
వెనుక బడి.. ఎదురుగా గుడి
ఫ కూటమి ప్రోద్బలంతో
తెరుచుకున్న పేకాట క్లబ్
ఫ పోలీసుల దాడి.. టీడీపీ నేతల పైరవీలు
అమలాపురం టౌన్: కొన్నేళ్లుగా మూతపడిన అమలాపురం జార్జి రిక్రియేషన్ క్లబ్ కూటమి నేతల ప్రోద్బలంతో మళ్లీ తెరుచుకుంది. కొత్తగా ఎన్నికై న ప్రజాప్రతినిధి కూడా కొందరు నేతలకు వత్తాసు పలకడంతో క్లబ్ శుక్రవారం రాత్రి తెరుచుకునే ఏర్పాట్లు జరిగాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పేకాట క్లబ్‌లకు ఎంత మాత్రం అవకాశం లేకపోవడంతో అవి మూతపడ్డాయి. అయితే శనివారం ఆ క్లబ్‌లో పేకాట ఆడుతున్న సమయంలో పోలీసులు మెరుపు దాడి చేశారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే టీడీపీ నేతలు కొందరు పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు నమోదుకు ససేమిరా అంటూ పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. శనివారం అర్ధరాత్రి పొద్దుపోయే వరకూ కొందరు నేతలు పట్టణ పోలీస్ స్టేషన్ వద్దే ఉండి పోలీసులతో మంతనాలు జరిపారు. నేతల ఒత్తిడి, పైరవీలతో కేసు నమోదు చేస్తారా.. లేదా అనే సందేహాలు ప్రజల్లో నెలకొంది. ప్రజాప్రతినిధి ఇచ్చిన అభయమే అనధికార అనుమతిగా భావించి కొందరు కూటమి నేతలు క్లబ్ తెరిచి బరి తెగించి మరీ పేకాటకు తెర తీశారు.
అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించేది లేదని జిల్లా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రకటనలతో ఊదరకొడుతుంటే ఈ పేకాట క్లబ్‌కు ఎలా అనుమతి ఇచ్చారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దాడి చేసిన పోలీసులు పేకాటపై కేసు నమోదు చేస్తే సరేసరి. లేని పక్షంలో పోలీసులు కూటమి నేతల ఒత్తిళ్లకు గురయ్యారనే అనుమానాలు బలపడతాయి. ఈ క్లబ్ భవనం వెనుకే ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ఎదురుగా వినాయక గుడి ఉంది. అసాంఘిక కార్యకలాపాలకు గుడి, బడి నిబంధనలు వర్తిస్తాయి. ఆ నిబంధనలను కూటమి నేతలు తుంగలో తొక్కి మరీ క్లబ్ తెరవడంపై విమర్శలకు దారి తీస్తోంది. ఏదేమైనా ఇది ఎంతవరకూ వెళ్తుందో వేచి చూడాల్సిందే.