Broiler chicken
-
భారీగా తగ్గిన చికెన్ ధర కేజీ రూ.72
ఆలమూరు: కార్తిక మాసం, అయ్యప్ప స్వాముల దీక్షల ప్రభావంతో నెల రోజులుగా చికెన్ విక్రయాలు తగ్గిపోయాయి. దీంతో బహిరంగ మార్కెట్లో బ్రాయిలర్ చికెన్ ధర గణనీయంగా పడిపోయింది. లైవ్ కోడి ధర రికార్డు స్థాయిలో మూడేళ్ల కనిష్టానికి చేరుకుంది. ఈ పరిణామం కోళ్ల ఉత్పత్తి కంపెనీలు, కోళ్ల రైతులు, వ్యాపారులను తీవ్ర నిరాశకు గురి చేస్తూండగా.. మాంసాహార ప్రియులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కోళ్ల ఉత్పత్తిలో రాష్ట్రవ్యాప్తంగా పేరొందిన వివిధ కంపెనీల నుంచి సాధారణంగా ప్రతి రోజూ సుమారు 350 టన్నుల బ్రాయిలర్, లేయర్ కోళ్ల ఎగుమతులు జరుగుతున్నాయి. వాతావరణం సానుకూలంగా ఉండటంతో ఇటీవల కోళ్ల ఉత్పత్తి పెరిగింది. సరిగ్గా ఇదే సమయంలో కార్తిక మాసం ప్రభావంతో చికెన్‌కు ఒక్కసారిగా డిమాండు పడిపోయింది. దీంతో ప్రస్తుతం రోజుకు 200 టన్నుల వరకూ మాత్రమే ఎగుమతులు జరుగుతున్నాయి. సరఫరా తగ్గినా విక్రయాలు లేకపోవడం ధరలు మరింతగా పడిపోవడానికి కారణమైంది. ఫలితంగా చికెన్ దుకాణాలపై ఆధారపడిన చిరు వ్యాపారులు ఆదాయం పడిపోతోందంటూ గగ్గోలు పెడుతున్నారు. ధర తగ్గినా.. బహిరంగ మార్కెట్లో చికెన్ ధరలు భారీగా తగ్గినా ఆ మేరకు విక్రయాలు మాత్రం పెరగడం లేదు. దీనివల్ల హోల్‌సేల్ వ్యాపారులు నెల రోజుల క్రితం కిలో కోడి లైవ్ రూ.132కు విక్రయించగా.. ప్రస్తుతం అది కాస్తా ఏకంగా రూ.62కు పడిపోయింది. రెండు కేజీల బరువు వచ్చే వరకూ కోడిని పెంచితే సరాసరి రూ.210 వరకూ ఖర్చవుతుందని, ప్రస్తుతం ఆ బరువు కలిగిన కోడిని అమ్మితే రూ.84 వరకూ నష్టం వస్తోందని రైతులు వాపోతున్నారు. బహిరంగ మార్కెట్లో బ్రాయిలర్ కోడి కేజీ హోల్‌సేల్ ధర రూ.72గా ఉండగా.. చికెన్ కేజీ స్కిన్‌తో రూ.150, స్కిన్లెస్ రూ.175 వరకూ విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే పరిస్థితి మరో నెల రోజులు కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో దాణా ఖర్చు భరించలేక కంపెనీదారులు, రైతులు ఉత్పత్తి అయిన కోళ్లను నష్టమే అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో మార్కెట్‌కు తరలిస్తున్నారు. డిమాండ్ తగ్గిపోయింది బహిరంగ మార్కెట్లో మునుపెన్నడూ లేని విధంగా చికెన్‌కు డిమాండ్ తగ్గిపోయింది. దీనివల్ల మూడేళ్ల కనిష్ట స్థాయికి చికెన్ ధర పడిపోయింది. దీంతో దిగుమతులు తగ్గించుకోవడంతో వ్యాపార లావాదేవీలు సక్రమంగా జరగడం లేదు. కోళ్ల ధర తగ్గడంతో రైతులు, సరఫరాదారులతో పాటు గ్రామీణ చిరు వ్యాపారులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కోళ్ల రైతులు ఏడాది పాటు పడిన కష్టమంతా ఒక్క ఈ నెలలోనే నీరుగారిపోతోంది. – బొబ్బా వెంకన్న, హోల్‌సేల్ కోళ్ల వ్యాపారి, పెదపళ్ల -
రెండు నెలలుగా దిగిరాని చికెన్ ధర
మండపేట: రెండు నెలలుగా చికెన్ ధర దిగిరానంటోంది. స్కిన్లెస్ కిలో రూ.300ల నుంచి రూ.320లతో వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. మేత ధరలు విపరీతంగా పెరగడం, ఎండలు ముదురుతుండటంతో నష్టాలు తాళలేక కొత్త బ్యాచ్‌లు వేయడానికి రైతులు వెనుకంజ వేస్తున్నారు. అవసరమైన మేర కోళ్లు లేక ధర తగ్గడం లేదని వ్యాపారులు అంటున్నారు. రంజాన్ నెల మొదలుకావడంతో వినియోగం మరింత పెరగనుంది. మాంసాహార ప్రియులు అధికంగా ఇష్టపడేది చికెన్. తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల పరిధిలో రోజుకు సాధారణంగా మూడు 3.2 లక్షల కిలోల చికెన్ వినియోగిస్తుండగా, ఆదివారం, పండుగ రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరుగుతుంటాయి. వేసవి ప్రభావం తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం, కోరుకొండ, గోకవరం, కొవ్వూరు, కోనసీమలోని అమలాపురం, రావులపాలెం, కాకినాడలోని తుని, తొండంగి ప్రాంతాల్లో 440 ఫామ్‌లు వరకు విస్తరించి ఉండగా ఏడు లక్షల కోళ్లు పెంపకం జరుగుతున్నట్టు అంచనా. బ్యాచ్ వేసిన 40 రోజుల్లో బ్రాయిలర్ కోళ్లు రెండు నుంచి రెండున్నర కేజీలు వరకు పెరిగి వినియోగానికి వస్తుంటాయి. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌ను బట్టి రైతులు ఎప్పటికప్పుడు కొత్త బ్యాచ్‌లు వేస్తుంటారు. ఎండలు తీవ్రమయ్యే కొద్ది కోళ్ల మరణాలు పెరిగి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కారణంతో వేసవిలో కొత్త బ్యాచ్‌లు వేయడానికి రైతులు ఆసక్తి చూపించరు. దీనికితోడు గత మూడు నెలల్లో కోడిమేత ధరలు గణనీయంగా పెరగడం కోళ్ల పెంపకంపై తీవ్ర ప్రభావం చూపింది. మొక్కజొన్న కిలో రూ. 14లు నుంచి రూ. 25లకు పెరుగ్గా, సోయా రూ. 40లు నుంచి రూ. 90లకు పెరిగిపోయింది. అన్ని మేతలు మిక్స్‌చేసి అమ్మే కంపెనీ మేత కిలో రూ. 30 నుంచి రూ. 50 వరకు పెరిగిపోయినట్టు కోళ్ల రైతులు అంటున్నారు. కోడిపిల్ల ధర రూ. 35లకు పెరిగిపోయింది. కిలో కోడి తయారయ్యేందుకు రెండు కిలోల మేత అవసరమవుతుండగా, ఇతర నిర్వహణ ఖర్చులతో లైవ్ కిలో కోడి తయారవ్వడానికి రూ. 110లు వరకు వ్యయమవుతోందని వారంటున్నారు. పెరిగిన ధరలతో సొంతంగా నిర్వహణ చేయలేక అధికశాతం మంది బ్రాయిలర్ కోళ్ల రైతులు బ్రాయిలర్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. కమీషన్‌పై కేవలం కోడిపిల్లలను పెంచి పెద్దవి చేసి అప్పగించే విధంగా ఫామ్‌లు నిర్వహిస్తున్నారు. రెండు నెలలుగా అదే ధర స్థానిక అవసరాలకు తగ్గట్టుగా కోళ్ల పెంపకం లేకపోవడం, అధికశాతం పామ్‌లు కంపెనీల అధీనంలోనే ఉండటం ధర పెరుగుదలకు కారణమని వ్యాపారులు అంటున్నారు. ఫిబ్రవరి మొదటివారంలో స్కిన్లెస్ చికెన్ కిలో రూ.200లు వరకు ఉండగా క్రమంగా పెరుగుతూ రూ.300లకు, లైవ్ కిలో రూ. 100ల నుంచి 150లకు చేరుకున్నాయి. మారుమూల గ్రామాల్లో రూ.320 నుంచి రూ.350లు వరకు కూడా అమ్మకాలు జరుగుతున్నాయి. రంజాన్ ఉపవాస దీక్షలు నేపథ్యంలో ముస్లింలు చికెన్ వినియోగానికి ప్రాధాన్యమిస్తుంటారు. సాధారణ రోజులతో పోలిస్తే రంజాన్ నెలలో అమ్మకాలు పెరుగుతాయని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితులలో ధర ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని వ్యాపారవర్గాల అంచనా. నిర్వహణ పెరిగిపోయింది ఎప్పుడు లేనంతగా కోడి మేత ధరలు, కోడిపిల్లల ధరలు పెరిగిపోయాయి. గతంలో పోలిస్తే నిర్వహణ వ్యయం రెట్టింపు అవుతోంది. సొంతంగా పెంచలేక చాలామంది రైతులు కంపెనీ కోళ్లనే పెంచుతున్నారు. అవసరానికి తగ్గట్టుగా కోళ్లు లేకపోవడం వలన ధర పెరుగుతోంది. – బొబ్బా వెంకన్న, బ్రాయిలర్ కోళ్ల రైతు, పెదపళ్ల, ఆలమూరు మండలం -
కొండెక్కిన కోడి!
స్కిన్లెస్ కిలో రూ.178 సాక్షి, హైదరాబాద్: చికెన్ ధర మండిపోతోంది. ఎండాకాలం వేడి చేస్తుందన్న ఉద్దేశంతో చికెన్ వినియోగించేందుకు మాంసాహారులు వెనుకడుగేస్తుంటారు. ఫలితంగా వేసవిలో చికెన్ ధరలు పడిపోవడం ఏటా సర్వసాధారణం. అయితే... నగరంలో ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మార్కెట్లో చికెన్ ధరలు దడ పుట్టిస్తున్నాయి. ఇటీవలి వరకు రూ.122లకు లభించిన బ్రాయిలర్ చికెన్ 20 రోజుల వ్యవధిలోనే కిలో ఒక్కింటికి రూ.30 వరకు ధర పెరిగింది. ఆదివారం రిటైల్ మార్కెట్లో లైవ్ కోడి కేజీ రూ.106, డ్రెస్డ్ చికెన్ కిలో రూ.152, స్కిన్‌లెన్ రూ.178, బోన్‌లెస్ రూ.340 ధరకు వ్యాపారులు విక్రయించారు. బర్డ్ ఫ్లూ వ్యాధి కారణంగా గత నెలలో పౌల్ట్రీ యజమానులు పెద్దసంఖ్యలో కోళ్లను చంపేశారు. ఆతర్వాత కొత్త బ్యాచ్‌లు వేయకుండా ఆపేశారు. ఫలితంగా కోళ్ల ఉత్పత్తి నిలిచిపోయి నగరంలో కొరత ఏర్పడింది. ప్రస్తుతం నగరంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లు జోరందుకోవడంతో చికెన్‌కు గిరాకీ పెరిగింది. ఇదే అదనుగా భావించి వ్యాపారులు ధరలు పెంచేశారు. గత నెలలో కొత్త బ్యాచ్‌లు వేయకపోవడం, ఉన్నవి కూడా ఎండదెబ్బకు చనిపోవడంతో బర్డ్స్ ఉత్పత్తి తగ్గి కొరత ఏర్పడింది. ఆ ప్రభావమే ఇప్పుడు ధరల పెరుగుదలకు దారితీసిందని వ్యాపారులు చెబుతున్నారు. సోమవారం నుంచి చికెన్ ధరలు రూ.8-12 వరకు పెరగనున్నాయని వ్యాపారులు వ్యాఖ్యానిస్తున్నారు. గుడ్ల ధరలు కూడా అస్థిరంగా ఉంటున్నాయి. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లో 100 కోడి గుడ్ల ధర రూ.310 ఉండగా, రిటైల్ మార్కెట్లో రూ.400 చొప్పున అమ్ముతున్నారు. నిజానికి ఒక్కో గుడ్డు ధర రూ.3.10 పైసలుండగా రిటైల్ వ్యాపారులు మాత్రం రూ.4 వసూలు చేస్తున్నారు. వేసవిలో చికెన్ ఇష్టపడనివారు మటన్ వైపు మొగ్గుచూపుతుండటంతో మార్కెట్లో మటన్ ధరలు కూడా పెరిగాయి. గతవారం వరకు కేజీ మటన్ రూ.450-500లున్న ధర ప్రస్తుతం రూ.480-550కి చేరింది. -
కోళ్లుకోలేని దెబ్బ
భువనగిరి, న్యూస్‌లైన్: పౌల్ట్రీ రైతు నష్టాల బాట పట్టాడు. ఇటీవల కాలంలో కోళ్ల ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో వారు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. బ్రాయిలర్ చికెన్ ధర గత సంవత్సరంతో పోలిస్తే గణనీయంగా తగ్గింది. కొత్తగా పౌల్ట్రీలు ఏర్పాటు చేసిన వారు నష్టాలను తట్టుకోలేక దివాలా తీస్తున్నారు. అనేక పౌల్ట్రీలు మూతపడే దశకు చేరుకున్నాయి. ఇటీవల కాలంలో పౌల్ట్రీల్లో కోళ్ల ఉత్పత్తి బాగా పెరిగింది. దీంతోపాటు ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, బీహార్, రాష్ట్రాలకు ఎగుమతులు తగ్గాయి. ఆ రాష్ట్రాల్లో కూడా పౌల్ట్రీ పరిశ్రమలు పెరగడంతో పాటు ఉత్పత్తి కూడా బాగా పెరగడంతో వారు ఇక్కడ నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవడం లేదు. దీంతో ఇక్కడి కోళ్లకు ఒక్కసారిగా డిమాండ్ పడిపోయింది. జిల్లాలో భువనగిరి, చౌటుప్పల్, బీబీనగర్, పోచంపల్లి, బొమ్మలరామారం, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో పౌల్ట్రీ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్క భువనగిరి డివిజన్‌లోనే రెండు వేలకు పైగా కోళ్లఫారాలు ఉన్నాయి. వాటిపై సుమారు మూడువేల మంది రైతులు ప్రత్యక్షంగా, మరో 10వేల మంది పరోక్షంగా ఈ పౌల్ట్రీ పరిశ్రమపై ఆధారపడ్డారు. ఈ సీజన్లో కోటికి పైగా కోళ్లను జిల్లా వ్యాప్తంగా పెంచుతున్నారు. ఒక్కో కోడిపిల్లను 23 రూపాయల నుంచి 26 రూపాయల వరకు కొనుగోలు చేస్తారు. 45రోజుల్లో కోడి రెండుకిలోల వరకు బరువు పెరుగుతోంది. ఇందుకోసం దాణా, ఇతర పెట్టుబడులతో కలపి 100 రూపాయల ఖర్చు అవుతోంది. ప్రస్తుతం హోల్‌సేల్‌గా రైతుకు కిలో చికెన్‌ను 50 రూపాయలే గిట్టుబాటు అవుతోంది. కొత్తగా వచ్చిన వారికి నష్టాల బాట పౌల్ట్రీలోకి కొత్తగా వచ్చిన వారికి నష్టాల బాట తప్పడం లేదు. రెండు సంవత్సరాల క్రితం మంచి లాభాలను చూసిన రైతుకు ఈ సారి ఆ పరిస్థితి లేదు. లాభాలు వస్తున్నా యి కదా అని మార్కెట్లోకి వచ్చిన పౌల్ట్రీ రైతులతో ఉత్పత్తి గణనీయంగా పెరిగిందే కానీ పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటు ధర రావడం లేదు. దీంతో పలువురు నష్టాలను భరించలేక అతి తక్కువ ధరకు ఆత్మకూర్ ఎం మండలంలో పౌల్ట్రీని అమ్ముకున్నారు. ఇల్లా జిల్లాలో పలు రైతులు నష్టాలను తట్టుకోలేకపోతున్నారు. ఇందులో స్థిరపడిన వారు మాత్రం ఏలాగోలాగు భవిష్యత్తుపై ఆశలు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. పెరిగిన ఉత్పత్తి దెబ్బతీసింది పెరిగిన కోళ్ల ఉత్పత్తితో కిలో చికెన్ రేటు గణనీయంగా పడిపోయింది. దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉత్పత్తి పెరగడంతో ఎగుమతులు తగ్గిపోయాయి. దీంతో ఈ సీజన్లో కోళ్ల పరిశ్రమపై ఆధారపడిన రైతు పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. గతంలో మాదిరిగా పెరిగిన ముడి సరుకుల ధరలకు అనుగుణంగా గిట్టుబాటు ధర రావడం లేదు. - పిన్నపురెడ్డి నరేందర్‌రెడ్డి, భువనగిరి