
స్వర్ణ ధ్వజస్తంభానికి మరిన్ని హంగులు
రాష్ట్ర స్థాయి తైక్వాండో
పోటీలకు వెంకటేష్
మామిడికుదురు: విశాఖపట్నంలో ఈ నెల 17వ తేదీ నుంచి జరిగే రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు మామిడికుదురుకు చెందిన డిగ్రీ విద్యార్థి కడలి దివ్యతేజ వెంకటేష్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డీవీవీ సత్యనారాయణ మంగళవారం తెలిపారు. కాకినాడలో ఈ నెల 11వ తేదీన జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా తరఫున పాల్గొన్న వెంకటేష్ బంగారు పతకం సాధించాడన్నారు. తద్వారా రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించినట్టు తెలిపారు. వెంకటేష్ తో పాటు అతడి కోచ్ కె.చిన్నను ప్రిన్సిపాల్ సత్యనారాయణ, అధ్యాపకులు మోకా రంగారావు, యాలంగి రవికుమార్, పెచ్చెట్టి రాధ అభినందించారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు
ఎంపికై న వెంకటేష్
కవల కొబ్బరి కాయ
కొత్తపేట: సహజంగా కొబ్బరికాయకు మూడు కన్నులు ఉంటాయి. కానీ గతంలో రెండు, నాలుగు కన్నుల కొబ్బరికాయలను చూశాం. ఇప్పుడు కొత్తగా ఒక కొబ్బరికాయలో కవల (రెండు) కాయలు బయటపడ్డాయి. కొత్తపేటకు చెందిన పురోహితుడు పెద్దింటి రామచంద్ర శ్రీహరి (రామం) ఇంట శ్రావణ మంగళవారం సందర్భంగా లక్ష్మీదేవి పూజలో కొబ్బరి కాయను కొట్టారు. దానిలో కవల కాయలు కనిపించాయి. పీచు తొలగించగా రెండు కనులు ఉన్నాయి. వీటిని పలువురు భక్తులు తిలకించారు.
హోటల్ సర్వర్ అనుమానాస్పద మృతి
అమలాపురం టౌన్: అమలాపురం గడియారం స్తంభం సెంటర్‌లోని ఒక హోటల్లో సర్వర్‌గా పనిచేస్తున్న పులిదిండి సత్యనారాయణ (50) సోమవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పట్టణ సీఐ కె.క్రిష్టోఫర్ తెలిపిన వివరాల ప్రకారం.. అల్లవరం మండలం కొమరగిరిపట్నానికి చెందిన పులిదిండి సత్యనారాయణ పదేళ్లుగా ఇదే హోటల్లో పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి వరకూ పనిచేసి నిద్రపోయాడు. హోటల్ యజమాన్యం మంగళవారం ఉదయం చూసే సరికి మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న అతడి కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని విలపించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సత్యనారాయణ హృదయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడని సమాచారం.
కలుపు మందు రుచి చూసిన యువకుడి మృతి
పి.గన్నవరం: పొలంలో కలుపు నివారణకు ఉపయోగించే మందు ఎలా ఉంటుందోనని రుచి చూసిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఏఎస్సై పట్టాభిరామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పి.గన్నవరం మండలం ఊడిమూడి గ్రామానికి చెందిన అడబాల శివ (26) ఈ నెల 6న తన పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ ఉన్న కలుపు నివారణ మందును ఎలా ఉంటుందో రుచి చూద్దామనుకున్నాడు. దీంతో కొద్దిగా తాగి, వెంటనే బయటకు ఊసేశాడు. కానీ ఈ విషయం ఇంట్లో చెప్పలేదు. ఈనేపథ్యంలో ఈ నెల 12న అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే అతడిని రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శివ మంగళవారం మృతి చెందాడు.
డీజిల్ ట్యాంకర్ నుంచి
మంటలు
తాళ్లరేవు: జాతీయ రహదారిపై తాళ్లరేవు వద్ద డీజిల్ ట్యాంకర్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి వాటిని అదుపు చేశారు. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం నుంచి యానాం వెళుతున్న డిజిల్ ట్యాంకర్ తాళ్లరేవుకు వద్దకు వచ్చేసరికీ టైర్ పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు రేగా యి. గమనించిన డ్రైవర్ ప్రాణభయంతో పరుగులు తీశాడు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేశారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ అక్కడకు చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన వీర వేంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానంలోని స్వర్ణ ధ్వజస్తంభానికి మరిన్ని హంగులు సమకూరనున్నాయి. నెల్లూరుకు చెందిన భక్తుడి విరాళం సుమారు రూ.మూడు కోట్లతో ఈ నెల తొమ్మిదో తేదీన స్వామివారి సన్నిధిలో స్వర్ణ ధ్వజస్తంభాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ధ్వజస్తంభం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. దీని ఏర్పాటు కోసం స్వామివారి ఆలయం ఎదురుగా గల శ్లాబ్‌కు గుండ్రంగా రంధ్రం చేశారు. ధ్వజస్తంభం ఆ రంధ్రంలోంచి ఆలయ శిఖరానికి సమాన ఎత్తు వరకూ వచ్చింది. దాని చివరలో సుదర్శన చక్రం, మేఖలాలు ఏర్పాటు చేశారు.
అయితే వర్షం వస్తే ఆ ధ్వజస్తంభం రంధ్రంలోంచి వర్షం చినుకులు దిగువకు పడే అవకాశం ఉంది. దీంతో దాన్ని చెక్కలతో తాత్కాలికంగా మూసివేశారు. ఇప్పుడు ధ్వజస్తంభం నుంచి పైకి చూస్తే శ్లాబ్ రంధ్రానికి వేసిన చెక్కులు తప్పు మరేమీ కనిపించవు. ఈ నేపథ్యంలో ఆ చెక్కలకు బదులు గ్లాస్‌తో తయారు చేసిన డోమ్ లాంటిది ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల దిగువ నుంచి చూస్తే గ్లాస్ డోమ్‌లోంచి ధ్వజస్తంభం చివరి వరకూ కనిపించే అవకాశం ఉంటుంది. వైదిక కార్యక్రమాలకు అవసరమైనపుడు ధ్వజస్తంభం మీద గ్లాస్ డోమ్ తొలగించేలా ఏర్పాటు చేయనున్నట్లు దేవస్థానం డీఈఈ ఉదయ్ తెలిపారు.
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
కరప: అప్పుల బాధ తట్టుకోలేక విష గుళికలు తిని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరప గ్రామానికి చెందిన వజ్రపు సత్యనారాయణ వెల్డింగ్ పనిచేసుకుంటూ భార్య, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. ఆరు నెలల క్రితం వెల్డింగ్ షాపు తీసుకుని సొంతంగా వ్యాపారం ప్రారంభించాడు. పనులు అంతగా లేక, వ్యాపారం సాగక షాపు నిర్వహణకు అప్పులు చేశాడు. వాటిని తీర్చే దారిలేక తాగుడుకు అలవాటు పడ్డాడు. ఈ నేపథ్యంలో అప్పుల బాధ తట్టుకోలేక మంగళవారం ఉదయం వెల్డింగ్ షాపు వద్ద విష గుళికలు తిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడు వాంతులు చేసుకోవడాన్ని గమనించిన ఒక బాలుడు ఇంటికి వెళ్లి విషయం చెప్పాడు. అతడి భార్య దేవి వెంటనే షాపు వద్దకు వచ్చి భర్తను వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడి చికిత్స పొందుతూ సత్యనారాయణ మృతి చెందాడు. దేవి ఫిర్యాదు మేరకు కరప ఇన్‌చార్జి ఎస్సై పి.శోభన్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కొనసాగుతున్న శిక్షణ
సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో 11 జిల్లాలకు చెందిన అధికారులకు సుస్థిరాభివృద్ది లక్ష్యాలపై ఇస్తున్న శిక్షణ మంగళవారం కూడా కొనసాగింది. దీనిలో భాగంగా మహిళా స్నేహ పూర్వక గ్రామం అనే అంశంపై తరగతులు జరుగుతున్నాయి. ప్యాకల్టీలు ప్రసాద్, నిహారిక, పద్మజ మాట్లాడుతూ మహిళా సంఘాల ఆర్థిక కార్యక్రమాలల్లో మహిళల భాగస్వామ్యంపై అవగాహన పెంచాలన్నారు. బాల్య వివాహాలకు అడ్టుకట్ట వేయాలని, శారీరక ఆరోగ్యం, మానసిక స్థితిపై శ్రద్ధ చూపాలని సూచించారు. కార్యక్రమంలో ఫ్యాకల్టీలు బి.వెంకటేశ్వర్లు, చక్రఫణిరావు, బి.ఆంజనేయులు పాల్గొన్నారు.

స్వర్ణ ధ్వజస్తంభానికి మరిన్ని హంగులు

స్వర్ణ ధ్వజస్తంభానికి మరిన్ని హంగులు

స్వర్ణ ధ్వజస్తంభానికి మరిన్ని హంగులు

స్వర్ణ ధ్వజస్తంభానికి మరిన్ని హంగులు
Comments
Please login to add a commentAdd a comment