
దిగొచ్చిన సర్కారు..
అనేక ప్రయోజనాలు
● వరి రైతులు, కౌలు రైతులంతా ఈ–క్రాప్‌లో నమోదు చేసుకుంటే అనేక లాభాలు ఉంటాయి.
● ఈ నమోదు ఆధారంగా ఆ సర్వే నంబరు భూమి వివరాలు సమగ్రంగా ఉంటాయి.
● వరి రైతులకు అవసరమైన సూచనలు, సలహాలను ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అందిస్తుంది.
● రాయితీపై విత్తనాలు, ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ రాయితీలను సమయాన్ని బట్టి ఇస్తారు.
● వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ,
ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు
దెబ్బతింటే పెట్టుబడి రాయితీ
పొందే వీలుంటుంది.
● ఈకేవైసీ ఆధారంగా వరి సాగు చేపట్టని అనర్హులను తొలగించి అర్హులకు ప్రయోజనం చేకూరుస్తారు.
ఆచితూచి అడుగు వేయకుంటే ఇలానే ఉంటోంది.. సరైన ప్రణాళిక లేకుంటే అందరి నుంచీ చీదరింపు ఎదుర్కోవాల్సి వస్తుంది. అచ్చం అలానే కూటమి ప్రభుత్వ తీరు ఉంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ తీసుకొచ్చిన ఈ–క్రాప్ విధానాన్ని వెనక్కి నెట్టేయాలని జాప్యం చేసిన బాబు ప్రభుత్వం చివరికి దిగొచ్చింది.. గత విధానాన్నే అమలు చేసేందుకు చర్యలు తీసుకుంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం...
ఆలమూరు: ఈ–క్రాప్ అనే చిన్న పదం రైతుల జీవితాల్లో వెలుగులు నింపింది. వ్యవసాయ రంగంలో సరికొత్త ఒరవడిని తీసుకొచ్చింది. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. వరి సాగుపై ధీమా కల్పించింది. సాగు పేరిట దోపిడీకి అడ్డుకట్ట వేసింది. ఇటువంటి బృహత్తర విధానాన్ని ప్రవేశపెట్టిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వేనోళ్ల కీర్తించింది. శుష్క వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ విధానాన్ని నిర్వీర్యం చేయాలని భావించింది. ఈ విధానాన్ని జాప్యం చేస్తూ కుట్రలకు తెరలేపింది. ఈ–క్రాప్ విశిష్టతను గుర్తించిన రైతాంగం ముందు కూటమి నేతల పన్నాగం ఫలించలేదు. రైతుల హెచ్చరికలు, నిరసనలతో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. రైతుల ఆగ్రహాన్ని గ్రహించిన వ్యవసాయ శాఖ ఆలస్యంగానైనా ఈ–క్రాప్ అమలు చేయాలని నిర్ణయించింది. ఆగస్టు నెలాఖరు లోగా పూర్తవ్వాల్సిన ఈ విధానాన్ని తాత్సారం చేయడంతో సెప్టెంబర్ నెలాఖరు వరకూ వెళ్లింది.
గతంలో అండగా నిలిచి..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల సౌలభ్యం కోసం వ్యవసాయ శాఖ నిపుణుల సూచనల మేరకు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకు వచ్చారు. ఆరుగాలం శ్రమించి రైతు పండించిన ప్రతి గింజకూ గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ విధానం సరికొత్త ఒరవడిని సృష్టించింది. అప్పటి ప్రభుత్వం 2019 రబీ సీజన్‌లో ప్రారంభించి ఐదేళ్లు పాటు సమర్థవంతంగా అమలు చేసింది. రైతులకు అన్నివిధాలా సహాయం అందిస్తూ నిర్ణీత వ్యవధిలోపు పంటను కొనుగోలు చేసి ధాన్యం సొమ్ము బ్యాంక్ ఖాతాల్లో పడేలా చేసి అండగా నిలిచింది.
కూటమి ప్రభుత్వం కుట్ర
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ పథకాలు అమలు చేయకూడదని కుట్రలకు తెరలేపింది. రైతులకు అత్యంత మేలు కలిగించే ఈ–క్రాప్ నమోదును తాము కూడా అమలు చేస్తే గత ప్రభుత్వానికే ప్రాధాన్యం దక్కుతుందనే అభిప్రాయంతో ఇప్పటి వరకూ జాప్యం చేసింది. ఇది అమలు చేసేది లేదంటూ తమ అనుకూల ప్రచార మాధ్యమాల ద్వారా పరోక్షంగా లీకులిచ్చి అటకెక్కించాలని నిర్ణయించింది. ఈ దురాలోచనలను గమనించిన రైతులు వ్యవసాయ శాఖపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ–క్రాప్ విధానం అమలు చేయకుంటే ఉద్యమించేందుకు సిద్ధమంటూ ప్రకటించారు. అవసరమైతే పంట విరామానికి సైతం వెనుకాడేది లేదని హెచ్చరించారు. రైతుల్లో రోజు రోజుకూ పెరుగుతున్న ఆగ్రహానికి భయాందోళన చెందిన ప్రభుత్వం చివరికి అమలుకు ఆదేశాలు ఇచ్చింది.
వచ్చే నెల 15 వరకూ..
రాష్ట్ర ప్రభుత్వం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాదిరిగానే ఈ–క్రాప్ విధానం అమలుకు షెడ్యూల్ ప్రకటించటంతో రైతులకు ఊరట దక్కింది. ఈ నెల తొలి వారంతో ప్రారంభమైన ఈ విధానం వచ్చే నెల సెప్టెంబర్ 15 వరకూ కొనసాగుతుంది.
జిల్లాలోని 22 మండలాల్లో 2.21 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, అందులో 1.63 లక్షల ఎకరాల్లో సుమారు 96 వేల మంది రైతులు వరి సాగు చేపట్టారు. ఈ– క్రాప్ నమోదులో గ్రామసభల ద్వారా అభ్యంతరాల స్వీకరణ వచ్చే నెల 19–24 మధ్యలో ఉంటుంది. అర్హుల తుది జాబితా వచ్చే నెల 30న విడుదల చేస్తారు. ఇది నమోదు చేయించుకుంటే లభించే ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ సిబ్బంది వివరిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకతతో పాటు రైతు సేవా కేంద్రాల్లో సంబంధిత రైతు సాగు చేసిన వివరాలు అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. అయితే ఈ–క్రాప్ ప్రారంభించిన నాటి నుంచి సర్వర్లు మొరాయించడంతో నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. జిల్లా పరిధిలోని ఒక్కో గ్రామంలో రోజుకు సుమారు 50 ఎకరాల వరకూ నమోదు చేయాల్సి ఉండగా, కేవలం పది ఎకరాల్లోపు మాత్రమే జరుగుతోంది.
రైతుల ఒత్తిడితో తగ్గిన
కూటమి ప్రభుత్వం
ఈ–క్రాప్ అమలు చేసేందుకు
అనుకూలం
గత ప్రభుత్వ విధానానికే ఓటు
ఆలస్యంగానైనా నమోదుకు
షెడ్యూల్ ఖరారు
నమోదుపై అవగాహన పెరిగింది
రైతు భరోసా కేంద్రాల్లో ఐదేళ్ల నుంచి ఈ–క్రాప్ నమోదు చేసుకుంటున్నాం. గతంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సత్వరమే పరిహారం అందించేందుకు ఇది దోహదపడింది. ఆర్‌బీకేల్లో అధికారుల సహాయ సహకారంతో సాగుకు ఢోకా లేకుండా ఉండేది.
– బొబ్బా వెంకన్న, రైతు, పెదపళ్ల
రైతులకు అండగా..
ఈ–క్రాప్ నమోదు ద్వారా వరి సాగు చేసే తమలాంటి కౌలు రైతులకు వ్యవసాయంపై భరోసా ఏర్పడింది. సాగు చేసిన పంట ఆధారంగా పండించిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. గత ఐదేళ్లలో ఈ–క్రాప్ రైతులకు అండగా నిలిచింది.
– ఇల్లూరి పట్టాభి, కౌలురైతు, పినపళ్ల
ఈ–క్రాప్‌తో మేలు
పంట ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధర, రాయితీలను అందించేందుకు ప్రవేశపెట్టిన ఈ–క్రాప్‌తో అనేక ప్రయోజనాలు ఉ న్నాయి. వరి సాగు చేసే రైతులంతా సకాలంలో ఈ– క్రాప్ నమోదు చేయించుకోవాలి. ప్రభుత్వం నుంచి లభించే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి. రైతుల అభ్యర్థన మేరకు నమోదు గడువును పెంచాం.
– ఓలేటి బోసుబాబు, జిల్లా వ్యవసాయాధికారి, అమలాపురం

దిగొచ్చిన సర్కారు..

దిగొచ్చిన సర్కారు..

దిగొచ్చిన సర్కారు..

దిగొచ్చిన సర్కారు..