తెలుగు భాషను పరిరక్షించుకుందాం
● శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ
అధ్యక్షుడు ప్రతాప్
● వైభవంగా 138వ జాతీయ
శతాధిక కవి సమ్మేళనం
అమలాపురం రూరల్: తెలుగు భాష పరిరక్షణకు తెలుగువారు కృషి చేయాలని అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కత్తిమండ ప్రతాప్ అన్నారు. కవులు సామాజిక చైతన్యంతో కవిత్వం రాయాలని ఆయన అన్నారు. ఆయన ఆధ్వర్యంలో అమలాపురం అంబేద్కర్ కమ్యూనిటీ భవనంలో ఆదివారం వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషా సంబరాలు నిర్వహించారు. ప్రాచీన, ఆధునిక కవుల వేషధారణలతో సాగిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. సెప్టెంబర్ 29వ తేదీన అనకాపల్లిలో తెలుగు భాషోత్సవాలు, శతాధిక కవుల కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు ప్రతాప్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు హాజరై కళావేదిక సాహితీ సేవను ప్రశంసించారు. తెలుగు తేజం, గోదావరి సోషల్ అండ్ కల్చర్ అసోసియేషన్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ సంయుక్తంగా సాహితీ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన ప్రముఖ కవయిత్రి కొల్లి రమావతి రాజమహేంద్రవరం నన్నయ విద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ తరపట్ల సత్యనారాయణ, తెలుగు అధ్యాపకులు ప్రముఖ సాహితీవేత్త మాకే బాలార్జున సత్యనారాయణ, ప్రముఖ రచయిత్రి చిట్టె లలిత, ప్రముఖ రచయిత్రి ఈశ్వరి భూషణం విశ్రాంత విద్యాధికారి గిరిజన సంక్షేమం కేఆర్.పురం ఏలూరుకు చెందిన డాక్టర్ టి.పార్థసారధి, కాకినాడ పీఆర్ కళాశాల సంస్కృత శాఖా అధ్యక్షురాలు డాక్టర్ వై. బుజ్జిలకు జ్ఞాపిక, ప్రశంసాపత్రం, రూ.10వేలు నగదు పురస్కారాన్ని అందజేశారు. కళావేదిక జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి, జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం, జాతీయ మహిళా అధ్యక్షురాలు చిట్టె లలిత జిల్లా కమిటీల ఏర్పాటులోనూ సాహితీ యజ్ఞంలో నిరంతరం కృషి చేస్తున్నారని ప్రతాప్ ప్రశంసించారు. ఈ సందర్భంగా పలువురు సాహితీవేత్తలను సత్కరించారు. కార్యక్రమంలో కళావేదిక జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ టి.పార్థసారధి, పోలిశెట్టి అనంతలక్ష్మి దేవి, అరిగెల బలరాం మూర్తి , గుర్రం రామకృష్ణారావు పాల్గొని కవి సమ్మేళనం నిర్వహించారు. రాష్ట్రం నుంచి 150 మంది కవులు తమ కవితల ద్వారా తెలుగు భాషా వైభవాన్ని చాటి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment