
ఇంటర్‌లో బాలికలదే పైచేయి
జిల్లాలో మెరుగైన ఫస్టియర్ ఫలితం
సెకండియర్‌లో మరింత దిగజారిన స్థానం
రాయవరం: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో బాలికలు మెరుగైన ఉత్తీర్ణతను సాధించారు. ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో వారి హవా కనిపించింది. గత విద్యా సంవత్సరం మాదిరిగానే ఈ విద్యా సంవత్సరంలో కూడా బాలికలు మంచి ఉత్తీర్ణతను కనబరిచారు. శనివారం విడుదలైన ఫలితాల్లో జిల్లాలో ఫస్టియర్ జనరల్ ఒకేషనల్ ఫలితాల్లో 60 శాతం ఉత్తీర్ణత సాధించగా, జనరల్ ఫలితం 63 శాతం ఉత్తీర్ణత కన్పించింది. అలాగే ద్వితీయ సంవత్సరం జనరల్, ఒకేషనల్ ఫలితాన్ని గమనిస్తే 76 శాతం ఉత్తీర్ణత సాధించారు. కేవలం ఇంటర్ సెకండియర్ జనరల్ ఫలితాన్ని గమనిస్తే 78 శాతం ఉత్తీర్ణత సాధించారు. గత విద్యా సంవత్సరంలో ఫస్టియర్ ఫలితాల్లో జిల్లా రాష్ట్ర స్థాయి ఫలితాలో 17వ స్థానం నుంచి 16వ స్థానంలో నిలిచి కొంత మెరుగైనా, సెకండియర్ ఫలితాల్లో గతేడాది దక్కించుకున్న 16వ స్థానం నుంచి 19వ స్థానానికి దిగజారింది.
ఫస్టియర్ నుంచి 4,520 మంది బాలురు పరీక్షలు రాయగా 2,472 మంది (55శాతం) ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 6,178 మందికి 4,300 మంది ఉత్తీర్ణత (70శాతం) సాధించారు. మొత్తంగా ఫస్టియర్ 10,698 మందికి 6,772 మంది (63 శాతం) ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్ ఫలితాలను చూస్తే బాలురు 3,824 మందికి 2,760 మంది ఉత్తీర్ణత (72శాతం) సాధించగా, బాలికల విషయానికి వస్తే 5,653 మందికి 4,671 మంది (83శాతం) ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 9,477 మందికి 7,431 మంది (78 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
ఒకేషనల్ ఫలితాల్లో ఫస్టియర్ 829 బాలురు పరీక్షకు హాజరు కాగా 268 (32శాతం), బాలికలు 1,086 మందికి 589 మంది (54శాతం) ఉత్తీర్ణులయ్యారు. 1,915 మంది ఫస్టియర్ ఒకేషనల్ పరీక్షకు హాజరవగా 857 మంది (45శాతం) ఉత్తీర్ణత సాధిం. ఒకేషనల్ సెకండియర్ ఫలితాలను గమనిస్తే 795 మంది బాలురకు 450 మంది (57శాతం), 1,142 మంది బాలికలకు 836 మంది (73శాతం) ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్ మొత్తం 1,937 మంది పరీక్షకు హాజరు కాగా, 1,286 మంది (66శాతం) ఉత్తీర్ణత సాధించారు.
అలరించిన కవి సమ్మేళనం
జాతీయ స్థాయిలో 126 మంది కవుల రాక
అమలాపురం టౌన్: అంర్జాతీయ సాహిత్య, సాంస్కృతిక సంస్థ శ్రీశ్రీ కళా వేదిక 147వ జాతీయ స్థాయి ఉగాది శతాధిక కవి సమ్మేళనం స్థానిక శ్రీకళా రెసిడెన్సీలో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ వీనుల విందుగా సాగింది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి 126 మంది కవులు హాజరై ఉగాది కవితా గానాలతో అలరించారు. వేదిక సీఈవో డాక్టర్ కత్తిమండ ప్రతాప్ అధ్యక్షతన జరిగిన సమ్మేళనంలో తెలుగు కవిత్వానికి వెలుగులు నింపిన మహా కవులు డాక్టర్ బోయి భీమన్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్ర పటాలకు సాహితీ దిగ్గజాలు పూల మాలలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వేదిక అంతర్జాతీయ సమన్వయకర్త కొల్లి రమావతి మాట్లాడుతూ కవిత్వం అంటే అక్షర తాండవమని, కాలంతో పాటు కవిత్వం మారాలని ఆమె సూచించారు. సమ్మేళనానికి విచ్చేసిన ప్రతీ కవిని వేదిక తరఫున ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేసి అభినందించారు. వచ్చే నెల 10, 11 తేదీల్లో ఏలూరులో జరగనున్న ప్రపంచ తెలుగు సాహితీ సంబరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ప్రతాప్ వెల్లడించారు. వేదిక జిల్లా ఽఅధ్యక్షుడు నల్లా నరసింహమూర్తి, కోనసీమ రచయిత సంఘం అధ్యక్షుడు బీవీవీ సత్యనారాయణ, వేదిక జాతీయ కార్యదర్శి మాకే బాలార్జున సత్యనారాయణలు పర్యవేక్షించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నంచి ఉగాది కళారత్న హంస పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ ప్రతాప్‌ను కవులు అభినందించారు. సమ్మేళన సభలో వేదిక కమిటీ సభ్యులు యెండూరి సీతామహాలక్ష్మి, పోలిశెట్టి అనంతలక్ష్మి అరిగెల బలరామమూర్తి, శ్రీపాద రామకృష్ణ, కడలి సత్యనారాయణ, గోదావరి పత్రిక సంపాదకుడు బోళ్ల సతీష్‌లు ప్రసంగించారు.
నేటి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు
అమలాపురం రూరల్: ఈ నెల 14వ తేదీ సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవుగా ప్రకటించిందని ఈ నేపథ్యంలో ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున జిల్లా వ్యాప్తంగా ఉన్న అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా ఆయన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.