
మహనీయుల త్యాగాలే స్ఫూర్తి
●
● రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి సుభాష్●
● ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు
● కొనసీమ జిల్లా వ్యాప్తంగా
పండగ వాతావరణ
● బాలయోగి స్టేడియంలో
ఆకట్టుకున్న పోలీసులు కవాతు
● వివిధ శాఖల ప్రగతి శకటాల ప్రదర్శన
సాక్షి, అమలాపురం: స్వతంత్య్ర పోరాటంలో మహనీయులు చేసిన త్యాగాలు మరువలేమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. నాటి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని నేటితరం యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జిల్లాను ప్రగతి పథంలో పయనింప చేయడానికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై కావాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లా వ్యాప్తంగా గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమలాపురం బాలయోగి స్టేడియంలో నిర్వహించిన వేడుకలు అంబరాన్ని అంటాయి. రాష్ట్ర కార్మిక శాఖమంత్రి వాసంశెట్టి సుభాష్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం పోలీసు వర్గాలు కవాతుతో చేసిన గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు. జిల్లా గత ఏడాది సాధించిన అభివృద్ధి ప్రగతిని ఆయన చదివి వినిపించారు. స్వేచ్చా, స్వాతంత్య్రలకు సూచికగా శాంతి కపోతాలను ఎగురవేశారు.
మువ్వన్నల జెండాల రెపరెపల మధ్య స్వాతంత్య్ర దినోత్సవాన్ని జిల్లాలో అంభరాన్నంటేలా నిర్వహించారు. మూడు రంగుల జెండాలు, విద్యుత్ దీపాల అలంకరణాలతో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల కార్యాలయాలతో జిల్లాలో జాతీయ జెండా ఆవిష్కరణలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు, జాతీయ గీతాలాపనలతో పండుగ వాతావరణం నెలకొంది.
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షకులను అలరించాయి. దేశభక్తి గీతాలు, స్వాతంత్య్ర ఉద్యమ గేయాలతో నృత్య రూపకాలు ఆకట్టుకున్నాయి. గుడిమెళ్లంక జెడ్పీ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులు చేసిన ప్రాచీన క్రీడ మల్ల కంబ ఆహూతులను విశేషంగా ఆకర్షించింది. ఈ సందర్భంగా విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఉత్తమ సేవకులకు పురస్కారాలు
వివిధ ప్రభుత్వ శాఖలలో విశిష్ట సేవలు అందించిన జిల్లా అధికారులు ఎనిమిది మందికి, అలాగే ఆయా విభాగాల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న సుమారు 245 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు బహూకరించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్, జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్, ఎస్పీ బి.కృష్ణారావు, జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి, ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వర్లు, అడిషనల్ ఎస్పీ ఖాదర్ బాషా, డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, అమలాపురం, రామచంద్రపురం, కొత్తపేట ఆర్డీవోలు జి.కేశవవర్ధన్ రెడ్డి, ఎస్.సుధాసాగర్, జీవీవీ సత్యనారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన
జిల్లా గత ఏడాది సాధించిన ప్రగతి ఆధారంగా ఆయా శాఖలు చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ శకటాల ప్రదర్శన నిర్వహించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సామాజిక పింఛన్ల పంపిణీ శకటం ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే గనులు, భూగర్భ శాఖ ఆధ్వర్యంలో ఉచిత ఇసుక విధానం తెలిపే శకటానికి ద్వితీయ స్థానం, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అన్నా క్యాంటిన్ల శకటానికి తృతీయ స్థానం ప్రకటించారు. వీటితో పాటు దేవదాయ ధర్మదాయ, వ్యవసాయ, ఉద్యాన, గృహ నిర్మాణ, వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక శాఖలకు చెందిన శకటాల ప్రదర్శన జరిగింది.
కలెక్టరేట్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ
78వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా అమలాపురం కలెక్టరేట్‌లో జాతీయ జెండాను కలెక్టర్ మహేష్ కుమా ర్ ఆవిష్కరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మహనీయుల త్యాగాలే స్ఫూర్తి

మహనీయుల త్యాగాలే స్ఫూర్తి

మహనీయుల త్యాగాలే స్ఫూర్తి
Comments
Please login to add a commentAdd a comment