కల్యాణ వైభోగమే..
అన్నవరం: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంతో అత్యంత అపూర్వ ఘట్టం. ఆ కార్యక్రమం తమ ఇష్టదైవం సన్నిధిలో జరగాలని చాలామంది కోరుకుంటారు. అన్నవరంలోని వీర వెంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానం వివాహాలకు పెట్టింది పేరు. ఇక్కడ ఏటా వేల సంఖ్యలోవివాహాలు జరుగుతాయి. మంచి ముహూర్తాల సమయంలో ఈ సంఖ్య భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం శ్రావణ మాసం కావడంతో రత్నగిరిపై వివాహాల సందడి మొదలైంది.
నూతన దంపతులతో కళకళ
నూతన దంపతులతో సత్యదేవుని ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. వివిధ ప్రాంతాల నుంచి కూడా నూతన వధూవరులు స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు. వీరందరూ వ్రతాలను ఆచరించి, స్వామివారిని దర్శించుకుని తమ జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. సత్యదేవుని సన్నిధిలో ఏటా ఐదు వేల జంటలు వేదమంత్రాల సాక్షిగా ఒక్కటవుతున్నాయి. వీరితో బాటు ఎక్కడెక్కడో వివాహాలు చేసుకున్న మరో పది వేల జంటలు సత్యదేవుని సన్నిధికి విచ్చేస్తున్నాయి.
పెళ్ల్లిళ్ల సీజన్
శ్రావణ మాసం ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకూ సత్యదేవుని సన్నిధిలో ఐదు వందలకు పైగా వివాహాలు జరిగాయి. ఆగస్టు ఐదు నుంచి శ్రావణ మాసం ప్రారంభం కాగా ఏడో తేదీ నుంచి వివాహాలు మొదలయ్యాయి. ఈ నెల 15వ తేదీ ఒక్కరోజే వందకు పైగా జరిగాయి. మిగిలిన రోజుల్లో పది నుంచి ఇరవై వరకూ జరుగుతున్నాయి. 18, 19వ తేదీలలో దాదాపు 50 జంటలు ఒక్కటయ్యాయి.
నేటి నుంచి భారీ సంఖ్యలో..
రత్నగిరిపై బుధవారం నుంచి ఈ నెల 23వ తేదీ వరకూ భారీ సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. ఈ మూడు రోజులూ రత్నగిరిపై సత్రం గదులలో దాదాపు 70 శాతం, అన్ని వివాహ మండపాలను పెళ్లి బృందాలు రిజర్వ్ చేసుకున్నాయి. ఇదే ముహూర్తానికి పెళ్లిళ్లు పెట్టుకున్న మిగిలిన వారందరూ మంటపాలు లభ్యం కాక తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.
సర్దుబాటు చేయ‘లేఖ’
రత్నగిరిపై వివాహాల నేపథ్యంలో సత్రం గదులు, అతిథి గృహాల కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. కొండపై ఉన్న 600 వసతి గదులలో దాదాపు 70 శాతం రిజర్వ్ అయిపోయాయి. వాటికి సంబంధించి చార్టులు కూడా సిద్ధమయ్యాయి. మిగిలిన గదుల కోసం విపరీతమైన పోటీ ఏర్పడింది. కొండకు వచ్చే భక్తులు, పెళ్లి బృందాలు గదుల కోసం ప్రముఖ రాజకీయ నాయకులు, వీఐపీల సిఫారసు లేఖలను తీసుకువస్తున్నారు. ఈ వ్యవహారం దేవస్థానం అధికారులకు తలనొప్పిగా మారింది. గదులను సర్దుబాటు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రత్నగిరిపై జోరుగా వివాహాలు
నేటి నుంచి మూడు రోజుల పాటు
భారీ ముహూర్తాలు
సత్రం గదులు 70 శాతం రిజర్వ్
శ్రావణంలో ఇప్పటికే 500 పెళ్లిళ్లు
Comments
Please login to add a commentAdd a comment