
జగన్ పేరుపైనా రాజకీయ కక్ష సాధింపేనా?
రాష్ట్ర మాల మహానాడు ప్రధాన కార్యదర్శి బాబ్జీ
అమలాపురం టౌన్: విజయవాడ నడి బొడ్డులో అంబేద్కర్ సామాజిక న్యాయ మహా శిల్పం బోర్డుపై పచ్చ మూకలు చీకటి దాడి చేయడంతో పాటు ఆ భారీ విగ్రహాన్ని నెలకొల్పిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరు ఉన్న అక్షరాలను కూడా ధ్వంసం చేయడం ఆటవిక చర్యేనని అమలాపురానికి చెందిన రాష్ట్ర మాల మహానాడు ప్రధాన కార్యదర్శి ఉండ్రు బాబ్జీ ధ్వజమెత్తారు. మహా శిల్పం బోర్డుపై స్టీల్ మెటల్‌తో ఉన్న జగన్ అక్షరాలను కూడా ధ్వంసం చేశారంటే ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపేనని ఆరోపించారు. అమలాపురంలో ఆయన విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాతగా, దేశానికి ప్రజాస్వామ్య విలువలను అందించిన మహానీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ఎన్నికల వరకూ రాజకీయాలు తప్ప, ఆ తరువాత ప్రజా రంజక పాలనపై దృష్టిపెట్టాలని ఆయన అన్నారు. ఈ దాడి పరోక్షంగా అంబేడ్కర్‌ను అవమాన పరచడమేనని అన్నారు. ఘటన సమయంలో సరిగా స్పందించని పోలీసులు ఇప్పటికై నా దోషులను కఠినంగా శిక్షించాలని బాబ్జీ డిమాండ్ చేశారు.