Chicken price Increased
-
కొండెక్కిన చికెన్ ధర
సాక్షి, విశాఖపట్నం: కొన్నాళ్ల నుంచి ఒకింత అందుబాటు ధరలో ఉన్న చికెన్ ఇప్పుడు చిక్కడం లేదు. రెండు నెలల పాటు కిలో చికెన్ రూ.230–260 మధ్య ఉండేది. మూడు వారాల నుంచి స్వల్పంగా పెరుగుతూ తాజాగా రూ.300కి చేరుకుంది. ఈ ఏడాది మార్చి మూడో వారం నుంచే ఎండలు, వడగాడ్పులు తీవ్రంగా ప్రభావం చూపాయి. ఏప్రిల్ నాటికి అవి తీవ్ర రూపం దాల్చాయి. దీంతో ఫారాల్లో పెరుగుతున్న కోళ్లు వడగాడ్పుల ధాటికి పెద్ద సంఖ్యలో చనిపోయాయి. రోజురోజుకూ తీవ్ర వడగాడ్పులు అధికమవుతుండడంతో పౌల్ట్రీ రైతులు కోడి పూర్తిగా ఎదగక పోయినా మార్కెట్‌కు తరలించే వారు. ఫలితంగా చికెన్ రేటు దిగి వచ్చింది. ఇలా కిలో చికెన్ మార్చి ఏప్రిల్ నెలల్లో రూ.230–260కి మించలేదు. మరోవైపు ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పౌల్ట్రీ రైతులు ఫారాల్లో కోళ్ల పెంపకాన్ని గణనీయంగా తగ్గించారు. కోళ్లను ఫారాల్లో బ్యాచ్‌ల వారీగా పెంచుతారు. కోడి పిల్ల చికెన్‌కు వీలుగా తయారవ్వాలంటే ఏడు నుంచి తొమ్మిది వారాల సమయం పడుతుంది. ఏప్రిల్‌లోనే ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో మే నెలలో మరింతగా విజృంభించి కోళ్లు మృత్యువాత పడతాయన్న భయంతో పౌల్ట్రీ రైతులు బ్యాచ్‌లను కుదించారు. దీంతో ఇప్పుడు కోళ్లకు కొరత ఏర్పడింది. డిమాండ్‌కు తగినన్ని బ్రాయిలర్ కోళ్ల లభ్యత లేకపోవడంతో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. ఫలితంగా ఈనెల ఆరంభంలో కిలో స్కిన్ లెస్ బ్రాయిలర్ చికెన్ రూ.260 ఉండగా ఇప్పుడది రూ.300కి ఎగబాకింది. అంటే 20 రోజుల్లో కిలోపై రూ.40 పెరిగిందన్న మాట! ఫారాల్లో కొత్తగా వేసిన బ్యాచ్‌లు అందుబాటులోకి రావాలంటే మరో మూడు నుంచి నాలుగు వారాల సమయం పట్టే అవకాశం ఉంది. అందువల్ల కనీసం మరో మూడు వారాల పాటు చికెన్ ధర ప్రియంగానే ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న ధరకంటే ఇంకాస్త పెరిగే అవకాశాలూ ఉన్నాయని అంటున్నారు. చికెన్ ప్రియులకు ఈ ధర భారంగానే ఉండనుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో రోజుకు మూడు లక్షలు, ఆదివారాల్లో ఆరు లక్షల కిలోల చికెన్ అమ్ముడవుతుందని అంచనా. బ్రాయిలర్ చికెన్ రేటు కొండెక్కి కూర్చున్న నేపథ్యంలో ఆదివారం ఆ ప్రభావం అమ్మకంపై పడిందని సీతమ్మధారలోని ఓ చికెన్ సెంటర్ నిర్వాహకుడు రామునాయుడు ‘సాక్షి’కి చెప్పాడు. గుడ్ల ధరలూ పైపైకే.. చికెన్ ధర ఇప్పటికే కొండెక్కి కూర్చుంటే.. కోడిగుడ్ల ధరలు కూడా పైపైకే ఎగబాకుతున్నాయి. మార్చిలో వంద గుడ్ల రేటు రూ.425 వరకు ఉండగా, ఏప్రిల్‌లో మరింత క్షీణించి రూ.405కి దిగి వచ్చింది. ఫలితంగా డజను గుడ్లు వినియోగదారునికి రూ.50కే లభ్యమయ్యేవి. కానీ ఇప్పుడు విశాఖలో వంద గుడ్ల ధర రూ.550కు చేరుకుంది. దీంతో డజను రిటైల్ మార్కెట్లో రూ.72కు పెరిగింది. కాగా ఉత్తరాంధ్రలో గుడ్లు పెట్టే (లేయర్) కోళ్లు 45 లక్షల వరకు వివిధ పౌల్ట్రీ ఫారాల్లో పెరుగుతున్నాయి. ఇవి రోజుకు సగటున 35 లక్షల గుడ్లను ఉత్పత్తి చేస్తున్నాయి. దాదాపు ఈ గుడ్లన్నీ స్థానికంగానే వినియోగమవుతున్నాయి. ఇలా ఇటు చికెన్, అటు కోడి గుడ్ల ధరలు ఎగసి పడుతుండడం నాన్ వెజ్ ప్రియులకు రుచించడం లేదు. -
Chicken Price: చుక్కలు చూపిస్తున్న చికెన్ ధర కిలో 320
మండపేట : మాంసాహార ప్రియులు అధికంగా ఇష్టపడే చికెన్ ధర చుక్కలు చూపిస్తోంది. రిటైల్ దుకాణాల వద్ద రూ.320 పలుకుతూ వినియోగదారులను బెంబేలెత్తిస్తోంది. కోడిపిల్లల ధరలు అమాంతం పెరిగిపోవడంతో కొత్తబ్యాచ్లు వేసేందుకు కోళ్ల రైతులు విముఖత చూపుతున్నారు. స్థానికంగా లభ్యత తగ్గడంతో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ప్రాంతాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. రోజుకు 3.2 లక్షల కిలోల చికెన్ వినియోగం తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో రోజుకు సుమారు 3.2 లక్షల కిలోల చికెన్ వినియోగిస్తుండగా, ఆదివారం, పండగ రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలుంటాయి. ఆలమూరు, రాజానగరం, కోరుకొండ, గోకవరం, అమలాపురం, రావులపాలెం, తుని, తొండంగి, కొవ్వూరు తదితర ప్రాంతాల్లో 440 ఫామ్‌ల వరకు విస్తరించి ఉండగా ఏడు లక్షల కోళ్ల పెంపకం జరుగుతున్నట్టు అంచనా. బ్యాచ్ వేసిన 40 రోజుల్లో రెండు నుంచి రెండున్నర కేజీల వరకు పెరిగి బ్రాయిలర్ కోళ్లు వినియోగానికి వస్తాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్‌ను బట్టి రైతులు ఎప్పటికప్పుడు కొత్త బ్యాచ్‌లు వేస్తుంటారు. మిగిలిన నెలలతో పోలిస్తే శ్రావణమాసం, వినాయక చవితి వేడుకలు, అయ్యప్ప దీక్షలు, కార్తికమాసంలో చికెన్ వినియోగం తగ్గుతుంది. ఈ నేపథ్యంలో ఆయా పండగల సమయాల్లో కొత్త బ్యాచ్‌లు వేయడాన్ని కొంతమేర తగ్గిస్తుంటారు. రూ.12 నుంచి రూ.50కు పెరిగిన కోడిపిల్ల ధర నెలన్నర రోజుల క్రితం రూ.12 ఉన్న కోడిపిల్ల ధర ప్రస్తుతం రూ.50కి చేరుకుంది. శ్రావణమాసంలో వినియోగం తగ్గుతుందని పలు హేచరీల్లోని బాయిలర్ కోళ్ల గుడ్లు ఉత్పత్తికి వినియోగించే పెరేంట్స్ కోళ్ల (బొంత కోళ్లు)ను షాపులకు అమ్మేశారు. గుడ్ల కొరతతో హేచరీల్లో కోడి పిల్లల ఉత్పత్తి తగ్గి వాటి ధర అమాంతం పెరిగిపోయిందని కోళ్ల రైతులు అంటున్నారు. మరోపక్క కోడి మేత ధరలు, ఇతర నిర్వహణ వ్యయం పెరిగిపోవడంతో గిట్టుబాటు కాదని అధిక శాతం మంది రైతులు కొత్త బ్యాచ్‌లు వేయలేదు. స్థానికంగా లభ్యత తగ్గడంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఆయా కారణాలతో శ్రావణమాసంలో వినియోగం తగ్గినా ధర దిగి రాలేదంటున్నారు. శ్రావణమాసం మొదట్లో రూ.250 ఉన్న కిలో స్కిన్ లెస్ చికెన్ ధర, నెలాఖరు నాటికి రూ.350కు చేరింది. వినాయక చవితి నవరాత్ర ఉత్సవాల నేపథ్యంలో వినియోగం మరింత తగ్గనుండటంతో అక్కడక్కడా పౌల్ట్రీల్లో ఉన్న కోళ్లను మార్కెట్లోకి తెస్తున్నారు. ఫలితంగా నాలుగు రోజులుగా ధర స్వల్పంగా తగ్గుతూ వచ్చింది. రిటైల్ దుకాణాల వద్ద స్కిన్లెస్ కిలో రూ.320, లైవ్ రూ.145 వరకు అమ్తుతున్నారు. కోడిపిల్ల ధర బాగా పెరిగిపోయింది కోడిపిల్ల ధర నెలన్నర రోజుల్లో రూ.12 నుంచి రూ.50కు పెరిగిపోయింది. ఆన్ సీజన్, కోడిపిల్ల ధరలకు జడిసి గిట్టుబాటు కాదని చాలామంది రైతులు కొత్త బ్యాచ్‌లు వేయలేదు. శ్రావణమాసం అయినప్పటికీ సాధారణ వినియోగం కనిపించింది. జిల్లాలో అవసరమైన కోళ్లు లేకపోవడం, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతితో ధర ఎక్కువగా ఉంది. – బొబ్బా వెంకన్న, బ్రాయిలర్ కోళ్ల రైతు, మండపేట -
మాంసం ప్రియులకు షాక్.. రికార్డు స్థాయిలో చికెన్ ధర.. కేజీ ఎంతంటే?
హైదరాబాద్ : కోడి కొండెక్కింది. రికార్డు స్థాయిలో చికెన్ ధర పలుకుతోంది. మండు టెండలో సాధారణంగా తగ్గే చికెన్ ధర ఈసారి ఏకంగా కేజీ రూ.310 చేరింది. గణనీయంగా పెరిగిన ఉష్ణోగ్రతలతో కోళ్లు చనిపోవడం.., డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడం, దాణా ధరలు పెరగడంతో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. దీనికి తోడు గత రెండు రోజులుగా మృగశిర కార్తె నేపథ్యంలో చికెన్‌కు గిరాకీ పెరగడం కూడా రేట్ల పైకి ఎగబాకడానికి కారణంగా కనిపిస్తోంది. వేసవి కావడంతో ఫంక్షన్లు, వివాహాలు పెరిగిపోవడంతో చికెన్ వినియోగం అనూహ్యంగా పెరిగింది. శుక్రవారం రిటైల్ మార్కెట్లో స్కిన్లెస్ చికెన్ ధర కిలో రూ.310 పలుకగా..కాలనీలు, బస్తీల్లో ఈ రేట్లు మరింత మండిపోతున్నాయి. ఇక స్కిన్‌తో ఉన్న చికెన్ కూడా రూ.260–280 వరకు అమ్ముతున్నారు. గత వారం రోజుల్లో కిలో చికెన్ ధర రూ.50 నుంచి 60 వరకు పెరిగింది. లైవ్ బర్డ్ కిలో రూ.188 వరకు విక్రయించారు. సాధారణంగా రాష్ట్ర వ్యాప్తంగా సగటున రోజుకు 5 లక్షల నుంచి 7 లక్షల కేజీల చికెన్ విక్రయిస్తుండగా.. గత ఆదివారం ఏకంగా 50 లక్షల కేజీల చికెన్ అమ్మకాలు జరిగినట్లు స్టార్ బ్రాయిలర్ అండ్ లేయర్ హోల్‌సేల్ డీలర్స్ అసోసియేషన్ కార్యదర్శి మహ్మద్ ఆప్రోజ్ ‘సాక్షి’కి తెలిపారు. -
తగ్గిన జీడి.. పెరిగిన కోడి
కాశీబుగ్గ/శ్రీకాకుళం: మార్కెట్లో జీడిపప్పు ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. మరోవైపు చికెన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. జాతీయ మార్కెట్లో సంక్షోభంతో జీడిపప్పు అమ్మకాలు వారం రోజులుగా గణనీయంగా పడిపోవడంతో పరిశ్రమదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని పలాస, ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో సుమారు 400 జీడి పరిశ్రమలు ఉనఆనియ. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో జీడిపప్పు వాడకం తగ్గడంతో పాటు, మండుతున్న ఎండలు ధరల పతనానికి కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. మొదటి రకం జీడి(గుడ్డు) ధర వారం రోజుల వ్యవధిలో కిలోపై రూ.150 వరకు తగ్గింది. వివిధ రకాల జీడిపప్పు, బద్ద, గుండ సుమారు రూ.75 వరకు తగ్గింది. ధరల తగ్గుముఖంపై పీసీఎంఏ అధ్యక్షుడు మల్లా సురేష్‌కుమార్, పలాస ఇండస్ట్రీయల్ ఎస్టేట్ అధ్యక్షుడు మల్లా రామేశ్వరం మాట్లాడుతూ ఏటా పెరిగే సమయంలో ఈసారి ధరలు తగ్గిపోయాయని చెప్పారు. కొండెక్కిన కోడి మాంసాహర ధరలు మాత్రలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 20 రోజుల క్రితం ధరలతో పోల్చితే చికెన్ ధర రూ.80, గుడ్డు ధర రూపాయి, చేపలు ధర రకాలను పట్టి రూ.80 నుంచి రూ.100 వరకు పెరిగాయి. వేసవి కాలంలో ఇలా ధరలు పెరగటం సాధారణమే అయినా ఈ ఏడాది పెరుగుదల విపరీతంగా ఉంది. వేసవిలో వ్యాధులు సోకుతాయన్న కారణంగా పౌల్ట్రీ యజమానులు సీజన్లో తక్కువగా కోళ్లను పెంచుతారు. ఫలితంగా ధర పెరుగుతోంది. అలాగే ప్రస్తుతం మార్కెట్లో కిలో నుంచి కిలోన్నర కోళ్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. వాస్తవంగా పౌల్ట్రీ యజమానులు కోడి బరువు రెండు కిలోలు దాటిన తరువాత మాత్రమే విక్రయిస్తుంటారు. ఇప్పుడు కోళ్లకు డిమాండ్ పెరగటంతో కిలో కోళ్లనే విక్రయిస్తున్నారు. వీటి రుచి కూడా తగ్గుతోందని మాంసాహార ప్రియులు చెపుతున్నారు. -
Chicken Prices: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చికెన్ ధరలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. తెలంగాణ, ఏపీలో కొన్ని ఏరియాల్లో త్రిబుల్ సెంచరీ దాటింది స్కిన్లెస్ చికెన్ కేజీ ధర. ఎండాకాలం, పైగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో చికెన్ డిమాండ్ పెరిగి.. ధరలూ పెరిగాయని వ్యాపారులు చెప్తున్నారు. పది రోజుల గ్యాప్‌లో 70 నుంచి 80 రూపాయల దాకా పెరిగింది. కూరగాయల దిగుబడి తగ్గిపోవడం, హోటల్స్.. రెస్టారెంట్లలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల వ్యాపారాలు జోరందుకోవడంతో ధరలు పెరిగాయి. మరోవైపు ఎండకు కోళ్లు చనిపోతాయనే భయంతో.. కొందరు కోళ్ల ఫారం వ్యాపారులు బరువు పెరగకుండానే వెంటనే అమ్మేస్తున్నారు. -
చికెన్ ధరలకు రెక్కలు
