మద్యం దుకాణం వాచ్‌మన్‌పై హత్యాయత్నం
● పోలీసుల అదుపులో నిందుతుడు
● ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
కొవ్వూరు: పట్టణంలో బస్టాండ్ సెంటర్‌లోని ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద నైట్ వాచ్‌మన్‌గా పని చేస్తున్న ఖండవల్లి జయరాజుపై ఆదివారం తెల్లవారు జామున హత్యాయత్నం జరిగింది. మెరకవీధికి చెందిన పిండి సుబ్రహ్మణ్యం తెల్లవారు జామున నాలుగు గంటలకు దుకాణం వద్దకు వచ్చి మద్యం కావాలని అడిగారు. దుకాణం మూసేశారని, మద్యం లేదని చెప్పడంతో ఆగ్రహించిన సుబ్రహ్మణ్యం తనతో తెచ్చుకున్న చాకుతో దాడి చేసి జయరాజు ముఖం, తల, చేతులపైన, చెవి వెనుక, ఛాతీ పైన గాయపరిచారు. జయరాజు కింద పడిపోవడంతో చనిపోయాడనుకుని సుబ్రహ్మణ్యం పారిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. చాకుకు ఉన్న పిడి విరిగిపోవడంతో బాధితుడికి ప్రాణాపాయం తప్పింది. తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న జయరాజును స్థానికులు స్థానిక సామాజిక ఆస్పత్రికి తరలించారు. నిజానికి మానసిక వికలాంగురాలైన సుబ్రహ్మణ్యం సోదరి పట్ల జయరాజు గతంలో అసభ్యకరంగా ప్రవర్తించారని, ఆ కోపంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలిందని ఎస్సై కె.జగన్‌మోహన్‌రావు తెలిపారు. ఈ విషయంపై సుబ్రహ్మణ్యం సోదరుడు గతంలో జయరాజును మందలించాడని వివరించారు.సెంట్రింగ్ పనులు చేసుకునే సుబ్రహ్మణ్యం తరచూ బయటి ప్రాంతాలకు వెళ్లి వస్తుంటాడని, వీరి ఇంటి పక్కనే సుబ్రహ్మణ్యం సోదరుడు నివసిస్తుంటే, వదిన వీరికి వండి పెడుతుండేందన్నారు. సోదరి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు తెలుసుకుని జయరాజుపై కక్షతో ఈ హత్యాయత్నానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఆసుపత్రి నుంచి అందిన సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడు సుబ్రహ్మణ్యాన్ని అదుపులోకి తీసుకున్నామని, డీఎస్పీ జి.దేవకుమార్ ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment