Chicken Price: కోడి కోయలేం.. తినలేం..! | Chicken Prices Increased in telangana | Sakshi
Sakshi News home page

Chicken Price: కోడి కోయలేం.. తినలేం..!

Apr 7 2025 11:28 AM | Updated on Apr 7 2025 12:04 PM

Chicken Prices Increased in telangana

బర్డ్‌ఫ్లూ తర్వాత అమాంతం పెరిగిన ధర

లభ్యత లేకపోవడమే కారణమంటున్న వ్యాపారులు

 కిలో చికెన్‌ ధర రూ.280 పైమాటే...
 

ఖమ్మం: కోడిని చూడగలం కానీ కోయలేము.. తినలేము అన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయి. చికెన్‌ ధరలు అమాంతం పెరగడమే ఇందుకు కారణమవుతోంది. జనవరి నెలలో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి ప్రచారంతో చికెన్‌ తినడానికి జనం విముఖత కనబరిచారు. ఆ సమయాన చికెన్‌ కేజీ ధర రూ.140 నుంచి రూ.160 పలకగా.. ఫిబ్రవరిలో కోళ్ల పరిశ్రమ నిర్వాహకులు మేళాలు నిర్వహిస్తే అక్కడకు పెద్దసంఖ్యలో జనం హాజరైనా కొనుగోలు మాత్రం ముందు రాలేదు. ఇక మార్చిలో రంజాన్‌ మాసం ప్రారంభమయ్యాక చికెన్‌ అమ్మకాలు కొద్దికొద్దిగా పెరగడం మొదలైంది. ఆ నెలంతా స్కిన్‌లెస్‌ చికెన్‌ కేజీ ధర రూ.220 నుంచి రూ.240 వరకు పలకగా.. ఈనెలలో మాత్రం రూ.280 నుంచి రూ.300వరకు పలుకుతుండడం గమనార్హం. దీంతో బర్డ్‌ ఫ్లూ భయం పోయినా ధర మాత్రం బెంబేలెత్తిస్తున్నట్లవుతోంది.

కొందరే పెంచడంతో...
బర్డ్‌ఫ్లూకు తోడు రకరకాల కారణాలతో జనవరి, ఫిబ్రవరి నెలల్లో చికెన్‌ ధరలు అమాంతం పడిపోయాయి. దీంతో అమ్మకాలు లేక పౌల్ట్రీ ఫారాల నిర్వాహకులు కోళ్లు పెంచేందుకు వెనుకడుగు వేశారు. ఫలితంగా కొన్ని హెచరిస్‌ కంపెనీల నిర్వాహకులు మాత్రమే కోళ్లు పెంచారు. ఇప్పుడు తినడానికి జనం ఆసక్తి చూపిస్తున్నా.. కోళ్ల లభ్యత లేకపోవడంతో ధర పెరుగుతోంది. లైవ్‌ కోడి కేజీ ధర రూ.150 నుంచి రూ.160 పడుతున్నందున తాము ధర పెంచి అమ్మకం తప్పడం లేదని సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు.

మటన్‌ రూ.వెయ్యి..
రెండు నెలల క్రితం బర్డ్‌ ఫ్లూ సోకుతుందనే ప్రచారంతో జనం చికెన్‌ తినకుండా మటన్, చేపల వైపు దృష్టి సారించారు. తద్వారా డిమాండ్‌ పెరగడంతో రూ.900వరకు ఉన్న మటన్‌ కేజీ ధర రూ.వెయ్యికి పెంచారు. అలాగే, తెల్ల చేపలు(లైవ్‌) కూడా కేజీ రూ.200 ధర పలికాయి. ఇప్పుడు చికెన్‌ ధర కూడా రూ.300 మార్క్‌కు చేరుతుండడంతో అది తినలేక.. మటన్‌ కొనలేక మాంసం ప్రియుల్లో ఆవేదన వ్యక్తవుతోంది. కాగా, కోళ్ల లభ్యత పెరిగాక మరో చికెన్‌ ధర తగ్గే అవకాశముందని సెంటర్ల నిర్వాహకుల ద్వారా తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement