
చురుగ్గా సత్యగిరికి మెట్ల నిర్మాణం
రూ.10.50 లక్షలతో చేపట్టిన దేవస్థానం
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సత్యగిరి పై గల హరిహరసదన్, శివసదన్ సత్రాలలో బస చేసే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు దేవస్థానం అధికారులు మెట్లదారి నిర్మాణం చేపట్టారు. సత్యగిరి దిగువన గల విద్యుత్ సబ్‌స్టేషన్ పక్క నుంచి సత్యగిరి ఘాట్‌రోడ్డు మూడో మలుపు వరకు రూ.10.50 లక్షల వ్యయంతో చేపట్టిన మెట్ల దారి నిర్మాణం ముగింపు దశకు చేరుకుంది. సత్యగిరిపై వంద గదుల హరిహరసదన్ సత్రం, 135 గదుల శివసదన్ సత్రం, రెండు ఉచిత కల్యాణ మంటపాలు, విష్ణుసదన్‌లోని 46 మ్యారేజ్ హాల్స్ ఉన్నాయి. సత్రాలలోని గదులలో భక్తులు బస చేస్తారు. బస చేసే భక్తులలో సొంత వాహనాలు లేనివారే అధికంగా ఉంటారు. స్వామివారి ఆలయానికి రావాలన్నా, మళ్లీ తిరిగి వెళ్లాలన్నా ఘాట్‌రోడ్ ద్వారా నడిచి లేదా వాహనాలలో వెళ్లాల్సి వచ్చేది. దేవస్థానం సత్యగిరి– రత్నగిరి మధ్య ఉచిత బస్సు నడుపుతున్నా అది అన్ని వేళలా అందుబాటులో ఉండదు. దాంతో ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆటోలకు ఎక్కువ మొత్తంలో ఛార్జి చేస్తుండడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు.
మెట్ల దారి వల్ల ఎంతో మేలు
సత్యగిరికి నిర్మిస్తున్న మెట్లదారి వలన భక్తులకు కొంతమేర ఇబ్బంది తొలగనుంది. సత్యగిరి ఘాట్‌రోడ్ ప్రారంభంలో గల విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి ఘాట్‌రోడ్ మొదటి మలుపు వరకు గల వంద మెట్లు, అక్కడ నుంచి రెండో మలుపు వరకు మరో 30 మెట్ల నిర్మాణం చేపట్టి దాదాపుగా పూర్తి చేశారు. ఈ మెట్ల నుంచి హరిహరసదన్, శివసదన్ సత్రాలు వంద మీటర్లు దూరం మాత్రమే ఉంటాయి. దీంతో ఆ సత్రాలలో బస చేసే భక్తులు ఆటోలు, బస్‌లు అందుబాటులో లేకపోయినా సులభంగా చేరుకోవచ్చు. ఈ మెట్లకు ప్రస్తుతం ప్లాస్టింగ్‌లు జరుగుతున్నాయని మరో వారం రోజుల్లో అవు పూర్తవుతాయని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment