కొండెక్కిన కోడి!
స్కిన్‌లెస్ కిలో రూ.178
సాక్షి, హైదరాబాద్: చికెన్ ధర మండిపోతోంది. ఎండాకాలం వేడి చేస్తుందన్న ఉద్దేశంతో చికెన్ వినియోగించేందుకు మాంసాహారులు వెనుకడుగేస్తుంటారు. ఫలితంగా వేసవిలో చికెన్ ధరలు పడిపోవడం ఏటా సర్వసాధారణం. అయితే... నగరంలో ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మార్కెట్లో చికెన్ ధరలు దడ పుట్టిస్తున్నాయి. ఇటీవలి వరకు రూ.122లకు లభించిన బ్రాయిలర్ చికెన్ 20 రోజుల వ్యవధిలోనే కిలో ఒక్కింటికి రూ.30 వరకు ధర పెరిగింది. ఆదివారం రిటైల్ మార్కెట్లో లైవ్ కోడి కేజీ రూ.106, డ్రెస్డ్ చికెన్ కిలో రూ.152, స్కిన్‌లెన్ రూ.178, బోన్‌లెస్ రూ.340 ధరకు వ్యాపారులు విక్రయించారు. బర్డ్ ఫ్లూ వ్యాధి కారణంగా గత నెలలో పౌల్ట్రీ యజమానులు పెద్దసంఖ్యలో కోళ్లను చంపేశారు. ఆతర్వాత కొత్త బ్యాచ్‌లు వేయకుండా ఆపేశారు. ఫలితంగా కోళ్ల ఉత్పత్తి నిలిచిపోయి నగరంలో కొరత ఏర్పడింది. ప్రస్తుతం నగరంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లు జోరందుకోవడంతో చికెన్‌కు గిరాకీ పెరిగింది. ఇదే అదనుగా భావించి వ్యాపారులు ధరలు పెంచేశారు.
గత నెలలో కొత్త బ్యాచ్‌లు వేయకపోవడం, ఉన్నవి కూడా ఎండదెబ్బకు చనిపోవడంతో బర్డ్స్ ఉత్పత్తి తగ్గి కొరత ఏర్పడింది. ఆ ప్రభావమే ఇప్పుడు ధరల పెరుగుదలకు దారితీసిందని వ్యాపారులు చెబుతున్నారు. సోమవారం నుంచి చికెన్ ధరలు రూ.8-12 వరకు పెరగనున్నాయని వ్యాపారులు వ్యాఖ్యానిస్తున్నారు. గుడ్ల ధరలు కూడా అస్థిరంగా ఉంటున్నాయి. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లో 100 కోడి గుడ్ల ధర రూ.310 ఉండగా, రిటైల్ మార్కెట్లో రూ.400 చొప్పున అమ్ముతున్నారు. నిజానికి ఒక్కో గుడ్డు ధర రూ.3.10 పైసలుండగా రిటైల్ వ్యాపారులు మాత్రం రూ.4 వసూలు చేస్తున్నారు. వేసవిలో చికెన్ ఇష్టపడనివారు మటన్ వైపు మొగ్గుచూపుతుండటంతో మార్కెట్లో మటన్ ధరలు కూడా పెరిగాయి. గతవారం వరకు కేజీ మటన్ రూ.450-500లున్న ధర ప్రస్తుతం రూ.480-550కి చేరింది.