
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రవణ్ రావు(Shravan Rao) విచారణ ముగిసింది. మూడు రోజుల కిందట విచారణకు హాజరైన ఆయన.. సుదీర్ఘంగా సాగిన విచారణలోనూ అసంపూర్తిగా సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ రావాలని దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేయడంతో ఆయన హాజరయ్యారు. అధికారులు అడిగిన పత్రాలను సమర్పించగా.. ఈ నెల 8వ తేదీన మరోసారి విచారణకు రావాల్సిందిగా ఆయనకు సిట్ నోటీసులు జారీ చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో శ్రవణ్ రావు ఏ6గా ఉన్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్‌ఐబీ) కేంద్రంగా ఎవరెవరిపై నిఘా ఉంచాలనే విషయంలో ఓ మీడియా సంస్థ అధినేత అయిన ఈయన సూచన మేరకే కీలక నిందితులు ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావులు నడుచుకున్నారనేది దర్యాప్తుసంస్థ ప్రధాన అభియోగం. అయితే కిందటి ఏడాది మార్చిలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే.. శ్రవణ్ రావు అమెరికా వెళ్లిపోయారు. ఇంతకాలం విచారణకు హాజరు కాకుండా వచ్చారు. తాజాగా..
అరెస్ట్ నుంచి సుప్రీం కోర్టు(Supreme Court)లో మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఊరట పొందిన ఆయన.. దర్యాప్తుకు తప్పనిసరిగా సహకరించాలన్న షరతు మేరకు జూబ్లీహిల్స్ పీఎస్‌లో ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు హాజరయ్యారు. అయితే గత విచారణ టైంలో ఆయనను మీడియా కంటపడనీయకుండా పోలీసులు వ్యవహరించిన తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
కీలకంగా శ్రవణ్ రావు
తొలుత నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సిరిసిల్ల డీసీఆర్‌బీ అప్పటి డీఎస్పీ ప్రణీత్‌రావు పేరు మాత్రమే ఉంది. దర్యాప్తు ముందుకెళ్తున్నకొద్దీ నిందితుల జాబితా పెరుగుతూ వచ్చింది. ఈక్రమంలోనే శ్రవణ్‌రావును ఆరో నిందితుడిగా చేరుస్తూ న్యాయస్థానంలో పోలీసులు మెమో దాఖలు చేశారు. 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు లబ్ధి చేకూర్చేందుకే కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు వారికి ఆర్థిక వనరులు సమకూర్చుతున్న వ్యాపారులపై నిఘా ఉంచాలని ఆయన సూచించారని అనుమానిస్తున్నారు. ఆయన్ను సుదీర్ఘంగా విచారిస్తే ఈ విషయాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.