నిన్నటి క్లిక్‌.. రేపటి కిక్కు | - | Sakshi
Sakshi News home page

నిన్నటి క్లిక్‌.. రేపటి కిక్కు

Published Sun, Aug 18 2024 11:46 PM | Last Updated on Sun, Aug 18 2024 11:46 PM

నిన్న

నిన్నటి క్లిక్‌.. రేపటి కిక్కు

అభిరుచే వృత్తిగా మారింది

మొదట్లో ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఫొటోగ్రఫీపై ఉన్న అభిరుచి క్రమంగాా పెరగడంతో దాన్నే వృత్తిగా మలుచుకున్నా. వృత్తిపరంగా, అభిరుచి పరంగా ఫొటోగ్రఫీనే ఆశగా, శ్వాసగా జీవిస్తున్నా. నా ప్రయాణంలో ప్రతి దృశ్యాన్ని కెమెరాలో బంధించేందుకు ప్రయత్నిస్తాను. ప్రకృతి చిత్రాలు, ఆరుదుగా కనిపించే లొకేషన్లు, ప్రత్యేకతను సంత రించుకున్న చిత్రాలను కెమెరాలో బంధిస్తుంటాను.

– చిట్టూరి దుర్గాప్రసాద్‌, ఫొటోగ్రాఫర్‌,

వెదురుపాక, రాయవరం మండలం

పోటీ విపరీతంగా పెరిగింది

ఫొటోగ్రఫీలో సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగింది. టెక్నాలజీకి అనుగుణంగా ఫొటోగ్రాఫర్లు కూడా అప్‌డేట్‌ కావాల్సిన అవసరం ఉంది. అప్‌డేట్‌ కాని ఫొటోగ్రాఫర్లు పోటీలో వెనుకబడి పోతున్నారు. ఫొటోగ్రఫీని కూడా ఒక వృత్తిగా భావించి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందించాలి. అప్పుడే ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు అభివృద్ధి చెందడానికి అవకాశముంటుంది.

– పోసిన వీరేంద్రకుమార్‌, రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ ఫొటోఅండ్‌ వీడియోగ్రాఫర్స్‌ వెల్ఫేర్‌

అసోసియేషన్‌, రాజమహేంద్రవరం

నైపుణ్యానికి కొదవులేదు

సాంకేతికత ఎంత పెరిగినా నైపుణ్యానికి ఉన్న ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు. ఆసక్తి ఉండాలే కానీ ప్రకృతిపై కన్నేస్తే కమనీయమైన దృశ్యాలను చిత్రీకరించే వీలుంది. సృజనాత్మకత, ఓపిక, సమయం కేటాయిస్తే మంచి ఫోటోగ్రాఫర్‌గా రాణించొచ్చు. ఈ వృత్తిలో సంపద ఎలా ఉన్నా సంతృప్తి పుష్కలంగా ఉంటుంది.

– చిక్కం శ్రీనివాస్‌, పద్మాలయ స్డూడియో, అంగర

ప్రతి ఫొటో.. ఓ జ్ఞాపకం

చరిత్రను సజీవంగా నిలిపే ఫొటోగ్రఫీ

ఫొటోలు, సెల్ఫీలకు పెరుగుతున్న ప్రాధాన్యం

నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం

రాయవరం/కపిలేశ్వరపురం: భావావేశాలకు గురిచేసే ఎన్నో సంఘటనలు.. ఆ ఘటనల దృశ్యాలు..వాటి జ్ఞాపకాలను మనసు తన కాన్వాస్‌పై ముద్రించుకుంటుంది. ఆ అనుభూతులను ఆస్వాదించడమో.. లేదా అనుభవించడమో పూర్తి కాకముందే మరో సంఘటన.. దృశ్యంగా.. జ్ఞాపకంగా.. ఇలా జీవిత పర్యంతం ఎన్నో ఘటనల దృశ్యాలు మదిలో నిక్షిప్తమై కాలగతిలో కలసిపోతుంటాయి. వాటిలో కొన్ని ఘటనల దృశ్యాలు మాత్రం ఎప్పటికీ మదిని ముద్దాడేవో.. మెలిపెట్టేవో.. గిలిగింతలు పెట్టేవో కచ్చితంగా ఉంటాయి. వాటిని కళ్లముందు నిలిపే అద్భుతం ‘చిత్రం’ మాత్రమే. అనుకునో.. కావాలనో.. ఆదమరచినపుడో ఎవరో కెమేరాతో క్లిక్‌ మనిపించిన ఆ చిత్రం నిజంగా మాయావే. ఎన్నేళ్లు గతించిపోయినా ఏ మూలనుంచో.. ఏ ఆల్బం నుంచో బయటపడినపుడు గత కాలపు మధురోహల్లోకి తీసుకుపోయి మురిపించేస్తుంది. కన్నీరు పెట్టిస్తుంది. అవి ఆనంద బాష్పాలు కావచ్చు.. నిబ్బరం కోల్పోయి ఒలికిన కన్నీరు కావచ్చు. కాలాన్ని సైతం జయించిన ఆ ‘చిత్రం’.. ఎంతో అపురూపం.

మనసుతో తీస్తేనే ఫొటోగ్రాఫ్‌..

సాంకేతికంగా వృద్ధి చెందిన తరువాత వచ్చిన ఆవిష్కరణల్లో కెమేరా ఒక అద్భుతం. ఆ కెమేరా లెన్స్‌ ముందున్న దృశ్యాన్ని క్లిక్‌ మనిపిస్తే అది కేవలం ఫొటో అవుతుంది కానీ ఫొటోగ్రఫీ కాదు. ముందున్న దృశ్యాన్ని క్లిక్‌మనిపించే వ్యక్తి కన్ను భావగర్భితమైనదైనపుడే.. అటువంటి వ్యక్తి క్లిక్‌చేసి ఆవిష్కరించే చిత్రాన్నే ఆహా.. ఏం ఫొటోగ్రాఫ్‌ అనగలం. అలాంటి కెమెరా పితామహుడు డాగురేకు పేటెంట్‌ లభించిన రోజు ఆగస్టు 19న ఏటా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.

ఫొటో విశ్వ వ్యాపితం..

అందుకే మిత్రులు, కుటుంబ సభ్యుల సమాగమం.. శుభాశుభ కార్యాలు.. సభలు, సమావేశాలు.. అది ఏదైనా నేడు ఫొటోలు తీయించడం సాధారణమైన విషయం. రేపటికి అదో జ్ఞాపకమే కాదు.. రిఫరెన్స్‌ కూడా. ఇక సాధారణ ప్రజా జీవనంలోకి వస్తే ప్రతి ఇంటా ఎన్నో బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోలు.. రెండు లేదా మూడు దశాబ్దాల నాటి ఫొటోలు ఎన్నో ఉంటాయి. అవి చూచినపుడల్లా ఆ రోజుల్లోకి వెళ్లిపోయి నాటి డ్రెస్సింగ్‌, హెయిర్‌ స్టైల్‌ చూసుకుని ఎన్ని కామెంట్లు పాసైపోతాయో.. అన్నీ మనసును ఆ రోజుల్లోకి తీసుకెళ్లి గిలిగింతలు పెడతాయి.

గమ్మత్తైన చప్పుడు ‘క్లిక్‌’

క్లిక్‌.. గమ్మత్తైన మెత్తని చప్పుడు. క్షణాల్లో సుందర దృశ్యం. చూపుడువేలి కొనతో బటన్‌ నొక్కితే ఎదుటి దృశ్యం చిన్ని చిప్‌లో బంధీ అవుతుంది. కొంతమందికి ఎన్ని సార్లు, ఎన్ని వేల ఫొటోలు తీయించుకున్నా కొత్తదనమే. గుండె కింద మెత్తని మధుర జ్ఞాపకాలను నిక్షిప్తం చేసి అవసరమైనప్పుడు వీక్షించగలిగే అపురూపమైన అవకాశాన్ని మనకు ఫొటోగ్రఫీ అందిస్తుంది.

ఇటీవల కాలంలో సెల్‌ఫోన్ల రాకతో కెమెరాల ప్రాభవం కాస్త తగ్గినా విలక్షణమైన ఫొటోలకు మాత్రం స్టూడియోలు, కెమెరాలను ఆశ్రయించక తప్పదు. రోలికార్డ్‌, రైస్‌ ల్యాండర్‌, రోలీ ఫ్లెక్స్‌, నికాన్‌, కేనన్‌ వంటి ఎన్నో కంపెనీల కెమెరాలు వివిధ మోడళ్లలో అందుబాటులోకి వచ్చాయి. వేల నుంచి లక్షల విలువ చేసే కెమెరాలు ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్నాయి.

ఇంతింతై వటుడింతై అన్నట్లుగా

ఫొటోగ్రఫీ అనేది గ్రాఫోన్‌ అనే పదం నుంచి పుట్టింది. గ్రాఫోన్‌ అంటే రాయడం, చిత్రించడం అని అర్ధం. మొదటిసారిగా 1826లో ఫ్రెంచి శాస్త్రవేత్త జోసఫ్‌ నైసిఫర్‌ నిస్సీ కనిపెట్టిన మొదటి కెమెరాతో ప్రారంభమైన ఫొటోగ్రఫీ నేడు డిజిటల్‌ ఫొటోస్‌ స్థాయికి అభివృద్ధి చెందింది. తీసే ఫొటోను బట్టి దాని ప్రాముఖ్యాన్ని బట్టి నేడు వివిధ లెన్సులు అందుబాటులోకి వచ్చాయి. సెల్‌ఫోన్‌లో బ్యాక్‌, ఫ్రంట్‌ కెమెరాలు అందుబాటులోకి జనబాహుళ్యానికి ఫొటోగ్రఫీ మరింత దగ్గరైంది. తాజాగా డ్రోణ్‌ ఫొటోగ్రఫీతో విహంగ వీక్షణం చేస్తూ తీసే ఫొటోలకు ఎంతో డిమాండ్‌ ఉంది.

వినూత్న రీతిలో..

నేచురల్‌, వైల్డ్‌ లైఫ్‌, ఫైన్‌ ఆర్ట్స్‌, నైట్‌ స్కేప్‌, వెడ్డింగ్‌ ఫొటోగ్రఫీ, యాష్రో ఫొటోగ్రఫీ, స్ట్రీట్‌ ఫొటోగ్రఫీ, సీటీస్కేప్స్‌, ల్యాండ్‌ స్కేప్స్‌, నైట్‌స్కేప్స్‌ ఇలా ఎన్నో రకాలుగా ఫొటోగ్రాఫర్లు తమ ప్రతిభ చాటుకుంటున్నారు. ఎమోషన్లు, ఫీలింగ్స్‌, సేడ్‌నెస్‌, థింకింగ్‌, కేరింగ్‌ ఇలా అన్ని రకాల ఎమోషన్లను ఒక్క క్లిక్‌తో చూపిస్తుంటారు. అంతే కాకుండా సమాజంలో జరుగుతున్న ఆకృత్యాలను కళ్లకు కట్టినట్టు చూపించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే ఫోటోలు తీయడంలోను కొందరకు తమ ప్రతిభ చూపుతున్నారు.

తరాలుగా ఇదే పని..

కాకినాడలో చెక్కా బసవరాజు 1885లో ఓ హాబీగా ఫొటోగ్రఫీని ప్రారంభించి చెక్కా బసవరాజు అండ్‌ సన్స్‌ ఏర్పాటు చేశారు. నాలుగు తరాలుగా తన కుటుంబం ఆ ప్రతిష్టను నిలబెట్టుకుంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఫొటోగ్రఫీ అసోసియేషన్లలో నాలుగు వేల మంది వరకు ఫొటోగ్రాఫర్లు ఉన్నారు. ఫొటోగ్రాఫర్లలో మిక్సింగ్‌ ఎడిటర్లు, ఫొటగ్రఫీ ఎడిటర్లు, ఫొటో ల్యాబ్‌ ఆపరేటర్లు ఇలా.. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు ఏడు వేల మంది ఈ వృత్తిపై ఆధారపడి ఉన్నారు.

కాకినాడ జిల్లాలో 15 మండలాలకు చెందిన సుమారు 2వేల మంది ఫోటోగ్రాఫర్లు 4 జోన్లు, 8 సంఘాలుగా ఉన్నారు.

కుటుంబం అంతా కలసికట్టుగా..

కపిలేశ్వరపురం మండలంలోని అంగర గ్రామానికి చెందిన పద్మాలయా ఫోటో స్టూడియోను 1986 ఆగస్టు 16న ప్రారంభించారు. వారి కుటుంబం ఫో టో గ్రాఫర్ల జీవన విధానాన్ని స్పష్టం చేస్తుంది. గ్రా మానికి చెందిన సోదరులు చిక్కం నరసింహారావు, శ్రీనివాస్‌, కాశీ విశ్వనాథం 38 ఏళ్లుగా స్టూడియో నిర్వహిస్తున్నారు. ఆహ్లాదకరమైన ప్రకృతి అందాల ను కెమేరాతో ఒడిసి పట్టడం శ్రీనివాస్‌కు అలవాటు.

No comments yet. Be the first to comment!
Add a comment
నిన్నటి క్లిక్‌.. రేపటి కిక్కు1
1/6

నిన్నటి క్లిక్‌.. రేపటి కిక్కు

నిన్నటి క్లిక్‌.. రేపటి కిక్కు2
2/6

నిన్నటి క్లిక్‌.. రేపటి కిక్కు

నిన్నటి క్లిక్‌.. రేపటి కిక్కు3
3/6

నిన్నటి క్లిక్‌.. రేపటి కిక్కు

నిన్నటి క్లిక్‌.. రేపటి కిక్కు4
4/6

నిన్నటి క్లిక్‌.. రేపటి కిక్కు

నిన్నటి క్లిక్‌.. రేపటి కిక్కు5
5/6

నిన్నటి క్లిక్‌.. రేపటి కిక్కు

నిన్నటి క్లిక్‌.. రేపటి కిక్కు6
6/6

నిన్నటి క్లిక్‌.. రేపటి కిక్కు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement