
అలరించిన బాలోత్సవం
కొత్తపేట: విద్యార్థులకు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో నైపుణ్యం పెంపొందించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తర్ఫీదు ఇవ్వాలని కొత్తపేట ఆర్డీఓ జీవీవీ సత్యనారాయణ అన్నారు. కొత్తపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో కోనసీమ బాలోత్సవం మొదటి పిల్లల పండుగ పేరిట రెండు రోజుల పాటు జరిగే కార్యక్రమాలను శనివారం ప్రారంభించారు. మనం ట్రస్ట్, జితేంద్ర సేవా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సత్యనారాయణ, శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు నిర్దేశించేది పాఠశాలలేనని అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అనే నానుడితో కోనసీమ బాలోత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు. చిన్నప్పటి నుంచే విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటల్లో ఆసక్తి కలిగించాలని, తద్వారా వారిలో నైపుణ్యాన్ని వెలికితీయాలని సూచించారు. అనంతరం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విచిత్ర వేషధారణ, కోలాటాలు, నాట్య ప్రదర్శనలు, లఘు నాటికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జితేంద్ర సేవా ఫౌండేషన్ చైర్మన్ మట్టపర్తి జితేంద్రకుమార్, కోనసీమ బాలోత్సవ అధ్యక్షుడు కాశీ విశ్వనాథం, మనం ట్రస్ట్ ఇన్‌చార్జి యండూరి పవన్, మనం ట్రస్ట్ చైర్మన్ కె.వీరబాబులను అభినందించారు. సర్పంచ్ బూసి జయలక్ష్మి, ప్రముఖ అంతర్జాతీయ శిల్పి డి.రాజ్‌కుమార్ వుడయార్, మందపల్లి మాజీ సర్పంచ్ చింతం విజయకృష్ణ మోహన్, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి మట్టపర్తి సూర్యచంద్రరావు, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.