
నిబంధనలు రీచ్ కాక..
● సీఆర్‌జెడ్‌తో అవాంతరాలు
● జిల్లాలో 24 రీచ్‌ల గుర్తింపు
● 12 చోట్ల మాత్రమే తవ్వకాలు
● నిబంధనలు సడలించాలంటున్న
అధికారులు
సాక్షి, అమలాపురం/ రావులపాలెం: ఇసుక ర్యాంపులకు కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) అడ్డుగా మారింది. ఫలితంగా ర్యాంపుల ఏర్పాటుకు ప్రతిబంధకమైంది. జిల్లాలో సముద్ర తీర ప్రాంతాలు, మత్స్యకారులు వేట సాగించే గోదావరి నదీ పరివాహక ప్రాంతాలను సీఆర్‌జెడ్ పరిధిలోకి తీసుకు వచ్చారు. 2011లో సీఆర్‌జెడ్‌ను అమలులోకి తెచ్చారు. దీనివల్ల జిల్లాలోని కీలక ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలకు ప్రతిబంధకాలు ఎదురయ్యాయి. సీఆర్‌జెడ్ నిబంధనలు సడలించకుంటే పూర్తిస్థాయిలో ర్యాంపులు అందుబాటులోకి రావని మైనింగ్, పర్యావరణ శాఖ అధికారులు తేల్చి చెబుతున్నారు.
సీఆర్‌జెడ్ పరిధిలో సముద్రతీర ప్రాంతం ఉంది. ఆయా చోట్ల ఎటువంటి తవ్వకాలు చేయకూడదు. కానీ ఇక్కడే ఇసుక తవ్వకాలు చేయడంతోపాటు ఆక్వా చెరువుల తవ్వకాలు చేస్తున్న విషయం తెలిసిందే. సీఆర్‌జెడ్ పరిధిని గోదావరి పరివాహక ప్రాంతాలకు సైతం విస్తరించారు. నేషనల్ సెంటర్ ఫర్ సస్టనబుల్ కోస్టల్ మేనేజ్‌మెంట్ (ఎన్‌సీఎస్‌సీఎం) ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లాలో 16 మండలాల పరిధిలోని 128 గ్రామాలు సీఆర్‌జెడ్ పరిధిలో ఉన్నాయి. సఖినేటిపల్లి మండలం (ఎనిమిది గ్రామాలు), మలికిపురం (తొమ్మిది), మామిడికుదురు (పన్నెండు), రాజోలు (పన్నెండు), అల్లవరం (పదకొండు), ఉప్పలగుప్తం (పది), అమలాపురం (రెండు), అంబాజీపేట (రెండు), కాట్రేనికోన (పదకొండు), కపిలేశ్వరపురం (రెండు), కొత్తపేట (రెండు), పి.గన్నవరం (పదిహేడు), రావులపాలెం (నాలుగు), అయినవిల్లి (ఆరు), కె.గంగవరం (ఎనిమిది), ముమ్మిడివరం (పన్నెండు) గ్రామాలు సీఆర్‌జెడ్ పరిధిలో ఉన్నాయి. దీనిపై గత నెల 31న అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. సీఆర్‌జెడ్‌లో 300 చదరపు మీటర్ల వరకూ మత్స్యకారులు నిర్మాణాలు చేసుకోవచ్చు. స్థానికంగా అనుమతులు తీసుకోవచ్చని నిర్ణయించారు. అలాగే క్రిక్స్‌లో వాటర్ లెవిల్ విడ్త్ నుంచి 100 మీటర్ల వరకూ బఫర్‌ను 50 మీటర్లు చేశారు. భవన నిర్మాణాలకు సంబంధించిన విషయం పక్కన పెడితే సీఆర్‌జెడ్ పరిధి వల్ల జిల్లాలోని గోదావరిలో పలు ర్యాంపుల వద్ద ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి.
అవకాశం ఉన్నా..
జిల్లాలో 12 వరకూ ఇసుక తవ్వకాలకు అనుమతి ఉన్న ర్యాంపులు ఉన్నాయి. వీటి నుంచి తవ్వకాలు సాగిస్తున్నారు. అయితే వాస్తవంగా 24 ప్రాంతాల నుంచి ఇసుక తవ్వకాలు చేసే అవకాశముంది. ఇలా చేస్తే ఉచిత ఇసుక పాలసీ అమలులో ఉన్నా స్థానిక సంస్థలకు సీనరేజ్ రూపంలో, ప్రభుత్వానికి జీఎీస్టీ రూపంలో ఆదాయం రావడంతోపాటు ఇసుక లభ్యత అధికంగా ఉంటోంది. భవన నిర్మాణ రంగం సైతం వేగంగా వృద్ధి చెందుతోంది. కానీ సీఆర్‌జెడ్ నిబంధనలతో పలు ర్యాంపుల నుంచి ఇసుక తీసే అవకాశం లేకుండా పోయింది. ఉదాహరణకు కపిలేశ్వరపురం మండల పరిధిలో కపిలేశ్వరపురం, తాతపూడి గ్రామాల్లో సీఆర్‌జెడ్ పరిధిలో ఉన్నాయి. ఇక్కడే ప్రస్తుతం స్టాక్ పాయింట్ల ద్వారా ఇసుక అమ్మకాలు జరుగుతుండడం విశేషం. రావులపాలెం మండలం గోపాలపురం, రావులపాలెం, అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం, కె.గంగవరం మండలం కోటిపల్లి, కూళ్ల, సఖినేటిపల్లి, రాజోలు మండలం సోంపల్లి, పి.గన్నవరం మండలం ముంజువరం, లంకల గన్నవరం, మనేపల్లి, పాత గన్నవరం ప్రాంతంలో గతంలో ఇసుక తవ్వకాలు జరిగేవి. వీటిలో ఇసుక ర్యాంపులు అధికం.
పరిధి నుంచి తొలగించాలి
ఇసుక తవ్వకాలకు వీలుగా గతంలో ర్యాంపులు నిర్వహించిన గ్రామాలను సీఆర్‌జెడ్ పరిధి నుంచి తొలగించాలనే డిమాండ్ పెరుగుతోంది. గనులు, భుగర్భ శాఖ అధికారులు ప్రభుత్వానికి పలు దఫాలు ప్రతిపాదనలు పంపించారు. దీనికి ఎన్విరాల్‌మెంట్, ఫారెస్ట్ అండ్ క్‌లైమేట్ నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు దృష్టికి ఈ విషయాన్ని జిల్లా అధికారులు తీసుకు వెళ్లారు. దీనిపై తాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో మాట్లాడతానని ఆయన చెప్పుకొచ్చారు. సీఆర్‌జెడ్‌ను సవరిస్తే కాని ఇక్కడ ఇసుక తవ్వకాలు చేసే అవకాశం లేదు.

నిబంధనలు రీచ్ కాక..
Comments
Please login to add a commentAdd a comment