Chicken prices
-
చికెన్..చాలా రేటు గురూ!
శ్రీకాకుళం/(పీఎన్ కాలనీ): సిండికేట్ల చేతిలో పడి చికెన్ ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. కూరగాయలు, ఆయిల్, నిత్యావసర సరుకుల ధరలు నిర్ణయించే అధికారం కలెక్టర్, మార్కెటింగ్‌శాఖ అధికారుల చేతుల్లో ఉంటుంది. చికెన్ ధరలు మాత్రం హోల్‌సేల్ చికెన్ వ్యాపారులు, వారి సిండికేట్ వారే రేట్లు ‘ఫిక్స్’ చేస్తారు. విశాఖపట్నం, విజయనగరంలో ఒక రేటు ఉంటే శ్రీకాకుళంలో మాత్రమే ఈ రెండు జిల్లాలకంటే రూ.20 ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ అంటే ఎవరూ సమాధానం చెప్పలేరు. ఫారాలకు జిల్లాలోనే ఫీడ్ దొరుకుతుంది, కోళ్ల ఫారాలు సైతం జిల్లాలోనే ఉన్నాయి. జిల్లాకు సరిపడా సరుకు లేకుంటే విశాఖ, అనకాపల్లి నుంచి తీసుకువస్తారు. కానీ ధరలు మాత్రం విశాఖ, విజయనగరం కంటే ఎక్కువే ఉంటున్నాయి. ఈ సిండికేట్‌లో త్రిమూర్తుల్లా ముగ్గురు వ్యక్తులు ఈ వ్యవహారమంతా నడిపిస్తోన్నట్లు చికెన్ షాపుల యజమానులు గుసగుసలాడుకుంటున్నారు. గత నాలుగు నెలలుగా స్కిన్లెస్ సుమారు రూ.260కి పైగా ధర పలుకుతోంది. విశాఖపట్నం, విజయనగరంలో రూ.240కి అమ్ముతున్నారు. ఇవి పత్రికల్లో వచ్చే ధరలు. చికెన్‌షాపుల యజమానుల వారి వ్యాపారాన్ని బట్టి ధర తగ్గించి అమ్మేవారు కొందరు, మరికొంతమంది దానికంటే ఎక్కువ ధరకు అమ్మకాలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ/ప్రవేటు హాస్టల్స్, హోటల్స్, దాబాల నిర్వాహకులు కొనలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దసరా తర్వాత ఆదివారం ఇంకెంత ధర పెంచేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. ఒడిశా నుంచి కొని.. జిల్లాలోని పలువురు వ్యాపారులు ఒడిశా నుంచి కోళ్లను తక్కువ ధరకు తీసుకువస్తున్నారు. జిల్లాలో కంటే ఒడిశాలో ధర కిలోకు రూ.40వరకు తక్కువగానే ఉంటుంది. తక్కువ ధరకు కొనుగోలు చేసి జిల్లాలో వ్యాపారులు, సిండికేటుగాళ్లు ఎక్కువ ధరకు అమ్ముతు న్నారు. విశాఖ, విజయనగరం జిల్లాల కంటే తక్కు వ ధరకు ఇవ్వాల్సింది పోయి తిరిగి దూర ప్రాంతాల నుంచి తెస్తున్నామనే నెపంతో ధరలు అధికంగా పెంచేసి రెట్టింపు లాభాల్ని ఆర్జిస్తున్నారు. ధరల నియంత్రణపై జిల్లా అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ధరలు నియంత్రించాల్సిందే చికెన్ ధరల నియంత్ర ణ అధికారుల చేతుల్లో ఉంటే బాగుంటుంది. హోల్‌సేల్ వ్యాపారులు తమకు ఇష్టం వచ్చిన ధరకు విక్రయిస్తున్నారు. – ప్రకాష్, చికెన్షాపు, రైతుబజారు రోడ్డు, శ్రీకాకుళం. వ్యాపారాలు చేయలేకపోతున్నాం చికెన్ ధరలను ఇష్టం వచ్చినట్లు పెంచుకుంటూ పోతున్నారు. చికెన్, గుడ్లు ధరలు పెంచడంతో దాబాకి వచ్చేవారికి అధిక ధరలకు ఆహారాన్ని అమ్మలేకపోతున్నాం నష్టాన్ని భరించలేకపోతున్నాం. – ఎం.నాగభూషణ్, శ్రీలక్షి్మదుర్గా దాబా, బలగరోడ్ ధరల నియంత్రణ మా చేతుల్లో లేదు చికెన్, గుడ్ల ధరల నియంత్రణ మా చేతుల్లో ఉండదు. వాటి సంరక్షణ, పోషణకు సంబంధించిన ప్రోత్సాహమంతా పశు సంవర్ధక శాఖ నుంచి ఉంటుంది. ధరల నియంత్రణకు జిల్లాలో సంబంధిత ప్రభుత్వ శాఖలతో కూడిన కమిటీ వేస్తే నియంత్రణ సాధ్యమ య్యే అవకాశం ఉంటుంది. – రావిపల్లి మురళీధర్, పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు -
కొండెక్కిన చికెన్! మంట పుట్టిస్తున్న మటన్..
ప్రకాశం: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చికెన్ ధరలు. నిన్నా మొన్నటి వరకు రూ.200 పలికిన చికెన్ ధర ఇప్పుడు ఏకంగా 300 రూపాయలకు చేరుకోవటంతో సామాన్యులు హడలిపోతున్నారు. కోళ్ల దాణా ధరలు పెరగడంతోపాటు, వేసవి తీవ్రత నేపథ్యంలో కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో డిమాండ్ అధికమైందని, దీని వల్లే చికెన్ ధరలు భారీగా పెరిగాయని పౌల్ట్రీ వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం దాణా ధర కేజీ 70 రూపాయలు పలుకుతుండటంతో కోళ్ల ఉత్పత్తిపై అనాసక్తి చూపుతున్నారు. పెరిగిన చికెన్ ధరతో తమకు నష్టమే జరిగిందని, విక్రయాలు తగ్గాయని దుకాణదారులు వాపోతున్నారు. ముక్కలేనిదే ముద్ద దిగని కొందరు మాంసాహార ప్రియులు మాత్రం కేజీ చికెన్‌కు బదులు అర కేజీతో సర్దుకుంటున్నారు.మటనా.. వొద్దుద్దులే..!మాంసాహార ప్రియులకు మటన్ ధరలు కూడా మంట పుట్టిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు 700 రూపాయలు పలికిన మటన్ ధర ఇప్పుడు రూ.800 నుంచి రూ.900 పలుకుతుండటంతో కొనుగోలుదారులకే కాదు వ్యాపారులకు సైతం కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. మండీ మార్కెట్ ఏజెంట్లు జీవాల రేట్లను విపరీతంగా పెంచేయటంతో మేకపోతులు, పొట్టేళ్లను అధిక మొత్తం వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోందని, అందువల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా పెరిగిన ధరలు త్వరలోనే తగ్గుముఖం పట్టాలని మాంసాహార ప్రియులు కోరుకుంటున్నారు. -
భారీగా తగ్గిన చికెన్ ధర కేజీ రూ.72
ఆలమూరు: కార్తిక మాసం, అయ్యప్ప స్వాముల దీక్షల ప్రభావంతో నెల రోజులుగా చికెన్ విక్రయాలు తగ్గిపోయాయి. దీంతో బహిరంగ మార్కెట్లో బ్రాయిలర్ చికెన్ ధర గణనీయంగా పడిపోయింది. లైవ్ కోడి ధర రికార్డు స్థాయిలో మూడేళ్ల కనిష్టానికి చేరుకుంది. ఈ పరిణామం కోళ్ల ఉత్పత్తి కంపెనీలు, కోళ్ల రైతులు, వ్యాపారులను తీవ్ర నిరాశకు గురి చేస్తూండగా.. మాంసాహార ప్రియులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కోళ్ల ఉత్పత్తిలో రాష్ట్రవ్యాప్తంగా పేరొందిన వివిధ కంపెనీల నుంచి సాధారణంగా ప్రతి రోజూ సుమారు 350 టన్నుల బ్రాయిలర్, లేయర్ కోళ్ల ఎగుమతులు జరుగుతున్నాయి. వాతావరణం సానుకూలంగా ఉండటంతో ఇటీవల కోళ్ల ఉత్పత్తి పెరిగింది. సరిగ్గా ఇదే సమయంలో కార్తిక మాసం ప్రభావంతో చికెన్‌కు ఒక్కసారిగా డిమాండు పడిపోయింది. దీంతో ప్రస్తుతం రోజుకు 200 టన్నుల వరకూ మాత్రమే ఎగుమతులు జరుగుతున్నాయి. సరఫరా తగ్గినా విక్రయాలు లేకపోవడం ధరలు మరింతగా పడిపోవడానికి కారణమైంది. ఫలితంగా చికెన్ దుకాణాలపై ఆధారపడిన చిరు వ్యాపారులు ఆదాయం పడిపోతోందంటూ గగ్గోలు పెడుతున్నారు. ధర తగ్గినా.. బహిరంగ మార్కెట్లో చికెన్ ధరలు భారీగా తగ్గినా ఆ మేరకు విక్రయాలు మాత్రం పెరగడం లేదు. దీనివల్ల హోల్‌సేల్ వ్యాపారులు నెల రోజుల క్రితం కిలో కోడి లైవ్ రూ.132కు విక్రయించగా.. ప్రస్తుతం అది కాస్తా ఏకంగా రూ.62కు పడిపోయింది. రెండు కేజీల బరువు వచ్చే వరకూ కోడిని పెంచితే సరాసరి రూ.210 వరకూ ఖర్చవుతుందని, ప్రస్తుతం ఆ బరువు కలిగిన కోడిని అమ్మితే రూ.84 వరకూ నష్టం వస్తోందని రైతులు వాపోతున్నారు. బహిరంగ మార్కెట్లో బ్రాయిలర్ కోడి కేజీ హోల్‌సేల్ ధర రూ.72గా ఉండగా.. చికెన్ కేజీ స్కిన్‌తో రూ.150, స్కిన్లెస్ రూ.175 వరకూ విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే పరిస్థితి మరో నెల రోజులు కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో దాణా ఖర్చు భరించలేక కంపెనీదారులు, రైతులు ఉత్పత్తి అయిన కోళ్లను నష్టమే అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో మార్కెట్‌కు తరలిస్తున్నారు. డిమాండ్ తగ్గిపోయింది బహిరంగ మార్కెట్లో మునుపెన్నడూ లేని విధంగా చికెన్‌కు డిమాండ్ తగ్గిపోయింది. దీనివల్ల మూడేళ్ల కనిష్ట స్థాయికి చికెన్ ధర పడిపోయింది. దీంతో దిగుమతులు తగ్గించుకోవడంతో వ్యాపార లావాదేవీలు సక్రమంగా జరగడం లేదు. కోళ్ల ధర తగ్గడంతో రైతులు, సరఫరాదారులతో పాటు గ్రామీణ చిరు వ్యాపారులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కోళ్ల రైతులు ఏడాది పాటు పడిన కష్టమంతా ఒక్క ఈ నెలలోనే నీరుగారిపోతోంది. – బొబ్బా వెంకన్న, హోల్‌సేల్ కోళ్ల వ్యాపారి, పెదపళ్ల -
చికెన్ ధరకు రెక్కలు
తణుకు: చికెన్ ధరలు మాంసంప్రియులకు చుక్కలను చూపుతున్నాయి. ఎండల ధాటికి ఉష్ణతాపం పెరిగి కోళ్లు మృత్యువాత పడుతుండటంతో మాంసం ఉత్పత్తి తగ్గగా, డిమాండ్ పెరిగి ధరపై ప్రభావం చూపుతున్నాయి. నెల రోజుల క్రితం వరకు కిలో స్కిన్లెస్ రూ.230, స్కిన్ చికెన్ రూ.200 ధర పలకగా ప్రస్తుతం మార్కెట్లో కిలో బ్రాయిలర్ చికెన్ ధర రూ.330కు, స్కిన్‌తో రూ.300 పలుకుతోంది. ఈ ధరలు చూసి కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకు రావడంలేదు. ఈ పరిస్థితుల్లో వ్యాపారాలు మందగించినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవల మండుటెండలకు బ్రాయిలర్ కోళ్లు చనిపోవడం, తగినంత దాణా తీసుకోకపోవడం వంటి కారణాలతో చికెన్ ధరలకు రెక్కలు వస్తున్నాయి. మరోవైపు ఎండల ప్రభావంతో గుడ్ల ఉత్పత్తి కూడా 20 శాతానికి తగ్గింది. ఇంకా పెరిగే అవకాశం గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో చికెన్ ధరలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎండల తీవ్రతకు మాంసం ఉత్పత్తి పడిపోవడంతో కిలో రూ.330 వరకు చేరిన చికెన్ ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే కోళ్లు తట్టుకోలేవు. ప్రస్తుతం జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు నమోదవుతోంది. ఈ పరిస్థితుల్లో కోళ్లను కాపాడుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం ఉండటం లేదని రైతులు వాపోతున్నారు. నెల రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో కోళ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. పౌల్ట్రీ ఫారాల్లో పెంచుతున్న కోళ్లు వడగాలులకు తట్టుకోలేక మృత్యువాత పడుతున్నాయి. పౌల్ట్రీ రైతులు సైతం ఏప్రిల్, మే నెలల్లో వీటి ఉత్పత్తికి వెనుకంజ వేస్తూ వచ్చారు.. ఫలితంగా కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడం తద్వారా ధరలు అమాంతం పెరిగిపోయాయి. సాధారణంగా వేసవిలో కోళ్లు 6 శాతం వరకు మృత్యువాత పడుతుంటాయి. ఈ సారి వడగాలుల తీవ్రత తారాస్థాయికి చేరడంతో 16 శాతానికి పైగా మృత్యువాత పడుతున్నాయని రైతులు చెబుతున్నారు. రెండు కిలోల కోడి తయారు కావడానికి 40 రోజులు సమయం పడుతుంది. వేసవిలో మేత సరిగ్గా తినకపోవడంతో 60 రోజులు పడుతోంది. ఈ పరిస్థితుల్లో అనుకున్న సమయానికి కోళ్లు ఉత్పత్తి కావడంలేదు. ఈ పరిస్థితుల్లో పౌల్ట్రీ రైతులు నష్టాలబాట పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ధరలు పెంచుతున్నారు. గతంలో లైవ్ చికెన్ ధర కిలో రూ.110 ఉండగా, ప్రస్తుతం రూ.160 పలుకుతోంది. కోళ్ల ఉత్పత్తి పడిపోయింది సాధారణంగా ఎండాకాలంలో చికెన్ ధర తగ్గుముఖం పడుతుంది. ఈ సారి ఎండల తీవ్రత కారణంగా కోళ్లు మృత్యువాత పడుతుండటంతో మాంసం దిగుబడి తగ్గింది. మరోవైపు కోళ్ల ఫారాల నుంచి పొరుగు రాష్ట్రాలకు ఎగుమతులు పెరిగాయి. దీంతో గత కొద్ది రోజులుగా కోళ్ల ఉత్పత్తి పడిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా చికెన్ ధర పలుకుతోంది. దీంతో గతంతో పోల్చితే 50 శాతం అమ్మకాలు పడిపోయాయి. – గణేష్, చికెన్ వ్యాపారి, తణుకు -
రికార్డు స్థాయిలో చికెన్ ధర@ 550
వికారాబాద్: చికెన్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. నెల రోజుల క్రితం వరకు సరైన రేట్లు లేకపోవడంతో మార్కెట్ కుదేలైంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలువురు రైతులు ఫారాలు మూసేశారు. ప్రస్తుతం ధరలు ఆకాశాన్నంటాయి. స్కిన్ లెస్ చికెన్ కిలోకు రూ.320 వరకు పలుకుతోంది. బోన్ లెస్ కావాలంటే రూ.550 చెల్లించాల్సిందే. లైవ్ బర్డ్ కిలోకు రూ.190 చొప్పున విక్రయిస్తున్నారు. రెండేళ్ల కాలంలో ఇవే అత్యధిక ధరలని వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవలికాలంలో శుభకార్యాలతో పాటు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో చికెన్‌కు డిమాండ్ పెరిగింది. పౌల్ట్రీ వైపు అడుగులు జిల్లా రైతులు ఇప్పుడిప్పుడే పౌల్ట్రీ రంగం వైపు దృష్టిసారిస్తున్నారు. బ్రాయిలర్ కోళ్ల పెంపకం ద్వారా ఏటా 6 బ్యాచ్‌లు వచ్చే అవకాశం ఉంది. దీంతో కోళ్ల పెంపకం లాభదాయకంగా కొనసాగుతూ వచ్చింది. జిల్లాలోని బొంరాస్‌పేట్‌లో– 4, దోమ 16, యాలాల 18, వికారాబాద్ 7, పూడూరు 12, పరిగి 12, మోమిన్‌పేట్ 6, మర్పల్లి 9, కుల్కచర్ల 5, కొడంగల్, ధారూరులో ఒక్కోటి చొప్పున పౌల్ట్రీ ఫారాలు ఉన్నాయి. ఎండల ప్రభావంతోనే.. కరోనా తర్వాత ప్రజలు మాంసాహార వాడకాన్ని పెంచారు. ఇందులోనూ చికెన్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. వినియోగదారుల అవసరం మేర ఉత్పత్తి లేకపోవడం ప్రస్తుతం కోడిమాసం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఎండాకాలం కావడంతో అధిక ఉష్ణోగ్రతల కారణంగా కోళ్ల ఎదుగుదలకు ఎక్కువ సమయం పడుతోంది. ఎలాగైనా వీటిని బతికించుకునేందుకు రైతులు, వ్యాపారులు అనేక అవస్థలు పడుతున్నారు. ఫారాల వద్ద కూలర్లు, రెయిన్ డ్రిప్, స్ప్రీంక్లర్లు ఏర్పాటు చేసి చల్లదనం అందిస్తున్నారు. దాణా, మందుల ధరలు రెట్టింపు కోళ్లకు దాణాగా ఉపయోగించే మొక్కజొన్న, సోయా, తవుడు ధరలు పెరిగాయని నిర్వాహకులు చెబుతున్నారు. దీనికి తోడు వ్యాక్సిన్లు, మందుల ధరలు కూడా రెట్టింపయ్యాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎండల వేడిమికి నిత్యం పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయని చెబుతున్నారు. తినడం తగ్గించాం గతంలో వారంలో రెండు రోజులు చికెన్‌ను తినే వాళ్లం. ప్రస్తుతం పెరిగిన ధరలతో రెండు వారాలకు ఒకసారి మాత్రమే తీసుకెళ్తున్నాం. మార్కెట్లో చికెన్ ధరలు విపరీతంగా పెరిగాయి. చికెన్ బదులు చేపలు తెచ్చుకుంటున్నాం. – గుడిసె బాబు, బొంపల్లి ఆశించిన లాభాలు లేవు గతంలో చికెన్ ధరలు పడిపోవడంతో ఆశించిన స్థా యిలో లాభాలు రాలే దు. దీంతో కొంతమంది ఫారా ల నిర్వహణ నుంచి తప్పుకొన్నారు. పదిహేను రోజు లుగా మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే నష్టాల నుంచి బయట పడుతున్నాం. – యాదగిరిరెడ్డి, చికెన్ సెంటర్ నిర్వాహకుడు -
భారీగా తగ్గిన చికెన్ ధరలు కిలో ఎంతంటే?
అల్లిపురం (విశాఖ దక్షిణ): చికెన్ ధరలు భారీగా పతనమయ్యాయి. నెల రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు రూ.220 నుంచి రూ.160కు చేరాయి. కిలోకు దాదాపు దాదాపు రూ.60 తగ్గింది. అయినప్పటికీ కొంతమంది రిటైల్ వ్యాపారులు ధరలు తగ్గించకుండా పాత ధరలకే అమ్ముతుండటంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, బ్రాయిలర్ కోడి లైవ్ ధర రూ.90కు పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోడిగుడ్డుదీ అదే దారి.. కోడిగుడ్డు ధరలు పది రోజులుగా తగ్గుముఖం పట్టాయి. వంద కోడిగుడ్లు జనవరిలో రూ.555 ఉండగా, ప్రస్తుతం రూ.440 ఉంది. రిటైల్‌లో మాత్రం వ్యాపారులు ఒకటి రూ.6 నుంచి రూ.6.50 వరకు అమ్ముతున్నారు. గిట్టుబాటు కావడం లేదు కోళ్ల రైతులకు ప్రస్తుత ధరలు గిట్టుబాటు కావటం లేదు. పిల్ల రేటు, ఫీడ్ రేటు పెరిగిపోయింది. మరో పక్క ట్రాన్స్‌పోర్టు చార్జీలు, లేబర్ చార్జీలు పెరిగిపోయాయి. చికెన్ ధరలు భారీగా పడిపోవడంతో తీవ్ర నష్టాలు చవిచూస్తున్నాం. ప్రభుత్వం చికెన్ వ్యాపారులను ఆదుకోవాలి. – టి.అప్పారావు, బ్యాగ్ అధ్యక్షుడు -
చికెన్.. ధర మండెన్.. షేర్ మార్కెట్‌ను తలపిస్తున్న ధరలు
సాక్షి, నంద్యాల: చికెన్ ధర అమాంతం పెరుగుతూ, పడిపోతూ షేర్ మార్కెట్‌ను తలపిస్తోంది. వ్యాపారులు రోజుకొక ధర నిర్ణయిస్తూ తమ వ్యాపారాన్ని మూడు కోళ్లు.. ఆరు కిలోలుగా సాగిస్తున్నారు. ఆదివారం వస్తే ధర కొండెక్కుతుంది. గత ఆదివారం రూ. 200 ప్రకారం విక్రయించగా ఈ ఆదివారం మాత్రం రూ. 220గా నిర్ణయించారు. ఇక మిగిలిన రోజుల్లో రూ.180 పైనే ఉంటుందని ప్రజలు చెబుతున్నారు. ఆదివారం విక్రయాలు అధికంగా ఉంటాయని, దీంతో కోళ్లు దొరకకపోతుండటంతో అధిక ధరలు వెచ్చించి తెస్తుండటం వల్లే ధర పెంచుతున్నామని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండంగా నాటు కోడి మాసం కేజీ రూ.500 పైనే పలుకుతుంది. చదవండి: (సార్ ఇటువైపు చూడండి.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన కొలగట్ల) -
కొండ దిగొస్తున్న కోడి..! తగ్గిన చికెన్ ధరలు.. హైదరాబాద్‌లో మాత్రం..!
కడప అగ్రికల్చర్: మొన్నామొన్నటి దాకా కొండ దిగని కోడి మాంసం ధరలు వారం రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. మరో వారం రోజుల్లో శ్రావణమాసం కూడా ప్రారంభంకానుండటంతో చికెన్ ధర మరింత తగ్గవచ్చని వ్యాపారులు అంటున్నారు. 20 రోజుల క్రితం రూ.250 పైన ఉన్న ధర వారం రోజుల నుంచి క్రమేపీ తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం స్కిన్ లెస్ రూ. 170, విత్ స్కిన్ కిలో రూ. 150 వచ్చింది. చదవండి👉🏻గ్లూకోజ్ పౌడర్ అనుకొని.. ప్రస్తుతం ఎండల తగ్గి వాతావరణం చల్లబడటంతోపాటు పాటు వర్షాలు కూడా వస్తుండటంతో చికెన్ ఉత్పత్తి కొంచం పెరిగిందని వ్యాపారులు తెలిపారు. వేసవిలో కిలో స్కిన్ లెస్ చికెన్ రూ. 300 పైగా పలికింది. దీంతో సామాన్యులు చికెన్ తినాలంటే జంకే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం కొండ దిగి వస్తుండడంతో పేద, మద్య తరగతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, బోనాల జాతర నేపథ్యంలో హైదరాబాద్‌లో చికెన్ ధరలు పెద్దగా దిగిరాలేదు. అక్కడ స్కిన్లెస్ చికెన్ కిలో ధర రూ.240 ఉండగా.. లైవ్ బర్డ్ 180 గా ఉంది. బోన్‌లెస్ చికెన్ 280 గా ఉంది. చదవండి👉🏻అమ్మో.. అరటిపండు.. డజన్ రూ.80 పైమాటే.. ఎందుకంటే? -
Chicken Price: చికెన్ 312 నాటౌట్.. చరిత్రలోనే ఆల్‌టైం రికార్డు
చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. సాధారణంగా ఎండాకాలం మొదలవగానే చికెన్ ధరలు తగ్గుతుంటాయి. అయితే ఒక్కసారిగా ఉత్పత్తి తగ్గడంతో ధర అమాంతం పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో బాయిలర్ చికెన్ కిలో రూ.312కు విక్రయిస్తున్నారు. ఈ ధరలు చూసి కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకు రావడంలేదు. – ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు) చికెన్ ధర ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసింది. పౌల్ట్రీ చరిత్రలో ఎన్నడూ లేని విధింగా హోల్‌సేల్ మార్కెట్లో బాయిలర్ చికెన్ కిలో రూ.312కు చేరింది. రోజు రోజుకూ ఎగబాకుతూ మాంసం ప్రియులు చేతి చమురు వదిలిస్తోంది. పెరుగుతున్న ధరలతో చికెన్ కొనాలంటే సామాన్యుడు కళ్లు తేలేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నగర మార్కెట్లో మటన్ ధర నిలకడగా కొనసాగుతోంది. లైవ్ ధర సైతం రికార్డు స్థాయిలో కేజీ రూ.166 చేరింది. పౌల్ట్రీ చరిత్రలోనే ఆల్‌టైం రికార్డు : కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం చికెన్ రికార్డు స్థాయి ధరలను నమోదు చేసింది. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా చికెన్ వైపు వినియోగదారుల అంతగా మొగ్గు చూపలేదు. ఓ దశలో స్కిన్లెస్ చికెన్ కిలో రూ.80 దిగివచ్చింది. అయితే సెకండ్ వేవ్ తగ్గిన అనంతరం చికెన్ ధర పెరుగుతూ వచ్చింది. ఓ దశలో కిలో రూ.280కి చేరి ఆల్‌టైం రికార్డును నెలకొల్పింది. తరువాత ఆ రికార్డులను అధిగమించే ఏకంగా రూ.312కు చేరింది. ఈ ఏడాది ఆరంభం నుంచి చికెన్ ధర కిలో రూ.200 మార్కును దిగకుండా కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి 1న రూ.214 వద్ద నిలకడగా ఉన్న ధర మార్చి 1 నాటికి రూ.280కి ఎగబాకింది. అనంతరం కొద్దిపాటి తగ్గుదల నమోదవుతూ వచ్చిన మే 1వ తేదీ నుంచి ధరల పెరుగుదల రికార్డు స్థాయికి చేరింది. మే 1వ తేదీ రూ.228గా ఉన్న కిలో స్కిన్లెస్ ధర మే 12వ తేదీ నాటికి రూ.312కు ఎగబాకి ఆల్‌టైం రికార్డు సృష్టించింది. రూ.320 మార్కు దాటే అవకాశముంది కోవిడ్ రెండో దశ అనంతరం నుంచి చికెన్ ధరలు రికార్డు స్థాయిలోనే కొనసాగుతున్నాయి. గతేడాది రూ.280 చేరి ఆల్‌టైం రికార్డు సృష్టించిన ధర ఈ ఏడాది ఏకంగా రూ.300 మార్కును దాటేసింది. ప్రస్తుతం వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి లేకపోవడంతోనే రికార్డు స్థాయిలో ధరలు పెరుగుతున్నాయి. ఎండాకాలం కావడంతో పౌల్ట్రీల్లో కోళ్లు పెరుగుదల సమయం ఎక్కువగా ఉంటుంది. వాటిని మార్కెట్‌కు తరలించేందుకు కావాల్సిన బరువు పెరిగేందుకు ఇతర సీజన్స్‌తో పోలిస్తే ఎక్కువ రోజులు పడుతుంది. దీంతో దాని ప్రభావం ఉత్పత్తిపై పడటంతో ధరలు పెరుగుతున్నాయి. దీంతో పాటు ఈ ఏడాది కోళ్లకు మేతగా ఉపయోగించే మొక్కజొన్న, ఆయిల్ తీసిన సోయ, తవుడు ధరలు భారీగా పెరిగాయి. దీంతో వీటి ప్రభావం కారణంగా కూడా చికెన్ ధర ఆకాశాన్ని అంటుతున్నాయి. – సుబ్బారావు, పౌల్ట్రీ, హోల్‌సేల్ చికెన్ వ్యాపారి -
Chicken Prices: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చికెన్ ధరలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. తెలంగాణ, ఏపీలో కొన్ని ఏరియాల్లో త్రిబుల్ సెంచరీ దాటింది స్కిన్లెస్ చికెన్ కేజీ ధర. ఎండాకాలం, పైగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో చికెన్ డిమాండ్ పెరిగి.. ధరలూ పెరిగాయని వ్యాపారులు చెప్తున్నారు. పది రోజుల గ్యాప్‌లో 70 నుంచి 80 రూపాయల దాకా పెరిగింది. కూరగాయల దిగుబడి తగ్గిపోవడం, హోటల్స్.. రెస్టారెంట్లలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల వ్యాపారాలు జోరందుకోవడంతో ధరలు పెరిగాయి. మరోవైపు ఎండకు కోళ్లు చనిపోతాయనే భయంతో.. కొందరు కోళ్ల ఫారం వ్యాపారులు బరువు పెరగకుండానే వెంటనే అమ్మేస్తున్నారు. -
రెండు నెలలుగా దిగిరాని చికెన్ ధర
మండపేట: రెండు నెలలుగా చికెన్ ధర దిగిరానంటోంది. స్కిన్లెస్ కిలో రూ.300ల నుంచి రూ.320లతో వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. మేత ధరలు విపరీతంగా పెరగడం, ఎండలు ముదురుతుండటంతో నష్టాలు తాళలేక కొత్త బ్యాచ్‌లు వేయడానికి రైతులు వెనుకంజ వేస్తున్నారు. అవసరమైన మేర కోళ్లు లేక ధర తగ్గడం లేదని వ్యాపారులు అంటున్నారు. రంజాన్ నెల మొదలుకావడంతో వినియోగం మరింత పెరగనుంది. మాంసాహార ప్రియులు అధికంగా ఇష్టపడేది చికెన్. తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల పరిధిలో రోజుకు సాధారణంగా మూడు 3.2 లక్షల కిలోల చికెన్ వినియోగిస్తుండగా, ఆదివారం, పండుగ రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరుగుతుంటాయి. వేసవి ప్రభావం తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం, కోరుకొండ, గోకవరం, కొవ్వూరు, కోనసీమలోని అమలాపురం, రావులపాలెం, కాకినాడలోని తుని, తొండంగి ప్రాంతాల్లో 440 ఫామ్‌లు వరకు విస్తరించి ఉండగా ఏడు లక్షల కోళ్లు పెంపకం జరుగుతున్నట్టు అంచనా. బ్యాచ్ వేసిన 40 రోజుల్లో బ్రాయిలర్ కోళ్లు రెండు నుంచి రెండున్నర కేజీలు వరకు పెరిగి వినియోగానికి వస్తుంటాయి. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌ను బట్టి రైతులు ఎప్పటికప్పుడు కొత్త బ్యాచ్‌లు వేస్తుంటారు. ఎండలు తీవ్రమయ్యే కొద్ది కోళ్ల మరణాలు పెరిగి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కారణంతో వేసవిలో కొత్త బ్యాచ్‌లు వేయడానికి రైతులు ఆసక్తి చూపించరు. దీనికితోడు గత మూడు నెలల్లో కోడిమేత ధరలు గణనీయంగా పెరగడం కోళ్ల పెంపకంపై తీవ్ర ప్రభావం చూపింది. మొక్కజొన్న కిలో రూ. 14లు నుంచి రూ. 25లకు పెరుగ్గా, సోయా రూ. 40లు నుంచి రూ. 90లకు పెరిగిపోయింది. అన్ని మేతలు మిక్స్‌చేసి అమ్మే కంపెనీ మేత కిలో రూ. 30 నుంచి రూ. 50 వరకు పెరిగిపోయినట్టు కోళ్ల రైతులు అంటున్నారు. కోడిపిల్ల ధర రూ. 35లకు పెరిగిపోయింది. కిలో కోడి తయారయ్యేందుకు రెండు కిలోల మేత అవసరమవుతుండగా, ఇతర నిర్వహణ ఖర్చులతో లైవ్ కిలో కోడి తయారవ్వడానికి రూ. 110లు వరకు వ్యయమవుతోందని వారంటున్నారు. పెరిగిన ధరలతో సొంతంగా నిర్వహణ చేయలేక అధికశాతం మంది బ్రాయిలర్ కోళ్ల రైతులు బ్రాయిలర్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. కమీషన్‌పై కేవలం కోడిపిల్లలను పెంచి పెద్దవి చేసి అప్పగించే విధంగా ఫామ్‌లు నిర్వహిస్తున్నారు. రెండు నెలలుగా అదే ధర స్థానిక అవసరాలకు తగ్గట్టుగా కోళ్ల పెంపకం లేకపోవడం, అధికశాతం పామ్‌లు కంపెనీల అధీనంలోనే ఉండటం ధర పెరుగుదలకు కారణమని వ్యాపారులు అంటున్నారు. ఫిబ్రవరి మొదటివారంలో స్కిన్లెస్ చికెన్ కిలో రూ.200లు వరకు ఉండగా క్రమంగా పెరుగుతూ రూ.300లకు, లైవ్ కిలో రూ. 100ల నుంచి 150లకు చేరుకున్నాయి. మారుమూల గ్రామాల్లో రూ.320 నుంచి రూ.350లు వరకు కూడా అమ్మకాలు జరుగుతున్నాయి. రంజాన్ ఉపవాస దీక్షలు నేపథ్యంలో ముస్లింలు చికెన్ వినియోగానికి ప్రాధాన్యమిస్తుంటారు. సాధారణ రోజులతో పోలిస్తే రంజాన్ నెలలో అమ్మకాలు పెరుగుతాయని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితులలో ధర ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని వ్యాపారవర్గాల అంచనా. నిర్వహణ పెరిగిపోయింది ఎప్పుడు లేనంతగా కోడి మేత ధరలు, కోడిపిల్లల ధరలు పెరిగిపోయాయి. గతంలో పోలిస్తే నిర్వహణ వ్యయం రెట్టింపు అవుతోంది. సొంతంగా పెంచలేక చాలామంది రైతులు కంపెనీ కోళ్లనే పెంచుతున్నారు. అవసరానికి తగ్గట్టుగా కోళ్లు లేకపోవడం వలన ధర పెరుగుతోంది. – బొబ్బా వెంకన్న, బ్రాయిలర్ కోళ్ల రైతు, పెదపళ్ల, ఆలమూరు మండలం -
కొండెక్కిన కోడి ధర.. నెల రోజుల్లో స్కిన్లెస్ చికెన్ రేట్ అంత పెరిగిందా!
కరీంనగర్ అర్బన్: కూరగాయల ధరలు తగ్గుముఖం పడుతుండగా.. కోళ్ల ధరలు కొండెక్కాయి. సుట్టమొస్తే చికెన్‌తో మర్యాద చేయడం పరిపాటి. కానీ పెరుగుతున్న ధర రోజురోజుకూ ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే నిత్యవసర సరకులు, నూనెల ధరలు అందనంత దూరంలో ఉండగా కోళ్లు, గుడ్ల ధరలు పెరగడంతో సామాన్యులపై మరింత భారం పడుతోంది. జిల్లాలో నెల వ్యవధిలో చికెన్ ధర కిలోకు రూ.111పెరిగింది. వరుస నష్టాల క్రమంలో స్థానికంగా కోళ్ల ఫారాల్లో తక్కువగా కోళ్లు పెంచుతుండగా సిద్దిపేట, హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఉత్పత్తి ఆశించినస్థాయిలో లేకపోవడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. జిల్లాకేంద్రంలో 500లకు పైగా హోల్‌సేల్ దుకాణాలుండగా హుజూ రాబాద్, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర, తి మ్మాపూర్ ప్రాంతాల్లో మరో 500 వరకు ఉన్నాయి. రిటైల్ షాపుల్లో మరో 500లకు పైగా ఉంటాయి. ధరలు పైపైకి జిల్లాలో నెలరోజులుగా చికెన్, గుడ్ల ధరలు కాలక్రమేణ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా జిల్లాలో ఎక్కువగా ఫౌల్ట్రీ, బాయిలర్ చికెన్ వినియోగిస్తారు. బ్రాయిలర్ చికెన్ ధర స్కిన్లెస్తో కిలో రూ.281కి చేరగా స్కిన్ ధర రూ.247కు చేరింది. సరిగ్గా నెలరోజుల క్రితం స్కిన్లెస్ చికెన్ కిలో రూ.170 ఉండగా స్కిన్ ధర 135 ఉండేది. అంతలోనే స్కిన్లెస్ రూ.111, స్కిన్ ధర కూడా అదేస్థాయిలో పెరిగింది. జిల్లాలో సగటున వెయ్యి క్వింటాళ్ల నుంచి 1,500 క్వింటాళ్ల వరకు చికెన్ విక్రయాలు జరుగుతున్నాయి. గుడ్ల ధరలు నెలన్నర రోజుల్లో రూపాయి పెరిగింది. నెల క్రితం గుడ్డు ధర రూ.4 ఉండగా ప్రస్తుతం రూ.5 ధర పలుకుతోంది. నష్టాలే కారణం రాష్ట్రంలో రికార్డుస్థాయిలో కోళ్లఫారాలుండగా కోళ్లు పెంచేవారి సంఖ్య క్రమేణా తగ్గుతోంది. గత రెండు బ్యాచులు నష్టాలే రావడంతో సమ్మక్క సారక్క జాతరకు ముందు నుంచి కోళ్ల కొరత వెంటాడుతోంది. ఒక్కో బ్యాచ్ 45–50 రోజులు కాగా 5వేల కోళ్లు పెంచే ఫారంరైతు సుమారు రూ.1లక్షనుంచి రూ.2లక్షల వరకు నష్టపోయారు. ఈ లెక్కన జిల్లాలో రూ.కోట్లలో నష్టం వాటిల్లింది. ట్రేడర్ల దోపిడీ రోజురోజుకు పెచ్చుమీరుతుండగా 50రోజులుగా కోళ్లను పెంచిన వారికి లాభాలు లేకపోగా ట్రేడర్లు మాత్రం గంటల్లోనే లాభాలు గడిస్తున్నారు. దీంతో కోళ్ల ఫారాలు ఖాళీగా ఉంచారు. పావు వంతు ఫారాల్లో మాత్రమే కోళ్లను పెంచుతుండగా డిమాండ్ మేరకు సప్లై లేకపోవడంతో ధర అమాంతం పెరుగుతోంది. వాతావరణంలో మార్పులతో కోళ్ల ఎదుగుదల ఉండటం లేదు. దీనికితోడు ఈకోలా, గురక రోగంతో చనిపోతుండటంతో ధరపై తీవ్ర ప్రభావం చూపుతోంది. -
కోడి ధరకు రెక్కలు
తణుకు: చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. సాధారణంగా ఎండాకాలం మొదలవగానే చికెన్ ధరలు తగ్గుతుంటాయి. అయితే ఒక్కసారిగా ఉత్పత్తి తగ్గడంతో ధర అమాంతం పెరిగింది. వారం రోజుల క్రితం వరకు కిలో స్కిన్లెస్ చికెన్ రూ.180, స్కిన్ చికెన్ రూ. 160 ఉండగా.. ప్రస్తుతం మార్కెట్లో కిలో స్కిన్ చికెన్ రూ.280కు విక్రయిస్తున్నారు. స్కిన్ లెస్ రూ.300 పలుకుతోంది. ఈ ధరలు చూసి కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకు రావడంలేదు. దాంతో వ్యాపారాలు మందగించినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవల మేత ధరలు విపరీతంగా పెరగడంతో కొత్త బ్యాచ్‌లు వేసేందుకు రైతులు వెనుకంజ వేస్తున్నారు. దీంతో బహుళజాతి సంస్థల నుంచి కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ఫలితంగా చికెన్ ధరలకు రెక్కలు వచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మేత ధరల మోత పశ్చిమ గోదావరి జిల్లాలో సాధారణంగా రోజుకు 2 లక్షల కిలోల మేర చికెన్ వినియోగిస్తుండగా ఆదివారం, ఇతర పండుగల రోజుల్లో రెట్టింపు అమ్మకాలు జరుగుతుంటాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 ఫారాల్లో 8 లక్షలకు పైగా బ్రాయిలర్ కోళ్లు పెరుగుతున్నాయి. సాధారణంగా ఎండలు పెరుగుతున్న సమయంలో చికెన్ ధర తగ్గుతుంది. ఈ సారి ధర పెరగడంతో అటు వ్యాపారులు, ఇటు సామాన్యులకు చికెన్ గుబులు పుట్టిస్తోంది. సాధారణంగా రెండు కిలోల కోడి తయారు కావడానికి 40 రోజులు సమయం పడుతుంది. ఎండాకాలంలో మేత సరిగ్గా తినకపోవడంతో 60 రోజులు పడుతోంది. ఈ పరిస్థితుల్లో మేత ధరలు అమాంతం పెరగడంతో కొత్త బ్యాచ్‌లు వేయడంలేదు. దీంతో అనుకున్న సమయానికి కోళ్లు ఉత్పత్తి కావడంలేదు. మరోవైపు పౌల్ట్రీ రైతులు నష్టాల బాట పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ధరలు పెంచుతున్నారు. బ్రాయిలర్‌తో పోల్చితే లేయర్ చికెన్ ధరలు పెద్దగా పెరగకపోవడం వినియోగదారులకు కొంత ఊరటనిస్తోంది. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేదు మేత ధరలు పెరిగిపోవడంతో రైతులు కొత్త బ్యాచ్‌లు వేసేందుకు ముందుకు రావడంలేదు. దీంతో జిల్లాలో డిమాండ్‌కు తగినట్లుగా కోళ్లు అందుబాటులో లేవు. దీంతో చికెన్ ధర పెరిగింది. మేత ధరలు గతంలో ఎప్పుడూ లేనంతగా కేవలం రెండు నెలల్లో మూడు రెట్లు పెరిగాయి. మేత ధరలు తగ్గి కొత్త బ్యాచ్‌లు వస్తేనే ధరలు తగ్గుతాయి. – బండి గణేష్, చికెన్ వ్యాపారి, తణుకు తగ్గిన బ్రాయిలర్ కోళ్ల పెంపకం ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఇతరత్రా కారణాలతో కొద్ది రోజుల వ్యవధిలోనే మేత ధర పెరిగింది. స్థానిక ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి అవుతుండటం, కొత్త పంటలు మార్కెట్లోకి రాకపోవడం మేత ధర పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. బ్రాయిలర్ కోడి మేతలో ప్రధానమైన సోయాబీన్ ధర నెల రోజుల్లో కిలోకు ఏకంగా రూ. 35 నుంచి రూ.90కి పెరిగింది. మొక్కజొన్న కిలో రూ. 12 నుంచి రూ. 24కి పెరిగింది. ఈ పరిస్థితుల్లో బ్రాయిలర్ కోళ్ల పెంపకం సగానికిపైగా తగ్గిపోయింది. దీంతో ఉభయగోదావరి జిల్లాలతోపాటు తెలంగాణలోని బ్రాయిలర్ కంపెనీల నుంచి స్థానిక వ్యాపారులు కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బ్రాయిలర్ ధర మరింత పెరిగే అవకాశం ఉందని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. -
కోడి ధరకు రెక్కలు.. అమాంతం పెరిగిన ధర.. అమ్మో అంత రేటా?
తణుకు: చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. సాధారణంగా ఎండాకాలం మొదలవగానే చికెన్ ధరలు తగ్గుతుంటాయి. అయితే ఒక్కసారిగా ఉత్పత్తి తగ్గడంతో ధర అమాంతం పెరిగింది. వారం రోజుల క్రితం వరకు కిలో స్కిన్లెస్ చికెన్ రూ.180, స్కిన్ చికెన్ రూ. 160 ఉండగా.. ప్రస్తుతం మార్కెట్లో కిలో స్కిన్ చికెన్ రూ.280కు విక్రయిస్తున్నారు. స్కిన్ లెస్ రూ.300 పలుకుతోంది. ఈ ధరలు చూసి కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకు రావడంలేదు. దాంతో వ్యాపారాలు మందగించినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవల మేత ధరలు విపరీతంగా పెరగడంతో కొత్త బ్యాచ్‌లు వేసేందుకు రైతులు వెనుకంజ వేస్తున్నారు. దీంతో బహుళజాతి సంస్థల నుంచి కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ఫలితంగా చికెన్ ధరలకు రెక్కలు వచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మేత ధరల మోత జిల్లాలో సాధారణంగా రోజుకు 2 లక్షల కిలోల మేర చికెన్ వినియోగిస్తుండగా ఆదివారం, ఇతర పండుగల రోజుల్లో రెట్టింపు అమ్మకాలు జరుగుతుంటాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 ఫారాల్లో 8 లక్షలకు పైగా బ్రాయిలర్ కోళ్లు పెరుగుతున్నాయి. సాధారణంగా ఎండలు పెరుగుతున్న సమయంలో చికెన్ ధర తగ్గుతుంది. ఈ సారి ధర పెరగడంతో అటు వ్యాపారులు, ఇటు సామాన్యులకు చికెన్ గుబులు పుట్టిస్తోంది. సాధారణంగా రెండు కిలోల కోడి తయారు కావడానికి 40 రోజులు సమయం పడుతుంది. ఎండాకాలంలో మేత సరిగ్గా తినకపోవడంతో 60 రోజులు పడుతోంది. ఈ పరిస్థితుల్లో మేత ధరలు అమాంతం పెరగడంతో కొత్త బ్యాచ్‌లు వేయడంలేదు. దీంతో అనుకున్న సమయానికి కోళ్లు ఉత్పత్తి కావడంలేదు. మరోవైపు పౌల్ట్రీ రైతులు నష్టాల బాట పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ధరలు పెంచుతున్నారు. బ్రాయిలర్‌తో పోల్చితే లేయర్ చికెన్ ధరలు పెద్దగా పెరగకపోవడం వినియోగదారులకు కొంత ఊరటనిస్తోంది. తగ్గిన బ్రాయిలర్ కోళ్ల పెంపకం ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఇతరత్రా కారణాలతో కొద్ది రోజుల వ్యవధిలోనే మేత ధర పెరిగింది. స్థానిక ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి అవుతుండటం, కొత్త పంటలు మార్కెట్లోకి రాకపోవడం మేత ధర పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. బ్రాయిలర్ కోడి మేతలో ప్రధానమైన సోయాబీన్ ధర నెల రోజుల్లో కిలోకు ఏకంగా రూ. 35 నుంచి రూ.90కి పెరిగింది. మొక్కజొన్న కిలో రూ. 12 నుంచి రూ. 24కి పెరిగింది. ఈ పరిస్థితుల్లో బ్రాయిలర్ కోళ్ల పెంపకం సగానికిపైగా తగ్గిపోయింది. దీంతో ఉభయగోదావరి జిల్లాలతోపాటు తెలంగాణలోని బ్రాయిలర్ కంపెనీల నుంచి స్థానిక వ్యాపారులు కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బ్రాయిలర్ ధర మరింత పెరిగే అవకాశం ఉందని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. (చదవండి: లైఫ్ ఈజ్ రయ్రయ్) డిమాండ్‌కు తగ్గ సరఫరా లేదు మేత ధరలు పెరిగిపోవడంతో రైతులు కొత్త బ్యాచ్‌లు వేసేందుకు ముందుకు రావడంలేదు. దీంతో జిల్లాలో డిమాండ్‌కు తగినట్లుగా కోళ్లు అందుబాటులో లేవు. దీంతో చికెన్ ధర పెరిగింది. మేత ధరలు గతంలో ఎప్పుడూ లేనంతగా కేవలం రెండు నెలల్లో మూడు రెట్లు పెరిగాయి. మేత ధరలు తగ్గి కొత్త బ్యాచ్‌లు వస్తేనే ధరలు తగ్గుతాయి. -బండి గణేష్, చికెన్ వ్యాపారి, తణుకు -
Sakshi Cartoon: చుక్కల్లో చికెన్ ధరలు
చుక్కల్లో చికెన్ ధరలు -
కోళ్లకు కొరత!
సాక్షి, అమరావతి బ్యూరో: వైరస్ భయంతో బ్రాయిలర్ కోళ్ల పెంపకాన్ని ఫౌల్ట్రీ రైతులు తగ్గించడంతో.. మార్కెట్లో కొరత ఏర్పడుతోంది. దీంతో చికెన్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 5న చికెన్(స్కిన్లెస్) కిలో ధర రూ.200 ఉండగా.. ఇప్పుడది రూ.300 దగ్గరకు చేరుకుంది. స్థానిక పౌల్ట్రీల నుంచి రోజూ మూడు లక్షల బ్రాయిలర్ కోళ్ల విక్రయాలు జరుగుతుంటాయి. హైదరాబాద్ నుంచి కోళ్ల కొనుగోళ్లు నిలిచిపోయాయి. డిమాండ్‌కు తగినన్ని బ్రాయిలర్ కోళ్లు లభ్యం కాక ధరలు గణనీయంగా పెరుగుతున్నాయని అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కాజా వెంకటేశ్వరరావు(నాని) ‘సాక్షి’కి చెప్పారు. -
దిగొచ్చిన చికెన్ ధర.. లొట్టలేస్తున్న మాంసం ప్రియులు
సాక్షి, తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): చాలాకాలం తరువాత చికెన్ ధరలు తగ్గడంతో మాంసం ప్రియులు లొట్టలేసుకుంటున్నారు. ఒక సమయంలో దాదాపు మూడొందల వరకు వెళ్లిన కిలో చికెన్ రేటు ఇప్పుడు సగానికి పడిపోయింది. నాన్‌వెజ్ ఐటమ్స్‌లో మటన్, ఫిష్‌తో పోలిస్తే చికెన్ రేటు మాత్రమే సామాన్యులకు అందుబాటులో ఉంటుంది. దీంతో ఎక్కువ శాతం చికెన్‌కు మొగ్గు చూపుతారు. ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితులు, కార్తీక మాసం కావడంతో ఇటీవల చికెన్ రేటు 170 (స్కిన్), 180 (స్కిన్లెస్)కి పడిపోయింది. తాటిచెట్లపాలెంలో మాత్రం ఈ ధర 160/ 170గా ఉంది. కార్తీకమాసం కారణంగా సుమారు 40 శాతం అమ్మకాలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా బ్రాయిలర్ కోడి పెరగగానే చికెన్ సెంటర్లకు తరలించి అమ్మకాలు చేపడుతుంటారు. అంతకుమించి పెరిగిన కోడిని ఉంచడం వల్ల వాటికి అదనపు మేత అవసరమై, కోళ్ల రైతులకు నష్టాలు వస్తాయి. ప్రస్తుతం ఇలా అందుబాటులోకి వచ్చిన కోళ్లు కూడా అధికంగా ఉండడంతో చికెన్ రేటు పడిపోయినట్లు వ్యాపారులు తెలిపారు. చదవండి: (థ్యాంక్యూ టీటీడీ.. మహిళా భక్తురాలు ఈ–మెయిల్) -
కొండెక్కిన కోడి..శ్రావణంలోనూ తగ్గని చికెన్ ధర
మండపేట: శ్రావణంలోనూ చికెన్ ధర దిగిరావడం లేదు. రూ.300లకు చేరి వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. రెండు నెలల వ్యవధిలో రెండు నుంచి మూడు రెట్లు పెరిగిన మేత ధరలు కోళ్ల పెంపకంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. స్థానికంగా లభ్యత తక్కువగా ఉండటంతో తెలంగాణ, చత్తీస్గడ్ నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా ధరలకు రెక్కలొచ్చాయని వ్యాపారులు విశ్లేషిన్నారు. కోడిగుడ్డు ధర మాత్రం కొంతమేర వినియోగదారులకు ఊరటనిస్తోంది. పండగరోజుల్లో.. తూర్పు గోదావరి జిల్లాలో సాధారణంగా రోజుకు 2.5 లక్షల కిలోల మేర చికెన్ వినియోగిస్తున్నారు. ఆదివారం, పండుగ రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరుగుతాయని అంచనా. జిల్లా వ్యాప్తంగా దాదాపు 400 ఫామ్‌లలో ఏడు లక్షలకు పైగా బ్రాయిలర్ కోళ్ల పెంపకం జరుగుతుంది. 40 రోజుల్లో బ్రాయిలర్ కోళ్లు వినియోగానికి సిద్దమవుతుంటాయి. ఈ మేరకు రైతులు ఎప్పటికప్పుడు కొత్త బ్యాచ్‌లు వేస్తుంటారు. మిగిలిన నెలలతో పోలిస్తే వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి వేడుకలు, దేవీ నవరాత్రి ఉత్సవాలు, అయ్యప్ప మాలధారణ, కార్తీకమాసం పూజల నేపథ్యంలో శ్రావణ నుంచి కార్తీకమాసం ముగిసే వరకు చికెన్ వినియోగం తగ్గుతుంది. ఆగస్టు నుంచి డిసెంబరు వరకు ఆన్‌సీజన్‌గా భావించి కొత్త బ్యాచ్‌లు వేయడాన్ని తగ్గించడం పరిపాటి. కారణమేంటంటే.. - కోవిడ్ ఆంక్షలు సడలించినా మేత ధరలు అదుపులోకి రావడం లేదు. - ఆంక్షలు కారణంగా జూలైలో మేత రవాణా నిలిచిపోయింది. ధరలు పెరగడం మొదలైంది. - బ్రాయిలర్ కోడి మేతలో ప్రధానమైన సోయాబిన్ కిలో రూ.35 నుంచి రెండు నెలల వ్యవధిలో ఏకంగా రూ.106కు పెరిగిపోయింది. - మొక్కజొన్న రూ.12నుంచి రూ. 23కు పెరిగినట్టు కోళ్ల రైతులు చెబుతున్నారు. - కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు పౌష్టికాహారంగా చికెన్ వినియోగం అధికం కావడంతో గత నెలలో కిలో చికెన్ రూ. 320వరకూ చేరింది. తర్వాత రూ.230ల నుంచి రూ.250లకు తగ్గింది. - వారం రోజులగా మళ్లీ ధరకు రెక్కలొస్తున్నాయి. ఆన్ సీజన్, మేత ధరలకు జడిసి కొత్త బ్యాచ్‌లు వేయకపోవడంతో యిలర్ పెంపకం సగానికి పైగా తగ్గిపోయింది. దిగుమతిపై ఆధారం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం, తెలంగాణలోని ఆశ్వారావుపేట, సత్తుపల్లి, చత్తీస్గడ్ రాష్ట్రాల నుంచి వ్యాపారులు కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ఆయా కారణాలతో చికెన్ ధరలకు మరలా రెక్కలొస్తున్నాయి. బుధవారం కిలో రూ.300కు చేరగా, లైవ్ కిలో రూ.135లు వరకు పెరిగింది. వినియోగం సాధారణంగానే ఉండటంతో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ ధర మరింత పెరిగే అవకాశముందని వ్యాపారవర్గాల అంచనా. అయితేగుడ్డు ధర క్రమంగా తగ్గడం వినియోగదారులకు ఊరటనిస్తోంది. రైతు ధర తగ్గిపోవడంతో ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో గుడ్డు రూ.5కి చేరుకుంది. మేత తగ్గితేనే కొత్త బ్యాచ్‌లు - బొబ్బా వెంకన్న బ్రాయిలర్ కోళ్ల రైతు శ్రావణమాసం అయినప్పటికీ సాధారణ వినియోగం కనిపిస్తోంది. అయితే ఎప్పుడూ లేనంతగా కేవలం రెండు నెలల వ్యవధిలోనే మేత ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఆన్‌సీజన్ మొదలు కావడం, మేత ధరలకు జడిసి ఎవరూ కొత్త బ్యాచ్‌లను వేయడం లేదు. దీంతో పక్క రాష్ట్రాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా ధరలు పెరుగుతున్నాయి. కీ పాయింట్స్ - తూర్పు గోదావరి జిల్లాలో చికెన్ వినియోగం రోజుకి 2.50 లక్షల కిలోలు - బ్రాయిలర్ కోళ్ల ఫామ్స్ సంఖ్య 400 - రిటైల్ మార్కెట్లో కిలో చికెన్ రూ. 300 - కోళ్ల మేత సోయబిన్ ధరల్లో పెరుగుదల రూ. 35 నుంచి రూ.100 చదవండి: సాగుకు ‘టెక్’ సాయం..! -
Chicken Prices: సగానికి తగ్గిన చికెన్ ధర!
సాక్షి, అమరావతి బ్యూరో: కోవిడ్ ప్రభావం చికెన్ ధరపై పడింది. కొద్దిరోజులుగా దీని ధర పతనమవుతూ వస్తోంది. దాదాపు 20 రోజుల క్రితం కిలో బ్రాయిలర్ కోడిమాంసం రూ.312కి చేరి రికార్డు సృష్టించింది. పౌల్ట్రీ చరిత్రలోనే చికెన్ అత్యధిక ధర పలకడం అదే తొలిసారి. అప్పట్లో మండుటెండలు, వడగాడ్పులతో పాటు ఫారాల్లో కోళ్ల కొరత ఏర్పడింది. దీంతో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. కానీ ఆ తర్వాత నుంచి చికెన్ ధర క్రమంగా క్షీణించడం మొదలైంది. రోజుకు రూ.5 నుంచి 10 చొప్పున తగ్గుతూ వచ్చి ఇప్పుడు కిలో రూ.160కి చేరింది. ప్రస్తుతం కొన్నిచోట్ల రూ.150కి కూడా చికెన్‌ను విక్రయిస్తున్నారు. కోవిడ్ ప్రభావంతో.. రెండు వారాల నుంచి కోవిడ్ విజృంభణ తీవ్రతరమవుతోంది. రోజూ కోవిడ్ బారిన పడుతున్న రోగుల సంఖ్య పదుల నుంచి వందలకు చేరింది. దీంతో జనం చికెన్ వినియోగాన్ని చాలా వరకు తగ్గించుకున్నారు. మరోవైపు కొన్నాళ్ల క్రితం వరకు చికెన్‌కు అధిక ధర లభిస్తుండడంతో రైతులు ఫారాల్లో కోళ్ల పెంపకాన్ని పెంచారు. అలా వేసిన బ్యాచ్‌లు ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి. వివిధ ఫారాల్లో కోళ్లు రెండు నుంచి రెండున్నర కిలోల బరువుకు చేరుకున్నాయి. ఈ బరువుకు మించి పెంపకాన్ని కొనసాగిస్తే రైతుకు నష్టం వాటిల్లుతుంది. రోజూ మేత ఖర్చు పెనుభారంగా మారుతుంది. అందువల్ల నిర్ణీత బరువుకు పెరిగిన కోళ్లను తెగనమ్ముకోవలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వినియోగానికి మించి కోళ్ల లభ్యత పెరగడంతో చికెన్ ధర క్షీణిస్తోంది. హైదరాబాద్ నుంచి ఆగిన కోళ్లు.. మరోవైపు హైదరాబాద్‌లో ధర ఒకింత తక్కువగా ఉండడం అక్కడ నుంచి కృష్ణా జిల్లాకు బ్రాయిలర్ కోళ్లను తీసుకొస్తుంటారు. కానీ ప్రస్తుతం జిల్లాలో ఉన్న కోళ్లే ధర లేక అమ్ముడవకపోవడంతో అక్కడ నుంచి కొనుగోలు చేయడం లేదని బ్రాయిలర్ కోళ్ల వ్యాపారులు చెబుతున్నారు. ఏడాదిగా పడుతూ.. లేస్తూ.. ► దాదాపు ఏడాది నుంచి పౌల్ట్రీ పరిశ్రమ ఒడిదొడుకులకు లోనవుతోంది. కోడి ధర కొన్నాళ్లు పెరుగుతూ, మరికొన్నాళ్లు పతనమవుతూ వస్తోంది. ► వాస్తవానికి గత ఏడాది కోవిడ్ ఆరంభానికి ముందు వరకు చికెన్ రేటు కిలో రూ.270 వరకు ఉండేది. ► కోవిడ్ ఉద్ధృత రూపం దాల్చాక చికెన్ తింటే కరోనా సోకుతుందన్న దుష్ప్రచారంతో అప్పట్లో వినియోగం తగ్గింది. నాలుగైదు నెలల పాటు దీని ధర భారీగా పతనమై ఒకానొక దశలో మూడు కిలోలు రూ.100కి దిగజారింది. ► ఆ తర్వాత ఆ పరిస్థితి నుంచి పౌల్ట్రీ పరిశ్రమ గట్టెక్కడంతో మళ్లీ చికెన్ ధర పెరగడం మొదలైంది. ► ఇలా విజయవాడ జోన్లో గత డిసెంబర్ వరకు కిలో రూ.250 వరకు అమ్ముడయ్యేది. అయితే బర్డ్‌ఫ్లూ విజృంభిస్తుందన్న ప్రచారంతో మళ్లీ చికెన్ రేటు జనవరి, ఫిబ్రవరి నెలల్లో రూ.150కి పడిపోయింది. ఆ భయం నుంచి బయట పడి మళ్లీ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ► ఇలా ఫిబ్రవరి 23న రూ.200 ఉన్న ధర మార్చి 31కి రూ.260కి చేరింది. ఏప్రిల్ 2న రూ.270, ఏప్రిల్ 6 రూ.312కి పెరిగింది. ► కాగా ప్రస్తుత చికెన్ ధరలు కొన్నాళ్ల పాటు కొనసాగే అవకాశం ఉందని అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాజా వెంకటేశ్వరరావు (నాని) ‘సాక్షి’కి చెప్పారు. ఇక్కడ చదవండి: Prawns Price: నిలకడగా రొయ్యల ధరలు ‘చాక్లెట్’ పంట.. ఏపీ వెంట.. -
నాటు కోడి.. భలే క్రేజీ
మహాముత్తారం : ప్రపంచమంతా కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో చికెన్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. లాక్డౌన్ సమయంలో చికెన్ తింటే కరోనా వస్తుందని పుకార్లతో ఆదరణ తగ్గిన విషయం విదితమే. అయితే, ప్రభుత్వం సైతం చికెన్ తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ప్రచారం చేయడంతో క్రమక్రమంగా చికెన్‌కు డిమాండ్ పెరిగింది. పట్టణాలకే పరిమితమైన కరోనా నేడు అటవీ గ్రామాలకుసైతం విస్తరించింది. దీంతో రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రజలంతా మాంసాహారం వినియోగంపై దృష్టి సారించారు. సాధారణంగా చికెన్ సెంటర్లో లభించే బాయిలర్‌ను మాత్రమే ఎక్కువ సంఖ్యలో వినియోగించేవారు. కొవ్వుకు చెక్.. రుచికి బెటర్ బాయిలర్ చికెన్ కంటే నాటు కోడి తింటే మరింత మంచిదన్న ప్రచారంతో ఇటీవల కాలంలో నాటుకోళ్లకు గిరాకీ పెరిగింది. బాయిలర్ కోడి మాంసం రుచి ఉండదు. ఇక మేక మాంసం తింటే కొవ్వు పెరుగుతుంది. ప్రస్తుతం చేపలు దొరకడం కష్టమే. మరి ఏమి తింటే మంచిదనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో తింటే నాటుకోడి కూరనే తినాలని ఆసక్తి పెరుగుతోంది. మిగతా మాంసాలతో పోలిస్తే నాటుకోడి కూర రుచిగా ఉండడం ఓ కారణం. ఒకప్పుడు ఇంటింటికీ కోళ్లు ఉండేవి. చుట్టాలు వచ్చినా, పండుగలు వచ్చినా నాటుకోడి కూర వండేవారు. రానురాను పల్లెల్లో కోళ్ల పెంపకం తగ్గిపోయింది. కోళ్ల వల్ల పెంట, వాసన తదితర ఇబ్బందులను గమనించిన పల్లె జనం సైతం కోళ్ల పెంపకాన్ని తగ్గించారు. ఇదే క్రమంలో బాయిలర్ కోళ్లు రావడం ప్రతీ ఊరిలో చికెన్ సెంటర్లు వెలియడంతో జనం ఆ చికెన్ వైపే మొగ్గు చూపారు. పైగా బాయిలర్ చికెన్ వండటం సులభం కావడం, ఎప్పుడంటే అప్పుడు దొరకడంతో జనం నాటుకోడి ఊసెత్తడం మానేశారు. మళ్లీ ఇప్పుడు.. ఇటీవలి కాలంలో ప్రజల్లో ఆరోగ్యంపై జాగ్రత్త పెరుగుతోంది. అతిగా మందులు వాడి పెంచే ఆహారం జోలికి పోవద్దన్న ఆలోచన ఎక్కువైంది. ఈ క్రమంలోనే బాయిలర్ చికెన్ తినద్దన్న ప్రచారం మొదలైంది. తింటే మటన్ తినండి తేదంటే నాటుకోడి కూర తినండి అని పలువురు ఆహార నిపుణులు సూచించడం, చేపలు మంచివే కాని అవి టైంకు దొరకకపోవడం కొందరికి నచ్చకపోవడంతో నాటు కోడి కూరవైపు మొగ్గు చూపడం ఆరంభమైంది. అయితే, బాయిలర్ కోడి సాధారణంగా కిలో రూ.100 నుంచి రూ.150 ఉంటుంది. నాటుకోడి రూ.350 నుంచి రూ.550 వరకు ఉంటుంది. పండుగల సమయంలో ఈ ధర మరింత ఎక్కువవుతుంది. అయినా నాటుకోళ్లపై క్రేజ్ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడంలేదు. ప్రత్యేక విందులు జరిగే ప్రాంతాల్లో నాటుకోళ్లను తీసుకెళ్తున్నారు. చికెన్ సెంటర్లలోనూ అమ్మకం.. ఒకప్పుడు నాటుకోడి మాంసం దొరకడం గగనంగా ఉండేది. ఆ కోళ్లను తెలిసిన వారి ఇళ్ల నుంచి కొనుగోలు చేసేవారు., దీనిని డ్రెసింగ్ చేయడం కష్టంగా భావించే వారు. పైగా దానిని కాల్చితేనే బాగుంటుందన్న అభిప్రాయం. ఇంత కష్టం ఎందుకని జనం దాని జోలికి పోవడం మానేశారు. కానీ ఇప్పుడు చికెన్ సెంటర్లలోనే దానిని కోసి డ్రెసింగ్ చేసి కాల్చి ఇస్తున్నారు. మటన్‌తో పోలిస్తే ధర తక్కువ పైగా రుచి, పోషకాలు కూడా ఎక్కువే. అందుకని ఈజీగా దొరుకుతున్న నాటుకోడి మాంసంపై జనం మక్కువ చూపుతున్నారు. అంతేకాకుండా నాటుకోడి ఎలాంటి మందులు అవసరం లేకుండా పెరుగుతోంది. పైగా మాంసం గట్టిగా రుచిగా ఉంటుంది. కొవ్వు సమస్య ఉండదు. తొందరగా జీర్ణమవుతుంది. ఆరోగ్యానికి మేలు తప్ప కీడు చేయదని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు నాటుకోళ్లను దళారులు పల్లెల నుంచి పట్టణాలకు తరలిస్తున్నారు. ప్రతీ రోజు దళారులు అటవీ గ్రామాల్లో ద్విచక్రవాహనాలపై తిరుగుతూ నాటుకోళ్లు కొంటాం అంటూ.. కేజీ రూ.180కి కొనుగోలు చేసి వరంగల్, భూపాలపల్లి, కరీంనగర్ తదితర పట్టణప్రాంతాలకు తరలించి రూ.350 నుంచి రూ.500 వరకు చికెన్ సెంటర్ యజమానులకు విక్రయిస్తున్నారు. దీంతో పండుగల సమయంలో గ్రామాల్లో నాటుకోళ్లకు కొరత ఏర్పడుతోంది. తింటే నాటుకోడే తినాలి.. సాధారణ చికెన్‌తో పోలిస్తే నాటుకోడి కూరే రుచిగా ఉంటుంది. ఇప్పటికి మా ఇంటికి బంధువులు వస్తే నాటుకోడి కూర వండాల్సిందే. ఇది మన తెలంగాణ సంప్రదాయం కూడా. వచ్చిన బంధువులకు నాటుకోడి కూర వండి పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.– ఓలపు శంకర్‌పటేల్, కిష్టాపూర్ -
వండకుండానే చికెన్ ‘ఫ్రై’
పశ్చిమగోదావరి, తణుకు: ఒకవైపు కరోనా ప్రభావంతో పౌల్ట్రీ రంగం సంక్షోభంలో పడింది. దీనికితోడు మండుతున్న ఎండలు కోళ్ల పరిశ్రమను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. చిరుప్రాణులైన కోళ్లు విలవిల్లాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లోపౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండటంతో మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయని పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే వేసవి కారణంగా గుడ్లు ఉత్పత్తి కూడా తగ్గిపోతోంది. ఎండల తీవ్రత కారణంగా సాధారణంగానే కోడి పెట్టే గుడ్ల సంఖ్య 30 శాతం వరకు పడిపోతోంది. ఒకపక్క నిలకడ లేని గుడ్డు ధరతోపాటు ఏటా పెరుగుతున్న నిర్వహణ ఖర్చులతో కోళ్ల పరిశ్రమకు నష్టం వాటిల్లుతోందని పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడ్డు ధర సైతం రూ. 2.80కు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా సంక్షోభం... సాధారణంగా జిల్లాలో 1.20 కోట్ల కోళ్లు పెరుగుతుంటాయి. వీటి ద్వారా రోజుకు సుమారు కోటి గుడ్లు ఉత్పత్తి అవుతుంటాయి. వీటిలో 20 శాతం స్థానికంగా వినియోగిస్తుండగా మిగిలిన 80 శాతం గుడ్లు ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే ఈ ఏడాది కరోనా వైరస్ ప్రభావం పౌల్ట్రీ పరిశ్రమపై పడింది. ప్రస్తుతం పెంచే కోళ్ల సంఖ్య సగానికిపైగా పడిపోగా ఎగుమతులు సైతం నిలిచిపోయాయి. మార్చినెలలో చికెన్, కోడిగుడ్డు అమ్మకాలపై చూపిన ప్రభావంతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దశలో ఎండల తీవ్రత అధికమవ్వడంతో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఈ వేసవిలో ఇప్పటివరకూ సుమారు 2,00,000 కోళ్లు చనిపోయినట్టు అంచనా. సుమారు రూ.50 కోట్ల నష్టం వాటిల్లినట్టు రైతులు చెబుతున్నారు. మరోవైపు పౌల్ట్రీ పరిశ్రమను పెరిగిన దాణా ఖర్చులు దెబ్బ తీస్తున్నాయి. కోళ్లకు దాణాగా అందజేసే మొక్క జొన్న, సోయాబీన్, నూకల ధరలు గతేడాదితో పోలిస్తే కాస్త అందుబాటులోకి వచ్చినప్పటికీ గుడ్డు ధర గిట్టుబాటు కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తుపాను ప్రభావంతో.. పశ్చిమ బెంగాల్లో తుపాను ప్రభావంతో గుడ్డు ఎగుమతులకు తీవ్ర ఆటంకం కలిగింది. ఇప్పటికే కరోనా ప్రభావంతో ఎగుమతులు లేక ఇబ్బందులు పడుతుండగా ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఒక పక్క ఉత్పత్తి లేకపోయినా గుడ్డు ధర మాత్రం రూ. 2.80కు దిగజారింది. ప్రస్తుతం గుడ్డు ధర తగ్గినప్పటికీ బహిరంగ మార్కెట్లో మాత్రం రూ.4 చొప్పున విక్రయిస్తున్నారు. అయితే గుడ్డు ఉత్పత్తికి సంబంధించి రూ.3.50 ఉంటేనే గానీ గిట్టుబాటు కాదని రైతులు అంటున్నారు. ఇదిలా ఉంటే ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా జిల్లా నుంచి పశ్చిమబెంగాల్, అసోం, ఒడిశా, బిహార్ తదితర రాష్ట్రాలకు రోజుకు సగటున 120 లారీల గుడ్లు ఎగుమతి అవుతుండగా ప్రస్తుతం ఈ సంఖ్య యాభైలోపు పడిపోయింది. చికెన్ ధరలపైనా ఈ ప్రభావం పడింది. రిటైల్ మార్కెట్లో కోడిమాంసం ధర భారీగా పెరిగింది. వేసవిలో గుడ్ల ఉత్పత్తి పడిపోవడం, కోళ్లు మృత్యువాత పడటం, కరోనా ప్రభావంతో పౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. గడ్డు పరిస్థితుల్లో పౌల్ట్రీ గత ఐదేళ్లుగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది కరోనా ప్రభావంతో పాటు వేసవి ప్రభావం పౌల్ట్రీపరిశ్రమపై పడింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా గుడ్డు ధర పడిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.– పెన్మత్స సుబ్బరాజు, పౌల్ట్రీ రైతు, కావలిపురం, ఇరగవరం మండలం -
చికెన్ ధర ఆల్‌టైం హై!
సాక్షి, అమరావతి బ్యూరో: చికెన్ చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా ధరలు పైకి ఎగబాకుతున్నాయి. రెండు నెలల కిందట చికెన్ తింటే కరోనా సోకుతుందన్న ప్రచారంతో కొనేవాడే లేక అత్యల్పంగా కిలో రూ. 50కే పడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రజల్లో అపోహలు తొలగడంతో మాంసం వినియోగం పెరిగింది. అలా పక్షం రోజుల కిందట రూ. 200కు, వారం కిందట రూ. 250కి చేరింది. అదిప్పుడు ఏకంగా రూ. 310కి పెరిగింది. బ్రాయిలర్ కోళ్ల చరిత్రలో ఇదే రికార్డు ధర. ఇప్పటివరకు రాష్ట్రంలో కిలో చికెన్ అత్యధిక «(రెండేళ్ల కిందట) ధర రూ. 260 పలికింది. ఇదే ఇప్పటివరకు ఉన్న రికార్డు. ఇప్పుడు ఆ రికార్డు చెరిగిపోయింది. కిలో రూ. 310 అనేది దేశంలోకెల్లా అత్యధిక ధర కావడం గమనార్హం. కోళ్ల పెంపకాన్ని 60 % తగ్గించిన పౌల్ట్రీ రైతులు గతంలో కరోనా కారణంగా చికెన్ ధరలు దారుణంగా క్షీణించడంతో పౌల్ట్రీ రైతులు కుదేలైపోయారు. ఆర్థికంగా నష్టపోయిన వీరు ఫారాల్లో కోళ్ల పెంపకాన్ని 60 శాతానికి పైగా తగ్గించారు. ఆ తర్వాత క్రమంగా చికెన్ కొనుగోళ్లు పెరిగాయి. డిమాండ్‌కు సరిపడినంతగా కోళ్ల లభ్యత లేకుండా పోయింది. ఫలితంగా చికెన్ ధర కొండెక్కి కూర్చుంది. ప్రస్తుతం లాక్డౌన్ వల్ల పెద్ద, చిన్న హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, రోడ్డు పక్కన దుకాణాలూ మూతపడ్డాయి. అవి కూడా తెరచి ఉంటే చికెన్ ధర మరింత పెరిగేదని చికెన్ సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఉదాహరణకు కృష్ణా జిల్లాలో సాధారణ పరిస్థితుల్లో రోజుకు లక్ష కోళ్లు (దాదాపు 2 లక్షల కిలోల చికెన్), ఆదివారాల్లో రెండు లక్షల కోళ్లు అమ్ముడయ్యేవి. ప్రస్తుతం ఫారాల్లో రోజుకు 40 వేల కోళ్లకు మించి లభ్యత ఉండడం లేదని వ్యాపారులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చికెన్ ధర మరో రూ. 15–20 వరకు పెరగవచ్చని వీరు చెబుతున్నారు. ఫారాల్లో కోళ్ల లభ్యత పెరిగే వరకు క్రమంగా చికెన్ ధరలు పెరిగే అవకాశం ఉందని అమరావతి బ్రాయిలర్ కోళ్ల పెంపకందార్ల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ‘సాక్షి’కి చెప్పారు. లాక్డౌన్ ఎత్తివేస్తే పొరుగు రాష్ట్రాల నుంచైనా కోళ్లను తీసుకొచ్చే వీలుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
చికెన్ @ రూ.250
సాక్షి, సిటీబ్యూరో: సిటీలో చికెన్ ధర పైపైకి వెళ్తోంది. గత మూడు నెలల్లో ఎన్నడూ లేనివిధంగా కిలో చికెన్ ధర రూ.250కు చేరుకుంది. కోవిడ్ వైరస్ ప్రభావంతో గత మూడు నెలల నుంచి చికెన్ వినియోగం దాదాపు 70–80 శాతం వరకు పడిపోవడంతో ధరలు బాగా తగ్గాయి. మార్చిలోపరిస్థితి మరీ దిగజారింది. ఒక దశలో కిలో కోడి వందలోపే ఉంది. మే రెండవ వారం నుంచి కాస్త చికెన్ వినియోగం పెరగడం..రంజాన్ నెల కొనసాగుతున్న దృష్ట్యా కూడా చికెన్ ధరలు పెరిగాయని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల నుంచి 5 లక్షల కిలోల వరకు చికెన్ విక్రయాలు జరుగుతాయి. ఆదివారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల కిలోల విక్రయాలు జరుగుతాయి. పండుగ రోజు దాదాపు 1.5 కోట్ల కిలోల వరకు విక్రయాలు జరిగాయని మార్కెట్ వర్గాల అంచనా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోళ్ల డిమాండ్ పూర్తి కాకపోవడంతో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. కానీ గత మూడు నెలల నుంచి కోవిడ్ వైరస్ ప్రభావంతో చికెన్ వినియోగం భారీగా తగ్గింది. దీంతో పౌల్ట్రీ పరిశ్రమ రూ.వంద కోట్ల నష్టాల్లో కూరుకుపోయింది. ఇప్పుడిప్పుడు చికెన్ వినియోగం కాస్త కూస్తో పెరిగింది. దీంతో ధరలు కాస్త పెరిగాయి. ఇక నగరంలోని పలు పెద్ద హోల్‌సేల్ షాపుల్లో కిలో కోడి ధర రూ. 115 నుంచి రూ.120 పలుకుతుంది. ఇక బహిరంగ మార్కెట్లో కిలో కోడి ధర రూ.150 వరకు అమ్ముతున్నారు. డ్రెస్డ్ చికెన్ ధర పెద్ద హోల్‌సేల్ మార్కెట్లో రూ.200 వరకు ఉండాగా అదే స్కిన్లెస్ కిలో చికెన్ ధర రూ.250 దాటుతుంది. ఇక బహిరంగ మార్కెట్లో కిలో చికె¯Œన్ రూ.250 నుంచి రూ.260 వరకు ఉంది. కోడిగుడ్డు ధర హోల్‌సేల్‌లో రూ.3.50 పైసలు ఉంది. హోల్‌సేల్‌లో రూ.4 వరకు ఉంది. -
కొండెక్కిన కోడి
తూర్పుగోదావరి, అమలాపురం: కోళ్ల పరిశ్రమ పుంజుకుంటోంది.. మార్చి నెలలో వరుస సంక్షోభాలతో ఈ పరిశ్రమ అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంది. ఈ మాంసం తింటే వ్యాధులు వస్తాయనే అపోహలు.. తరువాత కరోనా లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టింది. వ్య వసాయ, ఆ అనుబంధ రంగాల విషయంలో రైతులకు మేలు చేసే లా ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలించడంతో కోళ్ల పరిశ్రమ కోలుకుంటోంది. మార్చి రెండో వారంలో కనిష్ట స్థాయికి పడిపోయిన బ్రాయిలర్, లేయర్ కోళ్ల ధరలు ఇప్పుడు ఆకాశాన్నంటుతున్నాయి. ఆదివారం మార్కెట్లో బ్రాయిలర్ లైవ్ కేజీ రూ.130, లేయర్ కేజీ రూ.85 పలికింది. కేజీ బ్రాయిలర్ మాంసం రిటైల్ ధర రూ.220 నుంచి రూ.240 వరకు ఉంది. లేయర్ మాంసం కేజీ రూ.200 వరకు చేరడం విశేషం. గత మార్చిలో బ్రాయిలర్ లైవ్ ధర రైతు వారీ కేజీ రూ.16 వరకు ఉండగా, రిటైల్ ధర కేజీ రూ.38 మాత్రమే. లేయర్ ధర కేజీ రూ.పదికి పడిపోయింది. రైతులు చాలాచోట్ల కోళ్లను ఉచితంగా పంపిణీ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. లాక్డౌన్ సమయంలో ఎగుమతులు లేకపోవడం, కోళ్లకు మేత అందని పరిస్థితుల్లో పౌల్ట్రీ రైతులు ఉక్కిరిబిక్కిరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకుని రైతు అనుబంధ పరిశ్రమలను కాపాడేందుకు పలు చర్యలు తీసుకుంది. ఎగుమతులకు అనుమతులు ఇవ్వడంతో పాటు మేత అమ్మకాలకు పచ్చజెండా ఊపడంతో పరిశ్రమలు కోలుకున్నాయి. పెరిగిన కోడి మాంసం ధరలు వినియోగదారులకు భారంగా మారినా, వరుస సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్న రైతులకు మాత్రం ఊరటనిచ్చే అంశమని పలువురు అంటున్నారు. -
చికెన్ ధరలకు రెక్కలు
బెంగళూరు : మొన్నటి వరకూ చికెన్ ఉచితంగా ఇచ్చినా ముట్టుకోని జనం ఇప్పుడు చికెన్ కోసం ఎగబడుతున్నారు. దీంతో కేజీ చికెన్ ప్రస్తుతం రూ.200 ధర పలుకుతోంది. రామనగర జిల్లాలో లాక్డౌన్ ఉన్నప్పటికీ చికెన్, మటన్ విక్రయాలకు అనుమతులు ఇవ్వడం జరిగింది. శనివారం కేజీ రూ.180 ఉండగా ఆదివారం నాటికి రూ.200 దాటింది. అనేక చోట్ల కోళ్లు సరఫరా లేకపోవడం, కరోనా దెబ్బకు కోళ్లఫారాలు మూతబడడం వల్ల చికెన్‌కు డిమాండ్ ఏర్పడింది. మరోవైపు నెల రోజులుగా సముద్రం చేపల సరఫరా ఆగిపోయింది. మంగళూరు, కారవార ప్రాంతాల నుండి బెంగళూరుకు వచ్చే సరుకు అక్కడి నుండి రామనగరకు వచ్చేది. ఇప్పుడు అడపాదడపా వస్తున్నా ఏంజెల్, పాంప్రెట్ తదితర చేపల ధర కేజీ రూ.1000 పలుకుతోంది.