సాక్షి నెట్వర్క్: కరోనా కారణంగా నిన్న మొన్నటి వరకు పూర్తిగా పడిపోయిన చికెన్ అమ్మకాలు.. దానివల్ల వైరస్ సోకదని నిపుణులు తేల్చిచెప్పడంతో ఇప్పుడు దానికి ఎక్కడలేని డిమాండ్ పెరిగింది. ఒక్కసారిగా చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. నిజానికి కరోనా ప్రభావంవల్ల దాదాపు మూడు నెలలుగా పౌల్ట్రీ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా కుదేలైంది. కోళ్లు, గుడ్ల ఉత్పత్తి పడిపోయింది. దీంతో చికెన్ తింటే వైరస్ వ్యాపించదని నిపుణులతో పాటు ప్రభుత్వం కూడా విస్తృత ప్రచారం చేశాయి. ఫలితంగా వినియోగదారుల్లో నెమ్మదిగా భయం తొలగింది. అలాగే.. రెండు వారాలుగా దేశం మొత్తం లాక్డౌన్లో ఉండడం కూడా చికెన్‌పై వినియోగదారుల్లో మళ్లీ మక్కువ పెరగడానికి దోహదపడింది. దీంతో ఒక్కసారిగా కోళ్లకు, కోడి మాంసానికి డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో.. పది రోజుల క్రితం వరకూ చికెన్ ధర లైవ్ కిలో రూ.30కి.. స్కిన్లెస్ రూ.60కి అమ్మిన వ్యాపారులు ఆదివారం ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో ధర పెంచేశారు. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రూ.190 నుంచి రూ.300 వరకు చికెన్ ధర పలికింది. కృష్ణా జిల్లాలో కిలో రూ.190కి అమ్మకాలు సాగగా.. కర్నూలులో రూ.200, విశాఖలో ప్రాంతాన్ని బట్టి రూ.170–రూ.190 వరకు, శ్రీకాకుళంలో ఏకంగా రూ.300కు విక్రయించారు. కొన్ని వారాలపాటు ఇదే పరిస్థితి కర్నూలులో చికెన్, మటన్ అమ్మకాలకు జిల్లా అధికార యంత్రాంగం నుంచి అనుమతి రావడంతో కర్నూలు నగరంలోని చికెన్ సెంటర్ల దగ్గర ఆదివారం వినియోగదారులు బారులుతీరారు. కానీ.. డిమాండ్‌కు తగ్గట్టుగా కోళ్లు లేకపోవడంవల్ల సగం మందికి పైగా వినియోగదారులు ఉసూరుమంటూ వెనుదిరిగారు. కోళ్ల కొరతతో అనేక చికెన్ దుకాణాలు తెరుచుకోలేదు. కొద్దోగొప్పో తెరుచుకున్నవి ఉదయం 9 కల్లా మూసివేశారు. కాగా, జిల్లాకు అవసరమైన కోళ్లు, గుడ్లు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. కరోనా కారణంగా అక్కడ కోళ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. లాక్‌డౌన్‌తో కూలీల సమస్య కూడా తీవ్రమవడంతో ఉత్పత్తి పెంచలేకపోతున్నారు. మరికొన్ని వారాల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని ఇక్కడ చికెన్ సెంటర్ల యజమానులు చెబుతున్నారు. -
కొండెక్కిన ‘కోడి’
సాక్షి, అమరావతి: కోడి మాంసం ధర కొండెక్కి కూర్చుని సామాన్యుడికి అందకుండా ఊరిస్తోంది. డిసెంబర్ నెల ప్రారంభం నుంచి మొదలైన పెరుగుదల నెలాఖరు నాటికి కిలో స్కిన్లెస్ చికెన్ రూ.210 నుంచి 230 వరకూ పలికింది. నూతన సంవత్సరం రోజున కొద్దిగా తగ్గినా మళ్లీ పెరిగే సూచనలే కనిపిస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో ముక్కలేనిదే ముద్ద దిగని చికెన్ ప్రియులు ఆవేదన చెందుతున్నారు. నెలన్నర క్రితం వరకూ కిలో రూ.150 నుంచి రూ.170 మధ్య ఉన్న బ్రాయిలర్ చికెన్ (స్కిన్లెస్) ధర 20 రోజులుగా బాగా పెరిగింది. పది రోజులపాటు కిలో రూ.210 – 230 మధ్య (చికెన్ కంపెనీలు, నాణ్యత, ప్రాంతాన్ని బట్టి రూ.15 నుంచి రూ.20 వరకూ తేడా ఉంటుంది) స్థిరపడింది. రెండు మూడు రోజుల్లో తగ్గుముఖం పట్టి రూ.180–200కి దిగివచ్చింది. గత రెండు మూడు రోజుల్లో తగ్గడానికి అయ్యప్ప, భవానీ దీక్షలు, కొత్త సంవత్సరం, సెంటిమెంటు కారణాలని చికెన్ వ్యాపారులు, బ్రాయిలర్ పౌల్ట్రీ ఫారాల వారు విశ్లేషిస్తున్నారు. రెండు రోజుల్లో భవానీ దీక్షలు ముగియనున్నాయి. అలాగే అయ్యప్ప భక్తుల్లో కూడా అత్యధిక మంది (మఖరజ్యోతి దర్శనం కోసం ఆగేవారు మినహా) వారం పది రోజుల్లో మాలలు తీసేస్తారు. వీటికి తోడు సంక్రాంతి సందర్భంగా కోళ్లకు డిమాండు పెరుగుతుందని వ్యాపారవర్గాల అంచనాగా ఉంది. వీటికి తోడు గతంతో పోల్చుకుంటే మందు వినియోగం కూడా బాగా పెరగడంతో అదే స్థాయిలో చికెన్ అమ్మకాలూ పెరిగాయి. ‘ చెప్పడానికి బాగున్నా బాగులేకపోయినా మందుప్రియులవల్లే ఎక్కువగా చికెన్ అమ్ముడుపోతోందన్నది మాత్రం నిజం. చికెన్ విక్రయించే షాపు నిర్వాహకుడిగా ఇది నేను గ్రహించిన వాస్తవం...’ అని విజయవాడకు చెందిన ఒక దుకాణం యజమాని ‘సాక్షి’కి వివరించారు. ఇతర ప్రాంతాలతో పోల్చితే విజయవాడలో చికెన్ వినియోగమే కాదు ధర కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటుందని ఒక హోటల్ యజమాని అభిప్రాయపడ్డారు. ముక్కలేనిదే ముద్ద దిగనివారెందరో... పొట్టేలి మాంసంతో పోల్చితే ధర తక్కువగా ఉండటం కూడా కోడికూరకు డిమాండు పెరగడానికి కారణం. మటన్ కొనలేని వారంతా చికెన్‌వైపే మొగ్గుచూపుతున్నారు. హోటళ్లలో సైతం మటన్ కంటే చికెన్ వినియోగమే ఎక్కువగా ఉండటం ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో ప్రతి నెలా మూడు కోట్లకు పైగా బ్రాయిలర్ కోళ్ల ఫారాల నుంచి బయటకు వస్తున్నాయి. సీజన్‌ను బట్టి కొంచెం అటు ఇటుగా అదే స్థాయిలో కోడి పిల్లలు పెంపకం కోసం పౌల్ట్రీలకు చేరుతున్నాయి. వచ్చే వేసవిలో చికెన్ ధరలు పెరగవచ్చని బ్రాయిలర్ రంగ నిపుణులు చెబుతున్నారు. ‘ఈఏడాది ఖరీఫ్‌లోనూ, రబీలోనూ వర్షాభావం వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి పడిపోవడం వల్ల కోళ్లకు దాణాగా వాడే మొక్కజొన్న, తౌడు, సజ్జలు తదితరాల ధర పెరుగుతుంది. కరువువల్ల నీటి సమస్య ఏర్పడుతుంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. వేడి పెరిగి భూతాపంవల్ల కోళ్లు చనిపోయి మాంసం ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ కారణాలవల్ల చికెన్ ధర పెరిగితే తప్ప గిట్టుబాటు కాని పరిస్థితి వస్తుందని పౌల్ట్రీ రంగ నిపుణులు చెబుతున్నారు. ధరల్లో నాటుకోడి పొట్టేలు మాంసంతో పోటీ పడుతోంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో పొట్టేలి మాసం రూ.550 ఉంటే నాటుకోడి రూ.500 ఉంది. పెద్ద పెద్ద హోటళ్లలో సైతం నాటుకోడి పులుసు, సంగటి మెనూకు క్రేజి ఏర్పడింది. నాటుకోళ్ల పెంపకం ఖర్చు కూడా ఎక్కువే ఉంటుందని పౌల్ట్రీల యజమానులు చెబుతున్నారు. -
కొండెక్కిన కోడి!
స్కిన్లెస్ కిలో రూ.178 సాక్షి, హైదరాబాద్: చికెన్ ధర మండిపోతోంది. ఎండాకాలం వేడి చేస్తుందన్న ఉద్దేశంతో చికెన్ వినియోగించేందుకు మాంసాహారులు వెనుకడుగేస్తుంటారు. ఫలితంగా వేసవిలో చికెన్ ధరలు పడిపోవడం ఏటా సర్వసాధారణం. అయితే... నగరంలో ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మార్కెట్లో చికెన్ ధరలు దడ పుట్టిస్తున్నాయి. ఇటీవలి వరకు రూ.122లకు లభించిన బ్రాయిలర్ చికెన్ 20 రోజుల వ్యవధిలోనే కిలో ఒక్కింటికి రూ.30 వరకు ధర పెరిగింది. ఆదివారం రిటైల్ మార్కెట్లో లైవ్ కోడి కేజీ రూ.106, డ్రెస్డ్ చికెన్ కిలో రూ.152, స్కిన్‌లెన్ రూ.178, బోన్‌లెస్ రూ.340 ధరకు వ్యాపారులు విక్రయించారు. బర్డ్ ఫ్లూ వ్యాధి కారణంగా గత నెలలో పౌల్ట్రీ యజమానులు పెద్దసంఖ్యలో కోళ్లను చంపేశారు. ఆతర్వాత కొత్త బ్యాచ్‌లు వేయకుండా ఆపేశారు. ఫలితంగా కోళ్ల ఉత్పత్తి నిలిచిపోయి నగరంలో కొరత ఏర్పడింది. ప్రస్తుతం నగరంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లు జోరందుకోవడంతో చికెన్‌కు గిరాకీ పెరిగింది. ఇదే అదనుగా భావించి వ్యాపారులు ధరలు పెంచేశారు. గత నెలలో కొత్త బ్యాచ్‌లు వేయకపోవడం, ఉన్నవి కూడా ఎండదెబ్బకు చనిపోవడంతో బర్డ్స్ ఉత్పత్తి తగ్గి కొరత ఏర్పడింది. ఆ ప్రభావమే ఇప్పుడు ధరల పెరుగుదలకు దారితీసిందని వ్యాపారులు చెబుతున్నారు. సోమవారం నుంచి చికెన్ ధరలు రూ.8-12 వరకు పెరగనున్నాయని వ్యాపారులు వ్యాఖ్యానిస్తున్నారు. గుడ్ల ధరలు కూడా అస్థిరంగా ఉంటున్నాయి. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లో 100 కోడి గుడ్ల ధర రూ.310 ఉండగా, రిటైల్ మార్కెట్లో రూ.400 చొప్పున అమ్ముతున్నారు. నిజానికి ఒక్కో గుడ్డు ధర రూ.3.10 పైసలుండగా రిటైల్ వ్యాపారులు మాత్రం రూ.4 వసూలు చేస్తున్నారు. వేసవిలో చికెన్ ఇష్టపడనివారు మటన్ వైపు మొగ్గుచూపుతుండటంతో మార్కెట్లో మటన్ ధరలు కూడా పెరిగాయి. గతవారం వరకు కేజీ మటన్ రూ.450-500లున్న ధర ప్రస్తుతం రూ.480-550కి చేరింది.