ఆలమూరు: కార్తిక మాసం, అయ్యప్ప స్వాముల దీక్షల ప్రభావంతో నెల రోజులుగా చికెన్ విక్రయాలు తగ్గిపోయాయి. దీంతో బహిరంగ మార్కెట్‌లో బ్రాయిలర్ చికెన్ ధర గణనీయంగా పడిపోయింది. లైవ్ కోడి ధర రికార్డు స్థాయిలో మూడేళ్ల కనిష్టానికి చేరుకుంది. ఈ పరిణామం కోళ్ల ఉత్పత్తి కంపెనీలు, కోళ్ల రైతులు, వ్యాపారులను తీవ్ర నిరాశకు గురి చేస్తూండగా.. మాంసాహార ప్రియులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కోళ్ల ఉత్పత్తిలో రాష్ట్రవ్యాప్తంగా పేరొందిన వివిధ కంపెనీల నుంచి సాధారణంగా ప్రతి రోజూ సుమారు 350 టన్నుల బ్రాయిలర్, లేయర్ కోళ్ల ఎగుమతులు జరుగుతున్నాయి. వాతావరణం సానుకూలంగా ఉండటంతో ఇటీవల కోళ్ల ఉత్పత్తి పెరిగింది. సరిగ్గా ఇదే సమయంలో కార్తిక మాసం ప్రభావంతో చికెన్‌కు ఒక్కసారిగా డిమాండు పడిపోయింది. దీంతో ప్రస్తుతం రోజుకు 200 టన్నుల వరకూ మాత్రమే ఎగుమతులు జరుగుతున్నాయి. సరఫరా తగ్గినా విక్రయాలు లేకపోవడం ధరలు మరింతగా పడిపోవడానికి కారణమైంది. ఫలితంగా చికెన్ దుకాణాలపై ఆధారపడిన చిరు వ్యాపారులు ఆదాయం పడిపోతోందంటూ గగ్గోలు పెడుతున్నారు.
ధర తగ్గినా..
బహిరంగ మార్కెట్‌లో చికెన్ ధరలు భారీగా తగ్గినా ఆ మేరకు విక్రయాలు మాత్రం పెరగడం లేదు. దీనివల్ల హోల్‌సేల్ వ్యాపారులు నెల రోజుల క్రితం కిలో కోడి లైవ్ రూ.132కు విక్రయించగా.. ప్రస్తుతం అది కాస్తా ఏకంగా రూ.62కు పడిపోయింది. రెండు కేజీల బరువు వచ్చే వరకూ కోడిని పెంచితే సరాసరి రూ.210 వరకూ ఖర్చవుతుందని, ప్రస్తుతం ఆ బరువు కలిగిన కోడిని అమ్మితే రూ.84 వరకూ నష్టం వస్తోందని రైతులు వాపోతున్నారు. బహిరంగ మార్కెట్‌లో బ్రాయిలర్ కోడి కేజీ హోల్‌సేల్ ధర రూ.72గా ఉండగా.. చికెన్ కేజీ స్కిన్‌తో రూ.150, స్కిన్‌లెస్ రూ.175 వరకూ విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే పరిస్థితి మరో నెల రోజులు కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో దాణా ఖర్చు భరించలేక కంపెనీదారులు, రైతులు ఉత్పత్తి అయిన కోళ్లను నష్టమే అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో మార్కెట్‌కు తరలిస్తున్నారు.
డిమాండ్ తగ్గిపోయింది
బహిరంగ మార్కెట్‌లో మునుపెన్నడూ లేని విధంగా చికెన్‌కు డిమాండ్ తగ్గిపోయింది. దీనివల్ల మూడేళ్ల కనిష్ట స్థాయికి చికెన్ ధర పడిపోయింది. దీంతో దిగుమతులు తగ్గించుకోవడంతో వ్యాపార లావాదేవీలు సక్రమంగా జరగడం లేదు. కోళ్ల ధర తగ్గడంతో రైతులు, సరఫరాదారులతో పాటు గ్రామీణ చిరు వ్యాపారులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కోళ్ల రైతులు ఏడాది పాటు పడిన కష్టమంతా ఒక్క ఈ నెలలోనే నీరుగారిపోతోంది.
– బొబ్బా వెంకన్న, హోల్‌సేల్ కోళ్ల వ్యాపారి, పెదపళ్ల
Comments
Please login to add a commentAdd a comment