Dr. B. R. Ambedkar Konaseema District News
-
రోడ్డు ప్రమాదాల నివారణకు ఐఆర్‌ఏడీ యాప్
అమలాపురం టౌన్: తరుచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి అందుకు అనుగుణంగా అప్రమత్తమయ్యేలా రాష్ట్ర పోలీస్ శాఖ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటా (ఐఆర్‌ఏడీ) యాప్‌ను రూపొందించి దాని అమలుకు చర్యలు చేపట్టింది. జిల్లా పోలీసు శాఖ ఈ యాప్‌ను వినియోగించే విధానాలపై సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చింది. ప్రతీ పోలీస్ స్టేషన్లో ఎస్సై నుంచి కానిస్టేబుల్ వరకూ ఈ యాప్‌పై అవగాహన కల్పిస్తోంది. ఎస్పీ బి.కృష్ణారావు ఈ నెల 16న యాప్‌ను ప్రారంభించారు. ఐఆర్ఏ డేట్ బేస్ నమోదు గురించి జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, పోలీసు స్టేషన్ల సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఐఆర్‌ఏడీ రోల్ అవుట్ మేనేజర్ జీవీ రామారావు, డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డు బ్యూరో (డీసీఆర్బీ) సీఐ వి.శ్రీనివాసరావుల ఈ శిక్షణ తరగతులను పర్యవేక్షించారు.రోడ్డు ప్రమాదాల స్పాట్లను గుర్తించేది ఇలా..ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశానికి పోలీస్ దర్యాప్తు అధికారి (ఐవో) వెళ్లి అక్కడ ఐఆర్‌ఏడీ యాప్ ద్వారా ప్రమాద సమాచారాన్ని నమోదు చేయాలి. ఇదే స్పాట్లో గతంలో రోడ్డు ప్రమాదాలు జరిగాయా? లేదా? అనే అంశంపై ఆ అధికారి అక్కడే అధ్యయనం చేస్తారు. ఒకవేళ అదే స్పాట్లో తరచూ ప్రమాదాలు జరుగుతుంటే ఆ విషయాన్ని యాప్‌లో నమోదు చేయాలి. ఈ సమాచారాన్ని ఇటు ఎస్పీ కార్యాలయానికి, అటు రాష్ట్ర పోలీస్ కార్యాలయానికి యాప్ ద్వారా పంపించాలి. యాప్‌లో రోడ్డు ప్రమాదాల సమాచారాన్ని నమోదు చేస్తూనే అక్కడ ఇక ముందు రోడ్డు ప్రమాదాల జరగకుండా సూచనలు, జాగ్రత్తలతో అప్రమత్తం చేసే దిశగా చర్యలు చేపడతారు. వాహనాల డ్రైవర్లకు తెలిసేలా ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటూ హెచ్చరికలు బోర్డులు ఏర్పాటు చేస్తారు.అవగాహన పెంచాలికొత్తగా వచ్చిన ఐఆర్‌ఏడీ యాప్‌పై పోలీస్ సిబ్బంది పూర్తి స్థాయి అవగాహనతో ఉండడమే కాకుండా వాహన చోదకులకు జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది ఎక్కడికక్కడ రోడ్డు ప్రమాదాల నివారణ నిబంధనలపై అవగాహన కల్పించాలని ఎస్పీ కృష్ణారావు యాప్ శిక్షణ తరగతుల్లో సూచించారు. వాహన చోదకులు విధిగా హెల్మెట్లు ధరించాలని, సీటు బెల్ట్‌లు పెట్టుకోవాలని స్పష్టం చేశారు. వాహనాలను నిర్లక్ష్యంగా, పరధ్యానంగా నడపకుండా డ్రైవింగ్ సమయంలో పూర్తి అప్రమత్తతో ఉండాలని సూచించారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ఎంత ప్రమాదకరమో వాహన చోదకులకు పోలీసు అధికారులు తరుచూ కౌన్సెలింగ్ ద్వారా తెలియజేయాలన్నారు. లైసెన్స్‌ను లేకుండా టీనేజ్ పిల్లలకు మోటారు సైకిళ్లు నడిపే అధికారం లేదని, తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పులు తీసుకురావాలని సూచించారు. మానవ తప్పిదాల వల్ల రోడ్డు ప్రమాదం జరిగి ఎవరైనా చనిపోతే ఆ కుటుంబం ఎంత క్షోభిస్తుందో, ఎంతటి నష్టం చేకూరుతుందో డ్రైవింగ్ చేసే వ్యక్తులకు కనువిప్పు కలిగేలా వివరించాలని ఎస్పీ కృష్ణారావు జిల్లా పోలీస్ సిబ్బందికి సూచించారు. -
ఈ–క్రాప్ నమోదు తప్పనిసరి
అల్లవరం: రైతులు తాము పండించే పంట వివరాలను ఈ–క్రాప్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి వి.బోసుబాబు సూచించారు. బెండమూర్లంక గ్రామంలో జరుగుతున్న ఈ–క్రాప్ నమోదు కార్యక్రమాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1.52 లక్షల ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయన్నారు. 64 వేల ఎకరాల్లో ఈ–క్రాప్ నమోదు జరిగిందని, ఈ నెల 31 లోపు వంద శాతం పూర్తి చేయాలన్నారు. సెప్టెంబర్ 15లోగా ఈ–క్రాప్ నమోదు చేసిన పంటకు రైతుల ఈ–కేవైసీని నమోదు చేయాలన్నారు. అనంతరం ప్రతి గ్రామ సచివాలయంలో డ్రాఫ్ట్ జాబితాను ప్రదర్శించి, రైతులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించాలన్నారు. అల్లవరం మండలంలో 2,380 ఎకరాల్లో వరినాట్లు పూర్తి కాగా, 1,650 ఎకరాల్లో పంట వివరాలు నమోదు జరిగినట్టు తెలిపారు. వరిని కుళ్లు తెగులు ఆశించకుండా హెక్సాకోనోజోల్ మందును పిచికారీ చేయాలని సూచించారు. ఆయన వెంట ఏడీ షంషీ, వ్యవసాయాధికారి ఎన్వీవీ సత్యనారాయణ, ప్రకృతి వ్యవసాయాధికారి శ్రీనివాసరావు, విస్తరణాధికారి శివమోహన్, సర్పంచ్ బర్రే సీతారత్నం, రైతులు ఉన్నారు. -
కుండపోత.. ఉక్కపోత..
సాక్షి, అమలాపురం: వాతావరణం చాలా విచిత్రంగా మారింది. ఎప్పుడు ఎండ కాస్తుందో, ఎప్పుడు వాన పడుతుందో తెలియడం లేదు. వేసవిని తలదన్నెలా ఎండ కాస్తూ ప్రజలను భయపెడుతోంది. అంతలోనే చల్లని చినుకులు సేదతీర్చుతున్నాయి. అమలాపురంలో మంగళవారం గంట పాటు ఏకదాటిగా వర్షం పడింది. ఏకంగా 18.2 మీమీ కురిసింది. ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు కురిసిన వర్షంతో సామన్యులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి భానుడు విజృంభించాడు. విపరీతమైన ఎండతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. -
కలెక్టర్ ఫొటోతో వాట్సాప్ సందేశాలు
అమలాపురం రూరల్: కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని జిల్లాలోని అధికారులకు, ఇతరులకు గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్ సందేశాలు పంపిస్తున్నారు. వారితో చాటింగ్ చేస్తూ సంభాషణ కొనసాగిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ మహేష్ కుమార్ మంగళవారం ప్రకటన విడుదల చేరారు. వాట్సాప్ లో చూపిస్తున్న 947855 66071 నంబర్ తనది కాదని స్పష్టం చేశారు. ఎవ్వరూ ఆ నంబర్ నుంచి మెసేజ్‌లకు స్పందించవద్దని, ఫోన్ కాల్స్‌ను స్వీకరించవద్దని తెలిపారు. పాఠ్య, నోట్ పుస్తకాల పంపిణీ పూర్తి అమలాపురం టౌన్: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన పాఠ్య, నోట్ పుస్తకాల పంపిణీ దాదాపు పూర్తయ్యిందని డీఐఈవో వనుము సోమశేఖరరావు తెలిపారు. వాటిని విద్యార్థులు సక్రమంగా సద్వినియోగం చేసుకుంటున్నారా అనే విషయాన్ని తల్లిదండ్రులు పర్యవేక్షించాలని సూచించారు. అలాగే కళాశాలల్లో ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు కూడా ఆరా తీయాలన్నారు. మలికిపురం మండలం కేశనపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వృక్ష శాస్త్ర అధ్యాపకుడు లేని కారణంగా గెస్ట్ లెక్చరర్ ఫ్యాకల్టీ నుంచి దరఖాస్తులు ఆహ్వానించామన్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 50 శాతం మార్కులు సాధించిన వారు అర్హులన్నారు. బోధన చేసిన గంటకు రూ.150 చొప్పున నెలకు రూ.10 వేల మించకుండా గౌరవ భృతి ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. ఆసక్తి కలవారు ఈ నెల 24వ తేదీ సాయంత్రం లోపు దరఖాస్తులను ఆ కళాశాలలో సమర్పించాలన్నారు. -
కల్యాణ వైభోగమే..
అన్నవరం: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంతో అత్యంత అపూర్వ ఘట్టం. ఆ కార్యక్రమం తమ ఇష్టదైవం సన్నిధిలో జరగాలని చాలామంది కోరుకుంటారు. అన్నవరంలోని వీర వెంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానం వివాహాలకు పెట్టింది పేరు. ఇక్కడ ఏటా వేల సంఖ్యలోవివాహాలు జరుగుతాయి. మంచి ముహూర్తాల సమయంలో ఈ సంఖ్య భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం శ్రావణ మాసం కావడంతో రత్నగిరిపై వివాహాల సందడి మొదలైంది. నూతన దంపతులతో కళకళ నూతన దంపతులతో సత్యదేవుని ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. వివిధ ప్రాంతాల నుంచి కూడా నూతన వధూవరులు స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు. వీరందరూ వ్రతాలను ఆచరించి, స్వామివారిని దర్శించుకుని తమ జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. సత్యదేవుని సన్నిధిలో ఏటా ఐదు వేల జంటలు వేదమంత్రాల సాక్షిగా ఒక్కటవుతున్నాయి. వీరితో బాటు ఎక్కడెక్కడో వివాహాలు చేసుకున్న మరో పది వేల జంటలు సత్యదేవుని సన్నిధికి విచ్చేస్తున్నాయి. పెళ్ల్లిళ్ల సీజన్ శ్రావణ మాసం ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకూ సత్యదేవుని సన్నిధిలో ఐదు వందలకు పైగా వివాహాలు జరిగాయి. ఆగస్టు ఐదు నుంచి శ్రావణ మాసం ప్రారంభం కాగా ఏడో తేదీ నుంచి వివాహాలు మొదలయ్యాయి. ఈ నెల 15వ తేదీ ఒక్కరోజే వందకు పైగా జరిగాయి. మిగిలిన రోజుల్లో పది నుంచి ఇరవై వరకూ జరుగుతున్నాయి. 18, 19వ తేదీలలో దాదాపు 50 జంటలు ఒక్కటయ్యాయి. నేటి నుంచి భారీ సంఖ్యలో.. రత్నగిరిపై బుధవారం నుంచి ఈ నెల 23వ తేదీ వరకూ భారీ సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. ఈ మూడు రోజులూ రత్నగిరిపై సత్రం గదులలో దాదాపు 70 శాతం, అన్ని వివాహ మండపాలను పెళ్లి బృందాలు రిజర్వ్ చేసుకున్నాయి. ఇదే ముహూర్తానికి పెళ్లిళ్లు పెట్టుకున్న మిగిలిన వారందరూ మంటపాలు లభ్యం కాక తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. సర్దుబాటు చేయ‘లేఖ’ రత్నగిరిపై వివాహాల నేపథ్యంలో సత్రం గదులు, అతిథి గృహాల కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. కొండపై ఉన్న 600 వసతి గదులలో దాదాపు 70 శాతం రిజర్వ్ అయిపోయాయి. వాటికి సంబంధించి చార్టులు కూడా సిద్ధమయ్యాయి. మిగిలిన గదుల కోసం విపరీతమైన పోటీ ఏర్పడింది. కొండకు వచ్చే భక్తులు, పెళ్లి బృందాలు గదుల కోసం ప్రముఖ రాజకీయ నాయకులు, వీఐపీల సిఫారసు లేఖలను తీసుకువస్తున్నారు. ఈ వ్యవహారం దేవస్థానం అధికారులకు తలనొప్పిగా మారింది. గదులను సర్దుబాటు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రత్నగిరిపై జోరుగా వివాహాలు నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ ముహూర్తాలు సత్రం గదులు 70 శాతం రిజర్వ్ శ్రావణంలో ఇప్పటికే 500 పెళ్లిళ్లు -
యూనివర్సిటీ ఖ్యాతి పెంచాలి
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): యూనివర్సిటీ స్థాయి మరింత పెంచాలని, రాబోయే తరాలకు విద్యావృక్షంలా తయారు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.రామ్మోహనరావు పేర్కొన్నారు. జేఎన్టీయూ కాకినాడ వర్సిటీ 16 వ్యవస్థాపక దినోత్సవం మంగళవారం నిర్వహించగా ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. రామ్మోహనరావు మాట్లాడుతూ రీసెర్చ్ సెంటర్లు మరిన్ని ఏర్పాటుచేసి విద్యార్థులను పరిశోధన వైపు ప్రోత్సహించాలన్నారు. జేఎన్టీయూకే వీసీ మురళీకృష్ణ మాట్లాడుతూ ఉన్నత విద్యలో పరీక్షా విధానం, మెఽథడాలజీ, బోధన పద్ధతులు, పాఠ్య ప్రణాళికలో తీసుకురావలసిన మార్పులపై దృష్టి సారిస్తున్నామన్నారు. కాకినాడ సీపోర్టు సీఈఓ మురళీధర్ మాట్లాడుతూ వర్సిటీ ద్వారా సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టులు చేపట్టాలన్నారు. వర్సిటీ అనుబంధ కళాశాలలకు ఉత్తమ ఫెర్మార్మెన్స్ అవార్డులతో పాటు ఐపీఎస్ అధికారి ఎంవీఆర్ కృష్ణతేజకు యంగ్ అచీవర్ అవార్డు అందజేశారు. రెక్టార్ కేవీరమణ, రిజిస్ట్రార్ రవీంద్ర, డైరెక్టర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. బస్‌షెల్టర్ కూల్చివేసిన కూటమి నాయకులు పెదపూడి: అనపర్తి మండలం పొలమూరు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి తండ్రి గంగిరెడ్డి, తల్లిపేరు మీద ఉన్న బస్‌షెల్టర్‌ను కూటమి నాయకులు మంగళవారం జేసీబీతో దౌర్జన్యంగా కూల్చివేశారు. దీంతో బస్‌షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. కూటమి నాయకులు దౌర్జన్యంగా బస్‌షెల్టర్ కూల్చివేయడంపై ప్రజల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పొలమూరు గ్రామంలో తూర్పు పేటలో 20 ఏళ్ల క్రితం టీడీపీ హయాంలో జన్మభూమి గ్రామ సభల్లో నిర్ణయం మేరకు 30శాతం ప్రజావిరాళం (కాంట్రిబ్యూషన్)తో మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి తన తండ్రి గంగిరెడ్డి పేరుమీద ఈ నిర్మాణం చేపట్టారు. అప్పట్లో సూర్యనారాయణనరెడ్డి మూడు బస్షెల్టర్లు నిర్మాణాకి సుమారు రూ.లక్ష విరాళం ఇచ్చి వాటిని నిర్మించారు. అప్పటి నిబంధనల ప్రకారం ప్రజా విరాళం ఇచ్చినవారి పేర్లతో బస్‌షెల్టర్ నిర్మించుకోవచ్చు. అప్పటి టీడీపీ ఎమ్మెల్యే దివంగత నల్లమిల్లి మూలారెడ్డి హయాంలో నిర్మాణాలు చేపట్టారు. పొలమూరులో రెండు, చిన్న పొలమూరులో ఒకటి నిర్మించారు. ఈ బస్షెల్టర్లను ప్రయాణికులు వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పొలమూరు తూర్పు పేట వద్ద బస్‌షెల్టర్‌ను దౌర్జన్యంగా కూటమి నాయకులు కూల్చివేశారు. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి ఆయన తండ్రి పేరు మీద ఉన్న కట్టడాన్ని కూల్చివేయడమే లక్ష్యంగా పరిపాలన సాగుతోందా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. -
జిల్లాకు 57 లక్షల ఉపాధి పనిదినాలు
అమలాపురం రూరల్: ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాల్సిన పనులను గుర్తించి నివేదిక ఇవ్వాలని అధికారులను కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఉపాధి హామీ పనులపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు తమ శాఖల్లో ఉపాధి హామీ పనులు కింద చేయడానికి అవకాశం ఉన్న పనుల వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు ఉపాధి హామీ పథకం కింద 57 లక్షల పని దినాలను లక్ష్యంగా ఇచ్చారని, వాటిని చేరుకునేలా పనులను గుర్తించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. మెటీరియల్, లేబర్ కాంపోనెంట్ల కింద జిల్లాలో 266 రకాల పనులను చేపట్టవచ్చన్నారు. ఆగస్టు 23న రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో ప్రత్యేక సభలు నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో గ్రామ సభలకు కనీసం 30 శాతం మంది ప్రజలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఏపీవోలు, ఏపీడీలు ముందుగానే సమావేశమై ప్రస్తుతం జరుగుతున్న, జరగబోయే పనుల ప్రణాళిక రూపొందించుకుని గ్రామ సభలలో ఆమోదం తీసుకోవాలనన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, డీఆర్ఓ ఎం.వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ మధుసూదన్, జిల్లా ఉధ్యానశాఖ అధికారి బీవీ రమణ పాల్గొన్నారు. దేవాలయాల అభివృద్ధికి ప్రతిపాదనలు ప్రసాద్ పథకంలో దేవాలయాలను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం దేవదాయ ధర్మాదాయ శాఖపై సమీక్షించారు. జిల్లాలో దేవదాయశాఖ పరిధిలోని ఆలయాలు, వాటిలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు తదితర వాటిపై ఆరా తీశారు. జిల్లాలో సుమారు 216 ఎకరాల దేవాలయ భూములు ఆక్రమణకు గురయ్యాయని అధికారులు తెలపగా, తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పెద్ద మొత్తంలో ప్రసాదాలు తయారు చేస్తున్న దేవాలయాలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి నాణ్యతను పరీక్షించాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ ఎం.వెంకటేశ్వర్లు, ఆర్టీవో జి.కేశవవర్ధన్ రెడ్డి, జిల్లా దేవదాయ ధర్మాదాయశాఖ అధికారి ఎం.లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ మనోహర్, అంతర్వేది ఈవో సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. సీసీ కెమెరాలతో పర్యవేక్షణ జిల్లాలో ముఖ్యమైన ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోని రికార్డు రూమ్‌లను సీసీ టీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షించే దిశగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. ఈ విషయంపై మంగళవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులు, ఎస్ఎన్ఆర్ ఈ–డేటా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లోని (తహసీల్దార్ ) రికార్డు రూమ్‌లు, సంక్షేమ హాస్టళ్లు, ఇసుక రీచ్‌లు, ఇసుక నిల్వ కేంద్రాలు, ఇతర ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం ద్వారా పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమన్వయంతో లక్ష్యాన్ని చేరుకోవాలి అధికారులతో కలెక్టర్ మహేష్ కుమార్ -
రొయ్య రయ్..
