దేవరపల్లి: వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మార్కెట్‌లో లభిస్తోన్న ధర రైతులకు లాభసాటిగా ఉండడంతో రైతులు పొగాకు విక్రయాలు వేగంగా జరుపుతున్నారు. 2023–24 పంట కాలంలో పండించిన పొగాకును ఈ ఏడాది మార్చి 6న కొనుగోలు చేయడం ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లాలోని రెండు వేలం కేంద్రాలతో పాటు ఏలూరు జిల్లాలోని మూడు వేలం కేంద్రాలు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలో ఉన్నాయి. ఇప్పటి వరకూ 127 రోజులు కొనుగోళ్లు నిర్వహించారు. శుక్రవారం నాటికి ఐదు వేలం కేంద్రాల్లో సుమారు రూ.1,749 కోట్ల విలువ గల 53 మిలియన్ల కిలోల పొగాకు కొనుగోలు చేశారు. 2023–24 ఏడాదికి బోర్డు 48.25 మిలియన్ల కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, ప్రకృతి వైపరీత్యాల కారణంగా సాగు విస్తీర్ణం పెరగడంతో ఉత్పత్తి బాగా పెరిగింది. దీంతో 67 మిలియన్ల కిలోలు పొగాకు ఉత్పత్తి అవుతుందని పోగాకు బోర్డు అధికారులు, కొనుగోలు సంస్థలు అంచనా వేశాయి. దాదాపు ఈ అంచనాలకు చేరువలో పొగాకు ఉత్పత్తి అవుతోంది. ఇప్పటి వరకూ 53 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరగడంతో బ్రైట్ గ్రేడు పొగాకు అమ్మకాలు దాదాపు చివరి దశకు చేరుకున్నట్టేనని అధికారులు వివరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment