
‘అత్యవసర’ సేవలకు జూడాలు దూరం
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌లో కొనసాగుతున్న అత్యవసర వైద్య సేవలను జూనియర్ డాక్టర్లు బహిష్కరించారు. కోల్‌కతాలో ఆర్‌జీ కార్ వైద్య కళాశాలకు చెందిన పల్మనాలజీ పీజీ విద్యార్థిని దారుణ హత్యాచారం నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఎఫ్‌ఏఐఎంఏ) పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా శాంతియుత నిరసన చేపడుతున్న జూడాలు గురువారం నుంచి అత్యవసర సేవలకు కూడా హాజరుకావద్దని నిర్ణయించుకున్నారు. ఘటన జరిగిన వైద్య కళాశాల ఆవరణలో నిరసన చేస్తున్న వైద్య విద్యార్థులపై బుధవారం అర్థరాత్రి వేల మంది రౌడీ మూకలు దాడికి తెగబడ్డాయని కాకినాడ జీజీహెచ్‌లో నిరసన చేపడుతున్న ఆర్‌ఎంసీ జూనియర్ డాక్టర్లు తెలిపారు. దారుణం జరిగిన హాల్‌ని ధ్వంసం చేసి సాక్ష్యాలు లేకుండా చేశారన్నారు. ఈ ఘోరాన్ని దేశమంతా చూసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, వైద్యుల సంరక్షణ కోసం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతవరకు ఎఫ్‌ఏఐఎంఏ ఆదేశాల మేరకు తమ నిరసన నిరవధికంగా కొనసాగుతుందన్నారు. నిరసన నేపథ్యంలో కాకినాడ జీజీహెచ్‌లోని పోర్టికో వద్ద జూనియర్ డాక్టర్లు పలువురు రోగులతో మాట్లాడారు. అత్యవసర వైద్య సేవలు జీజీహెచ్‌లో కొనసాగుతాయనీ, కేవలం జూనియర్ డాక్టర్లు మాత్రమే హాజరుకారనీ నిరసనలో కొనసాగుతారని తెలిపారు. కలకత్తాలో వైద్య విద్యార్థినిపై జరిగిన దారుణాన్ని పలువురు రోగులు, వారి బంధువులకు వివరించారు. తమ నిరసనకు సంఘీభావం తెలపాలని కోరారు. గురువారం జూడాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జీజీహెచ్ ఆవరణలో నిరసనలో పాల్గొన్నారు. సాయంత్రం పీఆర్ కాలేజ్ సర్కిల్ వద్ద మానవహారంగా ఏర్పడి దారుణంపై ప్రభుత్వం స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం నాటి ర్యాలీలో యూజీ విద్యార్థులు కూడా పాలుపంచుకోనున్నారు.
కోలకతా పీజీ విద్యార్థినిపై
హత్యాచారానికి సంఘీభావం
రోగులు, వారి బంధువులను
తమకు మద్దతు తెలపాలని విన్నపం
Comments
Please login to add a commentAdd a comment