ఇలా ఇసుకిస్తారా! | - | Sakshi
Sakshi News home page

ఇలా ఇసుకిస్తారా!

Published Sat, Aug 17 2024 11:32 PM | Last Updated on Sat, Aug 17 2024 11:32 PM

ఇలా ఇ

ఇలా ఇసుకిస్తారా!

● కపిలేశ్వరపురం స్టాక్‌ పాయింట్‌ వద్ద 60,188 మెట్రిక్‌ టన్నుల ఇసుక అమ్మకాలు జరిపారు. ఇప్పుడు కొద్దిపాటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. మరో రెండు రోజుల్లో ఈ నిల్వలూ పూర్తి కానున్నాయి.

● ఆలమూరు మండలం జొన్నాడ స్టాక్‌ పాయింట్‌ వద్ద 10,590 మెట్రిక్‌ టన్నుల ఇసుక ఉండగా, జిల్లాలో తొలి స్టాక్‌ పాయింట్‌ ఇదే. అయితే ఇసుక అమ్మకాలు పూర్తయ్యాయి. ఇప్పుడున్న కొద్దిపాటి ఇసుక మట్టిలో కలిసిపోయింది.

ఉచిత ఇసుక నిల్‌

జిల్లాలో ఆరు స్టాక్‌ పాయింట్లు

మిగిలింది అరకొర నిల్వలే

అదీ పీఆర్‌ అప్పగించామంటున్న

అధికారులు

వరదతో అక్టోబర్‌ 15 వరకూ

ర్యాంపుల్లో సేకరణ కష్టమే

నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం

సాక్షి, అమలాపురం/ రావులపాలెం/ కొత్తపేట/ కపిలేశ్వరపురం/ ఆలమూరు: ఇసుక కంటికి కనిపించడం లేదు.. ఎక్కడా దొరికే పరిస్థితి లేదు.. నిల్వలు లేక స్టాక్‌ పాయింట్లు తెరిచే పరిస్థితి లేదు. కొద్దిపాటి నిల్వలను సైతం ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తామని అధికారులు చెబుతుండడంతో ఇసుక దొరకడం లేదు. ఇదే సమయంలో గోదావరి వరద నీటి ప్రవాహం కారణంగా అక్టోబర్‌ 15 వరకూ ఇసుక తవ్వకాలు చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఈ ప్రభావం నిర్మాణ రంగంపై పడుతోంది. కార్మికుల ఉపాధికి గండి కొడుతోంది.

మొదలు పెట్టే సమయానికి..

కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ మొదలు పెట్టే సమయానికి జిల్లాలో ఆరు స్టాక్‌ పాయింట్లలో 2,44,131 మెట్రిక్‌ టన్నుల ఇసుక ఉందని తేల్చారు. రావులపాలెం–1 స్టాక్‌ పాయింట్‌లో 33,888 మెట్రిక్‌ టన్నులు, రావులపాలెం–2లో 82,089, కొత్తపేట (మందపల్లి) 25,898, జొన్నాడ 10,590, తాతపూడి 31,478, కపిలేశ్వరపురంలో 60,188 మెట్రిక్‌ టన్నుల చొప్పున నిల్వలు ఉండగా, ప్రభుత్వం ఇక్కడి నుంచి ఇసుక అమ్మకాలు చేపట్టింది. కానీ అంతకు ముందే అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచే రావులపాలెం–1, 2, మందపల్లి ఇసుక స్టాక్‌ పాయింట్ల నుంచి దొడ్దిదారిన టన్నుల కొద్దీ ఇసుకను తరలించుకుపోయారు. కపిలేశ్వరపురం మండల పరిధి తాతపూడి వద్ద కూడా ఇలా కొల్లగొట్టేందుకు ప్రయత్నించగా స్థానికులు తిరగబడడంతో నిలిచిపోయింది. తరువాత గుర్తించిన నిల్వలను ప్రభుత్వం ఉచితం పేరుతో టన్నుకు రూ.265 చొప్పున వసూలు చేసి అమ్మకాలు చేసిన విషయం తెలిసిందే. పేరుకు ఉచిత ఇసుకే కానీ టీడీపీ ప్రజాప్రతినిధుల పేరున ట్యాక్స్‌లు, లారీల యజమానులు రెట్టింపు చేసి రవాణా చార్జీలు వసూలు చేయడంతో ఉచిత ఇసుక కాస్తా వినియోగదారులకు మోయలేని భారంగా మారింది.

అప్పటి వరకూ ఇంతే..

ఇప్పటికీ గోదావరిలో వరద నీరు ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి శనివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో 2,02,483 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువన క్యాచ్‌మెంట్‌ ఏరియాలో ఇంకా వర్షాలు పడే అవకాశముంది. సహజంగా గోదావరికి ఆగస్ట్‌లోనే పెద్ద వరదలు వస్తుంటాయి. అక్టోబర్‌ 15 వరకూ ఇదే పరిస్థితి ఉంటోంది. దీనివల్ల ర్యాంపులు నిర్వహించే అవకాశం తక్కువ. అప్పటి వరకూ ర్యాంపుల నుంచి ఇసుక తీయడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.

ముందుచూపు లేకుండా..

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్‌ 4న వచ్చాయి. అప్పటి వరకూ గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా ఎంపిక చేసిన స్టాక్‌ పాయింట్లలో భారీగా ఇసుక నిల్వ చేసింది. కూటమి ప్రభుత్వం, అధికార టీడీపీ ఎమ్మెల్యేలు ఆ నిల్వలను కొల్లగొట్టుకుని జేబులు నింపుకోవాలని చూశారే తప్ప గోదావరి వరదలు వస్తే మూడున్నర నెలల పాటు ఇసుక సేకరణ ఇబ్బంది అవుతోందనే ధ్యాస లేకుండా పోయింది. గోదావరికి జూలై 20 తరువాత కాని వరద రాలేదు. అప్పటి వరకూ ఇసుక సేకరించే అవకాశమున్నా కొత్త ప్రభుత్వం గుర్తించ లేదు. దీనివల్ల ఇప్పుడు కొరత వేధిస్తోంది.

నిర్మాణ రంగంపై ప్రభావం

జిల్లాలోని స్టాక్‌ పాయింట్లలో ఇసుక లేదు. ర్యాంపులు అప్పుడే తెరుచుకోక ఇసుకకు కొరత ఉండనుంది. పట్టణాలు, అభివృద్ధి చెందిన గ్రామాల్లో అపార్ట్‌మెంట్లు, కమర్షియల్‌ భవనాలు నిర్మించేవారు ముందుగానే ఈ పరిస్థితి ఊహించి ఇసుక నిల్వ చేసుకున్నారు. కానీ సామాన్యులు, మధ్య తరగతి కుటుంబాలు ఇసుక నిల్వ చేయలేదు. ఇసుక కొరత ప్రభావం వీరిపై అధికంగా పడనుంది. నిల్వలు అడుగంటినందున ఇసుకకు మరింత డిమాండ్‌ వచ్చిన తరువాత ఇప్పుడు పంచాయతీరాజ్‌ శాఖకు అప్పగిస్తామని చెబుతున్నారు. ఈ ఇసుకను సైతం తెలుగు తమ్ముళ్లు దొడ్డిదారిన విక్రయించే అవకాశముందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు నిఘా ఉంచాలనే డిమాండ్‌ ఉంది.

కపిలేశ్వరపురంలో ఇసుక స్టాక్‌ పాయింట్‌

ఇక నో స్టాక్‌..

రావులపాలెం–1 స్టాక్‌ పాయింట్‌లో 33,888 మెట్రిక్‌ టన్నుల ఇసుక ఉన్నట్టు మొదట్లో అధికారులు చెప్పారు. దాదాపు ఇక్కడ అమ్మకాలు పూర్తయ్యాయి. అధికారికంగా ఇసుక మొత్తం ఖాళీ అయ్యింది. అదనంగా ఏమీ లేదు. ఎటువంటి విక్రయాలూ జరగడం లేదు.

ఉన్నది పోగు చేస్తూ..

రావులపాలెం–2లో ప్రభుత్వం 82,089 మెట్రిక్‌ టన్నుల ఇసుక ఉన్నట్టు చెప్పింది. వాస్తవంగా ఇంతకన్నా అధికంగానే ఇక్కడ ఇసుక ఉందని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఇక్కడ కేవలం 600 టన్నుల మాత్రమే ఉంది. ఉన్న కొద్దిపాటి ఇసుకను పోగు పెడుతున్నారు. అయితే కొబ్బరి ఆకులు, డస్టు పౌడర్‌ వస్తుండడంతో ఇది ఇళ్ల కట్టుబడికి పనికి రాదని చెబుతున్నారు. వచ్చే కొద్దిపాటి ఇసుకను పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో ఉంచుతామని అధికారులు వివరించారు.

అభివృద్ధికని చెబుతూ..

కొత్తపేట మండలం మందపల్లి వద్ద ఉన్న ఈ స్టాక్‌ పాయింట్‌లో 25,898 మెట్రిక్‌ టన్నుల ఇసుక నిల్వలు ఉన్నాయి. ఇక్కడ అమ్మకాలు దాదాపుగా పూర్తయ్యాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక కొత్తపేట ఇసుక స్టాక్‌ పాయింట్‌ నుంచి ఇసుకను టీడీపీ నాయకులు అక్రమంగా తరలించారు. ఇంకా 1,200 టన్నుల మిగిలిన ఇసుకను అభివృద్ధి కార్యక్రమాల కోసం నిల్వ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇది కాకుండా మరో వెయ్యి టన్నుల ఇసుక స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ ఖాళీ స్థలంలో నిల్వ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఇలా ఇసుకిస్తారా!1
1/3

ఇలా ఇసుకిస్తారా!

ఇలా ఇసుకిస్తారా!2
2/3

ఇలా ఇసుకిస్తారా!

ఇలా ఇసుకిస్తారా!3
3/3

ఇలా ఇసుకిస్తారా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement