
చమురు సంస్థలకు చెంపపెట్టు
● ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు
● ఖనిజ సంపద నుంచి ఇక ఆదాయం
అమలాపురం టౌన్: మైనింగ్ చేసే సంస్థలు విధిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు రాయల్టీ చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం హర్షణీయమని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నాయకత్వంలో న్యాయమూర్తులు ఈ తీర్పు చెప్పడం రాష్ట్రంలో ఖనిజ సంపద కార్యకలాపాలు, అన్వేషణల పేరుతో దోచుకుంటున్న చమురు సంస్థలకు చెంప పెట్టులాంటిదన్నారు. శుక్రవారం అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. 30 ఏళ్ల నుంచి కేజీ బేసిన్ పరిధిలో చమురు సంస్థలు భూమిని తవ్వి, గుల్లచేసి అన్వేషణలు, కార్యకలాపాల పేరుతో రూ.కోట్లు దోచుకుంటున్నాయని గుర్తు చేశారు. మొత్తంగా కేజీ బేసిన్ ప్రాంతానికి దాదాపు రూ.50 లక్షల కోట్ల రాయల్టీ రావాల్సి ఉందన్నారు. చమురు సంస్థలు సోషల్ రెస్పాన్స్‌బులిటీ పేరుతో చిన్న సామాజిక భవనాలు నిర్మించడం, అక్కడక్కడ రోడ్లు వేయడం తప్ప భారీ మొత్తంలో రాయల్టీ రూపంలో ఆయా ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించిన సందర్భాలు లేవన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చమురు సంస్థల నుంచి రాయల్టీని పూర్తి స్థాయిలో రాబడితే రాష్ట్రానికి ఉన్న కొన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన అన్నారు. కొన్నేళ్లుగా చమురు సంస్థలు ఇక్కడ భూములను ఇష్టానుసారం తవ్వేసి చమురు, సహజ వాయువులను వెలికితీస్తూ వ్యవసాయాన్ని విచ్ఛిన్నం చేస్తున్న పరిణామాలపై తాము ఉద్యమాలు చేస్తున్నామని గుర్తు చేశారు. మైనింగ్ చేసే సంస్థల నుంచి రాయల్టీ నిధులను రాబట్టినప్పుడే రాష్ట్రాభివృద్ధి సాకారమవుతుందని పేర్కొన్నారు. ఉదాహరణకు పోలవరం ప్రాజెక్ట్, విశాఖ స్టీల్ ప్లాంట్ తదితర మేజర్ పనులకు రాయల్టీ సొమ్ము ద్వారా నిధులు సమకూర్చుకునే పరిస్థితి ఉంటుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో మిత్రత్వంతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆ దిశగా రాయల్టీ నిధులను కేంద్రం మెడలను వంచి సాధించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment