మీకెందుకు చెప్పాలి? | People reluctance to disclose assets finances in comprehensive survey | Sakshi
Sakshi News home page

మీకెందుకు చెప్పాలి?

Published Sun, Nov 10 2024 12:54 AM | Last Updated on Sun, Nov 10 2024 12:54 AM

People reluctance to disclose assets finances in comprehensive survey

సమగ్ర సర్వేలో ఆస్తులు, ఆర్థిక అంశాల వెల్లడికి ప్రజల విముఖత

ఇంటి విస్తీర్ణం, బ్యాంకు ఖాతా, రుణాలు, టర్నోవర్, ఆదాయ పన్ను వంటివి ఎందుకనే నిలదీతలు

ప్రభుత్వ పథకాలు, రేషన్‌కార్డు రద్దు చేస్తారేమోననే ఆందోళన.. రైతుబంధు, భరోసా రానప్పుడు భూమి, ధరణి వివరాలు సేకరించడమేంటనే ఎదురుప్రశ్నలు.. 

కొన్ని కేటగిరీల ప్రశ్నలకు అరకొరగానే సమాచారం.. 

భవిష్యత్తులో పథకాలు రావేమోనని సందేహం 

పేద వర్గాల నుంచి మాత్రం స్పందన.. 

రేషన్‌కార్డులు, పింఛన్ల కోసం వినతులు 

శనివారం కూడా కొనసాగిన స్టిక్కరింగ్‌ ప్రక్రియ 

75 ప్రశ్నలు, సవివర కోడింగ్‌తో ఎన్యుమరేటర్ల ఇబ్బంది 

పలు ప్రాంతాల్లో సమయానికి అందని సర్వే ఫారాలు 

రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజు సర్వేపై ‘సాక్షి’ పరిశీలన

‘‘మా ఆస్తుల వివరాలు, వార్షికాదాయం లెక్కలు ఎందుకు? స్థిర, చరాస్తులు, బ్యాంకు ఖాతా వివరాలతో ఏం చేస్తారు? ధరణి పాస్‌బుక్‌ నంబర్‌ ఎందుకు చెప్పాలి? మేం ఎక్కడ రుణం తీసుకుంటే, ఎందుకోసం తీసుకుంటే ప్రభుత్వానికి ఎందుకు? వీటితో మాకొచ్చే ప్రయోజనం ఏంటి? రైతుబంధు రానప్పుడు భూముల వివరాలు ఎందుకు అడుగుతున్నారు? ఇల్లు ఎన్ని గజాల్లో ఉంటే ఏం చేస్తారు?.. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం వెళ్తున్న ఎన్యూమరేటర్లకు ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలివి. అసలు ఈ సర్వే ఎందుకు చేస్తున్నారో, ఏ వివరాలు చెబితే ఏ పథకాలకు కోతపెడతారో, రేషన్‌కార్డు ఏమైనా రద్దు చేస్తారోనని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక వివరాలు, ఉద్యోగం, వ్యాపారం వంటి వివరాలు చెప్పడానికి ముందుకురాని పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో చేపట్టిన పరిశీలనలో వెల్లడైన అంశాలివీ..

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో వివరాల సేకరణ గందరగోళంగా మారింది. పేర్లు, కులం, వృత్తి వంటి కొన్ని సాధారణ వివరాలను వెల్లడిస్తున్న జనం.. ఆర్థికపర అంశాలను వెల్లడించేందుకు ఇష్టపడటం లేదు. ప్రజల నుంచి సరైన సమాధానాలు రాకపోవడం, కొన్ని అంశాల్లో సందేహాలు వ్యక్తం చేస్తూ ఎదురు ప్రశ్నలు వేస్తుండటం, వారికి సర్దిచెప్పాల్సి రావడంతో సర్వేలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఎన్యుమరేటర్లు వాపోతున్నారు. 

మరోవైపు పేద వర్గాల నుంచి మాత్రం సర్వేకు మంచి స్పందన కనిపిస్తోంది. రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు కావాలంటూ పెద్ద సంఖ్యలో విజ్ఞప్తులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ప్రక్రియలో భాగంగా... ఈ నెల 6వ తేదీ నుంచి ఇళ్లను గుర్తించి స్టిక్కర్లు వేసిన సంగతి తెలిసిందే. శనివారం నుంచి ఎన్యూమరేటర్లు ఆ ఇళ్లకు వెళ్లి పూర్తి వివరాలను సేకరించి, సర్వే ఫారాల్లో నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించారు.  

కాలమ్‌ నంబర్‌ 19 నుంచి తిప్పలు! 
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రశ్నావళిలో 75 ప్రశ్నలు (56 ప్రధాన ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలు) ఉన్నాయి. సర్వే బుక్‌లెట్‌ రెండు భాగాలుగా ఉంది. మొదటి విభాగం (పార్ట్‌–1)లో కుటుంబ యజమాని, కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలపై ప్రశ్నలు అడుగుతున్నారు. ఇందులో విద్య, ఉద్యోగ, ఉపాధి, భూమి, రిజర్వేషన్లు, రాజకీయాలు, వలసలకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. సాధారణ వివరాలను వెల్లడించేందుకు ప్రజలు సిద్ధంగానే ఉన్నా.. కాలమ్‌ నంబర్‌ 19 నుంచి వస్తున్న పలు ప్రశ్నలు ఆందోళన రేపుతున్నాయి. 

ప్రధానంగా వ్యాపారం వార్షిక టర్నోవర్, వార్షికాదాయం, ఆదాయ పన్ను చెల్లింపులు, బ్యాంకు ఖాతా సమాచారం, భూములు, ధరణి పాసు పుస్తకం వివరాలు, భూమి కొనుగోలు కోసం వనరులకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించేందుకు చాలా మంది విముఖత చూపుతున్నారు. అదేవిధంగా రిజర్వేషన్‌ ఫలాలు, ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వివరాలను అడిగినప్పుడు.. ఆ వివరాలు ఎందుకని ఎదురు ప్రశ్నలు ఎన్యూమరేటర్లకు ఎదురవుతున్నాయి. 


‘ఆర్థిక స్థితిగతుల’పై ఆందోళన 
సర్వే ప్రశ్నావళి రెండో విభాగం (పార్ట్‌–2)లో కుటుంబ ఆర్థిక స్థితిగతులపై ప్రశ్నలు అడిగినప్పుడు ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. వాటికి సరైన సమాధానం రావడం లేదని ఎన్యూమరేటర్లు చెప్తు న్నారు. రుణాలు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, పశు సంపద, స్థిరాస్తి, వాహనాలు, రేషన్‌కార్డు, నివాస గృహానికి సంబంధించిన సమాచారాన్ని చెప్పేందుకు ఇష్టపడటం లేదని అంటున్నారు. 

బ్యాంకు రుణాలు, అప్పులు, ఆస్తులకు సంబంధించిన ప్ర శ్నలు అడుగుతున్నప్పుడు ప్రజల నుంచి ఎదురు ప్రశ్నలు వస్తున్నాయని వివరిస్తున్నారు. ‘మేం రుణాలు చెల్లించకుంటే ప్రభు త్వం చెల్లిస్తుందా? ఆస్తుల వివరాలు మేమెందుకు చెప్పాలి? మా కున్న అప్పులకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? ఆదాయం వి వరాలు చెబితే పథకాలు వస్తాయా? ఉన్నవాటికి కోతపెడతారా?’ అని ప్రజలు నిలదీస్తున్నారని ఎన్యూమరేటర్లు వాపోతున్నారు. 

శనివారమూ కొనసాగిన స్టిక్కరింగ్‌ 
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఈ నెల 6వ తేదీనే ప్రారంభమైంది. 6, 7, 8వ తేదీల్లో ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన ప్రాంతంలోని ఇళ్లను పరిశీలించి యజమానులు, అద్దెదారుల వివరాలను తెలుసుకుని, స్టిక్కర్లు అంటించాలని, 9వ తేదీ నుంచి సర్వే ఫారాల్లో వివరాల నమోదు చేపట్టాలని నిర్ణయించారు. కానీ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నాలుగో రోజు కూడా స్టిక్కరింగ్‌ ప్రక్రియే కొనసాగింది. 

ఇళ్లకు తాళం ఉండటం, యజమానులు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో ఇళ్ల విజిటింగ్, స్టిక్కరింగ్‌ ప్రక్రియలో జాప్యం జరిగినట్లు ఎన్యూమరేటర్లు చెప్తున్నారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా స్టిక్కరింగ్‌ ప్రక్రియ పూర్తయిందని.. ఆదివారం నుంచి సర్వే ఫారాల్లో వివరాల నమోదు కొనసాగుతుందని ప్రణాళిక శాఖ వర్గాలు వెల్లడించాయి. 

వివరాల సేకరణలో తిప్పలు 
సర్వేలో ఒక్కో ఇంటికి సంబంధించి 75 ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టడం, 43 ప్రశ్నలకు బుక్‌లెట్‌ చూసుకుని కోడింగ్‌ వేయడం వేయడం ఎన్యూమరేటర్లకు తలకు మించిన భారమవుతోంది. పట్టణాలు, గ్రామాల్లో 150 నుంచి 175 వరకు ఇళ్లను ఎన్యూమరేషన్‌ బ్లాక్‌గా విభజించి ఒక్కో ఎన్యూమరేటర్‌కు అప్పగించారు. రోజుకు 10 ఇళ్లలో సర్వే చేయాలని ఆదేశించారు. కానీ చాలా ప్రాంతాల్లో తొలిరోజు ఐదు, ఆరు ఇళ్ల సర్వేనే పూర్తయింది. 

కుటుంబాలు ఎక్కువగా ఉన్న ఇళ్లలో అయితే గంటకుపైనే సమయం పడుతోందని.. మధ్యాహ్నం నుంచి కాకుండా రోజంతా చేస్తేనే సర్వే పూర్తవుతుందని సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. వివరాలు సేకరిస్తూ ఫామ్‌ నింపడం కష్టంగా ఉండటంతో కుటుంబ సభ్యులను సహాయకులుగా తీసుకెళుతున్నట్టు చెప్తున్నారు. 

ఇళ్లకు తాళాలతో ఇబ్బంది 
పంటల కోతల సమయం కావడంతో ఎన్యూమరేటర్లు ఎప్పుడు వస్తారో తెలియక రైతులు, కూలీలు పనులకు వెళ్తున్నారు. దీనితో సర్వే కోసం వెళ్తున్న ఎన్యూమరేటర్లకు తాళాలు వేసిన ఇళ్లు దర్శనమిస్తున్నాయి. పట్టణాల్లో ఇళ్లలో ఎవరో ఒకరు ఉంటుండటంతో సర్వే ముందుకుసాగుతోంది. తాళాలు వేసిన ఇళ్లను గుర్తుంచుకుని మళ్లీ రావడం ఇబ్బందేనని ఎన్యూమరేటర్లు చెప్తున్నారు.

జిల్లాల వారీగా ‘సర్వే’ తీరును పరిశీలిస్తే.. 
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 8,53,950 ఇళ్లు ఉండగా ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలో శనివారం రాత్రి వరకు స్టిక్కరింగ్‌ పూర్తి కాలేదు. వ్యవసాయ సీజన్‌ కావడంతో రైతులు, కూలీలు పొలాలకు వెళ్లడంతో చాలా ఇళ్లకు తాళం వేసి ఉంది. కొందరు ఇళ్ల యజమానులు వ్యక్తిగత వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. భద్రాద్రి జిల్లాలో సర్వే ఫామ్‌లు ఆలస్యంగా చేరాయి. ఏజెన్సీ ఏరియాలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుంటే ఆ వివరాలు చెప్పలేదు. గొత్తికోయలకు ఆధార్‌కార్డులు, ఓటరు కార్డులు ఉన్నా కులం సర్టిఫికెట్లు లేక సర్వేలో ఏం రాయాలో స్పష్టత లేకుండా పోయింది. 

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో చాలా మంది ఆదాయ వివరాలను సరిగ్గా చెప్పలేదు. ధరణి సమాచారం అడిగిన ఎన్యుమరేటర్లకు ‘మీకెందుకు?’అనే ప్రశ్న ఎదురైంది. రోజువారీ కూలీలు మొదటిరోజు పనులు వదులుకుని ఇంటి వద్దే ఉన్నా ఎన్యుమరేటర్లు రాక విసుగుపడటం కనిపించింది. ఇంటి నిర్మాణం, విస్తీర్ణంపై సమాధానాలు రాలేదు. ఐటీ రిటర్నులు, వడ్డీ వ్యాపారులు, కులాంతర వివాహాల సమాచారం రాబట్టలేకపోతున్నారు.  

⇒ కరీంనగర్‌ నగర పాలక సంస్థ పరిధిలో శనివారం కూడా స్టిక్కరింగే కొనసాగింది. పలుచోట్ల కొందరు ఇంటికి స్టిక్కర్లు వేయవద్దంటూ నిరాకరించారు. 

⇒ ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పత్రాల కొరతతో సర్వే ఆలస్యంగా మొదలైంది. ఒక్కో ఎన్యుమరేటర్‌ రోజుకు పది గృహాలను అప్పగించగా.. సమయం సరిపోక 5, 6 ఇళ్లే సర్వే చేస్తున్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో శనివారం రాత్రి వరకు కూడా స్టిక్కరింగ్‌ కొనసాగింది. రెండో శనివారం కావడంతో ఆరీ్పలు, ఉపాధ్యాయులు సర్వేకు హాజరుకాలేదు. బోధన్‌ నియోజకవర్గంలో సర్వే స్టిక్కర్లు వేయలేదని స్థానికులు చెప్పారు. 

⇒ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11,17,467 ఇళ్లు ఉండగా.. 8,231 మంది ఎన్యుమరేటర్లను నియమించారు. గ్రామీణ ప్రాంతాల్లో భూములు, ఆస్తుల వివరాలను చెప్పడం లేదు. ఆధార్‌ నంబర్, పాస్‌బుక్‌ వివరాలు ఇచ్చేందుకు కూడా వెనకాడుతున్నారు. పట్టణాల్లో దాదాపు అన్ని వివరాలు చెబుతున్నా ఉద్యోగం, ఆస్తి వివరాలు దాటవేస్తున్నారు. 

⇒ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 8.5 లక్షల కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు. పలువురు ఆస్తులు, భూములు, ఓపెన్‌ ప్లాట్ల వివరాలు చెప్పడం లేదు. ఇంట్లో ఉద్యోగం చేసే వారి వివరాలు చెప్పడం లేదు. ఉమ్మడి కుటుంబాల్లోని వారు వేర్వేరుగా వివరాలు నమోదు చేయాలని కోరుతున్నారు. ధరణి పాస్‌ బుక్‌ నంబర్, ఆధార్‌ కార్డులు వెతకడం, పట్టాపాస్‌ బుక్‌లు బ్యాంకుల్లో ఉండటంతో వివరాల నమోదులో జాప్యం జరుగుతోంది. బెల్లంపల్లిలో చాలాచోట్ల వార్డు కౌన్సిలర్లు, నాయకులు అందరినీ ఒకేచోటకు పిలిపించి.. వివరాలు నమోదు చేయించారు. 

⇒ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 9,67,871 కుటుంబాలు ఉన్నాయి. రుణాలు, భూములు, ఆస్తి వివరాలు చెప్పడానికి చాలామంది ముందుకురాలేదు. బీసీ–ఈ, సీ సర్టిఫికెట్లు తీసుకున్న వారు చెప్పడానికి వెనుకంజ వేశారు. కొందరు మహిళా టీచర్లు తమ భర్త, పిల్లలను సహాయకులుగా తెచ్చుకున్నారు.

రైతు భరోసా లేదు.. నేనెందుకు చెప్పాలి?
వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం గిరి్నబావి ప్రాంతంలో నరిగె ఐలయ్య ఇంటికి సర్వే కోసం ఎన్యూమరేటర్‌ వెళ్లారు. కొన్నింటికి సమాధానాలు చెప్పిన ఐలయ్య.. వ్యక్తిగత ఆస్తుల విషయంలో సరిగా స్పందించలేదు. రైతు భరోసా రానప్పుడు భూమి వివరాలు ఎందుకని ఎదురు ప్రశ్నించారు. పింఛన్‌ ఎప్పుడు ఇస్తారని ఆరా తీశారు. ఎన్యూమరేటర్‌ సర్దిచెప్పడంతో చివరకు భూమి వివరాలు చెప్పినా.. ఈ కుటుంబం వద్దే రెండు గంటలు గడిచిపోయింది.

అరగంట నుంచి గంట వరకు పడుతోంది.. 
మాకు రోజుకు 20 కుటుంబాల చొప్పున సర్వే చేయాలంటూ బుక్‌లెట్లు ఇచ్చారు. ప్రశ్నలు అడగడం, వాటి కోడ్‌ కోసం బుక్‌లెట్‌ చూడటం ఇబ్బందిగా ఉంది. డైరెక్ట్‌గా ఫామ్‌లోనే నమోదు చేసేలా ఉంటే బాగుండేది. సర్వేపై ప్రజలకు అవగాహన లేక సమాధానాలు చెప్పడానికి ఆలోచిస్తున్నారు. ఒక కుటుంబంలో ఎక్కువ మంది సభ్యులు ఉంటే అరగంట నుంచి గంట వరకు సమయం పడుతోంది. 
– ఎన్‌.పారిజాత, ఎన్యుమరేటర్, నకిరేకల్, నల్లగొండ జిల్లా

వివరాలు చెప్పేందుకు వెనకాడుతున్నారు 
ఇంటి యజమానిని ప్రశ్నలన్నీ అడిగి పూర్తి చేయడానికి చా లా సమయం పడుతోంది. కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు చాలా మంది ఇష్టపడటం లేదు. అవగాహన లేకపోవడంతో ఆస్తులకు సంబంధించిన వివరాలు చెప్పడానికి వెనుకాడుతున్నారు. కొన్ని ఇళ్ల వద్ద గంట దాకా సమయం పడుతోంది. సర్వే కోసం మరికొంత సమయం ఇవ్వాలి. 
– వేలిశెట్టి నరసింహారావు, ఎన్యుమరేటర్, వైరా, ఖమ్మం జిల్లా  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement