
మలికిపురం నుంచి ర్యాలీగా వస్తున్న గొల్లపల్లి సూర్యారావు, ఎంపీ అభ్యర్థి రాపాక
22ఎఎంపీ01:
వేణుగోపాలరావు నామినేషన్‌కు వచ్చిన పార్టీ శ్రేణులతో కిక్కిరిసిన పి.గన్నవరం కూడలి
అట్టహాసంగా తరలివచ్చిన వైఎస్సార్ సీపీ
అభ్యర్థులు విశ్వరూప్, జగ్గిరెడ్డి, విప్పర్తి, గొల్లపల్లి
సాక్షి అమలాపురం: ముహూర్తం కుదిరింది. సార్వత్రిక ఎన్నికలలో కీలకమైన నామినేషన్ల ప్రక్రియ మొదలైన తరువాత జిల్లాలో అత్యధికంగా సోమవారం నామినేషన్లు పడ్డాయి. అధికార వైఎస్సార్‌సీపీతోపాటు టీడీపీ, జనసేన, వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు, స్వతంత్రులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు. నాలుగో రోజు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్రులుగా 22 మంది అభ్యర్థులు మొత్తం 30 నామినేషన్లు పత్రాలను సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. అమలాపురం పార్లమెంటరీ సభ్యుని స్థానానికి నామినేషన్లు దాఖలు కాలేదని కలెక్టర్, పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి హిమాన్షు శుక్లా తెలిపారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థుల నామినేషన్లతో జిల్లాలో ఎన్నికల పండగ వాతావరణం తలపించింది. అమలాపురం, కొత్తపేట, పి.గన్నవరం, రాజోలు అభ్యర్థులు పినిపే విశ్వరూప్, చిర్ల జగ్గిరెడ్డి, విప్పర్తి వేణుగోపాలరావు, గొల్లపల్లి సూర్యారావుల నామినేషన్లు కోలాహలంగా సాగింది.
ఉత్సాహంగా విశ్వరూప్ నామినేషన్
అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పినిపే విశ్వరూప్ అట్టహాసంగా నామినేషన్‌దాఖలు చేశారు. అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో జి.కేశవవర్థనరెడ్డికి రెండు జతల నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయనతోపాటు భార్య బేబీ మీనాక్షి కూడా నామినేషన్ వేశారు. నియోజకవర్గం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన పార్టీ నాయకులతో కలిసి ర్యాలీగా వచ్చారు. ప్రచార రథంపై నుంచి విశ్వరూప్ ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. కామనగరువు, హౌసింగ్‌బోర్టు కాలనీ నల్లవంతెన రోడ్డు, కాటన్ పార్కు మీదుగా ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. తీన్‌మార్, డీజే బ్యాండ్, యువకుల మోటార్ సైకిల్ ర్యాలీగా వెంటరాగా విశ్వరూప్ ఊరేగింపు అట్టహాసంగా జరిగింది. కార్యకర్తలు ఉరేగింపులో ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్ ర్యాలీలో పాల్గొన్నారు.
విప్పర్తి నామినేషన్‌తో
పి.గన్నవరం జనసంద్రం
పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్ సీపీ అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావు పి.గన్నవరం తహసీల్దార్ కార్యాలయంలో ఎ.శ్రీరామచంద్రమూర్తికి రెండు సెట్‌ల నామినేషన్ దాఖలు చేశారు. ఆయన కుమారుడు రామ్మోహన్‌రావు ఒక సెట్ నామినేషన్ వేశారు. పి.గన్నవరం, మామిడికుదురు, అంబాజీపేట, అయినవిల్లి మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. వేణుగోపాలరావు తన స్వగృహం నుంచి బయలుదేరి సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వరకు నడుచుకుంటూ వెళ్లారు. తరువాత అక్కడ నుంచి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు.
అట్టహాసంగా గొల్లపల్లి నామినేషన్:
రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు మలికిపురం భారీ ఊరేగింపుతో రాజోలు తహసీల్దారు కార్యాలయానికి చేరుకున్నారు. ఒక సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్‌కు సమర్పించారు. గొల్లపల్లి నామినేషన్ వేసేందుకు వెళ్లున్నప్పుడు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అభివాదం చేయడంతో జై జగన్..జై గొల్లపల్లి నినాదాలు మారుమోగాయి. గొల్లపల్లితోపాటు రాపాక వర ప్రసాదరావు కూడా ర్యాలీలో పాల్గొన్నారు.
జిల్లాలో పలువురు నామినేషన్లు
రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ , స్వతంత్ర అభ్యర్థిగా ఎర్రంశెట్టి వీర వెంకట సత్యనారాయణ రామరాజు, టీడీపీ అభ్యర్థి తరఫున వాసంశెట్టి లక్ష్మీ సునీత, స్వతంత్ర అభ్యర్థిగా గుత్తుల జై శ్రీ సూర్యంద్రనాథ్ బాబుజిలు నామినేషన్లు వేశారు. ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఆల్ ఇండియా ఫార్వర్డ బ్లాక్ పార్టీ తరఫున పెమ్మాడి స్వామి, స్వతంత్ర అభ్యర్థిగా దొంగ సత్య రామ్, అనగాడి రేవతి, జై భారత్ నేషనల్ పార్టీ తరఫున వనచర్ల బాబ్జిలు రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. రాజోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి బహుజన సమాజ్ పార్టీ తరఫున పులపకూర లిలిని ఆసారాణి నామినేషన్ వేశారు. పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కొల్లాబత్తుల ఆనందరావు, జనసేన తరఫున గిడ్డి సత్యనారాయణలు నామినేషన్లు వేశారు. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా చీపురుమిల్లి కిరణ్‌కుమార్, మండపేట అసెంబ్లీ నియోజక వర్గానికి టీడీపీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు, వల్లూరి సాయికుమార్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున స్వతంత్ర అభ్యర్థిగా ఎస్.డేవిడ్ రాజ్ ఒక సెట్ నామినేషన్ వేశారు.

నామినేషన్ వేసేందుకు ర్యాలీగా తరలివస్తున్న మంత్రి విశ్వరూప్