మళ్లీ మొగటికే..
ఫ మూసుకుపోయిన కూనవరం మొగ
ఫ తెరిచిన వారం రోజుల్లోనే ఇలా
ఫ వర్షాలు పడితే మరోసారి ముంపు
ఫ శాశ్వత పరిష్కారం కోరుతున్న రైతులు
సాక్షి, అమలాపురం/ ఉప్పలగుప్తం: కూనవరం మొగ తెరిపించేందుకు అసలైన సమయంలో అనుమతులు ఇవ్వకుండా ఉన్నతాధికారులు చేసిన జాప్యంతో అవసరం లేని సమయంలో మొగ తెరవాల్సి వచ్చింది. ఇప్పుడు అది పూడుకుపోవడం చూసి ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోసారి భారీ వర్షాలు పడితే చేలు ముంపు బారిన పడి ఈ సారి నష్టం మరింత పెరిగే అవకాశముంది. దీంతో డ్రైన్స్ అధికారులు స్పందించి డ్రెజ్జర్‌ను రప్పించారు. దీనిద్వారా తవ్వకాలు చేయాలని నిర్ణయించారు. ఈ పనులతో కూడా పెద్దగా ప్రయోజనం ఉండదని, సాగు పూర్తయ్యే వరకూ తరచూ డ్రెజ్జింగ్ చేయాల్సిందేని రైతులు చెబుతున్నారు.
అందరూ చెబుతున్నా..
ఈ డ్రెయిన్‌కు శాశ్వత పరిష్కారం చూపాలని గతంలో నిపుణుల కమిటీ పలు సూచనలు చేసింది. ముంబయికి చెందిన ఓష్ణోగ్రఫీ సంస్థ సర్వే చేపట్టింది. సముద్రంలోకి గ్రోయిన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు చేసింది. అంతమాత్రాన ఇది విజయవంతం అవుతోందని చెప్పలేమని ఆ సంస్థ తేల్చి చెప్పింది. కానీ కొంతమంది విశ్రాంత సాగునీటి పారుదల శాఖ అధికారులు మాత్రం కూనవరం, రామేశ్వరం మొగలను ఆనుకుని ఉన్న పర్రభూముల (సాంప్)లో ఆక్రమణలు తొలగించాలని సూచిస్తున్నారు. దీనివల్ల కొంత వరకూ ముంపు నీటికి పరిష్కారం దొరుకుతుందంటున్నారు. సుమారు ఆరు వేల ఎకరాల విస్తీర్ణంలో సహజ సిద్ధంగా ఏర్పడిన పర్ర భూములను ఆక్రమించి కొందరు ఆక్వా సాగు చేస్తున్నారు.
దీనివల్ల అవి కుచించుకుపోయాయి. లేకుంటే ఈ పర్ర భూముల్లోకి ముంపునీరు చేరి నదుల ద్వారా సముద్రంలో కలిసేది. అలాగే పర్ర భూముల నుంచి సముద్రంలోకి నీరు దిగేలా పలుచోట్ల గండ్లు కొట్టాలని, అప్పుడు వేగంగా ముంపునీరు సముద్రంలో దిగుతుందని వారు తేల్చారు. ఈ కార్యాచరణ రూపొందించడంలో అధికారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కూనవరం డ్రెయిన్ నుంచి మొగ వరకూ సుమారు కిలో మీటరు పొడవునా డ్రెజ్జింగ్ చేస్తున్నారే తప్ప అటు చిర్రయానం పర్రభూమి నుంచి ముంపునీరు సముద్రంలోకి దిగే విధంగా, ఇటు ఎస్.యానాం పర్ర భూముల నుంచి సముద్రంలోకి నీరు దిగేలా గండ్లు పెడితే చాలా వరకూ సమస్య తీరుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ దిశగా పదేళ్లుగా కార్యాచరణ చేపట్టకపోవడం ఆయకట్టు రైతులకు శాపంగా మారింది.
సాగు వదిలేస్తున్నారు..
మధ్య డెల్టా (కోనసీమ)లో కీలకమైన కూనవరం మైజర్ డ్రెయిన్ దశాబ్దాల కాలంగా ఆయకట్టు రైతులకు కడగండ్లను మిగులుస్తోంది. ఉప్పలగుప్తం, అమలాపురం, కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాల్లో ఒకప్పుడు 35 వేల ఎకరాల ఆయకట్టుకు చెందిన ముంపునీరు ఈ డ్రెయిన్ ద్వారా సముద్రంలో కలిసేది. సహజ సిద్ధంగా తెరుచుకోవడం, మూసుకుపోవడం ఈ మొగ లక్షణం. దీనికి శాశ్వత పరిష్కారం చూపాల్సి ఉండగా ఏటా తాత్కాలికంగా మొగ తవ్వకాలు చేసి వదిలేస్తున్నారు. గతంలో ఈ సమస్య ఉన్నా పదేళ్లుగా మాత్రం ఆయకట్టు రైతులకు పెనుముప్పుగా మారింది. దీని ద్వారా ముంపునీరు దిగక ఈ ప్రాంతంలో సుమారు 4 వేల ఎకరాల్లో వరి చేలు ఆక్వా చెరువులుగా మారిపోయాయి. మరో రెండు వేల ఎకరాల్లో రైతులు సాగు వదిలేశారు. ఇక మిగిలింది 29 వేల ఎకరాలు. ఇంతటి ఆయకట్టుకు చెందిన ముంపునీరు దిగేందుకు వీలుగా మొగకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు.
ప్రక్షాళన చెయ్యాల్సిందే..
కోనసీమలో డ్రైనేజీ వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేయాలి. ఆక్రమణలు తొలగించి డ్రెయిన్లలో పూడిక తొలగించాలి. రెవెన్యూ, మైనర్, మీడియం, మేజర్ డ్రెయిన్లను ఒకేసారి ఆధునీకరించాలి. అలాగే డ్రెయిన్ల నీరు కలిసే నదులపై ఉన్న అవుట్‌ఫాల్ స్లూయిజ్‌లను నిర్మించడంతో పాటు మొగలకు శాశ్వత పరిష్కారం చూపాలి. ఇందుకు రూ.500 కోట్లు అవుతోందని చేయలేమని అధికారులు చెబుతున్నారు. కానీ ఇక్కడ ఏడాదిలో పండే పంట విలువ రూ.2,800 కోట్లు అనే విషయాన్ని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. కూలీలకు 1.65 కోట్ల పనిదినాలు దొరుకుతుందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తు పెట్టుకుని డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి.
–అయితాబత్తుల ఉమామహేశ్వరరావు,
కోనసీమ రైతు పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి, గోపవరం, ఉప్పలగుప్తం మండలం
Comments
Please login to add a commentAdd a comment