
సంరక్షణతో పశు సంపద
ఫ పెంపకంలో జాగ్రత్తలు అవసరం
ఫ తద్వారా అధిక ఆదాయం
కొత్తపేట: ఉదయం లేచింది మొదలు, రాత్రయ్యే వరకూ పాలు, టీ, కాఫీలంటూ తీసుకునే వారెందరో.. అలాంటి పాల ఉత్పత్తులు కావాలంటే పాడి పరిశ్రమ ఎంతో ఆధారం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పాడి పరిశ్రమ ఎందరో రైతులకు జీవనోధారం అయ్యింది. ఒకపక్క వ్యవసాయంతో పాటు అనుబంధంగా పశు సంపదతో ఆర్థికాభివృద్ధి సాధించేవారు. కాలక్రమేణా నిర్వహణ భారమై పశు పోషణ తగ్గించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వ్యవసాయం, పాడి పరిశ్రమ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఆయా రంగాల వైపు రైతులను మళ్లించేందుకు ప్రోత్సాహక పథకాలు అమలు చేసింది. ప్రధానంగా పాడి పరిశ్రమ ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించేందుకు గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాలను ప్రోత్సహించింది. దానితో పాడి రైతుల్లో పరిశ్రమ పట్ల ఆసక్తి పెరిగింది. దానికనుగుణంగానే ప్రస్తుతం పాల ఉత్పత్తులకు డిమాండ్ బాగా పెరిగింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పశువులు 1,60,403 గేదెలు, 75,839 ఆవులు పెంచుతున్నారు. జిల్లాలో పాల సేకరణ కేంద్రాలు 139, బల్క్‌మిల్క్ సెంటర్లు 5 ఉన్నాయి. నిత్యం 7,797 లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. పశువుల సంరక్షణ ద్వారా అధిక పాల ఉత్పత్తి, పాలు తీసే సమయంలో మెళకువలు, వాటిని కేంద్రాలకు, వినియోగదారులకు తరలించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తద్వారా ఆర్థికాభివృద్ధి తదితర అంశాలను పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, రావులపాలెం ప్రాంతీయ పశువైద్యాధికారి ఎస్.మహేశ్వరరెడ్డి వివరించారు.
సంరక్షణ.. జాగ్రత్తలు
ఫ నిత్యం పాడి పశువులకు పచ్చి, ఎండు గడ్డితో పాటు పోషకాలతో కూడిన దాణా అందించాలి. తగినంత నీరు తాగించాలి.
ఫ పశువులకు దోమలు కుట్టకుండా సంరక్షించాలి. సౌకర్యవంతంగా పశు శాలను ఏర్పాటు చేయాలి.
ఫ గేదె ఈనిన 15 రోజుల వరకూ పాల కేంద్రాలకు పాలను వేయరాదు. జున్ను పాలు కలిస్తే మంచి పాలు కూడా పాడైపోతాయి.
ఫ పాలు తీయడానికి ముందు నేలను ఊడ్చి నీటితో కడగాలి. చుట్టుపక్కల బురద, పేడ కుప్పలు ఉండరాదు.
ఫ పాలు తీసే ముందు పాడి పశువును గోరువెచ్చని నీటితో కడగాలి. పొదుగును శుభ్రం చేయాలి. అలా కుదరకపోతే పొదుగును కడిగి పొడి వస్త్రంతో తుడవాలి.
ఫ పాలు తీసే వ్యక్తి చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. తడి చేతులతో పాలు పితకరాదు.
ఫ ముందు తీసిన పాలలో సూక్ష్మజీవులు ఎక్కువగా ఉండి, వెన్న శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి ముందు పాలను దూడకు వదలాలి. వెనుక తీసిన పాలను కేంద్రానికి పోయాలి.
ఫ పాలు వేయడానికి స్టీలు, అల్యూమినియం పాత్రలనే వాడాలి.
ఫ నీళ్లు కలపడం వల్ల పాలలో వెన్న శాతంతో పాటు మిగిలిన ఘన పదార్థాలు తగ్గిపోతాయి. దీంతో పాల రేటు కూడా తగ్గిపోతుంది.
ఫ పాలు చుట్టుపక్కల వాసనను వెంటనే గ్రహిస్తాయి. కాబట్టి ఉల్లి, వెల్లుల్లి, ఎండు చేపలు, మురుగు నీటి వాసన వస్తే పాలు ఆ వాసనను గ్రహించి పులిసిన వాసన వస్తుంది. పాలు పితికిన వెంటనే శుభ్రమైన వస్త్రంతో వడకట్టాలి.
ఫ రాత్రి తీసిన పాలతో తర్వాత తీసినవి కలపకూదదు. తాజా పాలు కొంచెం తియ్యని వాసన కలిగి ఉంటాయి.
ఫ పాలల్లో ఎరుపు జీర, తరకలు కనిపిస్తే పశువుల్లో పొదుగు వాపు గాని, గాయం గాని ఉండి ఉండవచ్చు. వెంటనే పశు వైద్యుడిని సంప్రదించాలి. పై నియమాలు పాటిస్తే లాభాలు పొందవచ్చు.
ఇదే జీవనాధారం
నాకు 10 పాడి గేదెలు ఉన్నాయి. ఇందులో 4 చూడివి కాగా, 6 పాలిచ్చే గేదెలు. పూటకు సుమారు 30 లీటర్ల పాల దిగుబడి రాగా, నాకు పాల సేకరణ కేంద్రం కూడా ఉంది. దీనిద్వారా పాడి రైతుల నుంచి 50 లీటర్లు సేకరించి రిటైల్‌గా వినియోగదారులకు విక్రయిస్తున్నాను. ఈ విధంగా పాల ఉత్పత్తి, పాల సేకరణ ద్వారా జీవనం సాగిస్తున్నాను.
–చోడపనీడి వీవీ సత్యనారాయణ, పాడి రైతు,
వాడపాలెం, కొత్తపేట మండలం
శుభ్రంగా ఉంచాలి
పశువుల శాలలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. ముఖ్యంగా పశువులు వదిలిన మూత్రం అక్కడే నిల్వ ఉండకుండా పళ్లానికి వెళ్లేలా శాలలో తగిన విధంగా ఏర్పాట్లు చేయాలి. పాడి పశువుల పోషణలో జాగ్రత్తలు పాటిస్తే నాణ్యమైన అధిక పాల ఉత్పత్తి సాధించడంతో పాటు మంచి వెన్న శాతం వస్తుంది. తద్వారా లాభాలు పొందవచ్చు.
–ఎస్.మహేశ్వరరెడ్డి, ఏడీ, పశుసంవర్ధక శాఖ, వైద్యాధికారి, ప్రాంతీయ పశు వైద్యశాల,
రావులపాలెం

సంరక్షణతో పశు సంపద

సంరక్షణతో పశు సంపద

సంరక్షణతో పశు సంపద