మండపేట : మాంసాహార ప్రియులు అధికంగా ఇష్టపడే చికెన్ ధర చుక్కలు చూపిస్తోంది. రిటైల్ దుకాణాల వద్ద రూ.320 పలుకుతూ వినియోగదారులను బెంబేలెత్తిస్తోంది. కోడిపిల్లల ధరలు అమాంతం పెరిగిపోవడంతో కొత్తబ్యాచ్‌లు వేసేందుకు కోళ్ల రైతులు విముఖత చూపుతున్నారు. స్థానికంగా లభ్యత తగ్గడంతో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ప్రాంతాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.
రోజుకు 3.2 లక్షల కిలోల చికెన్ వినియోగం
తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో రోజుకు సుమారు 3.2 లక్షల కిలోల చికెన్ వినియోగిస్తుండగా, ఆదివారం, పండగ రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలుంటాయి. ఆలమూరు, రాజానగరం, కోరుకొండ, గోకవరం, అమలాపురం, రావులపాలెం, తుని, తొండంగి, కొవ్వూరు తదితర ప్రాంతాల్లో 440 ఫామ్‌ల వరకు విస్తరించి ఉండగా ఏడు లక్షల కోళ్ల పెంపకం జరుగుతున్నట్టు అంచనా. బ్యాచ్ వేసిన 40 రోజుల్లో రెండు నుంచి రెండున్నర కేజీల వరకు పెరిగి బ్రాయిలర్ కోళ్లు వినియోగానికి వస్తాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్‌ను బట్టి రైతులు ఎప్పటికప్పుడు కొత్త బ్యాచ్‌లు వేస్తుంటారు. మిగిలిన నెలలతో పోలిస్తే శ్రావణమాసం, వినాయక చవితి వేడుకలు, అయ్యప్ప దీక్షలు, కార్తికమాసంలో చికెన్ వినియోగం తగ్గుతుంది. ఈ నేపథ్యంలో ఆయా పండగల సమయాల్లో కొత్త బ్యాచ్‌లు వేయడాన్ని కొంతమేర తగ్గిస్తుంటారు.
రూ.12 నుంచి రూ.50కు పెరిగిన కోడిపిల్ల ధర
నెలన్నర రోజుల క్రితం రూ.12 ఉన్న కోడిపిల్ల ధర ప్రస్తుతం రూ.50కి చేరుకుంది. శ్రావణమాసంలో వినియోగం తగ్గుతుందని పలు హేచరీల్లోని బాయిలర్ కోళ్ల గుడ్లు ఉత్పత్తికి వినియోగించే పెరేంట్స్ కోళ్ల (బొంత కోళ్లు)ను షాపులకు అమ్మేశారు. గుడ్ల కొరతతో హేచరీల్లో కోడి పిల్లల ఉత్పత్తి తగ్గి వాటి ధర అమాంతం పెరిగిపోయిందని కోళ్ల రైతులు అంటున్నారు. మరోపక్క కోడి మేత ధరలు, ఇతర నిర్వహణ వ్యయం పెరిగిపోవడంతో గిట్టుబాటు కాదని అధిక శాతం మంది రైతులు కొత్త బ్యాచ్‌లు వేయలేదు.
స్థానికంగా లభ్యత తగ్గడంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఆయా కారణాలతో శ్రావణమాసంలో వినియోగం తగ్గినా ధర దిగి రాలేదంటున్నారు. శ్రావణమాసం మొదట్లో రూ.250 ఉన్న కిలో స్కిన్ లెస్ చికెన్ ధర, నెలాఖరు నాటికి రూ.350కు చేరింది. వినాయక చవితి నవరాత్ర ఉత్సవాల నేపథ్యంలో వినియోగం మరింత తగ్గనుండటంతో అక్కడక్కడా పౌల్ట్రీల్లో ఉన్న కోళ్లను మార్కెట్‌లోకి తెస్తున్నారు. ఫలితంగా నాలుగు రోజులుగా ధర స్వల్పంగా తగ్గుతూ వచ్చింది. రిటైల్ దుకాణాల వద్ద స్కిన్‌లెస్ కిలో రూ.320, లైవ్ రూ.145 వరకు అమ్తుతున్నారు.
కోడిపిల్ల ధర బాగా పెరిగిపోయింది
కోడిపిల్ల ధర నెలన్నర రోజుల్లో రూ.12 నుంచి రూ.50కు పెరిగిపోయింది. ఆన్ సీజన్, కోడిపిల్ల ధరలకు జడిసి గిట్టుబాటు కాదని చాలామంది రైతులు కొత్త బ్యాచ్‌లు వేయలేదు. శ్రావణమాసం అయినప్పటికీ సాధారణ వినియోగం కనిపించింది. జిల్లాలో అవసరమైన కోళ్లు లేకపోవడం, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతితో ధర ఎక్కువగా ఉంది.
– బొబ్బా వెంకన్న, బ్రాయిలర్ కోళ్ల రైతు, మండపేట
Comments
Please login to add a commentAdd a comment