
సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలంటూ ధర్నా
కాకినాడ సిటీ: కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. 2024లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు 59 విభాగాలుగా 176 హామీలు ఇచ్చిందన్నారు. వాటిలో పెన్షన్, అరకొర గ్యాస్ పథకం తప్ప మరేమీ అమలు చేయలేదని విమర్శించారు. విద్యార్థులకు, యువజనులకు, నిరుద్యోగులకు, మహిళలకు, కార్మికులకు, వివిధ వృత్తులు, కులాల వారీగా అమలు చేస్తామన్న పథకాలు ఏవీ అమలు చేయలేదని ఆరోపించారు. ముందు దగా, వెనుక దగా, కుడిఎడమల దగాదగా అన్న చందంగా చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఉందని ఆందోళనకారులు విమర్శించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు, మైనారిటీ, రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు చంద్రబాబు ప్రభుత్వం తల ఊపుతూ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందన్నారు. రెండున్నర లక్షల పెన్షన్ల కోత విధించి, పెన్షన్ పెంచి అమలు చేస్తున్నట్టు ఈ ప్రభుత్వం పోజు కొడుతోంది తప్ప ఆచరణలో పెన్షన్లు పెరిగింది లేదని విమర్శించారు. మొదటి దఫా గ్యాస్ పథకం అరకొర అమలు చేశారు తప్ప పూర్తిగా అమలు చేయలేదని, ఉచిత బస్సు ఊసేలేదన్నారు. నిరుద్యోగ భృతి మాటేలేదని, అమ్మకు వందనం, మహిళా శక్తి రైతు భరోసా, వలంటీర్లకు రూ.10 వేలు జీతం ఇవి కూడా అమలు చేయలేదన్నారు. ఇల్లులేనివారికి గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్ల భూమి ఇస్తానన్న పథకానికి నేటికీ శ్రీకారం చుట్టలేదని విమర్శించారు. ఉపాధి హామీ కూలీలకు నిధులు విడుదల కావడంలేదన్నారు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ నాయకులు జె.వెంకటేశ్వర్లు, ఆదినారాయణ, ఎం ఏసు, రాగుల రాఘవులు, జి బాలరాజు, జి రాజ్‌కుమార్, బొడ్డు సత్యనారాయణమూర్తి, జి దుర్గారావు, చిన్న, శ్రీను, కెవిరమణ, సతీష్ పాల్గొన్నారు.