సాక్షి అమలాపురం: వెనామీ సాగుకు పూర్వ వైభవం వచ్చింది. రొయ్యల ధరలకు రెక్కలు వచ్చాయి. గడిచిన నెల రోజుల్లో కౌంట్‌కు కేజీకి రూ.50 నుంచి రూ.60 వరకు పెరిగాయి. సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటు సాగు చేసిన చోట వాతావరణ మార్పుల వల్ల తెగుళ్లు సోకి పంట దెబ్బతినడంతో అంచనాలకు మించి ధరలు పెరిగాయని రైతులు చెబుతున్నారు. వెనామీ సాగు అధికం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో వెనామీ సాగు అధికంగా ఉంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాతో పాటు కాకినాడ జిల్లాలో సుమారు 25 వేల ఎకరాల వరకూ ఉంటుందని అంచనా. గడిచిన నెల రోజులుగా రొయ్యల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్లో కీలకమైన వంద కౌంట్ (కేజీకి 100 రొయ్యలు) ధర కొనుగోలుదారులు రూ.260గా నిర్ణయించారు. మార్కెట్లో పోటీ కారణంగా కేజీకి మరో రూ.10 పెంచి కొనుగోలు చేస్తున్నారు. అలాగే 90 కౌంట్ రూ.270 నుంచి రూ.280 వరకు, 80 కౌంట్ రూ.280 నుంచి రూ.290 వరకు, 70 కౌంట్ రూ.300 నుంచి రూ.310ల వరకు, 60 కౌంట్ రూ.320 నుంచి రూ.330 వరకు, 50 కౌంట్ రూ.340 నుంచి రూ.350 వరకు, 40 కౌంట్ రూ.375 నుంచి 385 వరకు, 30 కౌంట్ రూ.470 నుంచి రూ.480 వరకు ఉంది. రొయ్యల కొనుగోలుదారులు నిర్ణయించిన ధర కన్నా రూ.పది అదనంగా చేసి కొంటున్నారు. ఎగుమతుల జోరు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు రొయ్యల ఎగుమతి జోరుగా సాగుతుండడంతో వెనామీ ధరలు పెరిగాయి. కానీ డిమాండ్‌కు తగిన విధంగా రొయ్యలు అందుబాటులో లేవు. 100 కౌంట్ నుంచి 70 కౌంట్ మధ్యలో ఉన్న వెనామీ రొయ్యలు చైనాకు అధికంగా రవాణా జరుగుతుండగా, అంతకన్నా తక్కువ కౌంట్ అంటే 60 నుంచి 30 కౌంట్ మధ్య రొయ్యలు అమెరికాతో పాటు యూరప్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయని చెబుతున్నారు. తెగుళ్ల బెడద కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో గోదావరి నదీపాయలను ఆనకుని అనధికార ఆక్వా సాగు జరుగుతోంది. వరదలకు భయపడి ఇక్కడ జూలై నెలాఖరు నాటికి పట్టుబడులు వచ్చేలా చూసుకుంటారు. ఈ ఏడాది జూలై 20కి వరదలు రావడం వల్ల రైతులు నష్టాలను చవిచూశారు. దీని వల్ల కూడా సాగు తగ్గింది. ఇదే సమయంలో సాగు చేసిన చోట ఈ ఏడాది తెగుళ్ల తీవ్రత అధికంగా ఉంది. వెనామీ రొయ్యలకు వైట్ స్పాట్, వైట్ గట్ వంటి తెగుళ్లు, హెచ్‌పీ వల్ల రొయ్యల్లో ఎదుగుదల లోపం వంటి కారణాలతో దిగుబడి గణనీయంగా పడిపోయింది. ఎంతగా అంటే రెండు జిల్లాలకు కలిపి రోజుకు సగటున 400 మెట్రిక్ టన్నుల వరకు దిగుబడిగా వచ్చి కొనుగోలు కేంద్రాలకు వచ్చేది. కానీ ఇప్పుడు రోజుకు 150 టన్నులు కూడా మార్కెట్‌కు రావడం లేదు. ఈ కారణాల వల్లే వెనామీకి ధరలు పెంచడం మినహా మరో మార్గం కొనుగోలుదారులకు లేకుండా పోయింది. మార్కెట్‌ను గుప్పెట పెట్టుకుంటే అసలుకే మోసం వస్తోందనే కారణానికి తోడు, అనుకూల ప్రభుత్వానికి రైతులలో కొంత సానుకూలత రావాలనే ఉద్దేశంతో ధరలు పెంచారని రైతులు చెబుతుండడం విశేషం. ధరకు రెక్కలు ఐదేళ్ల తర్వాత పెరిగిన వైనం కౌంట్‌కు రూ.50 నుంచి 60 వరకూ అధికం వరదలు, తెగ్గుళ్లతో తగ్గిన సాగు ఉన్న వాటికి డిమాండ్ కౌంట్ రకం ధర (రూ.లలో) 30 470 40 375 50 340 60 320 70 300 80 280 90 270 100 260దెబ్బతీసిన తెగుళ్లు ఇటీవల రొయ్యల కొనుగోలుదారులు సిండుకేటుగా మారి ధరలు తగ్గించడం పరిపాటిగా మారింది. టీడీపీకి అనుకూలంగా ఉండే కొనుగోలుదారులు ధరలను తగ్గించడం ద్వారా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి చెడ్డ పేరును తీసుకురావడానికి యత్నించారు. ధరలు తగ్గిన ప్రతి సందర్భంలోనూ గత ప్రభుత్వం కలుగజేసుకుని కనీస మద్దతు ధరలు (ఎంఎస్సీ) ప్రకటించి రొయ్యలు కొనుగోలు చేయించింది. కరోనా తర్వాత నుంచి అంతర్జాతీయంగా ఎగుమతుల తగ్గుదల చోటు చేసుకుని ఆ ప్రభావం ధరలపై పడింది. 100 కౌంట్ ధర కేజీ రూ.210 నుంచి రూ.230 మధ్యలో ఉండేది. సిండికేటు కొనుగోలుదారులకు భయపడి కొందరు రైతులు సాగుకు దూరమయ్యారు. మరికొందరు పూర్తిస్థాయిలో రొయ్యలను పెంచలేదు. హైటెక్ పద్ధతిలో సాగు చేసే రైతులు ఎకరాకు గరిష్టంగా లక్ష వరకు రొయ్య పిల్లలను సాగు చేస్తుంటారు. అటువంటి వారు కూడా ఎకరాకు 70 వేల రొయ్యలకు మించి సాగు చేయలేదు. సాగు విస్తీర్ణం తగ్గడమే కారణం సాగు విస్తీర్ణం తగ్గడం వల్లే రొయ్యలకు ధర పెరిగింది. ఇప్పుడిప్పుడే సాగు మొదలు పెట్టినా డిసెంబర్, జనవరి వరకు దిగుబడి వచ్చే అవకాశం లేదు. అప్పటి వరకు మార్కెట్లో వెనామీ రొయ్యలకు ధర అధికంగానే ఉంటుంది. – బి.రాంబాబు, ఆక్వా రైతు, అమలాపురం -
మళ్లీ మొగటికే..
ఫ మూసుకుపోయిన కూనవరం మొగ ఫ తెరిచిన వారం రోజుల్లోనే ఇలా ఫ వర్షాలు పడితే మరోసారి ముంపు ఫ శాశ్వత పరిష్కారం కోరుతున్న రైతులు సాక్షి, అమలాపురం/ ఉప్పలగుప్తం: కూనవరం మొగ తెరిపించేందుకు అసలైన సమయంలో అనుమతులు ఇవ్వకుండా ఉన్నతాధికారులు చేసిన జాప్యంతో అవసరం లేని సమయంలో మొగ తెరవాల్సి వచ్చింది. ఇప్పుడు అది పూడుకుపోవడం చూసి ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోసారి భారీ వర్షాలు పడితే చేలు ముంపు బారిన పడి ఈ సారి నష్టం మరింత పెరిగే అవకాశముంది. దీంతో డ్రైన్స్ అధికారులు స్పందించి డ్రెజ్జర్‌ను రప్పించారు. దీనిద్వారా తవ్వకాలు చేయాలని నిర్ణయించారు. ఈ పనులతో కూడా పెద్దగా ప్రయోజనం ఉండదని, సాగు పూర్తయ్యే వరకూ తరచూ డ్రెజ్జింగ్ చేయాల్సిందేని రైతులు చెబుతున్నారు. అందరూ చెబుతున్నా.. ఈ డ్రెయిన్‌కు శాశ్వత పరిష్కారం చూపాలని గతంలో నిపుణుల కమిటీ పలు సూచనలు చేసింది. ముంబయికి చెందిన ఓష్ణోగ్రఫీ సంస్థ సర్వే చేపట్టింది. సముద్రంలోకి గ్రోయిన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు చేసింది. అంతమాత్రాన ఇది విజయవంతం అవుతోందని చెప్పలేమని ఆ సంస్థ తేల్చి చెప్పింది. కానీ కొంతమంది విశ్రాంత సాగునీటి పారుదల శాఖ అధికారులు మాత్రం కూనవరం, రామేశ్వరం మొగలను ఆనుకుని ఉన్న పర్రభూముల (సాంప్)లో ఆక్రమణలు తొలగించాలని సూచిస్తున్నారు. దీనివల్ల కొంత వరకూ ముంపు నీటికి పరిష్కారం దొరుకుతుందంటున్నారు. సుమారు ఆరు వేల ఎకరాల విస్తీర్ణంలో సహజ సిద్ధంగా ఏర్పడిన పర్ర భూములను ఆక్రమించి కొందరు ఆక్వా సాగు చేస్తున్నారు. దీనివల్ల అవి కుచించుకుపోయాయి. లేకుంటే ఈ పర్ర భూముల్లోకి ముంపునీరు చేరి నదుల ద్వారా సముద్రంలో కలిసేది. అలాగే పర్ర భూముల నుంచి సముద్రంలోకి నీరు దిగేలా పలుచోట్ల గండ్లు కొట్టాలని, అప్పుడు వేగంగా ముంపునీరు సముద్రంలో దిగుతుందని వారు తేల్చారు. ఈ కార్యాచరణ రూపొందించడంలో అధికారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కూనవరం డ్రెయిన్ నుంచి మొగ వరకూ సుమారు కిలో మీటరు పొడవునా డ్రెజ్జింగ్ చేస్తున్నారే తప్ప అటు చిర్రయానం పర్రభూమి నుంచి ముంపునీరు సముద్రంలోకి దిగే విధంగా, ఇటు ఎస్.యానాం పర్ర భూముల నుంచి సముద్రంలోకి నీరు దిగేలా గండ్లు పెడితే చాలా వరకూ సమస్య తీరుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ దిశగా పదేళ్లుగా కార్యాచరణ చేపట్టకపోవడం ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. సాగు వదిలేస్తున్నారు.. మధ్య డెల్టా (కోనసీమ)లో కీలకమైన కూనవరం మైజర్ డ్రెయిన్ దశాబ్దాల కాలంగా ఆయకట్టు రైతులకు కడగండ్లను మిగులుస్తోంది. ఉప్పలగుప్తం, అమలాపురం, కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాల్లో ఒకప్పుడు 35 వేల ఎకరాల ఆయకట్టుకు చెందిన ముంపునీరు ఈ డ్రెయిన్ ద్వారా సముద్రంలో కలిసేది. సహజ సిద్ధంగా తెరుచుకోవడం, మూసుకుపోవడం ఈ మొగ లక్షణం. దీనికి శాశ్వత పరిష్కారం చూపాల్సి ఉండగా ఏటా తాత్కాలికంగా మొగ తవ్వకాలు చేసి వదిలేస్తున్నారు. గతంలో ఈ సమస్య ఉన్నా పదేళ్లుగా మాత్రం ఆయకట్టు రైతులకు పెనుముప్పుగా మారింది. దీని ద్వారా ముంపునీరు దిగక ఈ ప్రాంతంలో సుమారు 4 వేల ఎకరాల్లో వరి చేలు ఆక్వా చెరువులుగా మారిపోయాయి. మరో రెండు వేల ఎకరాల్లో రైతులు సాగు వదిలేశారు. ఇక మిగిలింది 29 వేల ఎకరాలు. ఇంతటి ఆయకట్టుకు చెందిన ముంపునీరు దిగేందుకు వీలుగా మొగకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు. ప్రక్షాళన చెయ్యాల్సిందే.. కోనసీమలో డ్రైనేజీ వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేయాలి. ఆక్రమణలు తొలగించి డ్రెయిన్లలో పూడిక తొలగించాలి. రెవెన్యూ, మైనర్, మీడియం, మేజర్ డ్రెయిన్లను ఒకేసారి ఆధునీకరించాలి. అలాగే డ్రెయిన్ల నీరు కలిసే నదులపై ఉన్న అవుట్‌ఫాల్ స్లూయిజ్‌లను నిర్మించడంతో పాటు మొగలకు శాశ్వత పరిష్కారం చూపాలి. ఇందుకు రూ.500 కోట్లు అవుతోందని చేయలేమని అధికారులు చెబుతున్నారు. కానీ ఇక్కడ ఏడాదిలో పండే పంట విలువ రూ.2,800 కోట్లు అనే విషయాన్ని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. కూలీలకు 1.65 కోట్ల పనిదినాలు దొరుకుతుందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తు పెట్టుకుని డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. –అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, కోనసీమ రైతు పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి, గోపవరం, ఉప్పలగుప్తం మండలం -
రాఖీ కట్టి.. రక్షణ కోరి..
పిఠాపురం: రాఖీ పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయుని జన్మస్థలమైన పిఠాపురంలోని ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు. తెల్లవారుజాము నుంచి వేలాది మంది భక్తుల తరలిరావడంతో దత్తాత్రేయుని ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఏటా రాఖీ పౌర్ణమికి దేశ విదేశాల నుంచి భక్తులు ఇక్కడకు వచ్చి దత్తాత్రేయునికి రాఖీలు కడతారు. ఈ ఏడాది సుమారు 20 వేల మంది మహారాష్ట్ర భక్తులు తరలివచ్చి స్వామివారికి రాఖీలు కట్టి పూజలు చేశారు. పిఠాపురంలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన పాదగయ కుక్కుటేశ్వరస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
ఎస్పీ కార్యాలయానికి 18 అర్జీలు
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 18 అర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు వచ్చి తమ సమస్యలపై ఫిర్యాదు చేశారు. వచ్చిన అర్జీల్లో కొన్నింటిని ఎస్పీ అక్కడికక్కడే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. మిగిలిన ఫిర్యాదులపై ఆయా పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్సైలతో మాట్లాడి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు. ఫిర్యాదుదారులు కొందరు తమ కుటుంబ సమేతంగా వచ్చి కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలపై ఎస్పీకి ఏకరవు పెట్టారు. ఎస్పీ కార్యాలయ ప్రజా సమస్యల పరిష్కార వేదిక పర్యవేక్షణ ఎస్సై డి.శశాంక పాల్గొన్నారు. జగన్ కోసం నిలబడే వారు లక్షల్లో.. అమలాపురం టౌన్: మేము గేట్లు తెరిస్తే జగన్ మాత్రమే నిలుస్తారన్న రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ సీపీ జిల్లా ఐటీ విభాగం అధ్యక్షుడు తోరం గౌతమ్ రాజా ఖండించారు. ఈ మేరకు అమలాపురంలో గౌతమ్ రాజా సోమవారం ప్రకటన విడుదల చేశారు. సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారిపోయే ప్రతి ఒక్కరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మామూలేనని ఆయన మంత్రి విమర్శలను కొట్టి పారేశారు. మాజీ ముఖ్యమంత్రి జగనన్న వెంట నిలబడే నాయకులు, కార్యకర్తలు లక్షల్లో ఉన్నారని గుర్తు చేశారు. ఈవీఎంల గోల్‌మాల్‌తో నెగ్గిన మీకు మా అధినేత జగన్‌ను విమర్శించే అర్హత లేదని పేర్కొన్నారు. తోబుట్టువుల బంధాన్ని తెలిపేలా రాఖీ అమలాపురం టౌన్: తోబుట్టువుల బంధాన్ని తెలుపేలా జిల్లాలో రక్షాబంధన్ వేడుకలను జరుపుకొన్నారు. చెల్లి అన్నకు, అక్క తమ్ముడికి రాఖీ కట్టి పండగ విశిష్టతను చాటారు. రాఖీ పౌర్ణమిని అమలాపురంలోని ఓం శాంతి కేంద్రం ఇన్చార్జి బ్రహ్మకుమారి శ్రీదేవి ఆధ్వర్యంలో బ్రహ్మకుమారీలు ఘనంగా జరుపుకొన్నారు. అమలాపురంలోని రెండో అదనపు జిల్లా కోర్టు జడ్జి వి.నరేష్ వద్దకు బ్రహ్మకుమారీలు వెళ్లి రాఖీ కట్టారు. అలాగే జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, ఎంపీ గంటి హరీష్మాధుర్ల వద్దకు కూడా వెళ్లి రాఖీలు కట్టారు. బ్రహ్మకుమారీలు వారి నుదుట తిలకం దిద్ది స్వీట్లు తినిపించి ఆత్మీయతను చాటారు. ఓం శాంతి కేంద్రం ఇన్చార్జి బ్రహ్మకుమారి శ్రీదేవితోపాటు బ్రహ్మకుమారి స్వరూప తదితరులు పాల్గొన్నారు. పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం అమలాపురం రూరల్: జిల్లా పరిధిలోని వన్ స్టాప్ సెంటర్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేసేందుకు వివిధ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారిత అధికారి ఝన్సీరాణి తెలిపారు. ఈ పోస్టులను కలెక్టర్ మహేష్‌కు మార్ అధ్యక్షతన భర్తీ చేస్తారన్నారు. 25–42 ఏళ్ల మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా లీగల్ పర్సన్, లాయర్, పారా మెడికల్ పర్సన్, సోషల్ కౌన్సెలర్, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఆఫీస్ అసిస్టెంట్, బహుళ ప్రయోజన సిబ్బంది, కుక్, సెక్యూరిటీ గార్డ్ తదితర పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. కోనసీమ ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ నుంచి దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుని ఈ నెల 30వ తేదీలోగా ముమ్మిడివరంలో ఎయిమ్స్ కళాశాలలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ సాధికారిత అధికారి కార్యాలయంలో అందించాలన్నారు. కనక దుర్గమ్మకు లక్ష గాజుల పూజ తాళ్లపూడి: స్థానిక నవదుర్గాది పరివార సహిత కననదుర్గమ్మ ఆలయంలో శ్రావణ పూర్ణిమ సందర్భంగా సోమవారం లక్ష గాజులతో పూజా మహోత్సవం నిర్వహించారు. అమ్మవారికి గాజులు అలంకరించి కుంకుమార్చనలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు అల్లూరి శివప్రసాద్ ఆధ్వర్యంలో మహిళలు కుంకుమార్చన, లక్ష గాజుల పూజలో పాల్గొన్నారు. అమ్మవారికి గాజులు అలంకరించారు. -
నిర్దిష్ట వ్యవధిలో సమస్యలు పరిష్కరించండి
జాయింట్ కలెక్టర్ నిషాంతి అమలాపురం రూరల్: మారుమూల గ్రామాల నుంచి ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి వచ్చే అర్జీదారుల సమస్యలపై సానుకూలంగా స్పందించి, నిర్దిష్ట కాల వ్యవధిలో పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి అధికారులకు సూచించారు. సోమవారం అమలాపురంలోని కలెక్టరేట్ గోదావరి భవన్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జేసీతో పాటు డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ పీడీ ఎం.ఝాన్సీరాణి, డీఆర్డీఏ పీడీ డాక్టర్ వి.శివశంకర్ ప్రసాద్‌లు ప్రజల నుంచి 126 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిషాంతి మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. ఒకవేళ పరిష్కారానికి ఆస్కారం లేని ఫిర్యాదులు వస్తే అందుకు గల కారణాలను సంబంధిత ఫిర్యాదుదారులకు తెలపాలన్నారు. ఫిర్యాదులు నమోదు విభాగాన్ని ఆమె స్వయంగా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. దివ్యాంగుల వద్దకు జాయింట్ కలెక్టర్ వెళ్లి అర్జీలు స్వీకరించారు. జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారి కార్తీక్‌రెడ్డి, సీపీఓ వెంకటేశ్వర్లు, ట్రాన్స్‌కో ఈఈ మోకా రవికుమార్, జిల్లా మత్స్యశాఖ అధికారి ఎన్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సేంద్రీయ ఉత్పత్తులతో ఆరోగ్యం సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా ఆరోగ్యకర జీవనాన్ని గడపవచ్చని జాయింట్ కలెక్టర్ నిషాంతి తెలిపారు. కలెక్టరేట్ ప్రాంగణంలో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనను ఆమె ప్రారంభించి, పలు ఉత్పత్తులను కొనుగోలు చేశారు. సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులకు నేటి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. ఈ స్టాల్లో కూరగాయలు, ఆకుకూరలు, పప్పు దినుసులు, దేశవాళీ రకాలైన నల్ల బియ్యం తదితర రకాలు ఉన్నాయని ఆమె తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి వి.బోసుబాబు, డీపీఎం కె.శ్రీనివాస్, అడిషనల్ డీపీఎం సత్యనారాయణ, ఆదర్శ రైతు అప్పారి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2024
ఇది మే 17న తీసిన చిత్రం. కూనవరం మేజర్ డ్రెయిన్ మొగ ద్వారా సముద్రంలో కలిసే (స్ట్రైట్‌కట్) ప్రాంతం. ఇలా ఇసుక మేటలు వేసింది. ఏటా డ్రెయిన్‌లో నీరు లేని సమయంలో మేటలు వేయడం సహజమే అయినా ఈసారి ఏకంగా ఐదు నుంచి ఆరు అడుగుల ఎత్తున ఇసుక మేట వేసింది. దీనివల్ల ఖరీఫ్ సాగుకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోందని, వరి చేలు మంపుబారిన పడతాయని అప్పుడే శ్రీసాక్షిశ్రీ హెచ్చరించింది. కొత్త ప్రభుత్వం ఏర్పడినా దీని వంక కన్నెత్తి చూడకపోవడంతో అనుకున్నంత పని అయ్యింది. గత నెలలో కురిసిన భారీ వర్షాలతో జరగాల్సిన నష్టం జరిగింది. ఇది ఆగస్టు 14న మొగ తెరిచిన నాటి సమయంలో ముంపునీరు డ్రెయిన్ ద్వారా సముద్రంలో కలుస్తున్న దృశ్యం. కూనవరం మొగ మూసుకుపోవడంతో వరి చేలు నీట మునగడంపై శ్రీసాక్షిశ్రీలో వచ్చిన కథనాలకు తోడు ఆయకట్టు రైతులు పలు దఫాలుగా జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. కొంతమంది ఆక్వా రైతుల మాటలు నమ్మి మొగ తెరవకపోతే సాగు వదిలేస్తామని హెచ్చరించడంతో ఎట్టకేలకు స్పందించి మొగ తవ్వకాలు చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇది ఆగస్టు 19న కూనవరం మొగ వద్ద పరిస్థితి. సముద్ర కెరటాలకు మొగ మూసుకుపోయింది. వారం పది రోజులుగా సరైన వర్షాలు లేకపోవడంతో డ్రెయిన్‌లో నీరు పెద్దగా లేదు. డ్రెయిన్ నుంచి బలమైన ఒత్తిడితో నీరు సముద్రంలోకి దిగకపోవడం, కెరటాలతో మేటలు వేసేశాయి. ఇప్పుడు మూడు, నాలుగు అడుగుల ఎత్తున మేటలు వేయడంతో అధికారులు కంగుతిన్నారు. డ్రెయిన్ ఆనుకుని ఉన్న సాంప్ (పర్ర భూములు)ల్లోకి నీరు వెళ్లకుండా అడ్డుకట్టు వేసి డ్రెయిన్ ద్వారా సముద్రంలోకి నీరు బలమైన ఒత్తిడితో దిగేలా చేసినా ఫలితం ఇవ్వలేదు. దీనితో మొగ మరోసారి పూడుకుపోయింది. -
క్రీడాకారులను తయారు చేసుకోవాలి
ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అమలాపురం టౌన్: క్రీడాకారులు అప్పటికప్పడు పుట్టరని, ప్రతిభ గల క్రీడాకారులను మనం తయారు చేసుకుంటేనే వారు అంచలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయికి ఎదుగుతారని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. పాఠశాలల స్థాయిలోనే విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని నింపి క్రీడాంశాలవారీగా వారి ఆసక్తిని బట్టి నిష్ణాతులైన క్రీడాకారులుగా తీర్చిదిద్దినప్పుడే క్షేత్రస్థాయి నుంచి క్రీడా వ్యవస్థ బలపడుతుందని ఆయన అభిప్రాయ పడ్డారు. ఈ మేరకు ఆయన ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో క్రీడా స్ఫూర్తి అంశంపై వివరించారు. ఇప్పడు రాష్ట్ర ప్రభుత్వం జాతీయ స్థాయి క్రీడలను నిర్వహించాలన్న ఆలోచనను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేసి పాఠశాలల విద్యార్థుల్లో వారి వారి అభిరుచులను బట్టి క్రీడా స్ఫూర్తి నింపి సత్ఫలితాలు సాధించారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వంలో కూడా ఆ తరహా ప్రయత్నం సాగాలని ఆకాంక్షించారు. స్పోర్ట్ పాలసీలు తయారు చేసినప్పుడు క్రీడలపై అవగాహన లేని ఐఏఎస్ అధికారులు సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకోకూడదని సూచించారు. స్పోర్ట్స్ పాలసీ రూప కల్పనలో విశ్రాంత స్పోర్ట్స్ ఉన్నతాధికారులు, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారుల ఆలోచనలు, సూచనలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. వేణుగోపాలస్వామికి వెండి ఆభరణాల సమర్పణ మామిడికుదురు: మండలంలోని మొగలికుదురు గ్రామంలో కొలువుదీరిన శ్రీరుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామికి గ్రామానికి చెందిన దండు భీమరాజు, విజయలక్ష్మి దంపతులు రూ.1.5 లక్షల విలువైన వెండి ఆభరణాలను ఆదివారం సమర్పించారు. శ్రావణమాసం సందర్భంగా భీమరాజు దంపతులు స్వామి వారికి వెండి కవచం, శంఖు చక్రాలు తదితర ఆభరణాలను అందజేశారు. అర్చక్షులు సంప్రోక్షణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వెండి ఆభరణాలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. నేడు యథావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక అమలాపురం రూరల్: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సోమవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్లోని గోదావరి భవన్లో ఉదయం 10 గంటల నుంచి యథావిధిగా నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి తగు పరిష్కార మార్గాలు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లోవలో భక్తుల సందడి తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో సందడి నెలకొంది. ఆదివారం వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన భక్తులు ఎనిమిది వేల మంది అమ్మవారిని దర్శించుకున్నట్టు కార్యనిర్వహణ అధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,19,975, పూజా టికెట్లకు రూ.65,930, కేశఖండనశాలకు రూ.15,040, వాహన పూజలకు రూ.6,200, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.74,392, విరాళాల ద్వారా రూ.85,353, మొత్తం రూ.3,76,890 ఆదాయం సమకూరినట్టు ఈఓ వివరించారు. సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి రూ.1,00,001 అన్నవరం: సత్యదేవుని నిత్యాన్నదాన పఽథకానికి రాయుడు శ్రీనివాసరావు (కాకినాడ) రూ.1,00,001 విరాళాన్ని ఆది వారం సమర్పించారు. దాతకు అన్నదానం రశీదు, బాండ్‌ను అధికారులు అందజేశారు. -
సత్యదేవుని ఆలయానికి భక్తుల తాకిడి
● స్వామిని దర్శించిన 40 వేల మంది ● దేవస్థానం ఆదాయం రూ.40 లక్షలు అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆదివారం వేలాదిగా వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. సత్యదేవుని సన్నిధిన శనివారం రాత్రి పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. వివాహాలు చేసుకున్న నవ దంపతులు, ఇతర ప్రాంతాలలో వివాహాలు చేసుకున్నవారు పెద్ద సంఖ్యలో సత్యదేవుని ఆలయానికి తరలి వచ్చారు. వారంతా సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఇతర భక్తులు కూడా తోడవడంతో ఆలయంతో బాటు ఆలయ ప్రాంగణం, వ్రతాలాచరించే భక్తులతో వ్రత మంటపాలు, స్వామివారి దర్శనం అనంతరం సేద తీరే భక్తులతో విశ్రాంతి మంటపాలు కిక్కిరిసిపోయాయి. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించగా స్వామివారి వ్రతాలు మూడు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. స్వామివారి నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మంది భక్తులకు భోజన సౌకర్యం కల్పించారు. కన్నుల పండువగా రథోత్సవం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతేదేవి అమ్మవారి రథోత్సవం ఆది వారం కన్నుల పండువగా జరిగింది. ఉదయం పది గంటలకు రధాన్ని తూర్పు రాజగోపురం ముందుకు తీసుకువచ్చారు. అనంతరం ఆ రధంపై సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను ప్రతిష్టించారు. ఆలయ ప్రధాన అర్చకుడు కోట సుబ్రహ్మణ్యం స్వామి, అమ్మవార్లకు పూజలు చేశారు. అనంతరం దేవస్థానం ఏఈఓ కృష్ణారావు కొబ్బరికాయ కొట్టి రధోత్సవం ప్రారంభించారు. తరువాత ఆలయ ప్రాకారంలో రధానికి నాలుగు దిక్కుల కొబ్బరి కాయలు కొట్టి రధోత్సవాన్ని నిర్వహించారు. రూ.2,500 టిక్కెట్ తో ఇద్దరు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదపండితులు, అర్చకులు, వ్రతపురోహితులు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్యదేవుని రథోత్సవం -
తెలుగు భాషను పరిరక్షించుకుందాం
● శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రతాప్ ● వైభవంగా 138వ జాతీయ శతాధిక కవి సమ్మేళనం అమలాపురం రూరల్: తెలుగు భాష పరిరక్షణకు తెలుగువారు కృషి చేయాలని అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కత్తిమండ ప్రతాప్ అన్నారు. కవులు సామాజిక చైతన్యంతో కవిత్వం రాయాలని ఆయన అన్నారు. ఆయన ఆధ్వర్యంలో అమలాపురం అంబేద్కర్ కమ్యూనిటీ భవనంలో ఆదివారం వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషా సంబరాలు నిర్వహించారు. ప్రాచీన, ఆధునిక కవుల వేషధారణలతో సాగిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. సెప్టెంబర్ 29వ తేదీన అనకాపల్లిలో తెలుగు భాషోత్సవాలు, శతాధిక కవుల కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు ప్రతాప్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు హాజరై కళావేదిక సాహితీ సేవను ప్రశంసించారు. తెలుగు తేజం, గోదావరి సోషల్ అండ్ కల్చర్ అసోసియేషన్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ సంయుక్తంగా సాహితీ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన ప్రముఖ కవయిత్రి కొల్లి రమావతి రాజమహేంద్రవరం నన్నయ విద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ తరపట్ల సత్యనారాయణ, తెలుగు అధ్యాపకులు ప్రముఖ సాహితీవేత్త మాకే బాలార్జున సత్యనారాయణ, ప్రముఖ రచయిత్రి చిట్టె లలిత, ప్రముఖ రచయిత్రి ఈశ్వరి భూషణం విశ్రాంత విద్యాధికారి గిరిజన సంక్షేమం కేఆర్.పురం ఏలూరుకు చెందిన డాక్టర్ టి.పార్థసారధి, కాకినాడ పీఆర్ కళాశాల సంస్కృత శాఖా అధ్యక్షురాలు డాక్టర్ వై. బుజ్జిలకు జ్ఞాపిక, ప్రశంసాపత్రం, రూ.10వేలు నగదు పురస్కారాన్ని అందజేశారు. కళావేదిక జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి, జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం, జాతీయ మహిళా అధ్యక్షురాలు చిట్టె లలిత జిల్లా కమిటీల ఏర్పాటులోనూ సాహితీ యజ్ఞంలో నిరంతరం కృషి చేస్తున్నారని ప్రతాప్ ప్రశంసించారు. ఈ సందర్భంగా పలువురు సాహితీవేత్తలను సత్కరించారు. కార్యక్రమంలో కళావేదిక జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ టి.పార్థసారధి, పోలిశెట్టి అనంతలక్ష్మి దేవి, అరిగెల బలరాం మూర్తి , గుర్రం రామకృష్ణారావు పాల్గొని కవి సమ్మేళనం నిర్వహించారు. రాష్ట్రం నుంచి 150 మంది కవులు తమ కవితల ద్వారా తెలుగు భాషా వైభవాన్ని చాటి చెప్పారు. -
నిన్నటి క్లిక్.. రేపటి కిక్కు
అభిరుచే వృత్తిగా మారింది మొదట్లో ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఫొటోగ్రఫీపై ఉన్న అభిరుచి క్రమంగాా పెరగడంతో దాన్నే వృత్తిగా మలుచుకున్నా. వృత్తిపరంగా, అభిరుచి పరంగా ఫొటోగ్రఫీనే ఆశగా, శ్వాసగా జీవిస్తున్నా. నా ప్రయాణంలో ప్రతి దృశ్యాన్ని కెమెరాలో బంధించేందుకు ప్రయత్నిస్తాను. ప్రకృతి చిత్రాలు, ఆరుదుగా కనిపించే లొకేషన్లు, ప్రత్యేకతను సంత రించుకున్న చిత్రాలను కెమెరాలో బంధిస్తుంటాను. – చిట్టూరి దుర్గాప్రసాద్, ఫొటోగ్రాఫర్, వెదురుపాక, రాయవరం మండలం పోటీ విపరీతంగా పెరిగింది ఫొటోగ్రఫీలో సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగింది. టెక్నాలజీకి అనుగుణంగా ఫొటోగ్రాఫర్లు కూడా అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. అప్డేట్ కాని ఫొటోగ్రాఫర్లు పోటీలో వెనుకబడి పోతున్నారు. ఫొటోగ్రఫీని కూడా ఒక వృత్తిగా భావించి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందించాలి. అప్పుడే ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు అభివృద్ధి చెందడానికి అవకాశముంటుంది. – పోసిన వీరేంద్రకుమార్, రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ ఫొటోఅండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, రాజమహేంద్రవరం నైపుణ్యానికి కొదవులేదు సాంకేతికత ఎంత పెరిగినా నైపుణ్యానికి ఉన్న ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు. ఆసక్తి ఉండాలే కానీ ప్రకృతిపై కన్నేస్తే కమనీయమైన దృశ్యాలను చిత్రీకరించే వీలుంది. సృజనాత్మకత, ఓపిక, సమయం కేటాయిస్తే మంచి ఫోటోగ్రాఫర్‌గా రాణించొచ్చు. ఈ వృత్తిలో సంపద ఎలా ఉన్నా సంతృప్తి పుష్కలంగా ఉంటుంది. – చిక్కం శ్రీనివాస్, పద్మాలయ స్డూడియో, అంగర ● ప్రతి ఫొటో.. ఓ జ్ఞాపకం ● చరిత్రను సజీవంగా నిలిపే ఫొటోగ్రఫీ ● ఫొటోలు, సెల్ఫీలకు పెరుగుతున్న ప్రాధాన్యం ● నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం రాయవరం/కపిలేశ్వరపురం: భావావేశాలకు గురిచేసే ఎన్నో సంఘటనలు.. ఆ ఘటనల దృశ్యాలు..వాటి జ్ఞాపకాలను మనసు తన కాన్వాస్‌పై ముద్రించుకుంటుంది. ఆ అనుభూతులను ఆస్వాదించడమో.. లేదా అనుభవించడమో పూర్తి కాకముందే మరో సంఘటన.. దృశ్యంగా.. జ్ఞాపకంగా.. ఇలా జీవిత పర్యంతం ఎన్నో ఘటనల దృశ్యాలు మదిలో నిక్షిప్తమై కాలగతిలో కలసిపోతుంటాయి. వాటిలో కొన్ని ఘటనల దృశ్యాలు మాత్రం ఎప్పటికీ మదిని ముద్దాడేవో.. మెలిపెట్టేవో.. గిలిగింతలు పెట్టేవో కచ్చితంగా ఉంటాయి. వాటిని కళ్లముందు నిలిపే అద్భుతం ‘చిత్రం’ మాత్రమే. అనుకునో.. కావాలనో.. ఆదమరచినపుడో ఎవరో కెమేరాతో క్లిక్ మనిపించిన ఆ చిత్రం నిజంగా మాయావే. ఎన్నేళ్లు గతించిపోయినా ఏ మూలనుంచో.. ఏ ఆల్బం నుంచో బయటపడినపుడు గత కాలపు మధురోహల్లోకి తీసుకుపోయి మురిపించేస్తుంది. కన్నీరు పెట్టిస్తుంది. అవి ఆనంద బాష్పాలు కావచ్చు.. నిబ్బరం కోల్పోయి ఒలికిన కన్నీరు కావచ్చు. కాలాన్ని సైతం జయించిన ఆ ‘చిత్రం’.. ఎంతో అపురూపం. మనసుతో తీస్తేనే ఫొటోగ్రాఫ్.. సాంకేతికంగా వృద్ధి చెందిన తరువాత వచ్చిన ఆవిష్కరణల్లో కెమేరా ఒక అద్భుతం. ఆ కెమేరా లెన్స్ ముందున్న దృశ్యాన్ని క్లిక్ మనిపిస్తే అది కేవలం ఫొటో అవుతుంది కానీ ఫొటోగ్రఫీ కాదు. ముందున్న దృశ్యాన్ని క్లిక్‌మనిపించే వ్యక్తి కన్ను భావగర్భితమైనదైనపుడే.. అటువంటి వ్యక్తి క్లిక్‌చేసి ఆవిష్కరించే చిత్రాన్నే ఆహా.. ఏం ఫొటోగ్రాఫ్ అనగలం. అలాంటి కెమెరా పితామహుడు డాగురేకు పేటెంట్ లభించిన రోజు ఆగస్టు 19న ఏటా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఫొటో విశ్వ వ్యాపితం.. అందుకే మిత్రులు, కుటుంబ సభ్యుల సమాగమం.. శుభాశుభ కార్యాలు.. సభలు, సమావేశాలు.. అది ఏదైనా నేడు ఫొటోలు తీయించడం సాధారణమైన విషయం. రేపటికి అదో జ్ఞాపకమే కాదు.. రిఫరెన్స్ కూడా. ఇక సాధారణ ప్రజా జీవనంలోకి వస్తే ప్రతి ఇంటా ఎన్నో బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు.. రెండు లేదా మూడు దశాబ్దాల నాటి ఫొటోలు ఎన్నో ఉంటాయి. అవి చూచినపుడల్లా ఆ రోజుల్లోకి వెళ్లిపోయి నాటి డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ చూసుకుని ఎన్ని కామెంట్లు పాసైపోతాయో.. అన్నీ మనసును ఆ రోజుల్లోకి తీసుకెళ్లి గిలిగింతలు పెడతాయి. గమ్మత్తైన చప్పుడు ‘క్లిక్’ క్లిక్.. గమ్మత్తైన మెత్తని చప్పుడు. క్షణాల్లో సుందర దృశ్యం. చూపుడువేలి కొనతో బటన్ నొక్కితే ఎదుటి దృశ్యం చిన్ని చిప్‌లో బంధీ అవుతుంది. కొంతమందికి ఎన్ని సార్లు, ఎన్ని వేల ఫొటోలు తీయించుకున్నా కొత్తదనమే. గుండె కింద మెత్తని మధుర జ్ఞాపకాలను నిక్షిప్తం చేసి అవసరమైనప్పుడు వీక్షించగలిగే అపురూపమైన అవకాశాన్ని మనకు ఫొటోగ్రఫీ అందిస్తుంది. ఇటీవల కాలంలో సెల్ఫోన్ల రాకతో కెమెరాల ప్రాభవం కాస్త తగ్గినా విలక్షణమైన ఫొటోలకు మాత్రం స్టూడియోలు, కెమెరాలను ఆశ్రయించక తప్పదు. రోలికార్డ్, రైస్ ల్యాండర్, రోలీ ఫ్లెక్స్, నికాన్, కేనన్ వంటి ఎన్నో కంపెనీల కెమెరాలు వివిధ మోడళ్లలో అందుబాటులోకి వచ్చాయి. వేల నుంచి లక్షల విలువ చేసే కెమెరాలు ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఫొటోగ్రఫీ అనేది గ్రాఫోన్ అనే పదం నుంచి పుట్టింది. గ్రాఫోన్ అంటే రాయడం, చిత్రించడం అని అర్ధం. మొదటిసారిగా 1826లో ఫ్రెంచి శాస్త్రవేత్త జోసఫ్ నైసిఫర్ నిస్సీ కనిపెట్టిన మొదటి కెమెరాతో ప్రారంభమైన ఫొటోగ్రఫీ నేడు డిజిటల్ ఫొటోస్ స్థాయికి అభివృద్ధి చెందింది. తీసే ఫొటోను బట్టి దాని ప్రాముఖ్యాన్ని బట్టి నేడు వివిధ లెన్సులు అందుబాటులోకి వచ్చాయి. సెల్ఫోన్లో బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు అందుబాటులోకి జనబాహుళ్యానికి ఫొటోగ్రఫీ మరింత దగ్గరైంది. తాజాగా డ్రోణ్ ఫొటోగ్రఫీతో విహంగ వీక్షణం చేస్తూ తీసే ఫొటోలకు ఎంతో డిమాండ్ ఉంది. వినూత్న రీతిలో.. నేచురల్, వైల్డ్ లైఫ్, ఫైన్ ఆర్ట్స్, నైట్ స్కేప్, వెడ్డింగ్ ఫొటోగ్రఫీ, యాష్రో ఫొటోగ్రఫీ, స్ట్రీట్ ఫొటోగ్రఫీ, సీటీస్కేప్స్, ల్యాండ్ స్కేప్స్, నైట్స్కేప్స్ ఇలా ఎన్నో రకాలుగా ఫొటోగ్రాఫర్లు తమ ప్రతిభ చాటుకుంటున్నారు. ఎమోషన్లు, ఫీలింగ్స్, సేడ్నెస్, థింకింగ్, కేరింగ్ ఇలా అన్ని రకాల ఎమోషన్లను ఒక్క క్లిక్‌తో చూపిస్తుంటారు. అంతే కాకుండా సమాజంలో జరుగుతున్న ఆకృత్యాలను కళ్లకు కట్టినట్టు చూపించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే ఫోటోలు తీయడంలోను కొందరకు తమ ప్రతిభ చూపుతున్నారు. తరాలుగా ఇదే పని.. కాకినాడలో చెక్కా బసవరాజు 1885లో ఓ హాబీగా ఫొటోగ్రఫీని ప్రారంభించి చెక్కా బసవరాజు అండ్ సన్స్ ఏర్పాటు చేశారు. నాలుగు తరాలుగా తన కుటుంబం ఆ ప్రతిష్టను నిలబెట్టుకుంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఫొటోగ్రఫీ అసోసియేషన్లలో నాలుగు వేల మంది వరకు ఫొటోగ్రాఫర్లు ఉన్నారు. ఫొటోగ్రాఫర్లలో మిక్సింగ్ ఎడిటర్లు, ఫొటగ్రఫీ ఎడిటర్లు, ఫొటో ల్యాబ్ ఆపరేటర్లు ఇలా.. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు ఏడు వేల మంది ఈ వృత్తిపై ఆధారపడి ఉన్నారు. కాకినాడ జిల్లాలో 15 మండలాలకు చెందిన సుమారు 2వేల మంది ఫోటోగ్రాఫర్లు 4 జోన్లు, 8 సంఘాలుగా ఉన్నారు. కుటుంబం అంతా కలసికట్టుగా.. కపిలేశ్వరపురం మండలంలోని అంగర గ్రామానికి చెందిన పద్మాలయా ఫోటో స్టూడియోను 1986 ఆగస్టు 16న ప్రారంభించారు. వారి కుటుంబం ఫో టో గ్రాఫర్ల జీవన విధానాన్ని స్పష్టం చేస్తుంది. గ్రా మానికి చెందిన సోదరులు చిక్కం నరసింహారావు, శ్రీనివాస్, కాశీ విశ్వనాథం 38 ఏళ్లుగా స్టూడియో నిర్వహిస్తున్నారు. ఆహ్లాదకరమైన ప్రకృతి అందాల ను కెమేరాతో ఒడిసి పట్టడం శ్రీనివాస్‌కు అలవాటు. -
నిబంధనలు తొలగించాలి
ఎమ్మెల్సీ ఐవీ డిమాండ్ అమలాపురం టౌన్: రాష్ట్రంలో సర్వ శిక్ష విభాగంలో పనిచేస్తున్న ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ల (ఐఈఆర్పీ) జీతాల చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన అక్రమ నిబంధనలను తక్షణమే రద్దు చేయాలని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు (ఐవీ) డిమాండ్ చేశారు. అమలాపురంలోని యూ టీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఉన్న ఎమ్మెల్సీ ఐవీని ఐఈఆర్పీలు ఆదివారం కలిసి తమ సమస్యలను వివిరిస్తూ ఓ వినతి పత్రం అందించారు. దీనిపై స్పందించిన ఐవీ మాట్లాడుతూ ఐఈఆర్పీలు జీతాల చెల్లింపులపై ఆంక్షలు విధించడం అన్యాయ మని అన్నారు. వారు రెగ్యులైజేషన్ అడగకూడదని, కోర్టులకు వెళ్లడానికి వీలులేదని, ఎలాంటి కార ణం లేకుండా విధుల నుంచి తొలగించే అధికారం యాజమాన్యనికి ఉంటుందన్న నిబంధనలు వర్తింపచేయడం సరికాదని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. బాండు పేపరుపై సంతకం పెడితేనే జీతం చెల్లిస్తామన్న నిబంధన మరీ దారుణమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అసంబద్ధ, అక్రమ నిబంధనలను తొలగించాలని డిమాండ్ చేశారు. రాత పూర్వకమైన ఉత్తర్వులు లేకుండా ఈ నిబంధనలు అమలు చేయడమేమిటని ఎమ్మెల్సీ ప్రశ్నించారు. ఈ నిబంధనల వల్ల 1350 మంది ఐఈఆర్పీలు ఇబ్బంది పడుతున్నారని, ఉన్నతాధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్తానని ఆయన తెలిపారు. -
అయినవిల్లికి పోటెత్తిన భక్తులు
అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. స్వామిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస, రుద్రాభిషేకాలు, వివిధ ప్రత్యేక పూజలు జరిపారు. స్వామి మహానివేదన అనంతరం వివిధ పుష్పాలతో అర్చకస్వాములు సర్వాంగ సందరంగా అలంకరించారు. స్వామివారి లఘున్యాస, ఏకదశ రుద్రాభిషేకాల్లో 34 మంది, లక్ష్మీగణపతి హోమంలో 12 మంది దంపతులు పాల్గొన్నారు. 20 మంది తమ నూతన వాహన పూజలు నిర్వహించారు. 24 చిన్నారులకు తులాభారం నిర్వహించారు. స్వామివారి అన్నదాన పథకంలో 1384 మంది అన్నప్రసాదం స్వీకరించారు. స్వామివారికి వివిధ పూజలు, అన్నదాన విరాళాలుగా రూ.2,07,312 ఆదాయం లభించిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం ఆలయంలో అమలు చేస్తున్న నిత్యాన్నదాన పథకానికి ముమ్మిడివరం వాస్తవ్యులు ముళ్లపూడి శ్రీగణేష్ కుటుంబ సభ్యులు ఆదివారం రూ.లక్ష విరాళం అందజేశారు. ఈ సొమ్మును ఆలయ అర్చకుడు సత్తిబాబుకు అందజేశారు. దాతను వేదపండితులు వేదమంత్రాలతో సత్కరించి స్వామి చిత్రపటం ప్రసాదం అందజేశారు. -
సంస్కృతంతో విడదీయరాని బంధం
సంస్కృతంతో తెలుగుకు విడదీయరాని సంబంధం ఉంది. తెలుగులో 40 శాతం పదాలు సంస్కృతం నుంచే వచ్చాయని భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం. తెలుగు, సంస్కృతం రెండు ఒకే భాషా కుటుంబానికి చెందకపోయినా ఒకటితో ఒకటి కలిసి మనగలగడం ఆశ్చర్యం. – డాక్టర్ పీవీబీ సంజీవరావు, తెలుగు శాఖధిపతి, ఎస్‌కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్టాంప్ విడుదల సంస్కృతం భారతీయ భాషలలో అంతర్లీనంగా ఉంటుంది. కొన్ని పదాలు అటూఇటూ రూపాంతరం చెందాయి. రూపాంతర భాషాకుటుంబాలకి ప్రాకృతభాషలని పేరు. సంస్కృతంపై ఉజుపిస్ దేశం స్టాంప్ విడుదల చేయడం ఆనందంగా ఉంది. నేడు నన్నయ యూనివర్శిటీ, కలెక్టరేట్లో ఈ స్టాంప్‌ని విడుదల చేయనున్నారు. – శ్రీనివాస చీమలమర్రి, అంబాసిడర్ ఫర్ జైన్ లిటరేచర్, రిపబ్లిక్ ఆఫ్ ఉజుపిస్ -
గాయత్రి మాతగా వనదుర్గమ్మ
అన్నవరం: రత్నగిరి దుర్గామాత శ్రీ వనదుర్గ అమ్మవారి శ్రావణమాస జాతర మహోత్సవాలలో భాగంగా నాలుగో రోజు ఆదివారం వనదుర్గ అమ్మవారిని గాయత్రి మాతగా అలంకరించి పండితులు పూజించారు. ఉదయం ఎనిమిది నుంచి 11 గంటల వరకు రుత్విక్కులు నవగ్రహ జపాలు, శ్రీచక్రార్చన, పురుష, శ్రీ సూక్త పారాయణ, మూలమంత్ర జపాలు, సూర్యనమస్కారాలు, సప్తశతీ పారాయణలు, మూలమంత్ర జపాలు, బాల, కన్య, సువాసినీ పూజలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు లక్ష కుంకుమార్చన, చండీహోమం నిర్వహించారు. కుంకుమార్చన అనంతరం సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, ప్రసాదాలు నివేదించి భక్తులకు పంపిణీ చేశారు. వేద పండితులు గొల్లపల్లి ఘనాపాఠి. యనమండ్ర శర్మ, ఉపాధ్యాయుల రమేష్, ముష్టి పురుషోత్తం, కల్యాణబ్రహ్మ ఛామర్తి కన్నబాబు, ప్రథమశ్రేణి వ్రత పురోహితులు నాగాభట్ల రవిశర్మ, పాలంకి పట్టాభి, అంగర సతీష్, ఆలయ అర్చకులు కోట వంశీ, పరిచారకులు పవన్ ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. నేడు అమ్మవారికి చండీహోమం శ్రావణ పౌర్ణిమ సందర్భంగా సోమవారం జరిగే చండీహోమం పూర్ణాహుతి కార్యక్రమంతో వనదుర్గ అమ్మ వారి జాతర మహోత్సవాలు ముగియనున్నాయి. ఉద యం తొమ్మిది గంటలకు చండీహోమం ప్రారంభమ వుతుంది. 11 గంటలకు జరిగే పూర్ణాహుతి కార్యక్ర మంలో రుత్విక్కులు హోమద్రవ్యాలను సమర్పిస్తారు. అనంతరం అమ్మవారికి వేదపండితుల ఆశీస్సులు, ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. -
అమెరికాలో ఇంటర్న్‌షిప్‌నకు అమలాపురం కుర్రాడు
అమలాపురం టౌన్: పట్టణానికి చెందిన పిల్లాడి మధుకృష్ణ చంద్రబాబు సినీ నటుడు సోనూసూద్ అందించిన సాయంతో చదువుకుని ప్రయోజకుడై అమెరికాలో ఇన్టర్న్షిప్కు ఎంపికయ్యాడు. స్థానిక చిరు వ్యాపారి కుమారుడైన అతడు సోనూ అందించిన రూ.10 లక్షల సాయంతో పంజాబ్‌లోని లూధియానాలోని సిటీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీలో డిగ్రీ చేస్తూ ఈ ఘనత సాధించాడు. జే–వన్ వీసాపై ఆ యువకుడిని హాస్పటాలిటీ స్టూడెంట్ – ఎక్ఛేంజ్ విజిటర్‌గా 12 నెలల పాటు అమెరికా వెళ్లనున్నాడు. కరోనా కాలంలో రవాణా స్తంభించినపడు స్థానిక ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు, సామాజిక కార్యకర్త బాబీ గాబ్రియేల్ సాయంతో తన చదువు కోసం లూధియానా వర్సిటీకి వెళ్లినట్టు గుర్తుచేసుకున్నాడు. ఈ సందర్భంగా వారు చంద్రబాబును అభినందించారు. -
వంద కిలోల గంజాయి పట్టివేత
● ఇద్దరు నిందితుల అరెస్టు ● డీఎస్పీ శ్రీనివాసులు రాజానగరం: జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న వంద కిలోల గంజాయిని స్థానిక పోలీసులు ఆదివారం పట్టుకుని, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ గంజాయి విలువ సుమారు రూ.5 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఉత్తర మండల డీఎస్పీ కె.శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు రాజానగరంలోని మాధవీ ఫంక్షన్ హాలు వద్ద జాతీయ రహదారిపై వాహానాలను తనిఖీ చేస్తుండగా విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న టిఎన్ 88 బి 5961 నంబరు గల లారీలో తరలిస్తున్న వంద కిలోల గంజాయి పట్టుబడింది. తమిళనాడులోని సేలం జిల్లా వజపడి మండలం, వెప్పిలైపట్టిపుదుర్‌కు చెందిన లారీ డ్రైవర్ కమ్ ఓనర్ అయిన మరిముత్తు ఆర్ముగమ్ (45), పెరంబలూరు జిల్లా, సిరుమతూర్ మండలం, కుదిక్కడుకు చెందిన వేల్ మురుగన్ (27) పశ్చిమ బెంగాల్ కిరాయికి వెళ్లి తిరిగి వస్తూ విశాఖపట్నం సమీపంలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి ఈ గంజాయిని తక్కువ రేటుకు కొనుగోలు చేశారు. అక్కడ నుంచి ఆ గంజాయిని ఐదు సంచులలో నింపి తీసుకువెళ్లి, చిల్లర వ్యాపారం చేస్తున్నారన్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, గంజాయిని, లారీని, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ కేసులో చురుగ్గా పనిచేసిన సీఐ, ఎస్సైలను ఎస్పీ నరసింహ కిశోర్ అభినందించినట్టు డీఎస్పీ తెలిపారు. ఏడాదిలో ఏడు కేసులు.. స్థానిక పోలీసు స్టేషను పరిధిలో ఈ ఏడాదిలో గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి ఇంతవరకు ఏడు కేసులు నమోదయ్యాయని ఉత్తర మండల డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. వీటిలో సుమారు రూ.25 లక్షలు విలువ చేసే 506.35 కిలోల గంజాయితో పాటు రవాణాకు ఉపయోగించిన రెండు లారీలు, ఒక వ్యాన్, ఒక మోటారు సైకిలును స్వాధీనం చేసుకుని, 22 మందిని అరెస్టు చేశామన్నారు. సమావేశంలో సీఐ ఎస్పీ వీరయ్యగౌడ్, ఎస్సై మనోహార్ పాల్గొన్నారు. -
విశ్వజన మోహితం సంస్కృతం
కంప్యూటర్‌కు వాడుకోగలిగే భాషల్లో మొదటి స్థానం సంస్కృతానిదే. ఆ భాష అతి గొప్ప లక్షణం ఎన్ని వేల లక్షల కొత్త పదాలనైనా తయారు చేయవచ్చు. వాటికి వ్యత్పత్తి కలిగి ఉండడం మరో ప్రత్యేకత. అందుకనే లిథునియా, రష్యా, స్లొవేకియా మొదలైన యూరోపియన్ దేశాల వారు వారి మూలాలను సంస్కృతంలో వెతుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రెండు రకాల స్టాంపులను ఉజుపిస్ విడుదల చేస్తోంది. వాటి ధర ఇండియన్ కరెన్సీలో రూ.ఒక్కొటి రూ.120 ఉంటుంది. ● ప్రపంచంలో 877 భాషలపై ఎంతో ప్రభావం ● భారత సంస్కృతి, సంస్కృతం ప్రతిష్టమైనవి ● నేడు విశ్వ సంస్కృత భాషా దినోత్సవం ● సంస్కత భాషపై అభిమానంతో నేడు ఉజుపిస్ దేశం స్టాంప్ విడుదల సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం): భాషలకు సంస్కృతం తల్లివంటిది అని తొలి తెలుగు వ్యాకరణకర్త, ఆంధ్రభాషాభూషణము రచయత మూలఘటిక కేతన అన్నట్లుగా ప్రపంచం అంతా ఇప్పుడు సంస్కృతం గురించి గొప్పగా చెప్పుకుంటోంది. కాని భారతదేశంలో పుట్టిన సంస్కృతం ఒక్క వర్గం వారికి తప్ప మరే ఇతర వర్గాల వారు అభ్యసించకపోవడంతో ఆ భాష నేడు కనుమరుగవుతోంది. పాశ్చాత్య దేశాల వారు ఈ భాష ఔన్నత్యాన్ని గుర్తించి నేర్చుకోవడం హర్షణీయం. నిజానికి సంస్కృతం అంటే భాష కాదు. కృతము అంటే చెయటము లేదా చేసినదని, సంస్కరిపబడిన పని, భాష అని అర్థము. జనని ఎల్ల భాషలకు సంస్కృతంబు అనడానికి కారణమిదే. ప్రపంచంలో అతి పురాతన భాషల్లో సంస్కృతం ఒకటి. మన దేశ అధికారిక భాషగా గుర్తించబడి గౌరవించబడుతోంది. సంస్కృతాన్ని దేవ భాష, అమరవాణి, గీర్వాణిగా పిలుస్తారు. సంస్కృతం దేశ భాషలపైనే కాదు, ప్రపంచంలోని 877 భాషలపై తన ప్రభావాన్ని కలిగి ఉందని పరిశోధనలు తేల్చారంటే ఆ భాష ప్రభావం అర్థం చేసుకోవచ్చు. సంస్కృతం ఔన్నత్యాన్ని నిలబెట్టేలా ఏటా శ్రావణ పౌర్ణమి రోజున విశ్వ సంస్కృత భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సంస్కృత భాష గొప్పదనం సంస్కృతాన్ని ఉన్నతమైనదిగా గుర్తించారు కాబట్టే ఈ భాషలోని గ్రంథాలను వివిధ భాషల్లోకి పాశ్చాత్య పండితులు అనువదించుకున్నారు. అలాగే ఆధునిక విజ్ఞాన విషయాలకు సంస్కృత సాహిత్యం భాండాగారం. ఇవే మన ప్రస్తుత సంస్కృతికి నిలువుటద్దాలై మనల్ని ముందుకు నడిపిస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. పంచతంత్రం, హితోపదేశం, ఇతిహాసాలు రామాయణ, భారతం, భర్తృహరి సుభాషితాలు ప్రపంచ సాహిత్యానికి అద్భుతమైన ఎన్సైక్లోపీడియాలు. సంస్కృతంపై ఉజుపిస్ దేశం స్టాంప్ విడుదల.. మన సంస్కృతానికి మనం గౌరవం ఇవ్వకపోయినా పాశ్చాత్య దేశాల వారు ఎంతో గౌరవం ఇస్తున్నారు. ఏకంగా రిపబ్లిక్ ఆఫ్ ఉజుపిస్ దేశం వారు ప్రపంచ సంస్కృత దినోత్సవం సందర్భంగా లిధునియా రాజధాని ఇండియన్ ఎంబసీలో సోమవారం గౌరవ సూచకంగా కమోరెటివ్ స్టాంపును విడుదల చేస్తోంది. అసలు యూరోపియన్ దేశమైన ఉజుపిస్ సంస్కృత పై ఇంత గౌరవాన్ని ఉంచి స్టాంపును ఎందుకు విడుదల చేస్తోందన్న అనుమానం రావటం సహజం. ఉజుపిస్ అధికారిక భాష లిధునియా. ఈ భాష సంస్కృతానికి చాల దగ్గరగా ఉంటుంది. పేరుకే యూరోపియన్ భాష లిథునియా కాని అనుసరించేది పూర్తిగా సంస్కృతమే. అతిపురాతమైన విల్నియస్ యూనివర్సిటీలో ఏషియన్ ట్రాన్సిడెంటల్ స్టడీస్ కేంద్రంలో సంస్కృత శాఖ ఉంది. ఈ కేంద్రంలో పనిచేసే ఆచార్య వితస్ బిధునస్ 2016లో సంస్కృత లిథునియామాల అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఇందులో సంస్కతానికి లిథునియాకి వున్న సంబంధం గురించి వివరించారు. -
రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతి
సామర్లకోట: స్థానిక రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో సుమారు 60 ఏళ్ల వయసున్న వ్యక్తి మృత దేహాన్ని గుర్తించారు. రైల్వే పోలీసు కథనం ప్రకారం పిఠాపుం–సామర్లకోట కేఎం నెంబరు 630/–34–40 పోస్టుల మధ్య ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. రైల్వే ఏఎస్ఎం జీకేఎస్ శ్రీదేవి ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించినట్టు తెలిపారు. మృతదేహం వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. తలకు ఎడమ వైపు గాయం ఉన్నదని, మృతుడు చామనచాయ రంగులో ఉండి కుడి చాతిపై పుట్టుమచ్చ, బొడ్డు దిగువ భాగంలో మరో పుట్టు మచ్చ ఉండి, తెలుపు షర్టు నీలం గళ్ల లింగి ధరించి ఉన్నాడని చెప్పారు. రైల్వే ఎస్సై బి.లోవరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పెద్దాపురం ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు. రత్నగిరిపై మరొకరు..అన్నవరం: రత్నగిరిపై తూర్పు రాజగోపురం దిగువన గల ఘాట్‌రోడ్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అతని వయసు 55 ఏళ్లు ఉంటాయని, తెల్ల చొక్కా, కాషాయం రంగు లుంగీ ధరించి ఉన్నాడని తెలిపారు. అతని మృతదేహాన్ని ప్రత్తిపాడు ఆసుపత్రి మార్చురీకి తరలించామని తెలిపారు.