నిబంధనలు తొలగించాలి
ఎమ్మెల్సీ ఐవీ డిమాండ్
అమలాపురం టౌన్: రాష్ట్రంలో సర్వ శిక్ష విభాగంలో పనిచేస్తున్న ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ల (ఐఈఆర్‌పీ) జీతాల చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన అక్రమ నిబంధనలను తక్షణమే రద్దు చేయాలని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు (ఐవీ) డిమాండ్ చేశారు. అమలాపురంలోని యూ టీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఉన్న ఎమ్మెల్సీ ఐవీని ఐఈఆర్‌పీలు ఆదివారం కలిసి తమ సమస్యలను వివిరిస్తూ ఓ వినతి పత్రం అందించారు. దీనిపై స్పందించిన ఐవీ మాట్లాడుతూ ఐఈఆర్‌పీలు జీతాల చెల్లింపులపై ఆంక్షలు విధించడం అన్యాయ మని అన్నారు. వారు రెగ్యులైజేషన్ అడగకూడదని, కోర్టులకు వెళ్లడానికి వీలులేదని, ఎలాంటి కార ణం లేకుండా విధుల నుంచి తొలగించే అధికారం యాజమాన్యనికి ఉంటుందన్న నిబంధనలు వర్తింపచేయడం సరికాదని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. బాండు పేపరుపై సంతకం పెడితేనే జీతం చెల్లిస్తామన్న నిబంధన మరీ దారుణమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అసంబద్ధ, అక్రమ నిబంధనలను తొలగించాలని డిమాండ్ చేశారు. రాత పూర్వకమైన ఉత్తర్వులు లేకుండా ఈ నిబంధనలు అమలు చేయడమేమిటని ఎమ్మెల్సీ ప్రశ్నించారు. ఈ నిబంధనల వల్ల 1350 మంది ఐఈఆర్‌పీలు ఇబ్బంది పడుతున్నారని, ఉన్నతాధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్తానని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment