వాతి రోజున సీఎంతోపాటు మంత్రులం స్వయంగా మొగ్గు వేసి నిర్మాణ పనులను ప్రారంభిస్తామని చెప్పారు.
ఉద్యోగులకు ఒక డీఏ
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు పెండింగ్ డీఏలను చెల్లించాల్సి ఉండగా దీపావళి కానుకగా 2022 జనవరి నుంచి రావాల్సిన ఒక డీఏను మంజూరు చేశామని పొంగులేటి చెప్పారు. ఉద్యోగ సంఘాల నేతలతో జరిపిన చర్చల్లో సీఎం, డిప్యూటీ సీఎం ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాగే జీవో 317 కింద గత ప్రభుత్వ హయాంలో దూర ప్రాంతాలకు బదిలీ అయిన ఉద్యోగులను స్పౌజ్, ఆరోగ్య, పరస్పర కేటగిరీల కింద తక్షణమే సొంత ప్రాంతాలకు బదిలీలు నిర్వహించాలని నిర్ణయించామని వివరించారు.
జీవో 317 కింద దూర ప్రాంతాలకు వెళ్లిన ఇతర ఉద్యోగుల సమస్యతోపాటు ఉద్యోగ నియామకాలకు జీవో 46తో ఉన్న ఇబ్బందుల పరిష్కారానికి చట్ట రీత్యా, కోర్టుల రీత్యా చిక్కులున్న నేపథ్యంలో తదుపరి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి కేంద్రం ఆమోదం కోసం పంపాలని నిర్ణయించామని పొంగులేటి తెలిపారు. ఉద్యోగులకు ఒక డీఏ చెల్లిస్తే ప్రభుత్వంపై రూ. 3 వేల కోట్ల భారం పడనుందని.. అందుకు ప్రతి నెలా రూ. 230 కోట్లు అదనంగా కావాలని పొన్నం తెలిపారు.
నాలుగు కేటగిరీలుగా మిల్లర్ల విభజన..
రాష్ట్రంలో మిల్లర్లను నాలుగు విభాగాల కింద విభజిస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఎలాంటి ఆరోపణలు లేని మిల్లర్లకు ప్రథమ కేటగిరీ, ప్రభుత్వ నోటిసులకు స్పందించి చెల్లింపులు చేసిన వారిని రెండో కేటటిరీ, నోటిసులిచ్చినా చెల్లింపులు చేయక రికవరీకి గురైన వారిని మూడో కేటగిరీగా విభజించి వారి నుంచి బ్యాంకు గ్యారెంటీలు తీసుకున్న తర్వాత ధాన్యం సేకరణలో అనుమతించాలని, ఇంకా డిఫాల్టర్లుగా మిగిలిపోయిన వారిని అనుమతించరాదని నిర్ణయించామన్నారు. మిల్లర్ల న్యాయమైన సమస్యల పరిష్కారానికి పొరుగు రాష్ట్రాల్లో అవలంభిస్తున్న ఉత్తమ విధానాలను పరిశీలించి ఆమోదించామని చెప్పారు.
రూ. 24,269 కోట్లతో మెట్రో రెండో దశ
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టును కేంద్రంతో కలిసి జాయింట్ వెంచర్ కింద నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది. నాగోల్–శంషాబాద్, రాయదుర్గ్–కోకాపేట, ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట, మియాపూర్–పటాన్‌చెరు, ఎల్బీనగర్–హయత్‌నగర్ కారిడార్లలో 76.4 కి.మీ. కొత్త మెట్రో రైల్వే లైన్‌ను రూ. 24,269 కోట్ల అంచనాలతో ఏర్పాటు చేయడానికి రూపొందించిన డీపీఆర్‌ను కేంద్రానికి పంపేందుకు మంత్రివర్గం ఆమోదించింది.
పీపీపీ విధానంలో రోడ్ల అభివృద్ధి
పంచాయతీరాజ్ శాఖ, ఆర్ అండ్ బీ పరిధిలో 16–17 వేల కి.మీ. కొత్త రోడ్ల నిర్మాణం/పునరుద్ధరణ పనుల విషయంలో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి తప్పనిసరిగా బీటీ రోడ్డు, ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు, ప్రతి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు 4 లేన్ల రోడ్లను నిర్మించాలన్న ప్రతిపాదనలను ఆమోదించింది. ప్రతి ఉమ్మడి జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని పీపీపీ విధానంలో వచ్చే 4 ఏళ్ల పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందుకు రూ. 25 వేల కోట్ల నుంచి రూ. 28 వేల కోట్ల వ్యయం కానుందని ప్రాథమికంగా అంచనా వేసింది.
మరికొన్ని నిర్ణయాలు..
⇒ ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి గోషామహల్ స్టేడియం స్థలాన్ని అప్పగించడంతోపాటు ములుగులోని గిరిజన వర్సిటీకి 211 ఎకరాల భూమిని, స్పోర్ట్స్ వర్సిటీకి గచ్చిబౌలి స్టేడియాన్ని అప్పగించాలనే ప్రతిపాదనలకు ఆమోదం.
⇒ మధిర, వికారాబాద్, హుజూర్‌నగర్‌లో స్కిల్స్ వర్సిటీకి అనుబంధంగా కొత్త ఐటీఐల మంజూరు.
⇒ కొత్తగా ఏర్పడిన 8 కోర్టులు, రెండు వైద్య కళాశాలలకు సిబ్బంది మంజూరు.
⇒ కేంద్ర ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా కడెం ప్రాజెక్టులో పూడికతీతకు ఆమోదం. అన్ని ప్రాజెక్టుల్లో 23 శాతం పూడికతో నిండి ఉన్నాయని, భవిష్యత్తులో వాటిలోని పూడిక తొలగిస్తామని పొంగులేటి తెలిపారు. సినీనటుడు బాలకృష్ణకు స్టూడియో నిర్మాణానికి ఎలాంటి స్థలం కేటాయించలేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.
దీపావళికి ముందే పొలిటికల్ బాంబుల పేలుళ్లు
రాష్ట్రంలో పొలిటికల్ బాంబులు ఒకట్రెండు రోజుల్లో పేలబోతున్నాయని దక్షిణ కోరియా పర్యటన సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి స్పందించారు. దీపావళి టపాసుల కంటే ముందే ఇవి పేలుతాయని స్పష్టం చేశారు. కాగా, దక్షిణ కొరియాలో అమలైన నదుల పునరుజ్జీవ ప్రాజెక్టు గురించిన వివరాలను మంత్రులు పొంగులేటి, పొన్నం తమ సహచరులకు వివరించినట్లు సమాచారం. అయితే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు గురించి ప్రభుత్వం తీసుకోనున్న చర్యలపై ప్రత్యేకంగా మరో సమావేశం ద్వారా ప్రజల ముందుకు తీసుకెళ్లాలనే అభిప్రాయం కేబినెట్‌లో వ్యక్తమైనట్లు తెలియవచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment