వంద కిలోల గంజాయి పట్టివేత
● ఇద్దరు నిందితుల అరెస్టు
● డీఎస్పీ శ్రీనివాసులు
రాజానగరం: జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న వంద కిలోల గంజాయిని స్థానిక పోలీసులు ఆదివారం పట్టుకుని, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ గంజాయి విలువ సుమారు రూ.5 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఉత్తర మండల డీఎస్పీ కె.శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు
రాజానగరంలోని మాధవీ ఫంక్షన్ హాలు వద్ద జాతీయ రహదారిపై వాహానాలను తనిఖీ చేస్తుండగా విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న టిఎన్ 88 బి 5961 నంబరు గల లారీలో తరలిస్తున్న వంద కిలోల గంజాయి పట్టుబడింది. తమిళనాడులోని సేలం జిల్లా వజపడి మండలం, వెప్పిలైపట్టిపుదుర్‌కు చెందిన లారీ డ్రైవర్ కమ్ ఓనర్ అయిన మరిముత్తు ఆర్ముగమ్ (45), పెరంబలూరు జిల్లా, సిరుమతూర్ మండలం, కుదిక్కడుకు చెందిన వేల్ మురుగన్ (27) పశ్చిమ బెంగాల్ కిరాయికి వెళ్లి తిరిగి వస్తూ విశాఖపట్నం సమీపంలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి ఈ గంజాయిని తక్కువ రేటుకు కొనుగోలు చేశారు. అక్కడ నుంచి ఆ గంజాయిని ఐదు సంచులలో నింపి తీసుకువెళ్లి, చిల్లర వ్యాపారం చేస్తున్నారన్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, గంజాయిని, లారీని, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ కేసులో చురుగ్గా పనిచేసిన సీఐ, ఎస్సైలను ఎస్పీ నరసింహ కిశోర్ అభినందించినట్టు డీఎస్పీ తెలిపారు.
ఏడాదిలో ఏడు కేసులు..
స్థానిక పోలీసు స్టేషను పరిధిలో ఈ ఏడాదిలో గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి ఇంతవరకు ఏడు కేసులు నమోదయ్యాయని ఉత్తర మండల డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. వీటిలో సుమారు రూ.25 లక్షలు విలువ చేసే 506.35 కిలోల గంజాయితో పాటు రవాణాకు ఉపయోగించిన రెండు లారీలు, ఒక వ్యాన్, ఒక మోటారు సైకిలును స్వాధీనం చేసుకుని, 22 మందిని అరెస్టు చేశామన్నారు. సమావేశంలో సీఐ ఎస్పీ వీరయ్యగౌడ్, ఎస్సై మనోహార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment