అమలాపురం టౌన్: తరుచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి అందుకు అనుగుణంగా అప్రమత్తమయ్యేలా రాష్ట్ర పోలీస్ శాఖ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటా (ఐఆర్‌ఏడీ) యాప్‌ను రూపొందించి దాని అమలుకు చర్యలు చేపట్టింది. జిల్లా పోలీసు శాఖ ఈ యాప్‌ను వినియోగించే విధానాలపై సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చింది. ప్రతీ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై నుంచి కానిస్టేబుల్ వరకూ ఈ యాప్‌పై అవగాహన కల్పిస్తోంది. ఎస్పీ బి.కృష్ణారావు ఈ నెల 16న యాప్‌ను ప్రారంభించారు. ఐఆర్‌ఏ డేట్ బేస్ నమోదు గురించి జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, పోలీసు స్టేషన్ల సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఐఆర్‌ఏడీ రోల్ అవుట్ మేనేజర్ జీవీ రామారావు, డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డు బ్యూరో (డీసీఆర్‌బీ) సీఐ వి.శ్రీనివాసరావుల ఈ శిక్షణ తరగతులను పర్యవేక్షించారు.
రోడ్డు ప్రమాదాల స్పాట్లను గుర్తించేది ఇలా..
ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశానికి పోలీస్ దర్యాప్తు అధికారి (ఐవో) వెళ్లి అక్కడ ఐఆర్‌ఏడీ యాప్ ద్వారా ప్రమాద సమాచారాన్ని నమోదు చేయాలి. ఇదే స్పాట్‌లో గతంలో రోడ్డు ప్రమాదాలు జరిగాయా? లేదా? అనే అంశంపై ఆ అధికారి అక్కడే అధ్యయనం చేస్తారు. ఒకవేళ అదే స్పాట్‌లో తరచూ ప్రమాదాలు జరుగుతుంటే ఆ విషయాన్ని యాప్‌లో నమోదు చేయాలి. ఈ సమాచారాన్ని ఇటు ఎస్పీ కార్యాలయానికి, అటు రాష్ట్ర పోలీస్ కార్యాలయానికి యాప్ ద్వారా పంపించాలి. యాప్‌లో రోడ్డు ప్రమాదాల సమాచారాన్ని నమోదు చేస్తూనే అక్కడ ఇక ముందు రోడ్డు ప్రమాదాల జరగకుండా సూచనలు, జాగ్రత్తలతో అప్రమత్తం చేసే దిశగా చర్యలు చేపడతారు. వాహనాల డ్రైవర్లకు తెలిసేలా ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటూ హెచ్చరికలు బోర్డులు ఏర్పాటు చేస్తారు.
అవగాహన పెంచాలి
కొత్తగా వచ్చిన ఐఆర్‌ఏడీ యాప్‌పై పోలీస్ సిబ్బంది పూర్తి స్థాయి అవగాహనతో ఉండడమే కాకుండా వాహన చోదకులకు జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది ఎక్కడికక్కడ రోడ్డు ప్రమాదాల నివారణ నిబంధనలపై అవగాహన కల్పించాలని ఎస్పీ కృష్ణారావు యాప్ శిక్షణ తరగతుల్లో సూచించారు. వాహన చోదకులు విధిగా హెల్మెట్లు ధరించాలని, సీటు బెల్ట్‌లు పెట్టుకోవాలని స్పష్టం చేశారు. వాహనాలను నిర్లక్ష్యంగా, పరధ్యానంగా నడపకుండా డ్రైవింగ్ సమయంలో పూర్తి అప్రమత్తతో ఉండాలని సూచించారు.
సెల్‌ఫోన్ మాట్లాడుతూ, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ఎంత ప్రమాదకరమో వాహన చోదకులకు పోలీసు అధికారులు తరుచూ కౌన్సెలింగ్ ద్వారా తెలియజేయాలన్నారు. లైసెన్స్‌ను లేకుండా టీనేజ్ పిల్లలకు మోటారు సైకిళ్లు నడిపే అధికారం లేదని, తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పులు తీసుకురావాలని సూచించారు. మానవ తప్పిదాల వల్ల రోడ్డు ప్రమాదం జరిగి ఎవరైనా చనిపోతే ఆ కుటుంబం ఎంత క్షోభిస్తుందో, ఎంతటి నష్టం చేకూరుతుందో డ్రైవింగ్ చేసే వ్యక్తులకు కనువిప్పు కలిగేలా వివరించాలని ఎస్పీ కృష్ణారావు జిల్లా పోలీస్ సిబ్బందికి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment