
రొయ్య రయ్..
సాక్షి అమలాపురం: వెనామీ సాగుకు పూర్వ వైభవం వచ్చింది. రొయ్యల ధరలకు రెక్కలు వచ్చాయి. గడిచిన నెల రోజుల్లో కౌంట్‌కు కేజీకి రూ.50 నుంచి రూ.60 వరకు పెరిగాయి. సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటు సాగు చేసిన చోట వాతావరణ మార్పుల వల్ల తెగుళ్లు సోకి పంట దెబ్బతినడంతో అంచనాలకు మించి ధరలు పెరిగాయని రైతులు చెబుతున్నారు.
వెనామీ సాగు అధికం
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో వెనామీ సాగు అధికంగా ఉంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాతో పాటు కాకినాడ జిల్లాలో సుమారు 25 వేల ఎకరాల వరకూ ఉంటుందని అంచనా. గడిచిన నెల రోజులుగా రొయ్యల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్‌లో కీలకమైన వంద కౌంట్ (కేజీకి 100 రొయ్యలు) ధర కొనుగోలుదారులు రూ.260గా నిర్ణయించారు. మార్కెట్‌లో పోటీ కారణంగా కేజీకి మరో రూ.10 పెంచి కొనుగోలు చేస్తున్నారు. అలాగే 90 కౌంట్ రూ.270 నుంచి రూ.280 వరకు, 80 కౌంట్ రూ.280 నుంచి రూ.290 వరకు, 70 కౌంట్ రూ.300 నుంచి రూ.310ల వరకు, 60 కౌంట్ రూ.320 నుంచి రూ.330 వరకు, 50 కౌంట్ రూ.340 నుంచి రూ.350 వరకు, 40 కౌంట్ రూ.375 నుంచి 385 వరకు, 30 కౌంట్ రూ.470 నుంచి రూ.480 వరకు ఉంది. రొయ్యల కొనుగోలుదారులు నిర్ణయించిన ధర కన్నా రూ.పది అదనంగా చేసి కొంటున్నారు.
ఎగుమతుల జోరు
జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు రొయ్యల ఎగుమతి జోరుగా సాగుతుండడంతో వెనామీ ధరలు పెరిగాయి. కానీ డిమాండ్‌కు తగిన విధంగా రొయ్యలు అందుబాటులో లేవు. 100 కౌంట్ నుంచి 70 కౌంట్ మధ్యలో ఉన్న వెనామీ రొయ్యలు చైనాకు అధికంగా రవాణా జరుగుతుండగా, అంతకన్నా తక్కువ కౌంట్ అంటే 60 నుంచి 30 కౌంట్ మధ్య రొయ్యలు అమెరికాతో పాటు యూరప్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయని చెబుతున్నారు.
తెగుళ్ల బెడద
కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో గోదావరి నదీపాయలను ఆనకుని అనధికార ఆక్వా సాగు జరుగుతోంది. వరదలకు భయపడి ఇక్కడ జూలై నెలాఖరు నాటికి పట్టుబడులు వచ్చేలా చూసుకుంటారు. ఈ ఏడాది జూలై 20కి వరదలు రావడం వల్ల రైతులు నష్టాలను చవిచూశారు. దీని వల్ల కూడా సాగు తగ్గింది. ఇదే సమయంలో సాగు చేసిన చోట ఈ ఏడాది తెగుళ్ల తీవ్రత అధికంగా ఉంది. వెనామీ రొయ్యలకు వైట్ స్పాట్, వైట్ గట్ వంటి తెగుళ్లు, హెచ్‌పీ వల్ల రొయ్యల్లో ఎదుగుదల లోపం వంటి కారణాలతో దిగుబడి గణనీయంగా పడిపోయింది. ఎంతగా అంటే రెండు జిల్లాలకు కలిపి రోజుకు సగటున 400 మెట్రిక్ టన్నుల వరకు దిగుబడిగా వచ్చి కొనుగోలు కేంద్రాలకు వచ్చేది. కానీ ఇప్పుడు రోజుకు 150 టన్నులు కూడా మార్కెట్‌కు రావడం లేదు. ఈ కారణాల వల్లే వెనామీకి ధరలు పెంచడం మినహా మరో మార్గం కొనుగోలుదారులకు లేకుండా పోయింది. మార్కెట్‌ను గుప్పెట పెట్టుకుంటే అసలుకే మోసం వస్తోందనే కారణానికి తోడు, అనుకూల ప్రభుత్వానికి రైతులలో కొంత సానుకూలత రావాలనే ఉద్దేశంతో ధరలు పెంచారని రైతులు చెబుతుండడం విశేషం.
ధరకు రెక్కలు
ఐదేళ్ల తర్వాత పెరిగిన వైనం
కౌంట్‌కు రూ.50 నుంచి
60 వరకూ అధికం
వరదలు, తెగ్గుళ్లతో తగ్గిన సాగు
ఉన్న వాటికి డిమాండ్
కౌంట్ రకం ధర (రూ.లలో)
30 470
40 375
50 340
60 320
70 300
80 280
90 270
100 260
దెబ్బతీసిన తెగుళ్లు
ఇటీవల రొయ్యల కొనుగోలుదారులు సిండుకేటుగా మారి ధరలు తగ్గించడం పరిపాటిగా మారింది. టీడీపీకి అనుకూలంగా ఉండే కొనుగోలుదారులు ధరలను తగ్గించడం ద్వారా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి చెడ్డ పేరును తీసుకురావడానికి యత్నించారు. ధరలు తగ్గిన ప్రతి సందర్భంలోనూ గత ప్రభుత్వం కలుగజేసుకుని కనీస మద్దతు ధరలు (ఎంఎస్‌సీ) ప్రకటించి రొయ్యలు కొనుగోలు చేయించింది. కరోనా తర్వాత నుంచి అంతర్జాతీయంగా ఎగుమతుల తగ్గుదల చోటు చేసుకుని ఆ ప్రభావం ధరలపై పడింది. 100 కౌంట్ ధర కేజీ రూ.210 నుంచి రూ.230 మధ్యలో ఉండేది. సిండికేటు కొనుగోలుదారులకు భయపడి కొందరు రైతులు సాగుకు దూరమయ్యారు. మరికొందరు పూర్తిస్థాయిలో రొయ్యలను పెంచలేదు. హైటెక్ పద్ధతిలో సాగు చేసే రైతులు ఎకరాకు గరిష్టంగా లక్ష వరకు రొయ్య పిల్లలను సాగు చేస్తుంటారు. అటువంటి వారు కూడా ఎకరాకు 70 వేల రొయ్యలకు మించి సాగు చేయలేదు.
సాగు విస్తీర్ణం తగ్గడమే కారణం
సాగు విస్తీర్ణం తగ్గడం వల్లే రొయ్యలకు ధర పెరిగింది. ఇప్పుడిప్పుడే సాగు మొదలు పెట్టినా డిసెంబర్, జనవరి వరకు దిగుబడి వచ్చే అవకాశం లేదు. అప్పటి వరకు మార్కెట్‌లో వెనామీ రొయ్యలకు ధర అధికంగానే ఉంటుంది.
– బి.రాంబాబు, ఆక్వా రైతు, అమలాపురం

రొయ్య రయ్..

రొయ్య రయ్..
Comments
Please login to add a commentAdd a comment