
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు
అధికారులతో కలెక్టర్ మహేష్ కుమార్
అమలాపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదని అధికారులకు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ సూచించారు. సోమవారం అమలాపురంలోని కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సుమారు 181 అర్జీలు ఇవ్వగా, వాటిని కలెక్టర్‌తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఫిర్యాదులను నిశితంగా పరిశీలించి గడువులోగా పరిష్కరించాలని సూచించారు. జిల్లా కేంద్రం వరకూ అర్జీదారులు రావాల్సిన అవసరం లేకుండా మండల స్థాయిలోనే అధికారులు అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు. డీఆర్డీఏ పీడీ వి.శివశంకర్ ప్రసాద్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ ఎస్.మధుసూదన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం.దుర్గారావు దొర పాల్గొన్నారు. అనంతరం 21న రావులపాలెం శ్రీసత్యసాయి విద్యా సంస్థల్లో వికాస ఆధ్వర్యంలో 25 కంపెనీల ప్రతినిధులతో నిర్వహించనున్న జాబ్ మేళా వాల్ పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు.
200 గ్రామాల్లో ప్రచార సదస్సులు
రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు నీకు తెలుసా అనే ఇంటెన్సివ్ ఫైడ్ ప్రచార అవగాహన సదస్సులను జిల్లాలోని 200 గ్రామాల్లో నిర్వహించడానికి కార్యాచరణ సిద్ధం చేసినట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. హెచ్‌ఐవీ ఎయిడ్స్‌పై సమాజంలో ఉన్న అపోహలను తొలగించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులకు ఏఆర్‌టీ మందులను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందిస్తున్నారన్నారు. దీనిపట్ల సమగ్ర సమాచారాన్ని తెలుసుకునేందుకు నేషనల్ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ 1097 ఏర్పాటు చేశారని అన్నారు. డీసీహెచ్ ఎస్.కార్తీక్‌రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎం.దుర్గారావు దొర, జిల్లా కుష్ఠు, ఎయిడ్స్, టీబీ నియంత్రణ అధికారి సీహెచ్ వి.భరతలక్ష్మి, హెచ్‌ఐవీ ఎయిడ్స్ నియంత్రణ సూపర్‌వైజర్ బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు.
పారిశుధ్యంపై దృష్టి సారించండి
గ్రామాల్లో పారిశుధ్య పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఆయన ఎంపీడీఓలు, గ్రామ పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పారిశుధ్య నిర్వహణ, 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నిర్వహణ అంశాలపై దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పారిశుధ్య సమస్య తలెత్తకుండా, వ్యాధులు ప్రబలకుండా సమగ్ర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, ఆర్డీఓలు జి.కేశవవర్ధన్‌రెడ్డి, ఎస్.సుధాసాగర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment