ఆదివారం శ్రీకాకుళంలో మాంసం కొనుగోలు చేస్తున్న ప్రజలు
సాక్షి నెట్‌వర్క్: కరోనా కారణంగా నిన్న మొన్నటి వరకు పూర్తిగా పడిపోయిన చికెన్ అమ్మకాలు.. దానివల్ల వైరస్ సోకదని నిపుణులు తేల్చిచెప్పడంతో ఇప్పుడు దానికి ఎక్కడలేని డిమాండ్ పెరిగింది. ఒక్కసారిగా చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. నిజానికి కరోనా ప్రభావంవల్ల దాదాపు మూడు నెలలుగా పౌల్ట్రీ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా కుదేలైంది. కోళ్లు, గుడ్ల ఉత్పత్తి పడిపోయింది. దీంతో చికెన్ తింటే వైరస్ వ్యాపించదని నిపుణులతో పాటు ప్రభుత్వం కూడా విస్తృత ప్రచారం చేశాయి.
ఫలితంగా వినియోగదారుల్లో నెమ్మదిగా భయం తొలగింది. అలాగే.. రెండు వారాలుగా దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉండడం కూడా చికెన్‌పై వినియోగదారుల్లో మళ్లీ మక్కువ పెరగడానికి దోహదపడింది. దీంతో ఒక్కసారిగా కోళ్లకు, కోడి మాంసానికి డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో.. పది రోజుల క్రితం వరకూ చికెన్ ధర లైవ్ కిలో రూ.30కి.. స్కిన్‌లెస్ రూ.60కి అమ్మిన వ్యాపారులు ఆదివారం ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో ధర పెంచేశారు. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రూ.190 నుంచి రూ.300 వరకు చికెన్ ధర పలికింది. కృష్ణా జిల్లాలో కిలో రూ.190కి అమ్మకాలు సాగగా.. కర్నూలులో రూ.200, విశాఖలో ప్రాంతాన్ని బట్టి రూ.170–రూ.190 వరకు, శ్రీకాకుళంలో ఏకంగా రూ.300కు విక్రయించారు.
కొన్ని వారాలపాటు ఇదే పరిస్థితి
కర్నూలులో చికెన్, మటన్ అమ్మకాలకు జిల్లా అధికార యంత్రాంగం నుంచి అనుమతి రావడంతో కర్నూలు నగరంలోని చికెన్ సెంటర్ల దగ్గర ఆదివారం వినియోగదారులు బారులుతీరారు. కానీ.. డిమాండ్‌కు తగ్గట్టుగా కోళ్లు లేకపోవడంవల్ల సగం మందికి పైగా వినియోగదారులు ఉసూరుమంటూ వెనుదిరిగారు. కోళ్ల కొరతతో అనేక చికెన్ దుకాణాలు తెరుచుకోలేదు. కొద్దోగొప్పో తెరుచుకున్నవి ఉదయం 9 కల్లా మూసివేశారు. కాగా, జిల్లాకు అవసరమైన కోళ్లు, గుడ్లు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. కరోనా కారణంగా అక్కడ కోళ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. లాక్‌డౌన్‌తో కూలీల సమస్య కూడా తీవ్రమవడంతో ఉత్పత్తి పెంచలేకపోతున్నారు. మరికొన్ని వారాల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని ఇక్కడ చికెన్ సెంటర్ల యజమానులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment